[వందే భారత్ రైలు రూపకర్త సుధాంశు మణి అనుభవాల కథనం ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ ను తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]
నాంది:
భారతీయ రైల్వేలకు చెందిన రైల్వే ఉద్యోగుల బృందం 2018లో చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లో, భారతదేశపు మొట్టమొదటి సెమీ హై-స్పీడ్ రైలు అయిన ‘ట్రైన్ 18’ని తయారు చేసింది. ఈ రైలు ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా మాట్లాడుకునే ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’గా సేవలు అందిస్తోంది. సాధారణంగా కొత్త రైళ్ళ తయారీకి – డ్రాయింగ్ బోర్డు నుండి నమూనా ఉత్పత్తి శ్రేణి(proto type line) కు రావడానికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 36 నెలల సమయం పడుతుండగా; ఈ బృందం కాన్సెప్ట్, డిజైన్, ఇంజనీరింగ్, నిర్మాణం, ప్రయాణానికి సంసిద్ధత వరకు అన్నింటినీ కలిపి కేవలం 18 నెలల రికార్డు కాలంలో ఈ ఆధునిక రైలుని సిద్ధం చేసింది. దీనికి సమానమైన రైలును విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి అయ్యే అంచనా వ్యయంలో దాదాపు మూడో వంతు ఖర్చుతోనే ఈ రైలు తయారయింది . ఈ అసాధారణమైన 18 నెలల ప్రయాణంలో, అలాగే దానికి ముందు, తర్వాత కొన్ని నెలల పాటు ఈ బృందాన్ని నడిపించే అదృష్టం నాకు దక్కింది.
ఏ గ్లోబల్ రైలు తయారీదారు నుండి ఎలాంటి సాంకేతిక బదిలీ లేకుండానే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం దీనికి నిజమైన విలువను తెచ్చిపెట్టింది. ఈ ఉత్పత్తి, సాంకేతికత ఇంకా తయారీ ప్రక్రియల మేధో సంపత్తి హక్కులు పూర్తిగా ICF సొంతం అని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాము. ఈ రైలులో దిగుమతి చేసుకున్న విడిభాగాలను కొన్నింటిని ఉపయోగించినప్పటికీ, అవి ICF సిద్ధం చేసిన డ్రాయింగ్‌లు, నిర్దిష్ట లక్షణాలు (specifications) ల ఆధారంగానే దిగుమతి అయ్యాయి. ఏదేమైనా, ఈ విడిభాగాల విలువ రైలు తయారీకయిన మొత్తం వ్యయంలో 20% కంటే తక్కువగానే ఉంది.
ఇలాంటి రైలు మనకి రావడానికి చాలా కాలం పట్టింది. భారతదేశానికి దశాబ్దాలుగా ఒక ఆధునిక రైలు అవసరం ఉంది, కానీ అంతర్గత కలహాలు, స్వార్థపూరిత ఉద్దేశాలలో మునిగిపోయిన రైల్వేల అధికార యంత్రాంగం దేశాన్ని పదే పదే నిరాశపరిచింది. ఒక కొత్త రైలు రూపకల్పనని, నిర్మాణాన్ని మొదటి నుండి చేపట్టగల సామర్థ్యం, సాహసం ICF రైల్వే ఉద్యోగులలో ఉన్నాయి. భారతదేశంలోని సహాయక పరిశ్రమలు కూడా కొన్ని కీలక రంగాలలో దాదాపు ప్రపంచ స్థాయికి చేరుకుని, మెరుగ్గా రాణించడానికి ప్రోత్సాహం కోసం వేచి చూస్తున్నాయి. ఆ శక్తిని సరైన దిశలో మళ్లించి, చెప్పుకోదగ్గ ఫలితాన్ని సాధించడమే ఆలస్యం.
నేను రైల్వే అధికారిగా దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ సేవను ముగించుకుని, పదవీ విరమణకు ముందు నా చివరి బాధ్యతగా 2016లో ICF జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టాను. ఇందులో భాగంగా జర్మనీలోని భారత రాయబార కార్యాలయంలో మినిస్టర్ (రైల్వేస్)గా పనిచేసిన అరుదైన అనుభవం కూడా నాకు ఉంది. లోపలా బయటా అందంగా, ఆహ్లాదకరంగా ఉన్న దేశీయ ఆధునిక, వేగవంతమైన రైలును స్వయంగా రూపొందించి, తయారు చేయాలని నేనెప్పుడూ కలలు కనేవాడిని. ICF కి వచ్చిన తర్వాత, నా కలని నిజం చేసుకోవడానికి కాలం నా కలను నిజం చేయటం కోసమే ఎదురుచూస్తూ, కల్పించిన గొప్ప అవకాశం అదృష్టం లభించినట్టయింది.
గొప్ప అదృష్టమా? అవును, ఎందుకంటే వ్యవస్థ నాకు అనుకూలమైన అధికారులు, సిబ్బందితో కూడిన బృందాన్ని అందించింది. మేము మొదట అన్ని రంగాలలో ICF ని మార్చడం ప్రారంభించాము. పారదర్శకత, సానుభూతి, కొత్త ఆలోచనలను ఆహ్వానించడం, పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వడం, పాత రాచరిక పద్ధతులను (ఇండియన్ రైల్వేస్‌లో ఊపిరాడకుండా చేసే బ్యూరోక్రసీ ఉంది) పక్కన పెట్టడం, పనిదొంగలతో కఠినంగా వ్యవహరించడం వంటివి ఈ మార్పు ప్రక్రియను వేగవంతం చేశాయి. దీనివల్ల ICF త్వరలోనే కొత్త రికార్డులను సృష్టించడం ప్రారంభించింది. కేవలం ఉత్పత్తి గణాంకాలలోనే కాకుండా ఇతర అనేక అంశాలలో కూడా ఫ్యాక్టరీ ఒక లీడర్‌గా రూపాంతరం చెందింది. ఈ మార్పులో ‘ట్రైన్ 18’ కథ అత్యంత ముఖ్యమైన భాగం, కానీ అది ఒక్కటే కాదు. అప్పుడప్పుడు జరిగిన కొన్ని తప్పుడు అంచనాలు, నిరాశలు, వైఫల్యాలు ఉన్నప్పటికీ, విజయాలు, కార్య సిద్ధిలతో అత్యంత ఉత్సాహభరితమైన బాటలో సాగిన ఒక అద్భుతమైన ప్రయాణం ఇది.
సంక్షిప్తంగా చెప్పాలంటే, 18 నెలల ఉద్విగ్న భరితమూ, ఉత్సాహ పూర్వకమూ అయిన ప్రయాణం తర్వాత అక్టోబర్ 2018లో ‘ట్రైన్ 18’ నిర్మాణ కల చివరకు సాకారమై, విజయవంతమైన ఫలంగా నిలిచింది.
ఇతరులకు ‘ట్రైన్ 18’ కేవలం ఒక రైలు మాత్రమే, కానీ రైల్వే ఉద్యోగులూ , రైలు ప్రేమికులే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ రైలును అపూర్వమైన ఉత్సాహంతో, ప్రశంసలతో స్వాగతించారు. ఎందుకు? ఎందుకంటే ‘ట్రైన్ 18’ రైలు దేశంలోని యువ, వృద్ధ మనస్సులలో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులను చేపట్టాలనే ఆలోచనను రేకెత్తించే ప్రేరణగా, ఒక ఆదర్శంగా, ఒక ఐకాన్‌గా పనిచేసింది. “ICF చేయగలిగినప్పుడు, మనం ఎందుకు చేయలేము?” అనే భావనను కలిగించింది.
నా ICF సహచరులు ఆ అద్భుతమైన రోజుల్లో రైలును ఎలా రూపకల్పన చేశారు, ఎలా నిర్మించారు అనే విషయాలను గుర్తుచేసుకోవడం కోసం మాత్రమే కాకుండా, ఈ కొత్త ప్రయత్నంలోని అసలైన హీరోలు ఎవరికీ తెలియకుండా, గుర్తింపు లేకుండా, అజ్ఞాతంగా ఉండి పోకూడదనే ఉద్దేశంతో నేను పదవీ విరమణ తర్వాత ఈ పుస్తకాన్ని రాయడం ప్రారంభించాను. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై తీవ్రమైన ప్రతికూలత ముసురుకోవడంతో నేను త్వరలోనే నిరాశకు గురయ్యాను. నాతో పాటు, ఇప్పటికీ సర్వీసులో ఉన్న కీలక బృంద సభ్యులు దీని భారాన్ని మోస్తున్నట్లు అనిపించింది. దాంతో నేను రాయడం పక్కన పెట్టాను. కానీ ఆ తర్వాత, దేశంలో ఇలాంటి వేలాది ప్రాజెక్టులు విజయవంతం కాగలవని నా దేశప్రజలకు తెలియజేయడం నా బాధ్యత అని గ్రహించాను; దీనికి కావలసిందల్లా నాయకత్వంలో ధైర్యం, ఉద్వేగం, ఉద్దేశం, ముందుచూపు, సంకల్పం మాత్రమే. ప్రతికూలతలు రావచ్చు, పోవచ్చు కానీ కథ మాత్రం చెప్పాల్సిందే. ఏడాది తర్వాత నేను మళ్లీ పనిని ప్రారంభించాను, ఇదిగో ఇప్పుడీ పుస్తకం మీ ముందు ఉంది. ఈ కథ ద్వారా, భారతదేశం తన సామర్థ్యాన్ని గుర్తించి, దానిని ఉపయోగించుకునే సమయం వచ్చేసిందని, ఇది ‘ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు’ అనే సందేశాన్ని అందించగలనని ఆశిస్తున్నాను.
– సుధాంశు మణి
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
