[వందే భారత్ రైలు రూపకర్త సుధాంశు మణి అనుభవాల కథనం ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ ను తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]
అధ్యాయం 14 ఉత్పత్తి ప్రారంభం!
ఉత్పత్తిని ప్రారంభించడానికి పడే ఉద్వేగభరితమైన పోరాటాలు దాదాపు రోజువారీ ప్రాతిపదికన జరుగుతుండగా, నేను మరొక వేధించే సమస్యతో పోరాడవలసి వచ్చింది. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ విజయం అనేది జట్టులోని వివిధ స్థాయిల ప్రయత్నాల కలయిక మాత్రమే. ఒక ప్రైవేట్ కంపెనీ సిఇఓతో పోలిస్తే, భారతీయ రైల్వేలలో ఒక జనరల్ మేనేజర్‌కి ఈ రోజు బహుశా ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో అయితే, ఒక కొత్త నాయకుడు ఒక సవాలుతో కూడిన బాధ్యతను స్వీకరించినప్పుడల్లా, అతను తన స్వంత జట్టుని నిర్మించుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. నేను చెప్పదలచుకుంటే, అటువంటి విలాసవంతమైన సదుపాయం భారతీయ రైల్వేల జిఎమ్కి ఉండదు; అతని ప్రధాన బృందంలో, బోర్డు ద్వారా అతని కింద నియమించబడిన అధికారులు ఉంటారు. ఐ.సి.ఎఫ్. జిఎమ్గా ఒక గొప్ప బృందం ఇప్పటికే అక్కడ ఉన్నందుకు నేను అదృష్టవంతుడిని, జట్టులోని అత్యున్నత స్థాయి అధికారులలో చాలా మంది పేర్లను నేను ఇప్పటికే పేర్కొన్నాను. కానీ ఆ అదృష్టం ఎక్కువ కాలం నిలవలేదు. కొందరు కీలక అధికారులకు పదోన్నతులు రావడం లేదా ఇతర కారణాల వల్ల వారి బదిలీ ముప్పు తీవ్రంగా పొంచి ఉండేది. బోర్డులోని కొందరు దూరదృష్టి లేని అధికారులు, ఒక అధికారి ఐ.సి.ఎఫ్.లో ఎన్ని సంవత్సరాలు పనిచేశారో చూసి, అతనిని మార్చే సమయం వచ్చిందని ప్రకటించేవారు. ఆ అధికారి సాధించిన విజయాలు, అతను/ఆమె చేతిలో ఉన్న పని యొక్క ప్రాముఖ్యతకు ఎలాంటి విలువ ఉండేది కాదు. షేక్స్పియర్ రాసిన ది మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకంలో బస్సానియో చెప్పిన, “మీ అధికారంతో చట్టాన్ని ఒక్కసారి మార్చండి. ఒక గొప్ప మంచి చేయడం కోసం, కొంచెం తప్పు చేయండి,” అనే మాటలను ఈ సంకుచిత మనస్తత్వం గల అధికారులు విన్నారో లేదో నాకు అనుమానమే. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు, ఎవరి స్థానాన్ని అయినా భర్తీ చేయవచ్చు అనేది వారి సాధారణ నినాదంగా ఉండేది. ఒక ఉద్యోగానికి సరైన వ్యక్తి సరిపోలడం అనే ఒక విషయం ఉంటుందనే దాన్ని వారు విస్మరించేవారు. అందరూ అన్ని చోట్లా సరిపోగలిగితే, అధికారులలోని ప్రతిభను అంచనా వేయడానికి అర్థమే లేదు. అధికారుల కోసం ప్రస్తుతం ఉన్న మూల్యాంకన విధానం నిష్ప్రయోజకత్వాన్ని గ్రహించి, ప్రస్తుత ప్రభుత్వం ఒక ముఖ్యమైన నియామకానికి ముందు 360-డిగ్రీల ఫీడ్‌బ్యాక్ ప్రక్రియను ప్రారంభించింది.
అర్థవంతమైనది ఏదైనా సాధించాలంటే, సమర్థులైన అధికారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారానే అది సాధ్యమవుతుంది; అందరికీ సమాన న్యాయం చేయాలనే ఒక కఠినమైన, మొండి పట్టుదల గల భావనను సంతృప్తి పరచడం కోసం ఈ సూత్రాన్ని గుర్తించకపోవడమే, ప్రస్తుతం నెలకొన్న మధ్యస్థమైన పనితీరుకు, సాధారణ పనితీరుకు ఖచ్చితమైన కారణం.
నేను దీనిని వదిలిపెట్టకుండా బోర్డుని బ్రతిమిలాడుతూ, బ్రతిమిలాడుకుంటూ, జట్టులోని కీలక అధికారులు చెదరకుండా ఉండేలా చూసుకున్నాను మరియు కొన్ని మినహాయింపులతో చాలా వరకు విజయం సాధించాను. ఉదాహరణకు, ప్రాజెక్ట్ యొక్క అత్యంత కీలకమైన దశలో వావ్రేను వెళ్ళనివ్వాల్సి వచ్చింది. అతను పదోన్నతిపై వెళ్లవలసి వచ్చింది, సంబంధిత బోర్డు సభ్యుడు అతని పదోన్నతిని ఐ.సి.ఎఫ్. లోనే సర్దుబాటు చేయడానికి ఎలాంటి మార్గాన్ని వెతకలేదు. అదేవిధంగా, విశిష్ట సామర్థ్యాలు కలిగిన అధికారి అయిన త్రివేది, చివరకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే జిఎమ్గా తన పోస్టింగ్‌తో ప్రారంభించి, ఉన్నత స్థానాలకు వెళ్లడానికి నిర్ణయించబడినందున, మధ్యలోనే మమ్మల్ని విడిచిపెట్టారు. వావ్రేను కోల్పోవడం పెద్ద దెబ్బ అయినప్పటికీ, దాష్ అందుబాటులో ఉన్నందున అతని స్థానాన్ని భర్తీ చేయడం అంత కష్టం కాలేదు, కానీ త్రివేదికి సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం అంత సులభం కాదు. ఇండియన్ రైల్వేస్ లోని మెకానికల్ విభాగంలో ఆ స్థాయి అధికారులు దాదాపు అందరూ నాకు తెలుసు, ఈ పాత్రకు చాలా తక్కువ మంది మాత్రమే సరిపోయారు. అప్పుడు సెంట్రల్ రైల్వేలో చీఫ్ సేఫ్టీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శుభ్రాంశు గురించి నేను ఆలోచించాను. నేను అతనితో కలిసి పనిచేశాను, అతని కార్యసాధకత్వం, సామర్థ్యం నాకు తెలుసు. నా అభిప్రాయం ప్రకారం, ఆ పని సంక్లిష్టతలను బట్టి చూస్తే, ఆ ఉద్యోగానికి ఆయనే అత్యంత సరైన వ్యక్తి. మీ లక్ష్యాల వైపు సాగిపోవడానికి ఇండియన్ రైల్వేస్‌లో తరచుగా అవసరమయ్యే సంక్లిష్టమైన, అడ్డదిడ్డం మార్గాలకు సర్దుబాటు చేసుకోవడం, ఇంకా, వాటిని అవలంబించడం వంటివి ఈ సంక్లిష్టతలలో ఉన్నాయి. బోర్డు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు; సంబంధిత అధికారి నన్ను బోర్డు ఎంపిక చేసుకోవడం కోసం ముగ్గురు అధికారుల జాబితాను సమర్పించమని కోరారు, నేనేదో చిన్న కొనుగోలుచేస్తున్నట్లు, దానికి మూడు కొటేషన్లు అవసరమైనట్లు! విచారకరంగా, సదరు అధికారికి సాధారణంగా ఒక ప్రొడక్షన్ యూనిట్ పనితీరుపై గానీ, ప్రత్యేకించి ఐ.సి.ఎఫ్.లో మా చేతిలో ఉన్న ప్రాజెక్టుల రకంపై గానీ ఎలాంటి అవగాహన లేదు.
ఇది ఉపకరించదని నాకు తెలుసు. ఇటీవలనే సిఆర్‌బి గా బాధ్యతలు స్వీకరించిన అశ్వని లోహానీని నేను బ్రతిమిలాడవలసి వచ్చింది. చాలా మందికి తెలిసినట్లుగా, భారతీయ రైల్వేలు అందించిన అత్యంత వివేకవంతమైన, సమతుల్యత గల నాయకులలో లోహానీ ఒకరు. ఆయన మా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. నేను ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ఒకరోజు, బోర్డు సమావేశం ముగిసిన తర్వాత, సదరు అధికారి కూడా అక్కడే ఉన్నారని తెలిసి నేను లోహానీ గదిలోకి ప్రవేశించాను. ట్రైన్ 18 కోసం నాకు శుభ్రాంశు ఎందుకు కావాలి, ఆయన మాత్రమే ఎందుకు కావాలి అని చెప్పడానికి నేను కొంత నాటకీయ నైపుణ్యాన్ని, రంగస్థల కళని ఉపయోగించి ప్రకటించాను. ఎవరైనా స్పందించే లోపే, లోహానీ అంగీకరించారు, దాంతో కథ అక్కడితో ముగిసింది.
ఇక దిగువ స్థాయి బృందం విషయానికి వస్తే, అది నా పరిధిలోనే ఉంది. దానిని నిర్ధారించుకోవడం అంత తేలికైన పని కాదు, అలాగని అంత కష్టమైనదీ కాదు; మేము మధ్య స్థాయి అధికారులు, ఇంకా సూపర్వైజర్ల బృందాలు కొనసాగేలా చూడగలిగాము. చివరికి, కృతజ్ఞతగా చెప్పాలంటే, మేము మొత్తం ట్రైన్ 18 బృందంలో ఎలాంటి పెద్ద చీలికని ఎదుర్కోలేదు, ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి ఇది నిస్సందేహంగా ఒక కారణం.
ఈలోగా సమయం వేగంగా గడిచిపోయింది, మేము 2017 చివరికి చేరుకున్నాము. దాంతో పాటు, ట్రెయిన్ 18 ప్రయాణం మునుపెన్నడూ లేనంత ఉరుకులు పరుగులతో, ఒక విద్యుత్ వేగంతో అత్యంత తీవ్రంగా మారింది. “ఇయాగో, ‘సంతోషం, కార్యోత్సాహం – సమయాన్ని తెలియకుండా చేస్తాయి’ అని నువ్వు రోడ్రిగోతో చెప్పిన మాటల వెనుక ఉన్న అసలు భావం నాకు తెలుసు”.
ట్రైన్ 18 ఉత్పత్తి ప్రారంభం అనేది.. నేను ఇక్కడ కల్పించిన ఉపోద్ఘాతం సూచించినంత గొప్పగా కాకుండా, చాలా సాధారణంగా జరిగింది. ప్రారంభించడం అంటే అండర్‌ఫ్రేమ్ జిగ్ స్టేషన్‌పై అండర్‌ఫ్రేమ్ భాగాల అసెంబ్లీని ప్రారంభించడం, ఇంకా వాటిని కలిపి వెల్డింగ్ చేయడం. ఈ స్టేషన్ – కన్సల్టెంట్‌తో కలిసి రూపొందించబడింది, అప్పటికే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్న రవిచంద్రన్ పర్యవేక్షణలో తయారు చేయబడింది. జిగ్ స్టేషన్‌ను పదే పదే కాలిబ్రేట్ చేయాల్సి వచ్చింది, అది కూడా మేము ఇతర ఉత్పత్తుల కోసం అలవాటు పడినట్లుగా మొక్కుబడిగా చేసే పద్ధతిలో కాకుండా చాలా ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది.
బయట మార్కెట్ నుండి ఆర్డర్ చేసిన అనేక ఉప-భాగాలు ప్రోటోటైప్‌లు కావడంతో, వాటిని స్వీకరించి క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి వచ్చింది. ఈ భాగాలు ఆ రంగంలో అత్యుత్తమమైనవిగా పరిగణించబడే ఒక జంట తయారీ సంస్థల నుండి ఆర్డర్ చేయబడినప్పటికీ, వారి సరఫరాలో ఊహించని నాణ్యత సమస్యలు తలెత్తాయి. అండర్ఫ్రేమ్లో ఏదైనా అజాగ్రత్తగా చేసిన పని కంటికి కనిపించకుండా దాగి ఉంటుందని కాదు; అండర్ఫ్రేమ్లో ఖచ్చితత్వం లేకపోవడం అనేది సైడ్ వాల్స్, రూఫ్, ఇంకా డోర్ అసెంబ్లీ మొదలైన వాటిని అమర్చేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా తప్పుల పరంపరకు దారితీస్తుంది. పనిని ప్రారంభించాలనే ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, శశి భూషణ్, రవిచంద్రన్ పట్టుదలతో నిలబడ్డారు, సరైన నాణ్యత గల భాగాలు డెలివరీ చేయబడే వరకు పనిని ప్రారంభించడానికి నిరాకరించారు. నేను త్రివేదిని బెదిరించడానికి ప్రయత్నిస్తూ, అతని రిలీజ్ కూడా ఆలస్యమవుతుందని అన్నాను, కానీ ఆ బెదిరింపు తుస్సుమంది; భారతీయ రైల్వేలలో జిఎమ్‌లు రిలీజ్ కోసం ఎదురుచూడరు, వారు ఎక్కడ ఉన్నా అక్కడి నుండే బాధ్యతలు స్వీకరిస్తారు. ఒక బలమైన వ్యక్తి తలపై మీరు తుపాకీ పెట్టలేరు కాబట్టి, నేను నా ఒత్తిడిని తగ్గించుకోవలసి వచ్చింది.
ఉత్పత్తిని వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఆలోచనతో మొత్తం బృందం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది, కానీ మేము నిగ్రహంతో పనిపై దృష్టి పెట్టవలసి వచ్చింది. నేను స్వయంగా ఆ ఇద్దరు తయారీదారులకు గట్టిగా క్లాస్ పీకాను. కానీ మీరు జిఎమ్ అయినా కాకపోయినా, కేవలం అరవడం వల్ల సరైన నాణ్యత రాదు. లోపభూయిష్ట భాగాలను ఉపయోగించాలనే ఒత్తిళ్లకు లొంగకుండా, ఆ లోపం ఎంత చిన్నదైనా సరే రాజీ పడకుండా దృఢంగా నిలబడటమే ఫలితాన్ని ఇస్తుంది. ఆ రెండు సంస్థలకు స్పష్టమైన సందేశం వెళ్ళింది: “ఇదిగో చూడండి, మీరు ఒక చారిత్రాత్మక ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడానికి ఎంపికయ్యారు, కాబట్టి దీనికి తగిన గౌరవం ఇవ్వండి. లేదంటే మాకు ఆలస్యమైనా సరే, మేము ఈ ఆర్డర్‌ను వేరే ఎవరికైనా ఇచ్చేస్తాము.” ఈ హెచ్చరిక పని చేసింది, ఎందుకంటే ఆ సంస్థలను ఓడించి ఆర్డర్ రద్దు చేయడం అనేది నష్టదాయకమైన విజయం అవుతుంది; నిజానికి అది ఒక ఉత్త బెదిరింపు మాత్రమే.
చివరికి, మేము 2018 ఫిబ్రవరి మొదటి వారం చివరలో ఎప్పుడో ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమయ్యాము. అప్పుడు దేవుడు, లేదా దేవతలు జోక్యం చేసుకున్నారు. క్రైస్తవులకు, ముస్లింలకు దేవుడు ఒక్కడే, హిందువులకు దేవతలు అనేకం; వారు భారతీయ రైల్వేల వర్క్‌షాప్‌లు, ఫ్యాక్టరీలలో అక్షరాలా సర్వాంతర్యాములు. అయితే ఐ.సి.ఎఫ్.లో ఇది మరొక స్థాయికి చేరుకుంది. ప్రతి ఒక్క షాప్, సెక్షన్ లేదా ఆఫీసులో హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఒక ప్రత్యేకమైన పెద్ద పీఠంపై కొలువై ఉంటాయి, అక్కడి జనాభా ప్రాతిపదికన ఇది ఒక రకంగా అర్థం చేసుకోదగినదే. ఏదేమైనప్పటికీ, అన్ని ప్రధాన మతాల ప్రాతినిధ్యంతో అనేక పని ప్రదేశాలు మరింత లౌకికంగా ఉండేవి. ఒక అజ్ఞేయవాదిగా, నేను కొద్దిగా అయోమయానికి గురయ్యాను, కానీ అక్కడ ఉన్న సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాను.
హాస్యస్ఫోరకంగా చెప్పాలంటే, ఖుష్వంత్ సింగ్ తన జోక్ పుస్తకాలలో ఒకదానిలో చెప్పినట్లుగా నేను దీనిని క్లుప్తీకరిస్తాను:
యహా ఖుదా, వహా ఖుదా హై, ఇధర్ ఖుదా, ఉధర్ ఖుదా హై
ఔర్ జహా అభి తక్ నహీ ఖుదా హై, వహా భీ కల్ కో ఖుదేగా
(ఇక్కడ దేవుడు కనిపిస్తున్నాడు, అక్కడ దేవుడు కనిపిస్తున్నాడు, నాకు ప్రతిచోటా దేవుడే కనిపిస్తున్నాడు. మరియు ఈ రోజు ఎక్కడైతే దేవుడు కనిపించట్లేదో, రేపు దేవుడిని ప్రతిష్ఠించడానికి అక్కడ కూడా తవ్వడం జరుగుతుంది.)
ఫర్నిషింగ్ ఫ్యాక్టరీ లోపల ఒక పెద్ద గుడి ఉండేది, కొన్ని పండుగ పూజల రోజుల్లో అందరికీ అందులోకి ఉచిత ప్రవేశం ఉండేది; వాస్తవానికి, ఫ్యాక్టరీల లోపల చిన్న చిన్న తాత్కాలిక దేవాలయాలతో పాటు ఇతర మతాల ప్రార్థనా స్థలాలు కూడా చాలానే ఉండేవి. రక్షిత ప్రాంతంగా ఉన్న చోట ఇటువంటి ఉచిత ప్రవేశం, భారీ పూజల నిర్వహణ వంటివి ఎన్నో ప్రమాదాలతో కూడుకున్నవి. ఆయుధ పూజ రోజున కార్మికుల కుటుంబాలన్నింటినీ ఫ్యాక్టరీల లోపలికి అనుమతించడాన్ని నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే అది ఒక సామాజిక వేడుకగా మారిపోయింది. కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రులు/తోబుట్టువులు/ జీవితభాగస్వామి పనిచేసే స్థలాన్ని చూసి ఆనందించేవారు. కానీ ఒక ప్రభుత్వ ఫ్యాక్టరీ లోపల ఈ రకమైన పూజలా? ఆపై కాలనీలోని ఒక ఇల్లు లౌడ్‌స్పీకర్‌తో సువార్త (ఎవాంజెలిజం) కేంద్రంగా ఉపయోగించబడుతోంది. నా అవగాహన ప్రకారం ఇలాంటి కొన్ని పద్ధతులు దాదాపు చట్టవిరుద్ధమైన సరిహద్దుల్లో ఉన్నాయి. నేను వీటన్నింటికీ స్వస్తి పలికాను. గతంలో కొందరు జిఎమ్‌లు ఫ్యాక్టరీలలో జరిగే ఈ పూజా దినాల్లో భజనలలో కూడా పాల్గొన్నారని, ఫ్యాక్టరీలో పెద్ద పూజను ఆపివేస్తే దేవతలు తమ తీవ్రమైన ఆగ్రహంతో మనల్ని శిక్షిస్తారని నాకు చెప్పారు. కొంతమంది సిబ్బంది, అధికారులు కూడా కొన్ని చిన్నచిన్న ప్రమాదాలకు ఇదే కారణమని ఆపాదించారు. అయినప్పటికీ, నేను ఇంతకుముందు కూడా వర్క్‌షాప్‌ల లోపల ఇలాంటి భారీ మతపరమైన పద్ధతులకు ముగింపు పలికాను, అయినా ఇదిగో నేను ఇప్పటికీ క్షేమంగానే ఉన్నాను. ఏ సమూహాన్ని ప్రసన్నం చేసుకోకుండా, పూర్తిగా లౌకికంగా ఈ చర్యలు తీసుకోవడం వల్లే నేను దీనిని సాధించగలిగానని భావిస్తున్నాను. కానీ పని ప్రదేశాలలో దేవుళ్లు మరియు దేవతల పీఠాల ఉనికి అనేది మాత్రం – నేను తాకడానికి సాహసించని విషయం. దీనిని పూర్తిగా పట్టించుకోవద్దని బాబు నాకు సలహా ఇచ్చారు, లేదంటే జరగవచ్చు. ఇష్టం లేకపోయినా నేను దానికి అంగీకరించాను.
ఫిబ్రవరి 9వ తేదీని ఉత్పత్తి ప్రారంభించే రోజుగా నిర్ణయించాము. జిగ్‌లు సిద్ధంగా ఉన్నాయి, ఇన్-పుట్ భాగాల ఖచ్చితత్వం క్షుణ్ణంగా తనిఖీ చేయబడింది. అక్కడ పూజ జరుగుతుందని నాకు చెప్పారు. “దయచేసి ఎలాంటి పూజ వద్దు” అని నేను బాబుతో అన్నాను. త్రివేది దీనిని అస్సలు ఒప్పుకోలేదు. నాస్తికత్వం నుండి పుట్టిన ఒక వ్యక్తి ఔచిత్య భావన, మొత్తం ఐ.సి.ఎఫ్. సెంటిమెంట్లను పణంగా పెట్టలేకపోయింది; నేను పూజకు అనుమతి ఇవ్వడమే కాకుండా, అందులో ఖచ్చితంగా పాల్గొనవలసి ఉంటుందని నాకు చెప్పారు. అది నన్ను పూర్తిగా నిరుత్తరుడిని చేసింది. ప్రజల సెంటిమెంట్ల ముందు నేను తలవంచాల్సి వచ్చింది. దేవుడు లేదా దేవతలు వాదించే మరియు ఇష్టం లేని భక్తుడి పట్ల దయ చూపరు కాబట్టి, ఇందులో నాకు ఎప్పటికీ మోక్షం లభించదని నాకు పూర్తిగా తెలుసు:
నా ఖుదా హీ మిలా నా విసాల్-ఎ-సనమ్
నా ఇధర్ కే హుయే నా ఉధర్ కే హుయే
రహ్-ఎ-దిల్ మే హమారే యే రంజ్-ఓ-అలమ్
నా ఇధర్ కే హుయే నా ఉధర్ కే హుయే
(నువ్వు దేవుని ప్రేమను గానీ, ప్రియురాలిని గానీ పొందలేకపోయావు. ఇప్పుడు, ఈ విచారం మరియు దుఃఖంతో ముందుకు సాగిపోతూ జీవించు: రచయిత ఎవరో తెలియదు)
మేము ఆ సాధారణ వేడుక కోసం వచ్చేసరికి బృందమంతా వరుసగా నిలబడి ఉన్నారు. కాస్త గంభీరంగా కనిపిస్తున్న పండిత్ జీ నన్ను ఏమి చేయమని నిర్దేశించారో నేను అదే చేశాను. సీనియర్ అధికారులందరూ నామినేట్ చేయబడిన మాన్యుఫాక్చరింగ్ టీమ్ సభ్యులనీ, కోఆర్డినేటింగ్ డిజైన్ టీమ్ సభ్యులనీ ఒకరి తరువాత ఒకరుగా కలుసుకున్నారు; ఉత్సాహం ఉరకలేస్తోంది, వారి ముఖాల్లో గర్వం స్పష్టంగా కనిపిస్తోంది. పండుగ వాతావరణంలో ఎంతో ఉత్సాహంగా ఉన్న మొత్తం ప్రధాన బృందాన్ని నేను అక్కడ చూడగలిగాను.
నేను స్వయంగా ఒక చిన్న వెల్డింగ్ చేశాను, కానీ దురదృష్టవశాత్తు దానిని తర్వాత సరిచేసి (fettled) మళ్లీ చేయాల్సి వచ్చింది. నేను గొప్ప వెల్డింగ్ చేశానని నా ముఖస్తుతి కోసం ఎవరూ నాతో చెప్పలేదు; ఎందుకంటే రైల్వేలో సీనియర్ వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడానికి, వారిని మురిపించడానికి మనం ఎంతటి హాస్యాస్పదమైన స్థాయిలకైనా వెళ్తాము. ఒకసారి రైఫిల్ షూటింగ్ పోటీలో జరిగిన సంఘటన నాకు గుర్తుంది, మేము ఒక బుల్స్-ఐ పేపర్‌ను సిద్ధం చేసి, టార్గెట్ బోర్డు దగ్గర దాచి ఉంచాము; ప్రధాన అతిథి ప్రారంభ షాట్ కాల్చగానే (అది స్పష్టంగా టార్గెట్ బోర్డు కంటే ఒక మైలు దూరం పైకి వెళ్ళింది), ఒకరు ఆ ముందే రంధ్రం చేసిన కాగితంతో అవతలి వైపు నుండి పరుగెత్తుకుంటూ వచ్చి, “బుల్స్-ఐ కేవలం తృటిలో తప్పిపోయింది” అని గట్టిగా అరిచారు. దాంతో ఆ ప్రధాన అతిథి తన రైఫిల్ షూటింగ్ నైపుణ్యానికి ఎంతో సంతోషపడిపోయి ముఖమంతా నవ్వులు పూయించారు. మేము ఉపయోగించిన ఆ ట్రిక్ అందరికీ తెలిసినప్పటికీ, వందలాది మంది చప్పట్లు కొట్టారు.
రవిచంద్రన్ ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఒక కథ చెప్పవలసి వచ్చింది, దానిని మేము ఓపికగా విన్నాము. అసాధ్యంగా అనిపించే పనిని చేయడానికి మీరు ఎవరినైనా నిమగ్నం చేసినప్పుడు, మీరు చెల్లించాల్సిన చిన్న ధర ఇది. ఇది ఒక సంతోషకరమైన క్షణం. అందరూ గట్టిగా కొట్టిన చప్పట్లు పరాకాష్ఠకు చేరుకున్నాయి, అంతే; ట్రైన్ 18 ఉత్పత్తి ప్రారంభమైంది.
ట్రైన్ 18 ఖచ్చితంగా 2018 లోనే బయటకు రావలసి ఉంది, అప్పటికే ఇది ఫిబ్రవరి నెల. ప్రోటోటైప్లకు విస్తృతమైన పునర్నిర్మాణం, ఇంకా పునఃపరిశీలనలు అవసరమవుతాయని మాకు తెలుసు, ఎందుకంటే ఒక కోచ్‌ని అసెంబ్లింగ్ చేసే జిగ్సా పజిల్ మొదటి ప్రయత్నంలోనే సరిగ్గా సరిపోవడం చాలా అరుదు; గుర్తుంచుకోండి, దాదాపు ప్రతి కోచ్ మరొకదాని కంటే భిన్నంగా ఉన్నందున, మేము 16 ప్రోటోటైప్లను హ్యాండిల్ చేయవలసి ఉంది. సమయం చాలా విలువైనది, వృథా చేయడానికి మాకు సమయం లేదు.
షేక్స్పియర్ మనతో రకరకాలుగా మాట్లాడుతుంటాడు. ఆయన ఒక పాత్ర చేత ఈ రోజు ఒక మాట చెప్పిస్తే, రేపు మరొక పాత్ర చేత దానికి పూర్తి విరుద్ధమైన మాట చెప్పించవచ్చు. ఆయన ఒథెల్లో నాటకంలో ఇయాగో చేత, “ఓపిక లేని వారు ఎంత పేదవారు!” అని చెప్పించారు లేదా హెన్రీ VIII నాటకంలో, “ఎత్తైన కొండలను ఎక్కడానికి మొదట నెమ్మదిగా సాగడం అవసరం,” అని చెప్పించారు. ఇది నాకు వర్తించదు సర్. ది మెర్రీ వైవ్స్ ఆఫ్ విండ్సర్ నాటకంలో ఫోర్డ్ చెప్పిన, “ఒక నిమిషం ఆలస్యం అవ్వడం కంటే, మూడు గంటలు ముందే ఉండటం మేలు” అనే మాటకే నేను కట్టుబడి ఉంటాను.
(ఇంకా ఉంది)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
