Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే భారత్ – ట్రైన్ 18 కథ-16

[వందే భారత్ రైలు రూపకర్త సుధాంశు మణి అనుభవాల కథనం ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ ను తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]

అధ్యాయం 15 మా హెచ్ఆర్ మాంత్రికుడు – పారిశ్రామిక సంబంధాలు

ఐ.సి.ఎఫ్.లో వచ్చిన సాంస్కృతిక మార్పుల గురించి, ‘ట్రైన్ 18’ రూపకల్పన గురించి నేను మాట్లాడేటప్పుడు నన్ను తరచూ ఒక ప్రశ్న అడుగుతుంటారు. మేము చేపట్టిన హెచ్ఆర్ చర్యల వల్లే ట్రైన్ 18 సాధ్యమైందా? లేదా ట్రైన్ 18 లక్ష్యాన్ని సాధించడం కోసమే ఆ హెచ్ఆర్ చర్యలను చేపట్టారా? అని. ఈ ప్రశ్న నాకు ‘కోడి ముందా, గుడ్డు ముందా?’ అనే పాత సామెతలా అనిపిస్తుంది. బైబిల్ సృష్టి కథ ప్రకారం జంతువుల పుట్టుకను వివరించేటప్పుడు – గుడ్డు నుండి కాకుండా నేరుగా మొదటి కోడి వచ్చేందుకే అవకాశం ఇచ్చారు కాబట్టి, క్రైస్తవ ప్రపంచంలో ఈ ప్రశ్నకు ఒక ముగింపు దొరికిందని వారు భావిస్తారు. కానీ ఐ.సి.ఎఫ్. విషయంలో మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం జరిగింది. నా సమాధానం చాలా స్పష్టం. ఐ.సి.ఎఫ్. ఉత్పాదకతను, పనితీరును అన్ని రంగాల్లోనూ మెరుగుపరచడం ద్వారా ఒక సాంస్కృతిక మార్పును తీసుకురావడానికి ‘ట్రైన్ 18’ ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా మేము ఖచ్చితంగా ఈ హెచ్ఆర్ చర్యలను తీసుకునేవాళ్లం. కాకపోతే, ఒకవేళ ఈ ముందస్తు చర్యలు ఉండి ఉండకపోతే ‘ట్రైన్ 18’ సాధ్యమయ్యేదే కాదు.

నేను అప్పటికే చేసిన కొన్ని సున్నితమైన ప్రయత్నాల గురించి చెప్పాను. మేము ముందుకు సాగుతున్న కొద్దీ ఉద్యోగులతో విస్తృతంగా మమేకం కావడం, ఐ.సి.ఎఫ్. ముద్ర ఉన్న యూనిఫాంలు ధరించేలా చేస్తూ సంస్థపై వారిలో గర్వాన్ని పెంపొందించడం, స్ఫూర్తిదాయకమైన చిహ్నాలను ఏర్పాటు చేయడం, కళా పోటీలు, ఇంకా శిల్పకళా పోటీలు నిర్వహించడం వంటివి మరికొన్ని చర్యలు. మరోవైపు, ఇందులో భారీ పెట్టుబడులు కూడా ఉన్నాయి: రక్షణ కవచాలు, దుస్తులు, లాకర్లు, తాగునీటి కేంద్రాలు, కాంటీన్లు, టాయిలెట్లు, విశ్రాంతి గదుల ఆధునీకరణ ద్వారా పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి పెట్టుబడులు పెట్టాం. అలాగే స్టాఫ్ కాలనీల పునరుద్ధరణ, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, క్రీడా సౌకర్యాల కల్పన వంటి వాటిపై కూడా భారీగా ఖర్చు చేశాం.

కార్మిక సంఘాలు అవసరమే. కానీ యాజమాన్యం మరీ లొంగుబాటు ధోరణితో, బలహీనంగా ఉన్నప్పుడే సమస్య మొదలవుతుంది. అది యూనియన్లది పైచేయి అయ్యేలా చేస్తుంది, దాంతో వారు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి రోజువారీ పనుల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తారు. మరోవైపు, యాజమాన్యం యూనియన్లను చులకనగా చూస్తూ, వారి పట్ల ఎలాంటి సున్నితత్వం లేదా సానుభూతి లేకుండా కేవలం ఒక ‘అవసరమైన కీడు’ లాగా భావిస్తే, అది పారిశ్రామిక అశాంతికి దారితీసే ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుంది.

నా సర్వీస్ జీవితంలో కొన్ని సహజమైన ఇవ్వడం-పుచ్చుకోవడం  లతో పాటు యూనియన్లతో చాలా మంచి సంబంధాలను కలిగి ఉన్నాను. అంతమాత్రాన నేను వారి అన్యాయమైన డిమాండ్లకు లొంగిపోయానని గానీ, స్పష్టంగా కనిపిస్తున్న తప్పుడు పద్ధతుల పట్ల కళ్లు మూసుకున్నానని గానీ అర్థం కాదు. లౌక్యంగా, సత్సంబంధాలని కొనసాగిస్తూనే కఠినంగా వ్యవహరించడమే నిర్మాణాత్మక సామరస్యానికి మార్గమని నేను గ్రహించాను. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను.

నేను 2007 ప్రారంభంలో దక్షిణ మధ్య రైల్వేలోని లాలాగూడ కోచింగ్ వర్క్‌షాప్‌కు చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ (CWM) గా బాధ్యతలు స్వీకరించాను. మే డే (మే 1) దగ్గర పడుతుండటంతో నాకు ఒక విషయం తెలిసింది. ఆ రోజు అధికారికంగా సెలవు కాకపోయినప్పటికీ, దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఆ రోజు ఎవరూ పని చేయరట. అందరూ వర్క్‌షాప్ గేటు దగ్గర గుమిగూడి యూనియన్ నాయకుల ప్రసంగాలు వింటారు, అది కాగానే కార్మికులందరూ నేరుగా ఇళ్లకు వెళ్లిపోతారు. సిడబ్ల్యుఎమ్ (CWM) కూడా ఆ వేదికపై కూర్చుని సభను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉంటుంది. నేను ఆ సభలో పాల్గొనడానికి, మాట్లాడటానికి సిద్ధపడ్డాను కానీ వారికి ఒక నిబంధన పెట్టాను. సిడబ్ల్యుఎమ్‌గా నాకు సెలవు ప్రకటించే అధికారం లేదు. ఆ సెలవు కాగితం మీద లేదు, కేవలం ఆచరణలో మాత్రమే ఉందని వారు నాతో అన్నారు. “సరే, అలాంటప్పుడు నేను దీనికి అనుమతించను. ఇక్కడున్న మిగతా వారిలాగే నేను కూడా ఒక ప్రభుత్వ సేవకుడిని. ఇలాంటి అనధికారిక పనులు జరగకుండా చూడటమే నా బాధ్యత,” అన్నాను. దానికి అక్కడున్న పెద్ద నాయకులందరి నుండి తక్షణ స్పందన వచ్చింది: “మీరు ఇక్కడికి వచ్చిన మొదటి CWM ఏమీ కాదు. ఇది దశాబ్దాలుగా సాగుతోంది. మీరెందుకు కార్మిక వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు?” అని. నేను నా మాటపైనే నిలబడ్డాను, “కార్మిక వ్యతిరేకత కాదు, నేను కూడా ఈ వర్క్‌షాప్ కార్మికులలో ఒకడిని అనే భావిస్తాను. కానీ నా పరిధిని దాటి ప్రవర్తించమని మీరు నన్ను అడగలేరు.” దాంతో వాతావరణం వేడెక్కింది. ఈ మొండి, వింత వైఖరిని సహించేది లేదని యూనియన్లు హెచ్చరించాయి. ఈలోగా, నేను వ్యక్తిగతంగా యూనియన్ల ఉన్నత స్థాయి నాయకులతో మాట్లాడి, సిబ్బంది సమస్యలన్నింటినీ వినడానికి నేను సిద్ధంగా ఉన్నానని, అయితే మే డే వేడుకలు క్రమశిక్షణారాహిత్యానికి వేదిక కాకూడదని వారికి వివరించాను; ఈ విషయంలో వారు జోక్యం చేసుకోకుండా ఉండేలా ఒప్పించగలిగాను. అధికారులు, సూపర్‌వైజర్లు అందరూ నన్ను హెచ్చరిస్తూ -ఇలాంటి వివాదాలను రేపవద్దని, దీనివల్ల మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇబ్బందుల్లో పడతామని సలహా ఇచ్చారు. కానీ నేను వెనక్కి తగ్గలేదు; అధికారులు కూడా ఈ మార్పుకు నాయకత్వం వహించాల్సిన సమయం ఇదేనని చెప్పాను. సిబ్బంది మొదటి సగభాగం ఖచ్చితంగా పని చేయాలి, రాని వారికి ‘ఆబ్సెంట్’ మార్క్ చేయబడుతుంది, ఆ తర్వాత మనమందరం కలిసి వేడుకలో పాల్గొంటాం అని స్పష్టం చేశాను. లొంగుబాటు ద్వారా కొనుక్కునే శాంతి కంటే, క్రమశిక్షణ, శ్రమ గౌరవం చాలా ముఖ్యమైనవనే స్పష్టమైన సందేశాన్ని పంపడమే దీని ఉద్దేశం.

ఆ రోజు దగ్గర పడుతున్న కొద్దీ, నేను యూనియన్లను మర్యాదపూర్వకంగా కలుస్తాను కానీ సూత్రప్రాయంగా వెనక్కి తగ్గేది లేదని అందరికీ అర్థమైపోయింది. స్థానిక నాయకులు లోలోపల అసంతృప్తితో రగిలిపోతూ, చేతకాని హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. మే నెలకు ఒక రోజు ముందు, సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు పని చేస్తారని, ఆ తర్వాత వారు వేడుక జరిగే స్థలానికి రాలీగా వెళ్తారని, నేను కూడా ప్రముఖులతో కలిసి పూలదండలు వేసి, మే డే ప్రాధాన్యతను కొనియాడుతూ ప్రసంగించాలని నన్ను కోరారు. నేను దానికి సంతోషంగా అంగీకరించాను. మే 1వ తేదీ ఉదయం 9 గంటలకు, ఎంతో సమర్థుడైన వర్క్స్ మేనేజర్ కృష్ణమూర్తి నాకు ఎంతో ఉత్సాహంగా ఫోన్ చేసి, “సార్, జనాలు పని చేస్తున్నారు!” అన్నాడు. ఆ చిన్న సంతోషానికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను, కానీ మనం చేయాల్సింది కూడా అదే కదా – పని చేయడం? నిజమే, కానీ అక్కడ జరుగుతున్న మార్పు యొక్క ప్రాధాన్యతను తక్కువ చేసి చూడలేం; ఇటీవలి దశాబ్దాలలో వర్క్‌షాప్ చరిత్రలో మొదటిసారిగా మే డే రోజున పని జరిగింది.

అయితే, బెంగళూరు డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) గా నా పోస్టింగ్‌లో నేను ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను. అక్కడ ఉన్న ప్రధాన యూనియన్ ఎంతటి ఆధిపత్యాన్ని సంపాదించుకుందంటే -ముందస్తు అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో అధికారి గదిలోకి చొరబడటం, ఆఫీస్ గోడల నిండా, ఆఖరికి నగర ప్రధాన స్టేషన్‌లోనూ యూనియన్ పోస్టర్లు, బ్యానర్లు అంటించడం వంటి విషయాల గురించి యాజమాన్యం వారిని ప్రశ్నించే పరిస్థితి లేదు. నేను వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడటానికి ప్రయత్నించాను కానీ లాభం లేకపోయింది; డిఆర్ఎమ్ (DRM) అయిన నేను ఇలాంటి చిన్న విషయాల్లో జోక్యం చేసుకోకూడదనేది వారి పల్లవి. ఇవి చిన్న విషయాలు కావు, ఇవి డివిజన్ యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తాయని నేను వారిని బ్రతిమిలాడాను. లొంగిపోయే యాజమాన్యాలతో వ్యవహరిస్తూ ఇన్నేళ్లుగా అలవాటైన స్వేచ్ఛను వదులుకోవడం యూనియన్ల అహానికి దెబ్బ తగిలింది. వారు తమ అహాన్ని, సిబ్బందిలో తమకున్న తప్పుడు ప్రతిష్ఠ వెనుక దాచడానికి ప్రయత్నించారు. నా టీమ్‌లోని కొందరు ధైర్యవంతులైన అధికారుల సహాయంతో నేను వారిపై కఠినంగా వ్యవహరించాను. ఆ తర్వాతి రెండేళ్లలో అక్కడ ఏం జరిగిందో నేను వివరంగా చెప్పనక్కర్లేదు; అది నిరంతర ఘర్షణల పర్వంగా సాగింది. అది నాకు, నా కుటుంబానికి ఎంతో మానసిక ఒత్తిడిని కలిగించింది. ఫోన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు వచ్చాయి. పైగా బోర్డులోని కొందరు అగ్రశ్రేణి అధికారులు కూడా నన్ను వెనక్కి తగ్గమని, కేవలం న్యాయమూర్తిలా ఉండాలి కానీ శిక్షించే వ్యక్తిలా మారవద్దని సలహా ఇచ్చారు. ఆ సలహా ఉద్దేశం ఏదైనప్పటికీ, డివిజన్ సంస్కృతిని మార్చడానికి నాతో కలిసి అడుగులు వేసిన నా అధికారులను నేను ఒంటరిగా వదిలేయడానికి సిద్ధంగా లేను.

మేము పూర్తిగా విజయం సాధించామని నేను చెప్పను, కానీ యూనియన్లు కోరుకునే ఎలాంటి తప్పుడు పనులైనా చెల్లుబాటు కావు అనే స్పష్టమైన సందేశం మాత్రం సిబ్బందికి, అధికారులకు చేరింది. మాకు హెచ్ఆర్ హెడ్‌గా ఎంతో వివేకం, లౌక్యం ఉన్న లిల్లీ పాండేయా లాంటి అధికారి ఉండటం వల్ల విషయాలు మరింత తీవ్రం కాకుండా అదుపులో ఉంచడానికి సహాయపడింది; దాదాపు అన్ని వేళలా ఉద్రిక్తత ఉన్నప్పటికీ డివిజన్ పనులకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ఒక చిన్న విషయం: లిల్లీ కూడా కొన్నిసార్లు యూనియన్ల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆమె ‘ఆకర్షణీయమైన’, ‘శాంత స్వభావం’ వల్లే తాము డిఆర్ఎమ్ (DRM) పై పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోతున్నామని వారు ఆమెతో అనేవాళ్లు. ఆమె వ్యక్తిత్వం ఎలా ఉన్నప్పటికీ, సిబ్బంది సంక్షేమ చర్యలను నిజాయితీగా చేపట్టడంలో ఆమె చూపిన నిరంతర కృషి మాపై వచ్చే అనేక దాడులను కొంతవరకు తిప్పికొట్టింది.

మాకు ఘర్షణలు జరిగిన ప్రతిసారీ, మా డివిజన్ బ్రాంచ్ అధికారులలో అత్యంత సీనియర్ మరియు సమర్థుడైన సహోద్యోగి వై.ఎన్. బాబు, “సమస్య ఏంటి? కేవలం అహమా?” అనేవాడు. అవును, దాదాపు అదే. ఒకట్రెండు ప్రధాన సమస్యలు మినహా – ఉదాహరణకు, సిబ్బంది అందరికీ జీతాలు బ్యాంక్ ద్వారా చెల్లించాలని మేము భావించినప్పుడు. యూనియన్లు మాత్రం కేవలం నగదు రూపంలోనే చెల్లించాలని పట్టుబట్టాయి. బోర్డుతో పాటు రైల్వేలోని ఇతర డివిజన్లు కూడా దీనికి లొంగిపోయాయి; కఠినమైన నిర్ణయం కంటే సులువైన మార్గాన్నే వారు ఎంచుకున్నారు. అయితే, బ్యాంక్ పేమెంట్ అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా జరగాల్సిన పద్ధతి అని తెలుసుకోవడానికి ఎలాంటి పరిశోధన అవసరం లేదు. మేము ఈ విషయంలో గట్టిగా నిలబడ్డాము, దాంతో యూనియన్లు రైళ్లను ఆపేస్తామని బెదిరించాయి. మేము స్టేషన్లలో కొందరు మీడియా ఫోటోగ్రాఫర్లను ఉంచాము, దాంతో వారి ఆటలు సాగలేదు; వారి చట్టవిరుద్ధమైన చర్యలు కెమెరాకు చిక్కుతాయని వారికి తెలుసు. ప్లాట్‌ఫారమ్‌పై చాలా హంగామా జరిగింది కానీ రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించేలా ఎవరూ పట్టాలపైకి దిగలేదు. చివరకు, వారి నినాదాల మధ్యనే రైళ్లు సమయానికి బయలుదేరాయి. లిల్లీ వారికి ఒక గౌరవప్రదమైన మార్గాన్ని చూపింది, దానికి వారు వెంటనే అంగీకరించారు.

అలాంటి వ్యక్తులతోనైనా లేదా వారి వ్యవస్థీకృత యూనియన్లతోనైనా వ్యవహరించేటప్పుడు – అదంతా మన మానవ వనరులకు మనం ఇచ్చే విలువపైనే ఆధారపడి ఉంటుంది. అన్ని ఇతర వనరుల కంటే మానవ వనరుల ప్రాధాన్యతను గుర్తించి, వారి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సానుభూతితో, ఆత్మీయతతో వ్యవహరిస్తే సగం విజయం సాధించినట్లే. పైన పేర్కొన్న ఉదాహరణ కేవలం ఒకట్రెండు మినహాయింపులు మాత్రమే, ఎక్కడైతే మనం మరింత కఠినంగా ఉండాల్సి వచ్చిందో, కానీ మిగతా సమయాల్లో ఈ సాధారణ మంత్రం ఎప్పుడూ పనిచేస్తుంది.

ఈ సార్వత్రిక సత్యం నుండి కొంచెం పక్కకు జరిగి, మెక్‌బెత్ లో లేడీ మెక్‌బెత్ మరణించినప్పుడు, మెక్‌బెత్ రాజు తన అంతిమ క్షణాల్లో ఉన్నప్పుడు షేక్స్‌పియర్ చెప్పిన అద్భుతమైన మాటలను గుర్తుచేసుకుందాం, “జీవితం అనేది ఒక నడిచే నీడ మాత్రమే, రంగస్థలంపై కొద్ది సమయం హడావుడి చేసి, ఆపై శాశ్వతంగా తెరమరుగైపోయే ఒక ప్రాధాన్యత లేని మామూలు నటుడు లాంటిది.”

అదుపులేని ఆశయం, మితిమీరిన అహం ఆవహించినప్పుడు అంతం దగ్గర లోనే ఉంటుంది. గౌరవం, మంచితనంపై అహంకారం సవారీ చేసినప్పుడు, స్వార్థపూరితమైన ఆలోచనలే మార్గదర్శకాలైనప్పుడు, మానవ కథ నుండి అసలు అర్థమే హరించిపోవడం ప్రారంభమవుతుంది: “జీవితం అనేది ఒక నడిచే నీడ మాత్రమే…” మనం అహానికి వ్యతిరేకంగా ఒక సమతుల్యతను ఏర్పరచుకోవాలి, తప్పుడు ఆశయాలు, అహంకారం యొక్క ప్రలోభాలను నిరోధించాలి, ముఖ్యంగా అవి ఇతరుల నాశనాన్ని కోరుకునేటప్పుడు. ఈ చర్యలోనే తనకూ, ప్రజలకు, సంస్థలకు మోక్షం ఉంటుంది. యాజమాన్యంలోని అహంకార పూరిత నాయకులైనా లేదా యూనియన్ల నాయకులైనా కథ ఒక్కటే. అలాంటి అహంకార పూరిత యాజమాన్య నాయకులను నేను చాలా మందిని కలిశాను కానీ, అలాంటి యూనియన్ నాయకులను నేను చాలా అరుదుగా చూశాను. బెంగళూరులో అంత హంగామా చేసిన నాయకుడు కూడా ఇప్పటికీ నాకు మంచి మిత్రుడు, ఎందుకంటే కాలక్రమేణా మేము ఒకరి పరిమితులను ఒకరం అర్థం చేసుకున్నాము.

రైల్వే ప్రొడక్షన్ యూనిట్లలో యూనియన్ల స్థానంలో ఎన్నికైన సభ్యులతో కూడిన స్టాఫ్ కౌన్సిల్ ఉంటుంది. అభ్యర్థులు దాదాపు ఏదో ఒక యూనియన్‌కు చెందినవారే అయినప్పటికీ, ఎన్నికైన బాడీ ఏకైక ప్రతినిధిగా వ్యవహరించాలి. జోనల్ రైల్వేలలో ఉన్నట్లుగా సాధారణ యూనియన్ వ్యవస్థను పునరుద్ధరించాలని యూనియన్లు పోరాడుతున్నాయి. ఐ.సి.ఎఫ్‌.లో యూనియన్లు ఈ విషయంపై కోర్టుకు వెళ్లాయి, ఆ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండటంతో అధికారికంగా స్టాఫ్ కౌన్సిల్ ఏదీ పనిచేయడం లేదు. వేర్వేరు రాజకీయ, కార్మిక అనుబంధాలు కలిగిన సుమారు పది యూనియన్లు ఉన్నాయి – కొన్ని బలంగా, కొన్ని బలహీనంగా ఉన్నాయి. ఎస్సీ/ఎస్టీ మరియు ఓబీసీ సిబ్బంది కోసం రెండు గుర్తింపు పొందిన అసోసియేషన్లు ఉన్నాయి, ఇందులో ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోవడంతో అధికారిక గుర్తింపు నిలిచిపోయింది. అధికారికంగా, సమర్థవంతంగా మేము కేవలం ఓబీసీ అసోసియేషన్‌తో మాత్రమే వ్యవహరించాల్సి వచ్చింది. ఐ.సి.ఎఫ్‌.ను యూనియన్ల జోక్యం లేకుండా నడిపించడానికి ఇది అనుకూలమైన సమయం. కానీ మేము ఆ మార్గంలో వెళ్లలేదు; సిబ్బంది ప్రతినిధులతో ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండటం అభివృద్ధికి ఎంతో అవసరమని నేను నమ్మాను. అందువల్ల, మేము అందరితోనూ మాట్లాడాలని నిర్ణయించుకున్నాము. మేము వారి మాటలను ఆదరణతో, బాధ్యతాయుతంగా వినేవాళ్లం; ఏ దశలోనూ వారిని చులకనగా చూస్తూ మాట్లాడలేదు. వారి అభిప్రాయాలు, ఆందోళనలు మాకు ముఖ్యమైనవని స్పష్టం చేశాము. దీనిని నేను చట్టబద్ధంగా యూనియన్లు లేకపోవడం, కానీ ఆచరణలో సిబ్బంది ప్రతినిధుల చురుకైన సమూహం ఉండటం అని పిలుస్తాను.

ఐ.సి.ఎఫ్‌.లో యూనియన్లతో వ్యవహరించిన వృత్తాంతాలు నా దగ్గర పెద్దగా లేవు. అంతమాత్రాన ఐ.సి.ఎఫ్. పారిశ్రామిక రంగంలో ఒక ప్రశాంతమైన ద్వీపం అని కాదు. ఖచ్చితంగా కాదు. ఐ.సి.ఎఫ్. గతంలో తీవ్రమైన యూనియన్ ఉద్యమాలను చూసింది. మేము చాలా మెత్తగా లేదా మరీ కఠినంగా మారకుండా ఉండటానికి ఆ విషయాన్ని ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకునేవాళ్లం. మాకు ఒక చిన్న సంతోషం కూడా ఉంది – దాదాపు ఒక దశాబ్దం క్రితం ఒక చిన్న విషయంపై అధికారుల బృందాన్ని దాదాపు 6-7 గంటల పాటు దిగ్బంధించిన ఒక పాత నాయకుడిని మేము డిస్మిస్ చేశాము. అతను తనపై ఉన్న క్రమశిక్షణా చర్యలపై కోర్టుకు వెళ్లాడు. మేము ఈ కేసులో మా వాదనలు గట్టిగా వినిపించాము, చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము; అదే సమయంలో కోర్టులో కూడా అత్యంత చాకచక్యంగా పావులు కదిపాము; కోర్టు నుండి క్లియరెన్స్ రాగానే మేము వేగంగా స్పందించి, మరుసటి రోజే ఆ ఉద్యోగికి డిస్మిసల్ ఆర్డర్స్ ఇచ్చాము.

ఇదేమీ విషయాలను సరళీకృతం చేయడం కాదు. మా హెచ్ఆర్ మేనేజ్‌మెంట్ – దీనిని పర్సనల్ డిపార్ట్‌మెంట్ అని పిలవడం కొంత బాలేదు – ఎంతో ప్రశాంతంగా, నిబ్బరంగా ఉండే మోహన్ రాజా (PCPO) ఆధ్వర్యంలో నడవడం నా అదృష్టం. అతనికి ఐ.సి.ఎఫ్. లోని క్షేత్రస్థాయి పరిస్థితులపై అద్భుతమైన అవగాహన ఉంది, అతని అంచనాలు ఎప్పుడూ తప్పలేదు. అతను చాలా దృఢంగా ఉండగలడు, అదే సమయంలో అతనిలో సానుభూతి, కరుణ కూడా ఉన్నాయి. అది నా పనిని చాలా సులువు చేసింది. ఎలాంటి పారిశ్రామిక సమస్యా సంక్షోభంగా మారలేదు. కొందరు అగ్రశ్రేణి నాయకులపై గతంలోని కొన్ని సంఘటనల వల్ల క్రమశిక్షణా చర్యలు నడుస్తున్నాయి. ఆ కేసులను వేగవంతం చేసి తార్కిక ముగింపుకు తీసుకువచ్చినప్పటికీ, మేము వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎందుకంటే ఆ నాయకులు మా పురోగతిలో చాలా నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. ఒకవేళ నేను పుస్తకాల్లోని నియమాలను మాత్రమే చూసే అధికారిలా ప్రవర్తించి కఠినమైన చర్యలు తీసుకుంటే, మేము యూనియన్లతో, సిబ్బందితో ఉన్న బంధాన్ని కోల్పోతామని నా అంతరాత్మ చెప్పింది. ఇది మా విధానం నుండి కొంత పక్కకు జరిగినట్లు అనిపించినప్పటికీ, నిజానికి అలా కాదు. మా సిబ్బందిని నడిపించే నాయకులను కొంతవరకు ఆదరించడం, ఇష్టమున్నా లేకపోయినా, కార్మికులను మన పెద్ద లక్ష్యాల వైపు నడిపించడానికి ప్రయోజనకరంగా ఉంటుందనిపించింది. మిగతా ముఖ్య అధికారులు కూడా మేము యూనియన్లతో వ్యవహరించే తీరుతో ఏకీభవించారు. అసలు విషయం ఏంటంటే – నా పదవీ కాలంలో ఐ.సి.ఎఫ్. లో ఎలాంటి పారిశ్రామిక అశాంతి లేకపోవడం మాకు సంతోషాన్ని ఇచ్చింది.

ఏది ఏమైనప్పటికీ, మోహన్ రాజా చురుకైన పాత్ర వల్ల విషయాలు అద్భుతంగా పనిచేశాయి. ఏది ఒప్పో దాని కోసం నిలబడటం, ఏది తప్పో దానిని సరిదిద్దే సామర్థ్యం సాధారణంగా చాలా చోట్ల లోపిస్తుంది. ఈ గుణమే ఒక వ్యక్తిని నిర్వచిస్తుంది, మిగతా లక్షణాలన్నీ ఈ ఒక్క గుణం నుండే పుడతాయి. మిగతావన్నీ ద్వితీయమే. మోహన్ రాజాకు ఈ గుణం ఉంది, అతను తన బృందాన్ని కూడా అలాగే తీర్చిదిద్దాడు.

మోహన్ రాజాతో కలిసి, నేను దశాబ్దాలుగా పేరుకుపోయిన కొన్ని తప్పుడు పద్ధతులను అంతం చేయాలని చూసేవాడిని. మరో ఉదాహరణ: ఐ.సి.ఎఫ్. సిబ్బందికి మా దగ్గర రెండు లేదా మూడు బ్యాంక్ ఖాతాలను నమోదు చేసే అలవాటు ఉంది. ఒకటి వారి జీతం ఖాతా కాగా, మిగిలినవి లోన్లు, అడ్వాన్సుల కోసం ఉపయోగించేవారు. వారి జీతం ఖాతా నుండి వారు భారీ లోన్ తీసుకున్న బ్యాంక్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ అయ్యే ప్రమాదం ఉంటే, వారు ఐ.సి.ఎఫ్. నుండి తీసుకునే లోన్లు, అడ్వాన్సులు ఆ బ్యాంకుల నుండి సురక్షితంగా ఉండేవి. ఇప్పుడు, ఈ ఖాతాలను ఐ.సి.ఎఫ్. ధృవీకరించింది కాబట్టి, మేము కూడా ఆ తప్పుడు పద్ధతిలో భాగస్వాములమయ్యాము. ఒకసారి ఒక ఉద్యోగి తన సమస్యతో నన్ను సంప్రదించాడు; ఏదో పొరపాటు వల్ల అతని ప్రావిడెంట్ ఫండ్ అడ్వాన్స్ అతని జీతం ఖాతాలో జమైంది, అది ఆ తర్వాత బకాయి ఉన్న లోన్ కింద బ్యాంక్‌కు బదిలీ అయింది. అతను నిజానికి దీనిపై ఫిర్యాదు చేస్తున్నాడు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలను ఉంచే పద్ధతి అమలులో ఉందని తెలుసుకుని, నేను వెంటనే రాజాతో వీటన్నింటికీ స్వస్తి చెప్పమన్నాను; ఒక ఉద్యోగికి మా దగ్గర ఒకే బ్యాంక్ ఖాతా ఉండాలి, అంతే.

రాజా దీనిని చాలా క్రమబద్ధమైన పద్ధతిలో చేపట్టాడు. అతను మొదట ఉద్యోగులందరికీ ఒక నోటీసు జారీ చేస్తూ, వారి ప్రాధాన్యత కలిగిన ఖాతా వివరాలను అందించమని కోరాడు, అదే వారి ఏకైక ఖాతా అవుతుందని స్పష్టం చేశాడు. ఊహించినట్లుగానే, చాలా మంది స్పందించలేదు. ఆ తర్వాత అతను మరో స్పష్టమైన నోటీసు ఇచ్చాడు – ఒకవేళ సానుకూల స్పందన రాకపోతే, ఉద్యోగి యొక్క జీతం ఖాతానే అన్ని అవసరాలకూ ఏకైక ఖాతాగా పరిగణించబడుతుందని. ఊహించినట్లే, కొందరు నాయకులు నా దగ్గరకు వచ్చి, “ఉద్యోగుల వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు వెళ్లడం? అది వారికి, బ్యాంకులకు మధ్య ఉన్న వ్యవహారం కదా,” అని బ్రతిమిలాడారు. నేను వారికి స్పష్టంగా చెప్పాను, “లేదు సార్. ఇది వారి, ఇంకా ఐ.సి.ఎఫ్. ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఉద్యోగులు బ్యాంకులను మోసం చేయడానికి మనం పరోక్షంగానైనా సహకరించకూడదు. ఏదేమైనా, ఇతర సమానమైన రంగాలతో పోలిస్తే మన ఉద్యోగులకు చాలా మంచి జీతాలు ఇస్తున్నాం, ఈ వింత పద్ధతులు మనకు మంచి పేరు తీసుకురావు. కాబట్టి దయచేసి ఈ విషయం నుండి తప్పుకోండి, పీసీపీఓ ని సరైన పని చేయనివ్వండి.”

కానీ మన స్నేహితులు వినలేదు, చల్తా హై (నడుస్తుందిలే)  అంటూ ఒక ఉపన్యాసం ఇచ్చారు. చల్తా హై? దీని అర్థం ఏంటంటే – కొన్ని తప్పులు సాంప్రదాయంగా వస్తున్నాయి కాబట్టి వాటిని అంగీకరించాలి, వ్యవస్థను కదపడంలో ఎలాంటి ప్రయోజనం లేదు అని. నాకు షేక్స్‌పియర్ యొక్క ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్ లోని మొదటి లార్డ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి, “మన జీవితమనే వస్త్రం మంచి, చెడులనే రంగు రంగుల దారాల కలయికతో నేయబడింది. మన తప్పులు గనుక కొరడాతో కొట్టి బుద్ధి చెప్పకపోతే – మన మంచి గుణాలకు గర్వం పెరిగిపోయేది; అలాగే, మన మంచి గుణాలు గనుక ఆదరించి అండగా నిలబడకపోతే – మన పాపాలు/తప్పులు తీవ్ర నిరాశలో మునిగిపోయేవి.” వారు నాతో మాట్లాడుతున్నారు, వారికి తెలియకుండానే, ఆ కవి శైలిలో, మానసిక తత్వ శాస్త్రాన్ని అంత అద్భుతంగా వివరించిన ఆ రచయితలా; సమాజంలో మనుగడ సాగించాలంటే వెలుగుతో పాటు ఇతరుల చీకటిని కూడా అంగీకరించాలి. నేను వారి కంటే మెరుగ్గా వాదించగలిగేవాడిని. మేము విషయాన్ని ఉన్నదున్నట్లు చెప్పాల్సి వచ్చింది. నేను వెనక్కి తగ్గలేదు. ఎలాంటి ఆలస్యం లేకుండా, ఐ.సి.ఎఫ్. లోని ఈ సమర్థించలేని తప్పుడు పద్ధతి ముగిసింది, బ్యాంకులు సంతోషించాయి. మనం ఎలాంటి తప్పునైనా చల్తా హై అంటూ క్షమించే దేశంలో ఉన్నాం. భారతదేశాన్ని ఒక ప్రగతిశీల అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే, ఇలాంటి స్పష్టమైన అన్యాయాలను, తప్పులను అంగీకరించే వైఖరిని మనం నిరోధించాలి.

ఐసీఎఫ్‌లో ఇలాంటి అనేక రంగాలలో, క్రమశిక్షణ అయినా లేదా సంక్షేమమైనా, హెచ్ఆర్ వాతావరణాన్ని మార్చడంలో మోహన్ రాజా ఒక మాంత్రికుడిలా నిరూపించుకున్నాడు. మృదుస్వభావి అయినప్పటికీ దృఢంగా ఉండే అతను, మన మానవ వనరుల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో మా ప్రయత్నాలన్నింటికీ ప్రధానమైన ఆధారంగా నిలిచాడు. ఐసీఎఫ్‌లో యూనివర్సల్ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నప్పుడు అతను మాకు కొండంత అండగా నిలిచాడు. ఫ్యాక్టరీ కార్మికులందరికీ బయోమెట్రిక్ అటెండాన్సా? సులువైనదే, కానీ అదే సమయంలో చాలా క్లిష్టమైనది కూడా.

మొదట్లోనే ఉండాల్సిన ఒక విధానం గురించి అంత క్లిష్టమైనది ఏముంటుంది? రైల్వేలోని అన్ని వర్క్‌షాప్‌లు, ఫ్యాక్టరీలు, మెయింటెనెన్స్ డిపోలు/షెడ్‌లు అన్నీ కూడా షాప్ ఫ్లోర్ మేనేజ్‌మెంట్‌కు, కార్మికులకు మధ్య అనధికారికంగా కుదిరిన ఒక ‘కాంట్రాక్ట్ సిస్టమ్’ పై నడుస్తాయి. ఒక రోజుకు చేయాల్సిన పని అనధికారికంగా (కొన్నిసార్లు ఇన్సెంటివ్ ఆధారిత యూనిట్లలో అధికారికంగా) నిర్ణయించబడుతుంది, కార్మికులు ఆ పనిని డ్యూటీ గంటల కంటే ముందే పూర్తి చేయడానికి మొగ్గు చూపుతారు, పని కాగానే ఇళ్లకు వెళ్లిపోతారు. కాబట్టి రైల్వేలోని యూనిట్లలో కార్మికులు రోజుకు కేవలం మూడు నుండి ఆరు గంటల పాటు మాత్రమే డ్యూటీలో ఉంటారు; అసెంబ్లీ-లైన్ తరహా పని ఉన్న యూనిట్లలో ఆరు గంటలు పని చేస్తే, ఇతరులలో ఇది సాధారణంగా మూడు నుండి ఐదు గంటలు ఉంటుంది. ఐ.సి.ఎఫ్. పంజాబ్, బెంగాల్‌లోని కొన్ని యూనిట్లంత ఘోరంగా లేకపోయినప్పటికీ, దీనికి మినహాయింపు ఏమీ కాదు. ఇక్కడ కూడా నాలుగు గంటల గట్టి పని, ఆ తర్వాత ఇళ్లకు వెళ్లడం అనేది దశాబ్దాలుగా బహిరంగ రహస్యం. రైల్వే బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టడం ప్రారంభించినప్పుడు, దానిని కేవలం ఆఫీస్ మరియు ఇతర డెస్క్ సిబ్బందికే పరిమితం చేసింది, ఎందుకంటే ప్రధాన పనులను ఆపేసే శక్తి వారికి లేదు. షాప్ ఫ్లోర్ కార్మికులకు బయోమెట్రిక్ ప్రవేశపెట్టడానికి చేసిన చిన్న ప్రయత్నాలు స్టేటస్ కోయిజం (status quoism), సౌకర్యవంతమైన వాతావరణం, పిరికితనం వల్ల విఫలమయ్యాయి. ఇది మరో చల్తా హై. రైల్వేలోని మన పూర్వీకులు వ్యవస్థను ఈ స్థాయికి దిగజార్చడానికి అనుమతించినందుకు నేను ఎల్లప్పుడూ వారిని తీవ్రంగా విమర్శించేవాడిని. కానీ ఇక్కడ నేను ఐ.సి.ఎఫ్. జిఎమ్ (GM) గా ఉన్నాను, ఈ స్పష్టమైన నిర్లక్ష్యాన్ని సరిదిద్దడానికి ఏమీ చేయకుండా ఇతరులపై వేలెత్తి చూపడానికి నాకు ఎలాంటి సాకులు లేవు. నేను స్పందించాల్సి వచ్చింది, ది మర్చంట్ ఆఫ్ వెనిస్ లోని పోర్టియా చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ, “మంచిని తెలుసుకోవడం ఎంత సులభమో, దానిని ఆచరించడం కూడా అంతటి సులభమే అయివుంటే – చిన్న ప్రార్థనా మందిరాలన్నీ మహా దేవాలయాలుగాను, పేదవాడి గుడిసెలన్నీ రాజప్రసాదాలుగాను మారిపోయేవి. తన సొంత బోధనలను తానే ఆచరించేవాడే నిజమైన ఉత్తమ గురువు. ఇతరులు ఏమి చేయాలో ఇరవై మందికి సులువుగా బోధించగలను గానీ, నా బోధనను నేనే ఆచరించే ఆ ఇరవై మందిలో ఒక్కడిగా మారడం మాత్రం నాకు అత్యంత కఠినమైన విషయం!.”

అవును, నేను స్పందించాల్సి వచ్చింది. కానీ నాకు తెలుసు, హెన్రీ IV లోని ఫాల్‌స్టాఫ్ చెప్పినట్లుగా, ధైర్యంలో అత్యంత ఉత్తమమైన భాగం వివేకం. ట్వెల్ఫ్త్ నైట్ లోని ఫూల్ చెప్పినట్లు, “మూర్ఖపు తెలివి కంటే, తెలివైన మూర్ఖత్వం మేలు.” ఇది బుల్‌డోజర్ లాగా దూసుకుపోయి పరిష్కరించే సమస్య కాదు; గతంలో రైల్వేలోని పెద్ద వర్క్‌షాప్‌లు లేదా ఫ్యాక్టరీలలో అలాంటి ప్రయత్నాలు చేసిన వారందరూ చివరకు కేవలం గందరగోళాన్ని మిగిల్చారే తప్ప ఏమీ సాధించలేకపోయారు. రాజాకు, ఇతర సీనియర్ అధికారులకు, ముఖ్యంగా మనీష్ ప్రధాన్, శశి భూషణ్‌లకు నా సందేశం ఒక్కటే. మనం దీనిని చేయాలి కానీ క్రమంగా, ఉత్పత్తి పెంపుదల, కొత్త మోడళ్లు మరియు ఖచ్చితంగా ‘ట్రైన్ 18’ వంటి మన పెద్ద ప్రాజెక్టులను దెబ్బతీసేలా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా చేయాలి.

రాజాతో పాటు ఇద్దరు సీడబ్ల్యూఈ (CWE) లు అద్భుతమైన పని చేస్తున్నారు. మాకు ఎలాంటి తొందరలేదు, కానీ ముఖ్య సభ్యులు మాత్రం ‘ఇప్పుడు లేదా ఎప్పటికీ కాదు’ అనే విషయంలో చాలా దృఢంగా ఉన్నారు. ఆఫీస్, డెస్క్ సిబ్బంది అప్పటికే బయోమెట్రిక్ పరిధిలోకి వచ్చారు, దీనిని సార్వత్రికం చేయబోతున్నందుకు వారు సంతోషంగా ఉన్నారు. మా లక్ష్యం 2018 ప్రారంభంలో దీనిని ప్రారంభించడం, కానీ యూనియన్లు ఏదో ఒక అభ్యంతరాన్ని లేవనెత్తుతూనే ఉన్నాయి. త్రివేది దీనికి పూర్తిగా అనుకూలం, అయితే ఒక నిబంధన – దీనివల్ల ఉత్పత్తి తగ్గకూడదు అని. అన్నట్లు, అతను అంతకుముందు ఆలస్యంగా వచ్చే సిబ్బందిని హెచ్చరించడానికి కొన్ని వినూత్న మార్గాలను ప్రయత్నించాడు. స్కౌట్స్ మరియు గైడ్స్ పెద్ద సమూహం ఫ్యాక్టరీ ప్రధాన గేటు దగ్గర ప్లకార్డులతో నిలబడేవారు, వాటిపై “ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు సమయానికి పనిలోకి రానప్పుడు మమ్మల్ని మాత్రం సమయానికి స్కూలుకు వెళ్లమని ఎందుకు అడుగుతారు?” అని ఉండేది. ఇది బయోమెట్రిక్ ప్రారంభించడానికి నేరుగా సహాయపడనప్పటికీ, సమస్యను అందరికీ స్పష్టంగా తెలియజేయడానికి ఖచ్చితంగా సహాయపడింది.

ఫింగర్ స్కాన్లు, ఫోటోలను సేకరించడానికి కాంట్రాక్ట్ అప్పటికే ఖరారైంది, కేవలం మా అనుమతి కోసం వేచి ఉంది. ఈలోగా, నాకు అనధికారికంగా ఒక విషయం తెలిసింది – దాదాపు రెండు వందల మంది ఉద్యోగులు అసలు పనికే రావడం లేదు, వారి హాజరును ఇతరుల ద్వారా మార్క్ (proxy) చేయిస్తున్నారు. వారికి ఇతర వ్యాపారాలు లేదా వ్యాపకాలు ఉన్నాయి, ఐ.సి.ఎఫ్. లో వారి ఉద్యోగం కేవలం ఒక అదనపు ఇన్సూరెన్స్ లాంటిది. వారు తక్కువ స్థాయి సూపర్‌వైజర్లు, సహోద్యోగులతో సెటిల్ చేసుకుని, తమ ఇన్సెంటివ్ సంపాదనను వారికి ఇచ్చేసేవారు మరియు బహుశా కొన్ని కానుకలు కూడా ఇచ్చేవాళ్లు. వ్యవస్థను ఈ విధంగా మభ్యపెడుతూ, వారు ఎలాంటి భయం లేకుండా గైర్హాజరయ్యేవారు. నేను ఈ విలువైన సమాచారాన్ని నోట్ చేసుకున్నాను, విషయాలను నేరుగా తీవ్రం చేయకుండా సరైన సమయం కోసం వేచి చూశాను.

సరైన సమయం త్వరలోనే వచ్చింది. బయోమెట్రిక్ విధానంతో ముందుకు వెళ్లడానికి ఒక బలమైన తోడ్పాటు అవసరమని రాజా నాతో అన్నాడు. నేను యూనియన్ ప్రతినిధులను కలిశాను, వారు నన్ను చాలా సున్నితంగా అడిగారు,

  1. “బోర్డు నుండి దీనిపై ఎలాంటి ఒత్తిడి లేనప్పుడు ఈ విధానాన్ని ఎందుకు తీసుకురావడం?
  2. రైల్వేలోని ఇతర యూనిట్లు ఏవీ దీనిని ప్లాన్ చేయనప్పుడు కేవలం ఐసీఎఫ్‌లోనే ఎందుకు?
  3. పెరుగుతున్న ఉత్పత్తి, మంచి పారిశ్రామిక సంబంధాలు ఉన్న ఐసీఎఫ్‌లో ఇలాంటి కఠినమైన విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టడం?” అని.

రాజా మరియు ఇతరులు అంతగా క్షేత్రస్థాయి పని చేసిన తర్వాత నేను యూనియన్లతో తప్పుడు మార్గంలో వెళ్లాలని అనుకోలేదు. నేను యూనియన్ నేతలకు చెప్పాను, రైల్వేలో దీనిని అమలు చేసిన మొదటి యూనిట్‌గా మన కార్మికులు గర్వపడాలి అని. చర్చలు ఊహించినట్లుగానే సాగాయి, చివరకు నేను నా ప్రధాన అస్త్రాన్ని ప్రయోగించాను,

  1. “ప్రస్తుతం ఉన్న పద్ధతికి అనుగుణంగా ఎంట్రీ టైమ్‌లో కొంత సరళత ఉంటుంది.
  2. మేము దీనిని కేవలం రాకను నమోదు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాము, వెళ్లేటప్పుడు పట్టుబట్టము.
  3. మేము మా ప్రయత్నాన్ని బోర్డుకు తెలియజేస్తాము, రైల్వేలోని కనీసం మరో రెండు పెద్ద యూనిట్లలో దీనిని ప్రవేశపెట్టమని కోరతాము. వారు అలా చేసిన తర్వాత, మేము అవుట్ అటెండెన్స్‌తో సహా పూర్తిస్థాయి విధానానికి వెళ్తాము.”

ఆ తర్వాత నేను వారిని అడిగాను, అసలు పనికే రాని ఆ రెండు వందల మంది గురించి మీకు తెలుసా అని. వారు నీళ్లు నములుతుండగా, నేను వారిపై కవి కబీర్ దోహాను ప్రయోగించి దాని అర్థాన్ని వివరించాను:

బక్రీ పాతీ ఖాత్ హై, తాకీ ఖీంచీ ఖాల్
జే నర్ బక్రీ ఖాత్ హై, తిన్కా కౌన్ హవాల్
(పాపం ఆ మేక కేవలం ఆకులను తింటుంది, దానికే మనం దాని చర్మాన్ని వలుస్తాం; కానీ మేకను మొత్తం తినేసే మనుషుల పరిస్థితి ఏంటి, వారిని ఏం చేయాలి?)

రాజా యొక్క విధానం ఎల్లప్పుడూ డేల్ కార్నెగీ చెప్పినట్లుగా ఉంటుంది, “ప్రజలతో వ్యవహరించేటప్పుడు, మీరు తార్కిక జీవులతో కాదు, భావోద్వేగ జీవులతో వ్యవహరిస్తున్నారని గుర్తుంచుకోండి”. నేను భావోద్వేగాన్ని, తర్కాన్ని కలిపి ఉపయోగించబోతున్నాను. నేను వారికి స్పష్టం చేసింది ఏంటంటే -బయోమెట్రిక్ అనేది సమయానికి వచ్చే ఆ ‘ఆకులు తినే’ నిజాయితీపరులైన కార్మికుల కోసం కాదు, అసలు పనికే రాని ఆ ‘మేకను తినే’ వ్యక్తుల కోసమే అని. నా లక్ష్యం ఆ మేకను తినే వ్యక్తులను వదిలించుకోవడమే అని చెప్పాను. ఇది పనిచేసినట్లు అనిపించింది, ఎందుకంటే వారి వ్యతిరేకత కాస్తా అమలును వాయిదా వేయాలనే అభ్యర్థనలుగా మారింది, బహుశా సమయాన్ని పొడిగించుకోవడానికి కావచ్చు.

“ఏదైనా సంఘటన గురించి అతిగా ఆలోచించడం అనేది, ఒక ఆలోచనను నాలుగు భాగాలుగా చేస్తే, అందులో ఒక భాగం మాత్రమే వివేకం ఉంటుంది, మిగతా మూడు భాగాలు పిరికితనమే ఉంటుంది”, అంటాడు హామ్లెట్ తన సుపరిచితమైన అనిశ్చితి సమయాల్లో, ఒక యుద్ధానికి ముందు. తాను అతిగా ఆలోచిస్తున్నానని అతను భావిస్తాడు; ఆలోచించడం అనేది కేవలం ఒక భాగం వివేకం అయితే, మూడు భాగాలు పిరికితనం అని అతను అనుకుంటాడు. కొన్నిసార్లు, మేనేజర్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు, తమ అంతరాత్మను అనుసరించడంలో ఎలాంటి తప్పు లేదు. అది పనిచేస్తుందో లేదో త్వరలోనే తెలుసుకోవచ్చు; ఒకవేళ పనిచేయకపోతే, తక్కువ ఆలోచన – ఎక్కువ సమయస్ఫూర్తితో తన చర్యలను మార్చుకోవచ్చు. నా సీనియర్ టీమ్ అంతా ఇప్పుడు దీనికి అనుకూలంగా ఉంది. మా సిబ్బందిని సంతోషపెట్టడానికి మేము తీసుకున్న అపూర్వమైన చర్యల మంచితనంపై నాకు నమ్మకం ఉంది. మేము ఆ మూడు వంతుల పిరికితనాన్ని పక్కన పెట్టాల్సిన సమయానికి చేరుకున్నాము. నేను ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

కొద్ది రోజుల్లోనే స్కానింగ్ పనులు ప్రారంభమయ్యాయి, ఆ వెంటనే ఎంట్రీ టైమ్‌లో బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టాము. సిబ్బందితో కలిసి హాజరును నమోదు చేయడం కొంత ఇబ్బందిగా ఉందో లేదా చులకనగా ఉందో అని కొందరు సీనియర్ సూపర్‌వైజర్లు ఫిర్యాదు చేయడం వంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి; తాము ఎలాగూ అదనపు గంటలు పని చేస్తున్నాం కాబట్టి ఈ విధానం నుండి తమకు మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. నేను దీని గురించి ఆలోచించాను, ఇద్దరు సీనియర్ ప్రిన్సిపల్ చీఫ్ అధికారులను పిలిచాను, మేము మా హాజరును నమోదు చేసుకుంటున్నట్లు ఫోటోలు తీయించాను, ఆ ఫోటోలతో ఫ్యాక్టరీల అంతటా బ్యానర్లు ఏర్పాటు చేశాము, వాటిపై ఈ నినాదం ఉంది: “బయోమెట్రిక్ విధానం అందరి కోసం, మీ హాజరును నమోదు చేయడం మరువకండి”.

అది పనిచేసింది. ఆ విధానం అప్పటి నుండి అమలులో ఉంది. మా ప్రతిపాదనపై బోర్డు నుండి స్పందన కోసం వేచి చూశాము కానీ ఊహించినట్లుగానే ఎలాంటి సమాధానం రాలేదు. ఏదేమైనా, బోర్డులోని సదరు ఇన్‌ఛార్జ్ అధికారి ఒక సాధారణ ప్రభుత్వ బాబు లాంటివాడు, రైల్వేలకు అర్థం లేని లేఖలు పంపడంలో, ప్రయోజనం లేని బదిలీ ఆర్డర్లు ఇవ్వడంలో బిజీగా ఉండేవాడు; ఒక జూనియర్ అధికారి స్థాయిని దాటి ఎదగలేని వారి నుండి ఎలాంటి విప్లవాత్మక నిర్ణయాలను ఆశించలేము.

మోహన్ రాజా చేపట్టిన అనేక హెచ్ఆర్ మరియు సంక్షేమ చర్యలు మమ్మల్ని రైల్వేలోని ఇతర యూనిట్ల కంటే ప్రత్యేకంగా నిలిపాయి, సిబ్బందితో చర్చలు జరిపేటప్పుడు అది మాకు ఒక పెద్ద ప్రయోజనంగా మారింది. రైల్వే యూనిట్లకు పెద్ద బడ్జెట్లు ఉంటాయి, అందులో చాలా చిన్న భాగాన్ని సిబ్బంది సౌకర్యాలు, సంక్షేమం కోసం కేటాయించడం పెద్ద కష్టమేమీ కాదు; కాకపోతే నాయకులు దానిపై తక్కువ శ్రద్ధ చూపుతారు. మేము స్టాఫ్ కాలనీల మెరుగుదల కోసం నిధులను ధారాళంగా ఖర్చు చేశాము. రాజా మరియు అతని బృందం, ఐ.సి.ఎఫ్. లోని అద్భుతమైన సివిల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్ల సహాయంతో ఏర్పాటు చేసిన సౌకర్యాల జాబితా చాలా పెద్దది, అందులో వారు తెచ్చిన కొన్ని మెరుగుదలలు ఇక్కడ ఉన్నాయి:

  1. లోపల ఉన్న అన్ని కాంటీన్లు, వాటి పొడిగింపులతో సహా పునరుద్ధరించబడ్డాయి మరియు ఆధునీకరించబడ్డాయి.
  2. ప్రతి కాలనీకి బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టు మరియు కనీసం ఒక అధునాతన జిమ్‌తో కూడిన మెరుగైన సంక్షేమ కేంద్రం ఏర్పాటు చేయబడింది.
  3. ప్రతి కాలనీలో కనీసం మూడు పార్కులు ఏర్పాటు చేయబడ్డాయి, వీటిని అప్పటివరకు వదిలివేసిన స్థలాల నుండి పునరుద్ధరించాము.
  4. కాలనీలలో అద్భుతమైన క్రీడా సౌకర్యాలు కల్పించబడ్డాయి.
  5. నాలుగు మ్యారేజ్/కమ్యూనిటీ హాళ్లు పునరుద్ధరించబడ్డాయి మరియు ఎయిర్ కండిషన్ చేయబడ్డాయి, సిబ్బంది తమ కుటుంబ శుభకార్యాల కోసం తక్కువ ధరలకే వీటిని ఉపయోగించుకోవడానికి ఒక అద్భుతమైన వేదికను కల్పించాయి.
  6. అన్ని స్టాఫ్ క్వార్టర్లకు ప్రైవసీ కోసం ఫెన్సింగ్ ఏర్పాటు చేయబడింది; రోడ్లపై స్పష్టమైన సైన్ బోర్డులు, అన్ని క్వార్టర్లలో టైల్స్ ఫ్లోరింగ్ పనులు జరిగాయి.
  7. లోన్లు, పాస్‌లు, క్వెరీల వంటి తమ వ్యక్తిగత విషయాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే భారాన్ని తగ్గిస్తూ అనేక ఆన్‌లైన్ అప్లికేషన్లు, యాప్‌లు ప్రవేశపెట్టబడ్డాయి. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లకుండానే మందులను డెలివరీ చేసే విధానాన్ని కూడా తెచ్చాము.
  8. అన్ని ప్రధాన ఆఫీసులలో సిబ్బంది కోసం వినోదం, కాన్ఫరెన్స్ సౌకర్యాల కల్పన జరిగింది.

ఈ పుస్తకంలో వివరించిన చర్యలతో పాటు, దాష్ ఐసీఎఫ్‌ను ఒక పచ్చని ఒయాసిస్‌గా మార్చడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నాడు. అక్కడి నివాసితులు చూపిన ఆసక్తి స్పష్టంగా కనిపించింది, ఐ.సి.ఎఫ్. స్థలాలను పచ్చదనంతో నింపడంలో ఒక గొప్ప ప్రారంభం జరిగిందని మాకు తెలుసు; అది ఒక పెద్ద హెచ్ఆర్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా మారడం మాకు అదనపు ప్రయోజనం. మోహన్ రాజా, అతని బృందం ప్రొఫెషనల్ సహాయంతో ఇన్‌స్టిట్యూట్లు, కమ్యూనిటీ హాళ్లలో ఐదు అద్భుతమైన తోటలను సృష్టించారు, ఇవి అప్పటికే ఉన్న పదిహేను వనాలకు అదనం.

నా పదవీ కాలం ముగిసే సమయానికి మోహన్ రాజా తన అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించాడు. సదరన్ రైల్వేలో జరిగిన ఇలాంటి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కారణంగా మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో, ఐ.సి.ఎఫ్. లోని 308 మంది మాజీ యాక్ట్ అప్రెంటిస్ ఉద్యోగులు ఎనిమిదేళ్లుగా కన్ఫర్మేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి ఎలాంటి సీనియారిటీ కేటాయించబడలేదు, అందువల్ల వారికి ప్రమోషన్లు నిలిచిపోయాయి. వారి సమస్య పూర్తిగా న్యాయమైనది; ఐ.సి.ఎఫ్.లో ఈ ఉద్యోగులు ఇన్నేళ్లుగా సేవలు అందిస్తున్నప్పటికీ వారిని సొంతం చేసుకోలేకపోయాము. విజిటింగ్‌కు వచ్చే బోర్డు సభ్యులకు, మంత్రులకు కూడా ఈ స్టే ఆర్డర్ ఐసీఎఫ్‌కు వర్తించదని స్పష్టం చేయాలని యూనియన్లు విజ్ఞప్తి చేసేవి. ఏమీ కదిలేది కాదు. లీగల్ ఒపీనియన్ ప్రకారం అది వర్తిస్తుందని స్పష్టంగా ఉంది. ఆ ఉద్యోగులు నన్ను కలిసినప్పుడల్లా నేను అసహాయుడిగా భావించేవాడిని. వారిని నిరాశతో వెనక్కి పంపడానికి నేను నిజంగా సిగ్గుపడేవాడిని. నేను లా ఆఫీసర్‌ని పిలిచేవాడిని కానీ ఆమె అది కోర్టు ధిక్కారం అవుతుందని, ఎలాంటి అనుకూల చర్యలు తీసుకోవద్దని గట్టిగా వారించేది. నేను మోహన్ రాజాని ఏదైనా చేయమని అడుగుతూనే ఉన్నాను, అతను కేవలం తల ఊపేవాడు. అతను దిల్లీకి కొన్ని నిశ్శబ్ద పర్యటనలు చేశాడు, అడిషనల్ సాలిసిటర్ జనరల్‌ను కలిశాడు, ఎలాగోలా అతని నుండి ఒక అనుకూలమైన అభిప్రాయాన్ని పొందగలిగాడు. ఆ ఉద్యోగులందరూ రెగ్యులరైజ్ చేయబడ్డారు. వారు ఎంతో ఆనందంతో, కృతజ్ఞతతో నన్ను దేవుడిలా చిత్రీకరిస్తూ పోస్టర్లు ప్రదర్శించారు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది, అయినా నా రిటైర్మెంట్‌కు కొన్ని రోజుల ముందే కావడంతో నేను నిరసన తెలపలేకపోయాను. ఇది నా పదవీ కాలానికి ఒక శుభం పలకడం లాంటిది, కానీ వారు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన ఏకైక దేవుడు మోహన్ రాజా.

ఇది నన్ను మళ్లీ ఐ.సి.ఎఫ్. సరస్సు కథకు తీసుకువస్తుంది. నేను 2019 వేసవిలో లఖ్‌నవూలో ఒక వార్తాపత్రిక నివేదికను చదివాను, చెన్నై ప్రాంతంలోని అనేక జలాశయాలలో ఐ.సి.ఎఫ్. సరస్సు ఒకటి, అది ఎండిపోలేదు అని. నాకు చాలా సంతోషం అనిపించింది. అందుబాటులో ఉన్న రికార్డులలో స్పష్టమైన ప్రస్తావన లేనప్పటికీ, ఈ సరస్సు 1900 కంటే ముందే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రారంభ రోజుల్లో ఫ్యాక్టరీకి నీటి వనరుగా ఉండేది. ఇన్నేళ్ల నిర్లక్ష్యం, దానికి తోడు ఐ.సి.ఎఫ్. ప్రాంగణానికి పశ్చిమాన ఉన్న అనధికారిక కాలనీల నుండి మురుగునీరు మరియు తుఫాను నీరు చేరడం వల్ల అది మృతప్రాయంగా మారింది. నేను ఈ మురుగునీటి మార్గాలను మూసివేసినప్పుడు, అది ఆ కాలనీలలో తీవ్రమైన ఇబ్బందికి దారితీసింది. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే రంగంలోకి దిగారు, ఆ ఎమ్మెల్యే నన్ను తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని బెదిరించారు; అతని బెదిరింపులను తిప్పికొట్టడంలో ఐ.సి.ఎఫ్. అంతా ఒక్కటయ్యింది. 2016లో ఒక ముఖ్యమైన ప్రాణవాయువు లాంటి నీటి వనరు నుండి అది మృతప్రాయంగా మారడం అనేది మనుషుల స్వయంకృతాపరాధానికి ఒక కథ. కానీ అంతకంటే ముఖ్యంగా, రెండు సంవత్సరాల వ్యవధిలో దాని పునరుద్ధరణ అనేది మానవ వనరుల నిరంతర కృషికి ఒక నిదర్శనం. దాని పునరుద్ధరణ, నా దృష్టిలో, ఐ.సి.ఎఫ్. లోని హెచ్ఆర్ వాతావరణంలో వచ్చిన మార్పుకు నిశ్శబ్ద సాక్ష్యంగా నిలుస్తుంది.

కానీ ఒక చనిపోతున్న సరస్సు పునరుద్ధరణకు, ‘ట్రైన్ 18’ రూపకల్పనకు సంబంధం ఏంటి? అన్నిటా ఉంది. ఈ సరస్సు పునరుద్ధరణ ఐ.సి.ఎఫ్. సభ్యుల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. వలస పక్షులు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా ఆ నీటిపైకి వాలినప్పుడు, అవి ఐ.సి.ఎఫ్. లో ఉన్న చైతన్యానికి ప్రతీకగా నిలిచాయి; ఏదేమైనా, మీరు కొంత ప్రచారం ద్వారా ప్రజలను నమ్మించగలరు, కానీ ఆకాశంలో ఎత్తుగా ఎగురుతూ కేవలం సరైన స్థలంలో మాత్రమే భూమిపైకి దిగే పక్షుల సమూహాన్ని మీరు మోసం చేయగలరా?

ఎగరటంలోని అర్థాన్ని మనకు వివరించిన అల్లామా ఇక్బాల్ కు నా వందనం. ఈ వలస పక్షులు సరస్సు చుట్టూ ఎగురుతుండగా, ఐ.సి.ఎఫ్. మానవ వనరులకు ఒక కొత్త నినాదం దొరికింది.

ఐ తైర్-ఎ-లాహౌతీ ఉస్ రిజ్క్ సే మౌత్ అచ్ఛీ
జిస్ రిజ్క్ సే ఆతీ హో పర్వాజ్ మేన్ కోతాహీ
(ఓ దివ్యాత్మా! ఎగరడాన్ని నిరోధించే అటువంటి బతుకు కంటే మరణమే ఎంతో మిన్న!)

ఈ పక్షులు ఐ.సి.ఎఫ్‌.ను కనుగొన్నాయి, ఐ.సి.ఎఫ్. తనను తాను కనుగొంది. మేము ఎత్తుకి ఎగరడానికి సిద్ధంగా ఉన్నాము, కేవలం ‘ట్రైన్ 18’ తోనే కాదు, రాబోయే అనేక ‘ట్రైన్ 18’ లతో.

(ఇంకా ఉంది)

Exit mobile version