[వందే భారత్ రైలు రూపకర్త సుధాంశు మణి అనుభవాల కథనం ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ ను తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]
అధ్యాయం 16 పారదర్శకత, ఫలితం – ఈ రెండూ కలవాల్సిందే!
అసలు పారదర్శకత అంటే ఏమిటి? ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఒక ప్రభుత్వ సంస్థలో లేదా వాటాదారులకు జవాబుదారీగా ఉండే ఒక పెద్ద వ్యాపార సంస్థలో పారదర్శకత అంటే – నా అవగాహన ప్రకారం – అది ఒక నిజాయితీ, ఒక బహిరంగ సంస్కృతి. కానీ జవాబుదారీతనం లేని ఫలితాలను సాధించని పారదర్శకతకు అర్థం లేదు; దీనికి సమానమైన ప్రాముఖ్యత ఉన్న మరో వైపు కూడా ఉంది, అదే – ఫలితాన్ని అందించే బాధ్యత. ప్రజాధనాన్ని పారదర్శకంగా ఉపయోగించాల్సి వస్తే, ఆ డబ్బును ఏ ప్రయోజనం కోసమైతే వినియోగిస్తున్నారో ఆ ప్రయోజనం కూడా చక్కగా నెరవేరడం అంతే అవసరం.
ఫలితాల సాధనతో సంబంధం లేనంత కాలం పారదర్శకంగా ఉండటం చాలా సులభం. అలాగే, పారదర్శకత అనే ఒత్తిడి లేకపోతే ఫలితాలను అందించడం కూడా బహుశా మరింత సులభం కావచ్చు. పారదర్శకంగా ఉంటూనే ఫలితాలను సాధించడంలోనే అసలైన ప్రతిభ దాగి ఉంది. సాధారణంగా, పారదర్శకత అంటే సులభంగా అవతలి వైపు చూడగలిగే గుణం. దీనికి ఉన్న మరొక అర్థం పూర్తి అంచనా వేయగలగడం, అంటే ఇన్పుట్ను బట్టి అవుట్‌పుట్‌ను పూర్తిగా ఊహించవచ్చు. వస్తుసామగ్రిని సమర్థవంతంగా ఆర్డర్ చేయడం అనేది కంప్యూటర్ గేమ్ కాదు కాబట్టి, మీరు ఇలాంటి గ్రుడ్డి పారదర్శకతను అనుసరిస్తే, అసమర్థులైన సరఫరాదారులు దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
నేను ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఎందుకంటే, మేము ట్రైన్ 18 ప్రాజెక్టును ఆర్డర్ చేసి అమలు చేసిన విధానం అంత పారదర్శకంగా లేదని ఖాళీగా ఉండే కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తుంటారు. ప్రతి ఒక్క వ్యక్తిగత కేసును సమర్థించుకోవడం నా ఉద్దేశం కాదు, అది నా బాధ్యత కూడా కాదు; కానీ ఇక్కడ నేను కొన్ని సాధారణ ఉదాహరణలను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, పాఠకులే స్వయంగా నిర్ణయించుకోవచ్చు.
ఒక ఊహాజనిత పరిస్థితిని ఆలోచిద్దాం. X అనే ఒక ఉత్పత్తిని అభివృద్ధి చేసి, తయారు చేసి, పరీక్షించి, ధృవీకరించి, Y అనే నిర్ణీత కాలంలో Z అనే అంచనా వ్యయంతో సరఫరా చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంది.
మా ఉమ్మడి అనుభవం, ఇంకా టెండర్‌కు ముందస్తు విశ్లేషణలు చూపించిన దాని ప్రకారం,
- సంస్థ A అవసరానికి అనుగుణంగా అభివృద్ధి చేసి సరఫరా చేయగలదు, కానీ దాని ధర 1.05 Z అవుతుంది.
- సంస్థ B అవసరానికి అనుగుణంగా అభివృద్ధి చేసి సరఫరా చేయగలదు, కానీ దానికి 1.5 Y సమయం పడుతుంది మరియు ధర 1.25 Z అవుతుంది.
- సంస్థ C అభివృద్ధి చేసి సరఫరా చేయగలదు కానీ నాణ్యత అనుమానాస్పదంగా ఉంటుంది, కాలపరిమితి 2 Y కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, ధర 0.95 Z ఉంటుంది; ఈ సంస్థ కేవలం ఆర్డర్ దక్కించుకోవడం కోసమే బిడ్‌లో అడిగిన కాలపరిమితికి అంగీకరిస్తుంది. కానీ ఇలాంటి సంస్థలు తర్వాత మాట తప్పుతాయని మా అనుభవం పదేపదే నిరూపించింది.
- సంస్థ D తాము అభివృద్ధి చేయగలమని క్లెయిమ్ చేస్తుంది, కాగితంపై చూస్తే ఎంతో కొంత సామర్థ్యం ఉన్నట్లు కనిపిస్తుంది కానీ వారి సమర్థత (క్రెడెన్షియల్స్) ఇంకా నిరూపితం కాలేదు, కాలపరిమితి 2.5 Y అయ్యే అవకాశం ఉంది. ధర 0.9 Z ఉంటుంది; వీరు వాస్తవానికి దూరంగా ఉన్న ఏ కాలపరిమితికైనా సులభంగా అంగీకరిస్తారు, ఆపై ఏదో ఒక కారణం చెప్తూ వెనక్కి తగ్గుతారు.
పనితీరుకు మరియు ఫలితాల సాధనకు ఎటువంటి ప్రాధాన్యత లేని ఒక ప్రభుత్వ సంస్థలో, ఒక సాధారణ మిస్టర్ ట్రాన్స్పరెంట్ ఏం చేస్తాడు? ఈ సంస్థలన్నింటితో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మంచి అవగాహన ఉన్నప్పటికీ, అతను ఓపెన్ టెండర్లను పిలిచి, సంస్థ C లేదా D లకే బల్క్ పరిమాణంలో ఆర్డర్ ఇస్తాడు; అలాగే సంస్థ A కి కూడా అదే ధరను ఆఫర్ చేస్తూ చిన్న మొత్తంలో ఆర్డర్ ఇస్తాడు. ఇది అనవసరంగా సమయాన్ని వృథా చేస్తుంది. ఒకవేళ సంస్థ A ఆ ఆర్డర్‌ను అంగీకరిస్తే, వారి నుండి కొంతవరకు సరఫరా జరుగుతుంది కానీ కాలపరిమితి కొంతమేర దాటిపోతుంది. ప్రాజెక్టులో ఒక చిన్న భాగం పూర్తవుతుంది, అదే సమయంలో సంస్థలు C, D మాత్రం తడబడుతూ, ఆలస్యం చేస్తూనే ఉంటాయి. ఒకవేళ A ఆ ఆర్డర్‌ను అంగీకరించకపోతే, ప్రాజెక్టు ఘోరంగా విఫలమవుతుంది. అదే సమయంలో, సంస్థలు C, D కాలపరిమితిని అందుకోలేవని తెలిసి కూడా, మిస్టర్ ట్రాన్స్పరెంట్ మరో బిడ్డింగ్ ప్రక్రియకు వెళ్లి మళ్లీ అదే గందరగోళంలో పడవచ్చు. మాటల్లో పారదర్శకత ఉంటుంది కానీ ఆశయంలో ఉండదు; పారదర్శకత చక్కగా నెరవేరుతుంది కానీ ఫలితాల సాధన అటకెక్కుతుంది. ఇలాంటి మిస్టర్ ట్రాన్స్పరెంట్కు మన సర్కారీ వ్యవస్థలో ఎలాంటి శిక్ష పడదు, కానీ ప్రాజెక్టు మాత్రం ఖచ్చితంగా దారి తప్పుతుంది. అలాంటి పారదర్శకతకు మనం చెల్లించే మూల్యం ఏమిటి?
పై పరిస్థితిలో, మరింత బాధ్యతాయుతమైన ఒక అధికారి అయితే బిడ్ షెడ్యూల్లో కఠినమైన అర్హత ప్రమాణాలను ఏర్పరుస్తాడు, డెలివరీ కాలపరిమితికి స్పష్టమైన ప్రాధాన్యత ఇస్తాడు. కేవలం ఆశావహ సంస్థలను మినహాయించే ఈ అర్హత ప్రమాణాలను చూసి, సంస్థ A కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజల నుండి తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది. అధికారులు గనుక దృఢంగా ఉంటే, వారు సంస్థ A కి Z మరియు 1.05 Z మధ్య ధరలో పెద్ద బల్క్ ఆర్డర్‌ను ఇస్తారు, సంస్థ B ని కూడా ఇదే ధరకు చిన్నదైనప్పటికీ ఒక బల్క్ ఆర్డర్ తీసుకునేలా ఒప్పించడానికి ప్రయత్నిస్తారు, బహుశా సంస్థ C లేదా D లేదా రెండింటికీ చిన్న ఆర్డర్‌ను కేటాయిస్తారు. ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరికీ అవకాశం లభించడంతో పారదర్శకత అవసరం నెరవేరుతుంది. ఎటువంటి అక్రమ ఫిర్యాదులకు తావుండదు. అలా కాకుండా, అధికారులు భయపడి, అర్హత ప్రమాణాలను సడలించడానికి వెనకడుగు వేస్తే, చేసిన తప్పులకు తగిన శాస్తి జరుగుతుంది మరియు ప్రాజెక్టు మళ్లీ ఆ మిస్టర్ ట్రాన్స్పరెంట్ మార్గంలోనే కొట్టుకుపోతుంది.
కానీ పారదర్శకత, పనితీరు అనేవి సుపరిపాలనకు రెండు ముఖ్యమైన స్తంభాలైతే, సంబంధిత అధికారి ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి, అభివృద్ధికి అత్యుత్తమమైన మార్గాన్ని ఎంచుకోవాలి, సుదీర్ఘమైన బిడ్డింగ్ ప్రక్రియలో సమయాన్ని వృథా చేయకుండా సంస్థ A ని చర్చలకు పిలిచి, వారిని ఆశించిన ధర స్థాయికి తీసుకువచ్చి వెంటనే ఆర్డర్ ఇవ్వాలి; అది సాధించిన తర్వాత, దీనికి సమాంతరంగా సంస్థ B ని ఒప్పించే ప్రయత్నం చేయడం, సంస్థ C లేదా D లేదా రెండింటికీ చిన్న ఆర్డర్ ఇవ్వడం అనే ప్రత్యామ్నాయాలు ఎలాగూ తెరిచే ఉంటాయి. ఈ విధానంలో ప్రాజెక్టు అనుకున్న సమయానికి లేదా అంతకంటే ముందే పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
చివరి ఆప్షన్‌తో సహా ఈ మూడు చర్యలు కూడా భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ ని ఉల్లంఘించవు. కానీ ఏ మార్గాన్ని ఎంచుకోవాలనే బాధ్యత నిర్ణయాధికారిపైనే ఉంటుంది. తప్పుడు ఫిర్యాదులు వస్తాయనే భయం, విజిలెన్స్ భయాల వల్ల, ప్రభుత్వ అధికారులు ఇలాంటి దూకుడు చర్యలకు పూనుకోరు, ఫలితంగా ఫలితాల సాధన గంగలో కలుస్తుంది.
ఒక రైల్వే ఫ్యాక్టరీ కొన్ని పరికరాలను ఆర్డర్ చేయాల్సి వచ్చింది, వారు బోర్డు నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా డెలివరీ కాలపరిమితిని చాలా అవాస్తవికంగా నిర్ణయించారు. పేర్కొన్న కాలపరిమితి అత్యంత అచరణాత్మకమైనదని A & B కేటగిరీ సంస్థలు నిరసన తెలిపాయి, కానీ ఫలితం లేకపోవడంతో అవి బిడ్‌లో అసలు పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. ఆ ఆర్డర్‌ను సంస్థలు C, D కు ఇచ్చారు, ఆరు సంవత్సరాలు గడిచినా డెలివరీ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు మూలన పడింది, కొంత విమర్శలు వచ్చాయి, కానీ ప్రాజెక్టును చేసి చెడగొట్టినప్పటికీ, ఆ అధికారులు ఎలాంటి నష్టం లేకుండా తమ దినచర్యను కొనసాగిస్తున్నారు.
పెద్ద పెద్ద బిడ్లను పిలుస్తున్నందుకు తమను తాము అభినందించుకుంటున్న మరొక ఫ్యాక్టరీ ఉంది. ఎక్కడికైనా చేరుకోవాలనే ఆశయాలు ఉంటే చాలా మంచిదే. కానీ వారి బిడ్లు పూర్తి రక్షణాత్మక వాతావరణంలో పిలవబడతాయి; కాబోయే బిడ్డర్లతో మాట్లాడే ధైర్యం అధికారులకు లేకపోవడం వల్ల, పైన పేర్కొన్న ఉదాహరణ తరహా సంస్థల విశ్లేషణ ఇక్కడ అస్సలు ఉండదు. పద్ధతిగా చేస్తున్నామనే భ్రమ లేదా ఉదాసీనత వారిని ఎంతగా గ్రుడ్డివాళ్లను చేసిందంటే, బిడ్ పత్రాలను సిద్ధం చేసే ముందు ప్రధాన సంస్థలతో ఎటువంటి చర్చలు జరపరు. దీని ఫలితంగా A & B కేటగిరీ సంస్థలు లేదా అంతటి సామర్థ్యం ఉన్న ఇతర సంస్థలు అసలు బిడ్ వేయవు, దాంతో ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు ఆర్డర్లు ఇవ్వకుండా కేవలం టెండర్లు పిలవడంలో మాత్రమే ఆరితేరింది!
పరిపాలనలో పారదర్శకత అంటే ఒక సంస్థ యొక్క అన్ని చర్యలు ప్రజల పరిశీలనకు నిలబడేలా నిష్కపటంగా ఉండాలి. కానీ ప్రజల పరిశీలన కేవలం ఒక ప్రదర్శన కోసమైన పారదర్శకతకు మాత్రమే పరిమితం కావాలా, సాధించిన ఫలితాలకు ఎటువంటి విలువ లేదా ప్రాధాన్యత ఉండకూడదా? దురదృష్టవశాత్తూ, మన దేశంలో చాలా తరచుగా ఇదే జరుగుతోంది. ఇది తరచుగా శబ్దమూ ఆవేశంతో కూడిన కథలా ఉంటుంది, కానీ దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, బహుశా మెక్బెత్ ఈ మాటలను భారతదేశంలోని మా కోసమే చెప్పి ఉంటాడు, ఇది మమ్మల్ని ప్రభుత్వంలో కేవలం నామమాత్రపు సుపరిపాలనకు మాత్రమే బాధ్యులను చేస్తోంది.
వ్యక్తిగతంగా రిస్క్ ఉన్నప్పటికీ, ఐ.సి.ఎఫ్.లో మేము రెండవ, మూడవ మార్గాలను అనుసరించడానికి ప్రయత్నించాము. కేవలం పారదర్శకంగా కనిపించడం కోసం బిడ్లను పిలిచి, ఫలితాల సాధనను నాశనం చేయడం మాకు సమ్మతం కాదు. టీమ్‌లోని కీలకమైన స్టోర్స్, ఫైనాన్స్ అధికారులతో సహా చాలా మంది అధికారులు దీనిని అర్థం చేసుకున్నారని, పనితీరు పట్ల స్పష్టమైన బాధ్యతాయుతమైన పారదర్శకతతో పనిచేశారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏది సరైనదో తెలియడం ఒక ఎత్తయితే, దానికి కట్టుబడి నిలబడటం మరొక విషయం. పోర్షియా అన్నట్లుగా, మరోసారి, “ఏది చేయాలో తెలియడం కంటే, తెలిసిన మంచిని చేయడం అంత సులభమైతే..” ఐసిఎఫ్ లోని చాలా మంది అధికారులు దీనిని అర్థం చేసుకున్నారు,. శక్తివంతమైన వ్యక్తులను ఎదిరించాల్సి వచ్చినా సరైనదాని కోసం నిలబడటానికి సిద్ధపడ్డారు.
ప్రభుత్వ వ్యవస్థలలో మరియు ఇతర సంస్థలలో కూడా ఒక పనిని చేయడం, అదే సమయంలో దానిని పాడు చేయడం వంటి క్లాసిక్ ఉదాహరణలు పుష్కలంగా ఉన్నాయి. వ్యక్తులుగా, రోజంతా అలసిపోయేలా పనిచేసినా చాలా తక్కువ ఫలితం వచ్చిందనే నిరాశను మనం తరచుగా రోజు ముగింపులో అనుభవిస్తాము. తీరికలేకుండా ఉండటానికి, ఉత్పాదకతతో ఉండటానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వినడానికిది చాలా సులభంగా అనిపిస్తుంది కానీ మనమందరం ఎప్పుడూ దీని గురించి ఆలోచిస్తూనే ఉంటాం కదా? సంస్థలు అనేవి ప్రజలతో కూడుకున్నవి, వారు వ్యక్తిగత, ఇంకా, సామూహిక స్థాయిలలో ఈ విషయంపై తరచుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు అలా చేస్తే, నేను వివరించిన ఫలితం లేని టెండరింగ్ ప్రక్రియల నుండి క్రమంగా విముక్తి లభిస్తుంది. సాధించేది ఏమీ లేకుండా కేవలం బిజీగా గడిపే అధికారుల, సంస్థల సంఖ్య చాలా పెద్దది.
ఒక అందమైన కవితను ప్రతికూల కోణంలో వాడుతున్నందుకు నేను ఫిరాక్ (Firaq) క్షమాపణలు కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన బతికి ఉంటే నన్ను తీవ్రంగా కోప్పడేవారు:
జిన్హే మంజిలోన్ కి నా ఫికర్ థీ, జిన్హే చల్తే రెహనే సే కామ్ థా
మిలే ఐసే భీ కయీ కాఫిలే, తెరే గమ్ కి రాహ్-ఎ-దరాజ్ మే
(గమ్యం గురించి ఎటువంటి చింతా లేకుండా, కేవలం ముందుకు సాగడమే పనిగా పెట్టుకున్నవారు.. ఈ సుదీర్ఘమైన దుఃఖభరితమైన మార్గంలో నాకు అలాంటి అనేక సమూహాలు కూడా ఎదురయ్యాయి.)
ఇది పక్కన పెడితే. ఈ కొనుగోలు (ప్రొక్యూర్మెంట్) కేసులు మొదటి నుంచీ చాలా సున్నితమైనవి, పైగా వీటిలో వ్యక్తుల ప్రమేయం ఉంటుంది; ఒక చరిత్రకారుడు నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలి కానీ నాలాంటి ఒక చిన్న కథకుడు నిజంగా అలా ఉండగలడా? ఈ ఆలోచనను నేను పాఠకులకే వదిలేస్తున్నాను, సమయానుకూలత కోసం నా స్పష్టమైన నిజాయితీ లేమిని ఇక్కడే ప్రకటిస్తున్నాను; అదే గజల్ లోని ఒక ద్విపద ద్వారా మళ్లీ ఫిరాక్ ను ఆశ్రయిస్తున్నాను:
మేరే షేర్ ఆయినాఖానే మే, తెరి బేషుమార్ అదాఓఁ కే
మగర్ ఐసి భీ హై కోయి అదా, జో రహేగి సీనా-ఎ-రాజ్ మే
(నా కవిత్వం నీ అసంఖ్యాకమైన హొయలను, భంగిమలను ప్రతిబింబిస్తుంది, కానీ కొన్ని ప్రణయాల రహస్యాలు నా గుండె లోతుల్లోనే దాగి ఉండాలి.)
నిజాయితీ, సచ్ఛీలత, సమగ్రత! చాలా పెద్ద పదాలు ఇవి, కానీ మన ఆచరణాత్మక ప్రపంచంలో, ముఖ్యంగా ప్రభుత్వంలో, అలాంటి ఒక ఆదర్శప్రాయమైన నాయకుడు మనకు ఉన్నారా? తన అధికారిక యంత్రాంగాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయని, లేదా తనతో అధికారిక సంబంధాలు ఉన్న ఎవరి నుండి ఎలాంటి లబ్ధిని ఆశించని నాయకుడు ఎవరైనా ఉన్నారా? కేవలం అప్పుడప్పుడు ఇచ్చే సాధారణ ఆతిథ్యాన్ని స్వీకరించడానికే పరిమితమయ్యే వారు ఉన్నారా? లేదా ఇలా అందాం, ప్రత్యక్షంగా డబ్బు రూపంలో ప్రయోజనాలను ఆశించకపోయినా, అక్రమ బహుమతులను స్వీకరించడానికి ఎటువంటి అభ్యంతరం లేని వారు ఉన్నారా? లేదా పూర్తి నిజాయితీతోనే తన పనిని చేస్తూ, ఆ తర్వాత లబ్ధిదారుడి నుండి దానికి తగిన ప్రతిఫలాన్ని పొందడానికి వెనకాడని వారు ఉన్నారా? లేదా తాను చేసే లేదా చేయని ప్రతి అధికారిక పనికీ ఒక ధరను నిర్ణయించే సర్వోన్నత ప్రభుత్వ అధికారి ఉన్నారా? నేను దీని గురించి చెప్తూనే పోవచ్చు మరియు ఈ రకాలన్నింటి చుట్టూ నా స్వంత అనుకూలమైన తార్కికతను నిర్మించవచ్చు.
విషయాన్ని స్పష్టంగా చెప్పాలంటే, నా దాదాపు నలభై ఏళ్ల సేవా జీవితంలో, నేను కేవలం ముగ్గురు అత్యంత నిజాయితీ గల అధికారులను మాత్రమే చూశాను. వారి పేర్లను నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు, ఎందుకంటే అది వారిలాగే లేదా వారికి దగ్గరగా ఉన్న ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన మార్గం నుండి పక్కకు తప్పని అధికారులు. ఒకవేళ ఆఫీసు కార్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి అనుమతి లేకపోతే, ఆఫీసుకు సైకిల్ మీద వెళ్లే రకానికి చెందిన అధికారులు. వేరే ఊరికి డ్యూటీ మీద వెళ్లినప్పుడు ఎలాంటి వ్యక్తిగత పనులను చేయని అధికారులు. తమ వ్యక్తిగత పనుల కోసం క్రింది స్థాయి సిబ్బందిని ఎన్నడూ వాడుకోని అధికారులు. నిబంధనలను ఖచ్చితంగా పాటించే వ్యక్తులు. అది వారి నమ్మకం, వారు దానిని చివరి వరకు పాటించారు. వారిని అలానే ఉండనిద్దాం; తమ నిజాయితీని గర్వంగా చెప్పుకునే హక్కు కేవలం వారికే ఉంది. నేను ఎప్పటికీ వారిలా ఉండలేను కాబట్టి వారికి సెల్యూట్ చేస్తున్నాను.
మరి మిగిలిన వారి సంగతి ఏమిటి? ప్రతి ఒక్కరూ తమ స్వంత సౌకర్యాన్ని బట్టి, మనస్సాక్షిని బట్టి తమ పరిమితులను నిర్మించుకుంటారు, నిజాయితీ రేటింగ్‌లో తమకంటే క్రింద ఉన్న వారి కంటే తాము ఎక్కువ నిజాయితీపరులమని నటిస్తారు. ఇది నిజానికి సంస్థకు ఎటువంటి ప్రయోజనం లేని ఒక నామమాత్రపు ఆట మాత్రమే; ‘ధర నిర్ణయించే’ వ్యక్తి కంటే కేవలం ‘ఆతిథ్యం మాత్రమే స్వీకరించే’ వ్యక్తి ఎక్కువ లేదా తక్కువగా రాణించడం వల్ల సంస్థకు వచ్చే నష్టమేమీ లేదు. ఎవరు ఎక్కువ మరియు మెరుగైన ఫలితాలను ఇస్తున్నారనేదే ముఖ్యం. అవును, ఒక నాయకుడిగా, నేను ఏ పనీ చేయని తక్కువ అవినీతిపరుడి కంటే, పని చేసి చూపించే ఎక్కువ అవినీతిపరుడినే ఇష్టపడతాను. అయితే ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఉంది – దానికి ఒక పరిమితి అంటూ ఉండాలి. ఒకరి అవినీతి గనుక సంస్థ ప్రతిష్ఠను, సంస్కృతిని, ఫలితాలను దెబ్బతీస్తుంటే, కళ్లు మూసుకుని కూర్చోలేము. నాయకులు దానిని అనధికారికంగా తెలుసుకునే మార్గాన్ని కలిగి ఉండాలి. నేను నా మాటలకు నేనే విరుద్ధంగా మాట్లాడుతున్నానా? లేదు. ఒక నాయకుడు పని చేసే వ్యక్తిలా నటిస్తున్న ఒక దుర్మార్గుడిని గుర్తించాలి, అతనికి తగిన శాస్తి జరగాలి, అతని పతనాన్ని ఇతరులకు ఒక ఉదాహరణగా చూపించాలి.
దీనిని పరిశీలించండి. ఇటీవల పదవీ విరమణ చేసిన బోర్డు సభ్యుడు ఒకరు తన నిజాయితీని గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నించారు; కానీ ఆయన చేసిన ఏకైక సహకారం ఏమిటంటే – అధికారుల ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడి నుండి అక్కడికి బదిలీలు చేయడం తప్ప విధానంలో లేదా అమలులో చూపించడానికి ఏమీ లేదు. ఇదే మహానుభావుడు రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న సమయంలో తన ఇంటి ఫర్నిషింగ్, ఇంకా ఇతర వస్తువుల ఇన్వాయిస్లు, వోచర్లను అందజేస్తూ లబ్ధి పొందారు. భారతీయ రైల్వేలలో దురదృష్టవశాత్తూ వీరి సంఖ్య చాలా పెద్దది కాబట్టి ఇలాంటి వారిపై సమయం వృథా చేయవద్దు.
సౌకర్యవంతమైన నియమ నిబంధనల వెనుక దాక్కునే లేదా సరైనదైనప్పటికీ రిస్క్‌తో కూడిన మార్గాన్ని ఎంచుకోవడానికి వెనకాడుతూ నిర్ణయాలను వాయిదా వేసే వృత్తిపరమైన అవినీతి, సాధారణ అవినీతి కంటే బహుశా మరింత ప్రమాదకరమైనది. పైకి నిజాయితీపరులుగా కనిపిస్తూ వృత్తిపరంగా ఎటువంటి సంకోచం లేకుండా అవినీతికి పాల్పడే వారు ఎక్కువ నష్టం చేయగలరు. నాయకుడు తన బృందంలోని అటువంటి సభ్యులను గుర్తించి, వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి.
ఒక నాయకుడిగా మీరు మీ మనుషులను అంచనా వేయాలి. ఇక్కడ ఎలాంటి నిర్దిష్టమైన సూత్రాలు లేవు. ఎవరి ఆలోచనలు వారివి. కానీ నేను దీనిని ఎలా ఎదుర్కొన్నాను?
కవి డి. రాజ్ కన్వల్ గారిని గుర్తు చేసుకోవాలి:
ఇన్సాన్ నహీ వో జో గునాహ్గార్ నహీ హై,
వో కౌన్ సా గుల్షన్ హై జహా ఖార్ నహీ హై
(ఏ తప్పూ చేయనివాడు అసలు మనిషే కాడు, ముళ్లు లేని తోట ఎక్కడైనా ఉంటుందా?)
నేను చెబుతున్నట్లుగా, ఐ.సి.ఎఫ్. లో మా సిబ్బంది, వారి కుటుంబాల క్రీడలు, సామాజిక పరస్పర చర్యలు, శారీరక ఉల్లాసం కోసం అనేక సదుపాయాలను కల్పించడానికి ఎంతో కృషి చేసాము. ఇది నా నమ్మకానికి సంబంధించిన విషయం. నిబంధనలు అనుమతించిన దానికి మించి నేను రైల్వే డబ్బును ఖర్చు చేస్తున్నానని, ఇది ఏదో ఒక రోజు ఆడిట్ లేదా విజిలెన్స్ ద్వారా సమస్యగా మారుతుందని కొందరు సీనియర్ అధికారులు నాకు చెబుతూనే ఉన్నారు. నేను వారితో అస్సలు ఏకీభవించలేదు. మంచి ప్రయోజనం కోసం ఖర్చు చేసినంత కాలం అలాంటి ఖర్చులపై ఎటువంటి పరిమితి లేదని నాకు తెలుసు. సిబ్బందికి అనుకూలంగా ఉంటాననే పేరు నాకు ఎలాగూ ఉంది కాబట్టి, ఆ అనుమానాలను ఎటువంటి సందేహం లేకుండా తిరస్కరించి, దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన రంగాలలో మరింత ఎక్కువ ఖర్చు చేశాను, నాది తప్పో ఒప్పో చరిత్రే నిర్ణయిస్తుంది.
ఒక ఉదాహరణ: అన్ని కాలనీలలోని సిబ్బంది క్వార్టర్ల చుట్టూ ఎలాంటి గోడ లేదా కంచె లేదు. ఖర్చులను పంచుకునే ప్రాతిపదికన మాత్రమే సిబ్బంది క్వార్టర్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయవచ్చనే పురాతన నిబంధన ఒకటి ఉంది. భారతీయ రైల్వే తన సిబ్బందికి మంచి గృహవసతి కల్పించడానికి కట్టుబడి ఉంటే, గోప్యతకు ప్రాథమిక అవసరమైన ఫెన్సింగ్‌ను కేవలం ఖర్చులను పంచుకునే ప్రాతిపదికన మాత్రమే చేయాలని మనం ఎలా నిబంధన పెట్టగలం? మేము ఈ కఠినమైన నిబంధనను అధిగమించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ, ఐ.సి.ఎఫ్. లో మాకు కొంతమంది సానుకూల దృక్పథం గల ఫైనాన్స్ అధికారులు ఉన్నారు మరియు మేము అన్ని క్వార్టర్లకు సాధారణ గాల్వాల్యూమ్ షీట్లను ఫెన్సింగ్‌గా అందించడానికి కోట్ల రూపాయలను ఖర్చు చేసాము. ఇది అపారమైన సద్భావనను సంపాదించడమే కాకుండా, కాలనీల రూపురేఖలను కూడా ఎంతో అందంగా మార్చివేసింది.
సమగ్రత, సచ్ఛీలత సమస్యలను నిర్వహించడంలోని చిక్కుముడి గురించి ఇంతే. ఓ కవి రాసిన ఒక సొనెట్ లోని ఈ మాటలను గమనించండి, “ఎదుటివారి దృష్టిలో చెడ్డవాడిగా అనిపించడం కంటే నిజంగానే చెడ్డవాడిగా ఉండటం మేలు, ఎందుకంటే మనం అలా కాకపోయినా నిందలు తప్పవు; ఆ ఆనందాన్ని కోల్పోవడం మన భావన వల్ల కాదు, ఇతరులు చూసే విధానం వల్లే జరుగుతుంది.”
నేను ఇప్పటికే చెడ్డవాడినని భావిస్తే, నేను చేస్తున్నది నా భావన ప్రకారం కాకుండా ఇతరులు చూసే విధానం బట్టి చెడ్డది అని నిర్ధారించబడితే – నేను చేస్తున్నది సరైనదని నాకు తెలిస్తే, చెడ్డవాడిగా అనిపించడం కంటే నిజంగానే చెడ్డవాడిగా ఉండటం మేలు, అంటే కేవలం చెడ్డవాడని అనుకోవడం కంటే నిజంగానే చెడ్డగా ఉండటం మంచిది. ఇందులో ఒకరి చేతులు కాలే ప్రమాదం కూడా ఉంది, కానీ కొత్తగా చేసే ప్రతి పనిలోనూ ఎంతో కొంత అనుబంధ నష్టం జరిగే ప్రమాదం ఎలాగూ ఉంటుంది.
పారదర్శకత, సమగ్రత, సచ్ఛీలత అనే ఈ అంశంపై లోతైన ఆత్మపరిశీలన జరగాలి. సరైన ప్రభుత్వ మార్గదర్శకాలు రావాలి, లేదంటే ఒకవైపు పారదర్శకత, సమగ్రత మరియు మరోవైపు ఫలితాల సాధన అనే ఈ చిక్కుముడి నుండి మనం ఎప్పటికీ బయటపడలేము. ఏదో ఒక రోజు బహుశా జరగవచ్చు, కానీ ప్రస్తుతానికి దానిని అలానే వదిలేద్దాం! ఐ.సి.ఎఫ్. లో మేము ఇలాంటి ప్రయోజనం లేని నకిలీ పారదర్శకత, కపట సమగ్రతా లక్షణాల నుండి చాలా వరకు దూరంగా ఉన్నామని చెప్పడానికి గర్విస్తున్నాను, అదే మా ఒప్పందాలు విజయవంతం కావడానికి ప్రధాన కారణం.
హామ్లెట్ ఓఫీలియాతో, “నువ్వు పవిత్రురాలివి, నిష్కల్మషమైనదానివి అయితే.. నీ పవిత్రత, నీలోని ఆకర్షణను నీ దరిచేరనివ్వకూడదు” అంటాడు. దానికి ఓఫీలియా, “ప్రభూ! నిష్కల్మషత్వానికి, పవిత్రత కంటే మించిన చక్కని సాంగత్యం ఇంకేముంటుంది?” అని అడుగుతుంది. హామ్లెట్ మాటలు సద్గుణానికి, అందానికి మధ్య ఒక గోడను కడతాయి; అందం ఎక్కడ సద్గుణాన్ని చెరిపేస్తుందో అన్నట్లుగా, ఆ రెండూ దూరంగా ఉండాలంటాడు. కానీ, అందానికి సద్గుణమే అసలైన అలంకారమని, ఆ రెండూ జంటగా సాగాలన్నది ఓఫీలియా ఆశ నిండిన ఎదురుప్రశ్న. హామ్లెట్ ఆ తర్వాత ఈ మాటలను మార్చేసి ఉండవచ్చు, కానీ మన సందర్భానికి ఇది చక్కగా సరిపోతుంది. నిజాయితీ, పారదర్శకత (సద్గుణం) అనేవి చేసే పనితీరు మరియు ఫలితాల (అందం) తో తప్పకుండా ముడిపడి ఉండాలి.
(ఇంకా ఉంది)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
