[వందే భారత్ రైలు రూపకర్త సుధాంశు మణి అనుభవాల కథనం ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ ను తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]
అధ్యాయం 17 డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్ విశేషాలు
మేము 2018 మొదటి సగభాగం ముగింపునకు చేరుకుంటున్నాము. చివరి నిమిషంలో చేయాల్సిన డిజైన్ మార్పుల తాలూకు సూక్ష్మ వివరాలు, సబ్-అసెంబ్లీల అభివృద్ధి, వాటి ఎండ్యూరెన్స్ టెస్టింగ్ (మన్నిక పరీక్షలు), ఐ.సి.ఎఫ్.లో ట్రైన్ బాడీల తయారీ పనులు పిచ్చి వేగంతో సాగుతున్నాయి. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న పనుల విషయంలో, టీమ్‌లోని ప్రతి సభ్యుడూ అవతలి వ్యక్తి తన పనిని త్వరగా పూర్తి చేయాలని కోరుకునేవాడు; ట్రైన్ 18 పేరిట హెచ్చరించుకోవడం, బతిమాలుకోవడం, కోపతాపాలు ప్రదర్శించడం ఆ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. ఒకరోజు ఒక స్టోర్స్ అధికారి నాతో రహస్యంగా ఒక మాట చెప్పారు – గతంలో సీనియర్ అధికారులు జీఎం పేరు చెప్పి పనులను వేగవంతం చేయమని తనను తొందరపెట్టేవారని, కానీ ఇప్పుడు అన్ని స్థాయిల అధికారులూ స్వయంగా వచ్చి ‘ట్రైన్ 18’ పేరు చెప్పి వెంటనే చెయ్యమంటున్నారని అన్నారు. ఇప్పుడు ఐ.సి.ఎఫ్.కు ‘మిషన్ ట్రైన్ 18’ అనేదే ఒక సీఈఓలా మారిపోయింది, ఎందుకంటే దాని మాటే జీఎం మాట కంటే ఎక్కువగా చెల్లుబాటవుతోంది.
షేక్‌స్పియర్ రాసిన రిచర్డ్ III నాటకంలో కింగ్ రిచర్డ్ యుద్ధభూమిలో నిలబడి, “గుర్రం, గుర్రం! నా సామ్రాజ్యాన్ని ఇస్తాను ఒక గుర్రం కోసం!” అని అరుస్తాడు. తన గుర్రం కుప్పకూలిపోయినా రణరంగాన్ని వదలడానికి నిరాకరించే రిచర్డ్ శౌర్యాన్ని సగభాగం ప్రదర్శించడానికి కవి బహుశా ఆ పంక్తులను రాసి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత కాలంలో ఈ వాక్యం గౌరవం లేని హాస్య ఉల్లేఖనాలకు (ఉదాహరణకు: “ఒక మూర్ఖుడు, ఒక మూర్ఖుడు, ఒక మూర్ఖుడు! ఒక మూర్ఖుడి కోసం నా విదూషక టోపీ!”) వాడుకగా మారిపోయింది కాబట్టి, నేను దానికి కొంత సందర్భోచిత గౌరవాన్ని తిరిగి తీసుకువస్తాను. ఏదో ఒక చిన్న వస్తువు కోసం అన్వేషణగా కాకుండా, ట్రైన్ 18 యొక్క విలువను మరియు ప్రాముఖ్యతను చాటడానికి నేను దానిని ఇలా ఉటంకించాను: “ఒక రైలు, ఒక రైలు! నా సామ్రాజ్యాన్ని ఇస్తాను ఒక రైలు కోసం!”
ఈ సమయానికి, మా వద్ద తగినన్ని డిజైన్ నమూనాలు సిద్ధంగా ఉన్నాయి. దీనితో సమానమైన సాంప్రదాయ రైలుతో పోలికను ఒక పట్టిక రూపంలో మరింత శాస్త్రీయంగా ప్రదర్శించవచ్చు:
| లోకో మోటివ్ లాగే రైలు (20 యూనిట్లు: 2 లోకోలు, 2 పవర్ కార్లు & 16 ఏసీ కోచ్‌లు) | ట్రైన్ 18, ఒక 16-కోచ్‌ల రైలు సెట్ |
| సీటింగ్: ఎగ్జిక్యూటివ్ క్లాస్ (56) ఎకానమీ/సీసీ (78) మొత్తం సామర్థ్యం: 1204 |
సీటింగ్: ఎగ్జిక్యూటివ్ క్లాస్ (52) మరియు ఎకానమీ/సీసీ (78, మరియు 44 సీట్లు కలిగిన 2 డ్రైవర్ టీసీలు) కాబట్టి మొత్తం సామర్థ్యం 1128 అవుతుంది |
| దివ్యాంగుల కోసం స్థలం: నామమాత్రం | దివ్యాంగుల కోసం స్థలం చాలా విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటుంది |
| టర్మినల్స్ వద్ద రైలుని వెనక్కి మళ్లించాల్సిన అవసరం ఉంది | టర్మినల్స్ వద్ద రైలుని వెనక్కి మళ్లించాల్సిన అవసరం లేదు |
| ఒక బోగీ నుండి మరో బోగీకి వెళ్లే మార్గం ఒక పాత కాలపు ఊగిసలాడే వెస్టిబ్యూల్ ద్వారా ఉంటుంది | ఒక చివర క్యాబ్ నుండి మరొక చివర క్యాబ్ వరకు మొత్తం 16 బోగీల గుండా వెడల్పాటి సీల్డ్ గ్యాంగ్‌వే ద్వారా నేరుగా వెళ్ళవచ్చు |
| బోగీ లోని స్థలం యొక్క వినియోగం చాలా తక్కువ | బోగీ లోని స్థలం పూర్తి స్థాయిలో వినియోగించబడుతుంది |
| బరువు అంతా లోకోమోటివ్‌లపైనే కేంద్రీకృతమై ఉంటుంది. అధిక కప్లర్ శక్తులు. | సమానమైన బరువు పంపిణీ. తక్కువ కప్లర్ శక్తులు. |
| ఎటువంటి ప్రత్యామ్నాయ రక్షణ వ్యవస్థ లేదు | మంచి ప్రత్యామ్నాయ రక్షణ వ్యవస్థ ఉంది |
| ఇంధన సామర్థ్యం: స్వల్పం | ఏరో-నోస్ (ఏరోడైనమిక్ ముందు భాగం), కోచ్‌ల మధ్య ఫెయిరింగ్స్, తక్కువ బరువు & పరికరాలు రైలంతటా విస్తరించి ఉండటం వల్ల ఇంధన సామర్థ్యం చాలా ఎక్కువ |
| బోగీ లోపలి కళాత్మకత: ఎప్పటిలాగే పాత పద్ధతిలోనే ఉంటుంది | బోగీ లోపలి కళాత్మకత: అత్యాధునికం & సరికొత్తది |
| బోగీ వెలుపలి కళాత్మకత: పాత పద్ధతిలోనే ఉంటుంది | బోగీ వెలుపలి కళాత్మకత: అత్యాధునికం & సరికొత్తది |
| సాంప్రదాయ బయో-టాయిలెట్లు | అత్యుత్తమ బయో-వాక్యూమ్ టాయిలెట్లు |
| పేరు చెప్పుకోదగ్గ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (పి.ఐ.ఎస్.) లేదు | జీపీఎస్ ఆధారిత స్పష్టమైన, ప్రయాణికులకు అనుకూలమైన పి.ఐ.ఎస్. |
ఈ రైలు యొక్క విస్తృత సాంకేతిక వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- 160 కిమీ/గంట వేగం; 180 కిమీ/గంట పరీక్షా వేగం
- గరిష్ట డిజైన్ యాక్సిల్ లోడ్: 17 టన్నులు, ప్రాథమిక డిజైన్‌లో 16.5 టన్నులు సాధించబడింది
- ప్రారంభ త్వరణం (Starting acceleration): 0.8 మీ/సెకను², గరిష్ట మందగమనం (Peak deceleration): 1 మీ/సెకను²
- 50% పవరింగ్‌తో కూడిన 16-కోచ్‌ల చైర్ కార్ కాన్ఫిగరేషన్
- 4-కార్ బేసిక్ యూనిట్, ప్రతి బేసిక్ యూనిట్‌కు ఒక పాంటోగ్రాఫ్ మరియు రైలులో 2 ఎండ్ క్యాబ్‌లు ఉంటాయి
- వీల్-మౌంటెడ్ బ్రేక్ డిస్క్
- 3-ఫేజ్ IGBT ట్రాక్షన్ పరికరాలన్నీ అండర్-స్లంగ్ (బోగీ కింద అమర్చబడినవి)
- పూర్తిగా సస్పెండ్ చేయబడిన ట్రాక్షన్ మోటార్లు
- ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 180 డిగ్రీలు తిరిగే సీట్లు, ఎకానమీ క్లాస్‌లో ముందుకు స్లైడ్ అయ్యే సీట్లు
- కోచ్‌లోనే అత్యాధునిక పాంట్రీ పరికరాలు
- మోల్డెడ్ ఎఫ్‌ఆర్‌పి (FRP) ఇంటీరియర్స్ మరియు మాడ్యులర్ ఎఫ్‌ఆర్‌పి టాయిలెట్లు
- పక్క గోడలలో నిరంతరాయంగా సాగే కిటికీలు (Continuous windows)
- ఎక్స్‌టర్నల్ ఫెయిరింగ్స్‌తో కూడిన పూర్తిగా సీల్ చేయబడిన గ్యాంగ్‌వేలు
- సెమీ పర్మనెంట్ ఇంటర్ కోచ్ కప్లింగ్
కంప్యూటర్ సిమ్యులేషన్స్ చూపించిన దాని ప్రకారం – దీనికి సమానమైన లోకో-హాల్డ్ రైలు నేరుగా ఉండే సమాంతర ట్రాక్‌పై 130 కిమీ/గంట వేగాన్ని అందుకోవడానికి 0.2 మీ/సెకను² త్వరణం, 0.3 మీ/సెకను² మందగమనం మరియు 279 సెకన్ల సమయం తీసుకుంటుంది. అదే ట్రాక్‌పై ట్రైన్ 18 విషయానికి వస్తే ఈ సంఖ్యలు – త్వరణం 0.8 మీ/సెకను², మందగమనం 1.0 మీ/సెకను² మరియు కేవలం 50 సెకన్ల సమయంగా ఉన్నాయి. (తదుపరి పరీక్షలు మరియు ట్రయల్స్‌లో వాస్తవంగా వచ్చిన ఫలితాలు ఈ గణాంకాలకు చాలా దగ్గరగా ఉండటం విశేషం). దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, 160 కిమీ/గంట వేగంతో వెళ్లే సెక్షన్‌లో, సగటు వేగం దాదాపు 130 కిమీ/గంట పరిధిలో ఉండాలి. ఇది భారతీయ రైల్వేలోని అత్యంత వేగవంతమైన క్రింది మూడు రైళ్లతో పోలిస్తే ఎంతో మెరుగైనదిగా ఉండటమే కాక ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది.
| రైలు | రూట్ | దూరం (కిమీ) | సమయం (నిమిషాలు) | గరిష్ట వేగం (కిమీ/గంట) | సగటు వేగం (కిమీ/గంట) |
| గతిమాన్ | ఢిల్లీ-గ్వాలియర్ | 303 | 186 | 160 | 111 |
| శతాబ్ది | ఢిల్లీ-భోపాల్ | 707 | 510 | 150 | 100 |
| రాజధాని | ఢిల్లీ-ముంబై | 1,384 | 942 | 140 | 88 |
మేము ఇటీవల ఒక ఎత్తైన షెడ్‌ను నిర్మించాము. కేవలం ట్రైన్ 18 బాడీలను ఉంచడం కోసం రెండు లైన్లు మరియు విశాలమైన మధ్య మార్గం ఉన్న ఒక పూర్తి బే ని కేటాయించి, అక్కడ ఉన్న మిగతావన్నీ ఖాళీ చేయించాము. ఒక పెద్ద బోర్డుపై ‘ట్రైన్ 18 బే’ అని స్పష్టంగా ప్రకటించాము. ప్రారంభంలో అది చాలా వరకు ఖాళీగా ఉండేది, కానీ అసెంబుల్ చేసిన షెల్స్ ఒక్కొక్కటిగా రూపుదిద్దుకుంటుంటే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండేది. వృత్తిపరంగా అదొక సరైన ప్రొడక్షన్ లైన్. ఒకవేళ మీకు ఇది మరింత కవితాత్మకంగా వినబడాలనుకుంటే – ఐ.సి.ఎఫ్. యొక్క సరికొత్త బిడ్డ జన్మించడానికి కేటాయించబడిన ఒక పవిత్రమైన ప్రసవ వేదిక అది. అక్కడ చిరునవ్వులతో స్వాగతించే టీమ్ సభ్యులను కలవడానికి నేను తరచుగా వెళ్లేవాడిని; ఐ.సి.ఎఫ్.లో నా సాధారణ రోజులో ఆ క్షణాలే అత్యంత ఉత్తేజకరమైనవి. అక్కడ కొందరు తొందరపాటుతో అసహనంగా ఉన్నప్పటికీ, మెజారిటీ సభ్యులు తమ ఉత్సాహంతో నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచేవారు.
నేను మరోసారి డిజైన్ యొక్క కొన్ని అంశాల్లోకి వెళ్తాను. రైలు సెట్ కోచ్‌లు సాధారణంగా శాశ్వతంగా ఒకదానికొకటి జోడించబడి ఉంటాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, కప్లర్ ఎంపిక మరియు దానిని అమర్చడం ఒక ముఖ్యమైన అంశం; వేగవంతమైన త్వరణం, మందగమనం ఉన్నప్పటికీ, రైలు ప్రయాణంలో ఎటువంటి కుదుపులు లేకుండా ఉండటం చాలా అవసరం. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలోని కప్లర్లు ట్రాక్షన్ మరియు బ్రేకింగ్ సమయంలో విపరీతమైన కుదుపులకు కారణమవ్వడం వల్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయనే విషయం మాకు తెలుసు.
ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ‘టైట్‌లాక్’ రకం కప్లర్ల కథ చాలా ఆసక్తికరమైనది. వరుసగా వచ్చిన నాయకత్వాల నిర్ణయాధికారంలో ఉన్న దివాలాకోరుతనానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు ఈ కుదుపుల వల్ల ఇబ్బంది పడి ఉంటారు. మాకు సమస్య తెలుసు, మాపై ఫిర్యాదుల వర్షం కురిసింది, ప్రతిరోజూ మేము విమర్శలను ఎదుర్కొన్నాము, దీనికి పరిష్కారం కూడా సిద్ధంగా ఉంది. కానీ మేము ఉన్న డిజైన్‌లోనే వరుస మార్పులు చేస్తూ సమయాన్ని, శ్రమను వృథా చేశాము. డిజైన్‌ను మార్చి సరైన కప్లర్‌ను ఎంచుకునే కఠినమైన నిర్ణయం తీసుకునే నాథుడే లేకపోయాడు; అది కేవలం ఒకే ఒక వెండర్ వద్ద విపరీతమైన ధరకు లభిస్తుండటం మా అధికార యంత్రాంగాని ఎలాగూ ఒక పెద్ద అడ్డంకిగా మారింది. కొంత పట్టుదలతో ఒక మార్గాన్ని వెతకాల్సి ఉండింది, కానీ యథాతథ స్థితి విసుగు పుట్టించేలా అలాగే కొనసాగింది. చివరికి దానిని ఆమోదించారు, కానీ ప్రస్తుతం ఉన్న వెండర్ల చేత ప్రభావితమై, ఇతర సబ్-ఆప్టిమల్ (తక్కువ నాణ్యత గల) ఎంపికల వైపు తప్పుదోవ పట్టించబడి, సంవత్సరాల తరబడి కాలయాపన, ఇంకా తాత్సారం చేసిన తర్వాతే అది సాధ్యపడింది. ఎవరో ఒకరు చాలా చక్కగా చెప్పారు, “వ్యవస్థలోని యథాతథ స్థితి తన హోదాను కోల్పోయిన చాలా కాలం తర్వాత కూడా బ్యూరోక్రసీ దానిని సమర్థిస్తూనే ఉంటుంది.”
ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఐ.సి.ఎఫ్.లో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. చివరికి, భవిష్యత్తులో మరింత పొడవైన రైళ్లకు కూడా సరిపోయేలా, ఈ రంగంలో మంచి గుర్తింపు ఉన్న ఒక మల్టీ-నేషనల్ కంపెనీ వారి స్థానిక ప్లాంట్‌తో కలిసి ఒక రిజిడ్ సీబీసీ డ్రాఫ్ట్ గేర్ కప్లర్ (సెమీ-పర్మనెంట్ హెడ్‌తో కూడినది) అభివృద్ధి చేయబడింది.
మన ఇల్లు లేదా ఆఫీస్ ఇంటీరియర్స్ చేసేటప్పుడు రకరకాల ఆప్షన్లను పరిశీలించినట్లే, ఈ రైలు లోపలి భాగాల కోసం కూడా అనేక ఎంపికలను పరిశీలించాము. ప్రధాన ఇంటీరియర్ కన్సల్టెంట్లను, ముఖ్యంగా ఒక ఫ్రెంచ్ మహిళను కలవడానికి నేను ఎప్పుడూ కాస్త వెనుకాడేవాడిని; ఎందుకంటే ప్రారంభ సమావేశాలలో ఒకదానిలో ఆమె నాకు రైలు ఇంటీరియర్స్ గురించి అసలు అవగాహనే లేదని మొహం మీదే చెప్పేసింది. ఉదాహరణకు, ఎకానమీ క్లాస్ సీట్లలో రంగుల షేడ్స్ (hue and shade) క్రమంగా మారేలా చేయడం; నాకది కాస్త వింతగా అనిపించింది, కానీ చివరికి ఆమె మాటే నెగ్గింది మరియు ఈ రోజు రైలులో మీరు దానిని చూడవచ్చు. రైలు తయారైన తర్వాత, నేను ఐ.సి.ఎఫ్. లోని అత్యంత సీనియర్ అధికారిణి, ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన ఉషా వేణుగోపాల్‌ను అడిగితే ఆమె కూడా నాతో ఏకీభవించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మరొక అంశం: సీట్లలో వెనక్కి వాలడానికి బదులుగా స్లైడ్ అయ్యేలా ఏర్పాటు చేయడం. అదొక మరింత సౌకర్యవంతమైన రెక్లైన్ సౌకర్యాన్ని ఇచ్చి ఉండాల్సిందని మేమంతా భావించాము, కానీ ఆ కన్సల్టెంట్ మాత్రం ఈ యూరోపియన్ డిజైన్ కోసమే పట్టుబట్టారు; ఆ విషయంలో ఆమె చెప్పింది కూడా నిజమే, ఎందుకంటే ఐరోపాలోని సీట్లు కూడా ఇదే రకంగా ఉండటం నాకు గుర్తుంది. ఈ నిర్ణయం మళ్లీ సమీక్షకు వస్తుందని, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఐ.సి.ఎఫ్. కొత్తగా నిర్ణయం తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. అయినప్పటికీ, నేను చాలా సమావేశాలకు హాజరయ్యాను మరియు ఎక్కువ జోక్యం చేసుకోకుండా నిరోధించబడినప్పటికీ, ఆ పురోగతిని ఆసక్తిగా గమనించేవాడిని. ఆ మహిళ ఎన్నో నమూనాలను ప్రదర్శించేది మరియు వాటన్నింటిలోనూ మార్పు చేయాల్సిన అవసరం నాకు కనిపించేది; ఆమె ఓపికగా వివరించేది, కానీ ఆమె అంతరంగం మాత్రం హెన్రీ V లోని రాజులా, “నీ ఆలోచనలకు కనీస విలువ కూడా లేదు, వాటిని తప్పుబట్టడం కూడా నా సమయాన్ని వృథా చేసుకోవడమే” (“your mind is not worth sun burning”) అనో, లేదా కోరియోలానస్ లోని మెనెనియస్ లా, “నువ్వు ఇంకొంచెం మాట్లాడితే నా బుర్ర పాడైపోతుంది” (“More of your conversation would infect my brain”) అనో అనుకునేదేమో. నేను ఇందులో భాగస్వామినై ఉండవచ్చు, కానీ అందరినీ సమన్వయం చేసుకుంటూ, మంచి వాతావరణాన్ని కాపాడుతూ, పని వేగంగా సాగేలా చూసుకోవడం మా శ్రీనివాస్ యొక్క నాయకత్వ పటిమ వల్లే సాధ్యమైంది. డ్రాయింగ్ బోర్డుపై ఇంటీరియర్స్ యొక్క విస్తృత రూపం ఇలా కనిపించింది:
భారతీయ రైల్వే రైలుకు ఈ డిఫ్యూజ్డ్ లైటింగ్ (సమంగా విస్తరించే కాంతి) ఆలోచన చాలా కొత్తగా అనిపించింది. మానిటర్లపై పూర్తి మరియు డిఫ్యూజ్డ్ లైటింగ్ మోడల్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
కొన్ని నెలల తర్వాత పరిస్థితి మారినంత ఘోరంగా అప్పట్లో లేదు. డిజైన్లకు తుది మెరుగులు దిద్దుతున్నప్పుడు, షెల్ తయారీ పూర్తి స్థాయిలో సాగుతున్నప్పుడు మరియు కొత్తగా అభివృద్ధి చేసిన సబ్-అసెంబ్లీల సరఫరా వివిధ దశల్లో ఉన్నప్పుడు.. కొన్ని రోజులు ఉత్సాహం, సంతృప్తి ఉంటే, మరికొన్ని రోజులు తీవ్ర నిరాశలు ఎదురయ్యేవి. ఐ.సి.ఎఫ్. యొక్క అనేక అంకితభావం గల బృందాలు తయారీదారుల ప్రాంగణాల్లో పరీక్షలు నిర్వహించడంలో బిజీగా ఉన్నాయి. డిప్యూటీ సీఎమ్ఈ/డిజైన్ దిలీప్ కుమార్, డిప్యూటీ సీఈఈ/డిజైన్ అమితాబ్ సింఘాల్ సహాయంతో దాదాపు ప్రతి వారం ఒక కొత్త పెర్ట్ (PERT) చార్ట్‌ను సమర్పించేవాడు. వెనుకబడిన కొందరు వేగం పుంజుకుంటే, చిరుతల్లాంటి కొందరు మందగించారు. కానీ ఈ రంగురంగుల చార్టులన్నీ కేవలం రంగుల వెనుక అసలు సత్యాన్ని దాచే రంగుల చార్టులుగానే మిగిలిపోతాయని మాకు అప్పుడు తెలీదు. వాస్తవం అంత సౌకర్యవంతంగా లేదు. ఫిబ్రవరి-మే 2018 కాలంలో, చాలా నెమ్మదిగా ఉన్న కొద్దిమంది సరఫరాదారులతో జరిగిన సమావేశాలు మినహా, మిగిలినవన్నీ ఎక్కువగా నిర్ణయాత్మకంగా సాగాయి; బోలెడంత టీ మరియు సమోసాలు, పెద్దగా గొడవలేమీ లేవు, దిలీప్ అదరగొడుతున్నాడని మేము అనుకున్నాము.
పనులు సాగుతున్న తీరును చూస్తే, ఆగస్టు 2018 నాటికి ఫ్లాగ్ ఆఫ్ (ప్రారంభోత్సవం) ఖచ్చితంగా సాధ్యమయ్యేలా కనిపించింది. దిలీప్, అమితాబ్ ఇద్దరూ విషయాలను నమ్మకంగా ప్రదర్శించేవారు, కానీ చర్చ ప్రారంభం కాగానే ఆ తేదీలను చూసి కాస్త సంకోచించేవారు. నిజానికి, ఆ ఇద్దరు అధికారులూ అర్థం కాని ఒక పజిల్ లాంటివారు. భగవంతుడి లీలలు విచిత్రమైనవి, ఈ ఇద్దరి విషయంలోనూ అది నిజం. డాన్స్ ఫ్లోర్ మీదకు వదిలితే, దిలీప్ సాక్షాత్తూ శివుడే దిగివచ్చినట్లుగా ఊగిపోతాడు; లేదంటే చాలా సైలెంట్‌గా, సిగ్గుపడే టైప్. ఇక అమితాబ్ కూడా, ప్రారంభంలో కాస్త హడావుడి చేసినా ఆ తర్వాత చాలా విచిత్రంగా మారిపోతాడు. ఆఫీసులో అంత రిజర్వ్‌డ్‌గా ఉండే ఈ జంట, సామాజిక వేడుకల్లో అంత తేలికగా ఎలా నవ్వుల పాలు కాగలరా అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోయేవాడిని.
ఏదేమైనప్పటికీ, ఇద్దరూ నిశ్శబ్దంగా మరియు సమర్థవంతంగా పనిచేసే అధికారులు. నా గదిలో జలేబీలు గెలుచుకోవడానికి దిలీప్ అప్పుడప్పుడు చాలా దగ్గరగా వచ్చేవాడు. శ్రీనివాస్ ఎప్పుడూ అతన్ని బలంగా సమర్థించేవాడు. ఎవరికైనా ఏవైనా ఆందోళనలు లేదా అనుమానాలు ఉంటే, అతను ఈ రైలు నమూనాను చూపిస్తూ – రైలు ఇలాగే కనిపించబోతోంది! అని వారిని శాంతింపజేసేవాడు.
రైలు నిజంగా ఈ మోడల్ లాగే కనిపిస్తుందా అని చూడటానికి ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్రుతగా, ఆందోళనగా ఉన్నారు. నేను కూడా అలాగే ఉన్నాను, కానీ నా స్థితి రాహీ రాసిన ఈ పంక్తుల్లా ఉంది:
కర్ నా దేర్ ఔర్ హష్ర్ బర్పా కర్నే మే,
మేరీ నజర్ తేరే దీదార్ కో తరస్తీ హై
(ప్రళయాన్నయినా సరే త్వరగా రానివ్వు, నిన్ను ఒక్కసారి చూడాలని నా ప్రాణం తహతహలాడుతోంది.)
జూన్ వచ్చేసరికి కానీ మాకు అర్థం కాలేదు – అంతా సజావుగా లేదని. మొదటి షెల్‌లో ఇంటీరియర్ ఫినిషింగ్ పనులు ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది, పైగా ప్రొపల్షన్ మరియు ఇతర అనుబంధ పరికరాల ప్రధాన డెలివరీలు ఆగస్టులో మాత్రమే వచ్చేలా ఉన్నాయి. ఆగస్టులో రైలును సిద్ధం చేయాలంటే జూలైలోనే కమిషనింగ్ ప్రారంభం కావడం అత్యంత అవసరం, కానీ అది స్పష్టంగా అసాధ్యమని తేలిపోయింది. మిస్టర్ ఫోర్డ్ చెప్పిన చమత్కారాలు ఎలా ఉన్నా, మేము ఒక నిమిషం కాదు, ఏకంగా కొన్ని నెలలు ఆలస్యం కాబోతున్నామని స్పష్టమైంది.
(ఇంకా ఉంది)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
