Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే భారత్ – ట్రైన్ 18 కథ-19

[వందే భారత్ రైలు రూపకర్త సుధాంశు మణి అనుభవాల కథనం ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ ను తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]

అధ్యాయం 18 ఈ మార్పు నిలదొక్కుకుంటుందా?

వివిధ స్థాయిలలో నాయకత్వం మారినప్పుడు ఐ.సి.ఎఫ్.లో తీసుకొచ్చిన సాంస్కృతిక, వ్యవస్థాగత మార్పులు అలాగే కొనసాగుతాయా? ఐ.సి.ఎఫ్. నిరంతర అభివృద్ధితో ఇంకా ముందుకు సాగుతుందా? నిజంగానే నేను కొన్ని మంచి వ్యవస్థలను ఏర్పాటు చేసి ఉంటే, అవి నిరంతరం కొనసాగేలా ఎలా చూడాలి? వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇది సహజంగానే ఎదురయ్యే ఒక సందిగ్ధత అని నాకు గుర్తొస్తుంది. కానీ నిజాయితీగా చెప్పాలంటే, అది నన్ను అంతగా కలవరపెట్టలేదు. ప్రభుత్వ రంగంలో పనిచేసే మనం బహుశా దాని గురించి అసలు ఆలోచించమేమో. నన్ను ఒకటి రెండు ఐఐఎం సంస్థలకు ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆ ప్రశ్నను తేలికగా పక్కన పెట్టడం నాకు కష్టమైంది. రైల్వే ఉద్యోగుల మొండితనం, అందరికీ అవసరమయ్యే వారి అనివార్యత, భారతీయ రైల్వే సంస్థలలో సహజంగానే ఉండే మనుగడ బలాలు లాంటి పడికట్టు మాటలు అక్కడ పెద్దగా పనిచేయలేదు. నాయకత్వ బాధ్యతల్లో ఉన్న ఎవరికైనా ఇది సహజంగా ఎదురయ్యే సందిగ్ధతే అని నేను గ్రహించాను. ఐ.సి.ఎఫ్.లో చేసిన మంచి పనులు కేవలం నిలదొక్కుకోడమే కాకుండా, నిరంతరం మెరుగుపడుతూ ఉండటం గురించి నేను ఆలోచించాల్సి వచ్చింది.

సంస్థాగత సంస్కృతి అనేది అక్కడ అమలులో ఉన్న విలువలు, నమ్మకాలు, నియమాలు, ఆచారాల కలయికను సూచిస్తుంది. ఒక సంస్థను దాని ఆస్తుల ద్వారా కాకుండా, అది ఏమిటో తెలియజేసేది ఇదే. ఇంకా చెప్పాలంటే, ఒక సంస్థలో పనులు జరిగే విధానమే దాని సంస్కృతి. ఇందులో పలు పొరలు ఉంటాయి. మీరు మొదటగా చూసే పొర అక్కడి వ్యక్తుల ప్రవర్తన, పనుల నాణ్యత, ఇంకా ఫలితాలు. రెండవది, ఈ మొదటి పొరను గమనించడం ద్వారా అక్కడ అమలులో ఉన్న విలువలను అంచనా వేయవచ్చు. మూడవది, వ్యవస్థలో బయటకు చెప్పుకోని అంతర్గత భావనలు లేదా ఊహలు. బలమైన, స్పష్టమైన సంస్కృతి ఉన్న సంస్థలలో ఇలాంటి గుప్త భావనలు ఉండవు, కానీ అలాంటి సంస్థలు చాలా అరుదు. ఈ పొరల మధ్య సమన్వయం లోపించినప్పుడు ఉద్యోగులలో అసంతృప్తి మొదలవుతుంది.

ఈ విషయంలో మనం ఐ.సి.ఎఫ్.ను పరిశీలిద్దాం. ఏ ఇతర ప్రభుత్వ సంస్థలాగే, ఇక్కడ కూడా (నిజానికి ఈనాటికీ) ఎన్నో బహిరంగ రహస్యాలు ఉండేవి. పరస్పర చర్యలలో, నిర్ణయాలు తీసుకోవడంలో కఠినమైన అధికార క్రమాన్ని పాటించడం, నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాస్ ఏమి కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఫైలుకు రంగుపులిమి చూపించడం, ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు పాతకాలపు ప్రోటోకాల్స్ పట్ల అతి సున్నితత్వం ప్రదర్శించడం, కొందరు నాయకులు తమకు లేనిపోని అధికారాలు, హక్కులు ఉన్నట్లు భావించడం, పరిశ్రమలు, వెండర్లు, ఇతర బయటి ఏజెన్సీలకు దూరంగా ఉంటున్నట్లు నటించడం, డిపార్ట్‌మెంటల్ విజిలెన్స్ విభాగం అంటే భయం, పైకి విధేయత నటిస్తూనే నాయకత్వంపై అపనమ్మకం కలిగి ఉండటం, అందరికీ తెలిసినప్పటికీ ఆచరణలో కాకుండా కేవలం బోధనలకే పరిమితమైన నిజాయితీ, నీతి నియమాల పట్ల ఒక కృత్రిమ భావన – ఇలాంటి ఎన్నో భావనలు ఇక్కడ పాతుకుపోయి ఉండేవి.

వీటిని మార్చాలంటే కొన్ని విప్లవాత్మక చర్యలు అవసరమని నాకు తెలుసు. సంస్కృతి అనేది ఎప్పుడూ పైస్థాయి నుంచే మొదలవుతుంది. పాతుకుపోయిన భావనలను కదిలించి, విలువలను మార్చే దిశగా అడుగులు వేయాలంటే ఇది చాలా ముఖ్యం. ఆ మేరకు, పాత పద్ధతులను విడనాడటానికి స్పృహతో కూడిన ప్రయత్నాలు చేయాలని ఐ.సి.ఎఫ్. సభ్యులందరినీ నేను ఎలా కోరానో ఇప్పటికే వివరించాను.

మేము పరిష్కరించడానికి ప్రయత్నించిన సంస్కృతి సంబంధిత అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఐ.సి.ఎఫ్.లోని సభ్యులందరితో, బృందాలతో ఎంతో స్నేహపూర్వకంగా కలవాలనేదే నా వ్యక్తిగత ఆచరణ ద్వారా నేను ఇచ్చిన సందేశం. స్నేహభావానికి ఖర్చు ఉండదు, కానీ దానివల్ల గొప్ప ఫలితాలు ఉంటాయి. నన్ను ఎప్పుడు ఆహ్వానించినా, నేను ఎల్లప్పుడూ సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవాడిని, వాటిని ఆస్వాదించేవాడిని కూడా.

రోజువారీ అవినీతి వ్యవహారాలలోనూ, వృత్తిపరమైన నిబద్ధతలోనూ మీరు నిజాయితీగా ఉంటే సరిపోదు, నిజాయితీపరులుగా కనిపించాలి కూడా. మీ నిజాయితీని అందరికీ చాటుకుంటూ, నేనే గొప్ప నీతిమంతుడిని అన్నట్లుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు; కొన్నిసార్లు నిజాయితీ అనేది వ్యక్తిగత ఎంపిక కూడా. కానీ పనిలో నిజాయితీ అనేది ఉండాల్సిన లక్షణమని, చిత్తశుద్ధి లోపాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించబోమని కింది స్థాయి వరకు బలమైన సందేశం వెళ్లాలి. తీవ్రమైన అవకతవకలపై ఉక్కుపాదం మోపడం ద్వారా మేము కొంత పురోగతి సాధించాము. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాము, అనామకంగా ఫిర్యాదులు (విజిల్ బ్లోయింగ్) చేయడాన్ని ప్రోత్సహించాము. ఇలాంటి ప్రయత్నాల ద్వారా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన లేదా అవినీతికి పాల్పడినట్లు స్పష్టంగా రుజువైన కొందరు సిబ్బందిని గుర్తించి, వారిని శిక్షించగలిగాము; వారిలో చాలామందిని ఉద్యోగం నుండి తొలగించాము.

ఈ సమస్యను మేము ఒక వినూత్న పద్ధతిలో పరిష్కరించిన సందర్భాన్ని ఇక్కడ ఉదహరిస్తాను. దీపావళి సమయంలో, అలాగే కొంతవరకు నూతన సంవత్సర సమయంలో, సప్లయర్లు మరియు కాంట్రాక్టర్ల ప్రతినిధులు డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, మద్యం బాటిళ్లు, ఖరీదైన బహుమతులతో కూడిన పెద్ద పెద్ద సంచులను పట్టుకుని ఆఫీసులలో స్వేచ్ఛగా తిరుగుతూ అధికారులకు వాటిని పంచడం అన్ని రైల్వే ఆఫీసులలో ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇది ఒక ఆఫీసు గురించి ఎంతటి వృత్తివిరుద్ధమైన అభిప్రాయాన్ని కలిగిస్తుంది? నేను జర్మనీలో ఉన్నప్పుడు, జనవరి 1న జర్మన్ రైల్వేస్ (Deutsche Bahn) సిబ్బందికి కొన్ని తక్కువ ఖరీదు గల వైన్ బాటిళ్లను అందించడానికి మేము ఎంతో ఒప్పించాల్సి వచ్చింది, ఎన్నో ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది; వాటిని తీసుకోవడానికి వారు చాలా ఇబ్బంది పడ్డారు.

మా ఆఫీసు ప్రతిష్ఠను పెంచడానికి, ఈ దీపావళి బహుమతుల సంప్రదాయాన్ని ఆపాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం ఐ.సి.ఎఫ్. కార్యాలయాలన్నింటి బయట ఈ క్రింది ఆకర్షణీయమైన వాక్యాలతో స్టాండీలను ఏర్పాటు చేయించాను:

“ప్రియమైన సందర్శకులారా, మీరు ఏవైనా డ్రై ఫ్రూట్స్, స్వీట్లు లేదా ఇతర బహుమతులు తెచ్చినట్లయితే, దయచేసి వాటిని రిసెప్షన్ వద్ద అప్పగించండి. వాటిని మా ప్రత్యేక పిల్లల పాఠశాల ‘కరుణ’కు పంపడానికి మేము సంతోషిస్తాము.”

ఐ.సి.ఎఫ్.లో నా మొదటి దీపావళి సమయంలో, ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిని పట్టుకోవడానికి నా అటెండర్లను కూడా నియమించాను. అలా పట్టుబడిన వారిని నా గదికి తీసుకువచ్చినప్పుడు, బిత్తరపోయి నిలబడిన వారిని ప్రశ్నించడం నాకు ఎంతో సరదాగా అనిపించింది.

అయితే, మేము కేవలం ఉపరితలంపై కొద్దిగా మాత్రమే కదలిక తీసుకురాగలిగామని నేను భావిస్తున్నాను. భద్రతా సిబ్బందితో సహా కొన్ని విభాగాల సిబ్బందిలో పచ్చి అవినీతి పేరుకుపోయి ఉండేది; మా ఉద్దేశం అందరికీ బాగా తెలిసి, దానివల్ల కొంత ప్రభావం ఉన్నప్పటికీ, మేము దానిని పూర్తిగా నిర్మూలించలేకపోయాము. అంతేకాకుండా, పూర్తిగా అవినీతిపరులుగా పేరుపడ్డ కొందరు అధికారులు కూడా ఉండేవారు. రైల్వే ప్రయోజనాలకు నష్టం కలగనంత కాలం లంచాలు తీసుకోవడంలో తప్పులేదనే ఒక ఆత్మవంచన లేదా స్వార్థపూరిత భావన బహుశా వారిలో చాలామందికి ఉండేది. మరోసారి చెబుతున్నాను, ఈ విషయంలో మేము గొప్ప విజయాలు సాధించామని నేను చెప్పలేను. సాంస్కృతికంగా మాకు కలిగిన ఏకైక సంతృప్తి ఏమిటంటే, నిజాయితీ, చిత్తశుద్ధి అనే అంశాలపై కొంత చర్చ, దృష్టి కేంద్రీకృతమయ్యాయి.

మరి వృత్తిపరమైన నిజాయితీ సంగతేమిటి? వృత్తిపరమైన నిజాయితీ లేకపోవడం ఇంకా పెద్ద ప్రమాదం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే సంస్కృతి లేకపోవడం, ముందుగానే నిర్ణయించుకున్న ఒక లక్ష్యాన్ని సమర్థించుకోవడానికి ఫైళ్లకు రంగుపులమడం అనేది ఒక ఆరోగ్యకరమైన సంస్థాగత సంస్కృతిని నిర్మించడానికి గొప్ప అడ్డంకి. రైల్వేలో రోజువారీ కార్యకలాపాలు మినహా దాదాపు అన్ని నిర్ణయాలు ఫైళ్ల ద్వారానే నడుస్తాయి. చాలామంది సీనియర్ అధికారులు ఫైళ్లకు, అవి సమర్పించే విధానానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు, కానీ దురదృష్టవశాత్తూ అది ఒక రకమైన ‘బాబుడమ్’ (అధికారిక జాప్యం/నత్తనడక) పద్ధతిలో ఉంటుంది; దీనిని విపరీతమైన బ్యూరోక్రాటిక్ పద్ధతిగా విమర్శించేవారు కూడా ఉన్నారు. నేను ఎప్పుడూ ఫైలు బాహ్య నియమాల గురించి పట్టించుకోలేదు; అందులోని విషయమే నాకు ముఖ్యం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, ఈ ఫైళ్ల కదలిక వ్యవస్థను ఎంతో ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తమ వ్యతిరేక అభిప్రాయాలను కూడా నిజాయితీగా నమోదు చేయడానికి ప్రోత్సహించబడటం వల్ల, సంస్థ ప్రయోజనాలకు విరుద్ధమని తమ విచక్షణకు అనిపించిన దేనికీ తలొగ్గాల్సిన ఒత్తిడి ఉండేది కాదు. అదే సమయంలో, ముఖ్యమైన కేసులలో జాప్యం చేయడం లేదా ఫైళ్లను ఆపడం క్షమించరాని నేరమని, అలా జాప్యం చేసిన వ్యక్తి అందరి ముందు అవమానానికి గురికావాల్సి వస్తుందని స్పష్టం చేశాము.

షేక్‌స్పియర్ రాసిన ‘ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్’ నాటకంలో మరియానా వేరే సందర్భంలో “నిజాయితీ అంత గొప్ప వారసత్వం మరొకటి లేదు” అని అంటుంది. అందులోని సంక్లిష్టమైన శ్లేషలు, రూపకాలను పక్కన పెడితే, ఆ వాక్యం యొక్క వాచ్యార్థం ఒక సంస్థకు ఎంత శక్తివంతమైనదో చూడండి. ఐ.సి.ఎఫ్.లో మేము నిర్మిస్తున్న వారసత్వంలో కనీసం ఒక ప్రాథమిక నిజాయితీ సూత్రాన్నైనా పూర్తిగా కనుమరుగైపోకుండా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాము.

మేము భిన్నాభిప్రాయాలను (అసమ్మతిని) కూడా ప్రోత్సహించడానికి ప్రయత్నించాము. చాలాసార్లు కొత్తగా చేరిన సభ్యులు తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తుంటారు. దానిని అణచివేయకుండా, వారి మాట వినాలి. చాలా సందర్భాలలో, ఒక తిరుగుబాటుదారుడి మాట వినడం వల్ల అతడిని మనవైపుకు తిప్పుకోవచ్చు. అంతేకాకుండా, ఎవరిదైనా తిరుగుబాటు పూరిత ఆవేశం ఆధారంగా మనం మన తప్పులను సరిదిద్దుకునే అదనపు ప్రయోజనం కూడా ఉంటుంది.

విభాగాల మధ్య ఉండే అడ్డుగోడలను బద్దలు కొట్టడానికి విశాల దృక్పథం చాలా ముఖ్యం. ఇది మాకు పెద్ద సమస్య కాకపోవడం వల్ల, బృంద సభ్యులందరినీ సంస్థ లక్ష్యాల వైపు నడిపించడం సులభమైంది. ఒక అధికారిక ప్రక్రియను కూడా ప్రారంభించాము. పని ప్రక్రియలను సులభతరం చేయడానికి, పనిలో అనవసరమైన జాప్యాలను తొలగించడానికి మౌలిక మార్పులను సూచించేందుకు అధికారులతో కూడిన ఒక క్రాస్-ఫంక్షనల్ ట్రాన్స్‌ఫర్మేషనల్ బృందాన్ని ఏర్పాటు చేశాము. కొన్ని నెలల వాదోపవాదాల తర్వాత, చివరకు వారు ఎన్నో కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చారు; వాటిలో చాలావరకు నిజంగానే అమలు చేయబడ్డాయి లేదా కనీసం బలంగా ముందుకు తీసుకెళ్లబడ్డాయి.

పని ప్రదేశాలు, కాలనీలు, క్రీడా సౌకర్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణం, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ మొదలైన వాటిని మెరుగుపరచడానికి మేము చేసిన పని అపూర్వమైనది, భారీ స్థాయిలో జరిగింది. సారాంశంగా చెప్పాలంటే, మేము ఈ క్రింది రంగాలలో మంచి పురోగతి సాధించాము:

  1. నిర్ణయాలు తీసుకోవడంలో వెసులుబాటు మరియు అనుకూలత, జాప్యాలపై నియంత్రణ; కేవలం కొన్ని విభాగాల లక్ష్యాలకు కాకుండా మొత్తం ఐసీఎఫ్ యొక్క విశాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం; తరచుగా ఈ సంకుచిత, పరిమిత లక్ష్యాలే పనితీరు సూచికలుగా చలామణి అవుతుంటాయి.
  2. సమస్యల పరిష్కారం మరియు మెరుగైన సమాచార మార్పిడి కోసం అధికారిక, అనధికారిక సమావేశాలు.
  3. కార్మిక శక్తికి స్ఫూర్తినివ్వడం, వారిని ప్రోత్సహించడం.
  4. మెరుగైన వాతావరణం: యూనిఫాం నియమావళి, చిహ్నాలు, పని ప్రదేశంలో పరిశుభ్రత, క్రమశిక్షణ, పని వేళల తర్వాత సాంస్కృతిక, సామాజిక, క్రీడా కార్యక్రమాలు, కుటుంబాల భాగస్వామ్యం, మరింత పచ్చదనం, మెరుగైన సంక్షేమ కేంద్రాలు, విజువల్ ఆర్ట్ ప్రదర్శనల విస్తరణ మొదలైనవి.
  5. చిత్తశుద్ధి మరియు నిజాయితీ; ఇవి కేవలం ముఖ్యమైనవి మాత్రమే కాదు, స్పష్టంగా ప్రదర్శించబడాలి మరియు అందరికీ కనిపించాలి.
  6. అన్నింటికంటే ముఖ్యంగా, అన్ని స్థాయిలలో విశ్వసనీయమైన, స్పష్టంగా కనిపించే సానుకూల నాయకత్వం.

ఈ మార్పు ఇలాగే నిలదొక్కుకుంటుందా? ఒక సున్నితమైన, క్రమబద్ధమైన పరివర్తనతో, సంస్థలో పనులు జరిగే విధానాన్ని ఉద్యోగులందరూ తమదిగా భావించడం ప్రారంభించినప్పుడు మార్పులు స్థిరంగా నిలుస్తాయని నేను భావిస్తున్నాను. కొత్త పద్ధతులు, ప్రవర్తనలు, వైఖరులు పనితీరును మెరుగుపరచడంలో ఎలా సహాయపడ్డాయో నొక్కి చెబుతూ మేము ఉద్యోగులతో నిరంతరం సంభాషించడం వల్ల, అది వారి విలువల వ్యవస్థలో ఒక భాగంగా మారడం ప్రారంభమైంది. ఆ మేరకు, ఈ మార్పు తప్పకుండా నిలబడుతుందని నాకు నమ్మకం ఉంది. మరోవైపు, ఈ వేగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉమ్మడి నాయకత్వం యొక్క నిరంతర నిబద్ధత కూడా చాలా ముఖ్యం. తర్వాత వచ్చే ఉన్నతాధికారుల బృందం ఈ మార్పులను స్వీకరించి, వాటికి ప్రతిరూపంగా నిలుస్తుందా? అది ఎప్పటికీ అంచనా వేయలేని విషయంగానే ఉంటుంది. అయితే, ఈ సాంస్కృతిక మార్పులలోని అనేక అంశాలను నిలబెట్టుకోవడమే కాకుండా, వాటిని మరింత సానుకూలంగా మెరుగుపరిచే శక్తి ‘టీమ్ ఐ.సి.ఎఫ్.’కు ఉందని నాకు గొప్ప నమ్మకం ఉంది.

సాంస్కృతిక కార్యక్రమాల కొనసాగింపుతో పాటు, సంస్థాగత మనుగడ అనే పెద్ద ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. అంటే వ్యాపారాన్ని కొనసాగించడం మరియు విస్తరించడం; సంస్థను భవిష్యత్తుకు సిద్ధం చేయడం, అనగా నేటి విజయాన్ని కొనసాగిస్తూనే భవిష్యత్తు అవసరాలను కాపాడటం మరియు బలోపేతం చేయడం.

మేము ఇంకా ఏమి చేయగలిగేవాళ్ళం? నాయకత్వం ఎలాంటి బ్లాక్‌మెయిల్‌కు లొంగనంత కాలం, మీ సిబ్బంది మనసు గెలుచుకోవడానికి మీరు చేయగలిగే పనులకు అంతే ఉండదు! ఈ మార్పును నిలబెట్టి, దానిని ఒక మెట్టు నుండి మరో ఉన్నత మెట్టుకు తీసుకెళ్లేది వారే.

భారతీయ రైల్వే జీఎంలకు వినోద కార్యక్రమాల కోసం భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తారు. ఈ డబ్బును ఖర్చు చేయడానికి ఉన్న నియమ నిబంధనలు ఏమిటో నాకు తెలియదు; దానిని నిర్వహించడానికి నేను సెక్రటేరియట్‌పై ఆధారపడ్డాను. కానీ జీఎం తనకు ఇష్టమైన కొందరు అధికారులను పోగుచేసుకుని పార్టీలు చేసుకోవడానికి మాత్రం ఆ డబ్బు ఉద్దేశించినది కాదు. రైల్వే అధికారుల పార్టీలా? అదొక విరుద్ధమైన పదబంధం లాంటిది. పార్టీ అంటే రైల్వే అధికారులు తమ జీవిత భాగస్వాములతో కలిసి హాజరయ్యే ఒక సమావేశం. అక్కడ ‘సాహెబ్‌లు’, ‘మేడమ్‌ల’కు వేర్వేరు సీటింగ్ ఏర్పాట్లు ఉండే ఒక అలిఖిత నియమం ఉంటుంది; మీరు ఈ విభజనను కొద్దిగా దాటడానికి ప్రయత్నించినా, తోటి అధికారులు, వారి జీవిత భాగస్వాములు మిమ్మల్ని వింతగా చూస్తారు. అక్కడ కొద్దిగా మద్యం, ఈ రోజుల్లో అయితే వైన్ కూడా ఉంటుంది; అప్పుడప్పుడు మీ ఆలోచనా శక్తిని సవాలు చేసి, బుర్రను మొద్దుబార్చే కొన్ని చప్పగా ఉండే పార్టీ గేమ్స్ ఉంటాయి. ముందుగా కొందరు కింది స్థాయి సిబ్బంది స్టేజీపై పాటలు పాడతారు, ఆ తర్వాత కొందరు సాహెబ్‌లు, మేమ్‌సాహెబ్‌లు వచ్చి తమ అతి మధురమైన, కర్ణకఠోరమైన గానంతో అక్కడి వారిని హింసిస్తారు. ఇక డ్యాన్స్ ఫ్లోర్ విషయానికొస్తే, సాహెబ్‌లు జంటలుగా డ్యాన్స్ చేస్తుంటే, మేమ్‌సాహెబ్‌లు ముగ్గురు లేదా నలుగురు చొప్పున గుంపులుగా చేరి వింత వింత స్టెప్పులు వేస్తుంటారు – తప్పుడు దిశలో కదిలే నడుము ఊపుడు, గెంతులు, ఏదో తెలియని కారణంతో చేతులు గాలిలోకి విసురుతూ చేసే క్యాట్‌వాక్, రెండు ఎడమ కాళ్లతో పుట్టిన వ్యక్తి వేసే అత్యుత్తమ అడుగులు వంటి హాస్యాస్పదమైన భంగిమలను ప్రదర్శిస్తుంటారు. మద్యానికి ఎప్పుడూ నో చెప్పని నేను, విస్కీ గ్లాసుల నుండి వెలువడే నాటు జోకులు వినిపించే కాస్త మేధోపరమైన మూలలకే పరిమితమయ్యేవాడిని.

అలాంటి పార్టీల కోసం నా ఎంటర్‌టైన్‌మెంట్ నిధులను ఖర్చు చేయడమా? అది నాకు ఏమాత్రం ఇష్టం లేని పని. నిబంధనలకు లోబడి, కేవలం సీనియర్ అధికారులతోనే కాకుండా జూనియర్ అధికారులు, సూపర్‌వైజర్లు, ఆఫీసు సిబ్బంది, టెక్నీషియన్లు, ఇంకా ఇతర సిబ్బంది వర్గాలకు చెందిన వారితో సహా మొత్తం ఐసీఎఫ్ బృందంతో మరింత సన్నిహిత సంబంధాలు పెంచుకోవడానికి ఈ నిధులను ఎందుకు ఉపయోగించకూడదు? నేను ఈ విషయాన్ని బాబుతో చర్చించాను, ఇది బృంద స్ఫూర్తిని పెంపొందించే మంచి ఆలోచన అని అతను కూడా బలపరిచాడు. మేము జీఎం నివాసంలో ఇలాంటి ఒక డజనుకు పైగా టీ పార్టీలు, విందులను ఏర్పాటు చేశాము. పాల్గొన్న వారందరికీ అది ఒక కొత్త అనుభవం; సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నందున ఐ.సి.ఎఫ్. వారందరినీ ఒకేసారి పిలవడం సాధ్యం కాకపోయినప్పటికీ, మేము పెద్ద సంఖ్యలో ప్రాతినిధ్య బృందాలను కవర్ చేశాము.

చాలామంది పాల్గొనేవారికి, భారతీయ రైల్వే సంప్రదాయానికి అనుగుణంగా రాజభవనంలా ఉండే జీఎం నివాసం ఒక అభేద్యమైన కోట లాంటిది; అక్కడికి ఆహ్వానం అందగానే వారు మొదట కొంత ఆశ్చర్యానికి గురయ్యారు, కానీ లోపలికి వచ్చిన తర్వాత, వారు తమ సొంత ఇంటిలో ఉన్నట్లుగా హాయిగా ఉండేలా మేము చూసుకున్నాము. ఈ సమావేశాలలోని కార్యక్రమాలను కొందరు ఉత్సాహవంతులైన, చురుకైన జూనియర్ అధికారులు ఎంతో స్నేహపూర్వకంగా, అనధికారిక పద్ధతిలో నిర్వహించారు; అలా నిరంతరం అందరూ కోరుకునే అధికారులలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ జాన్ ఒకరు. బహుశా తమ జీవితంలో మొదటిసారిగా ఒక పెద్ద సమూహం ముందు లేచి నిలబడి మాట్లాడేలా లేదా పాడేలా కూడా అతను పాల్గొనేవారిని ప్రోత్సహించగలడు. నేను ఆ అనుభవాన్ని ఎంతో ఇష్టపడతాను, అది ‘టీమ్ ఐ.సి.ఎఫ్.’కు వెలకట్టలేని మేలు చేసింది.

జీఎం బంగ్లాలో సిబ్బందితో ఆత్మీయ విందులు

ఐ.సి.ఎఫ్.లో చేపట్టిన పరివర్తనాత్మక కార్యక్రమాలకు గాను ఏప్రిల్ 2018లో రైల్వే మంత్రి చేతుల మీదుగా నాకు ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్’ లభించింది. ఐ.సి.ఎఫ్.లో జరిగిన అద్భుతమైన పనికి ఇది తగిన గుర్తింపు అని నా సహోద్యోగులలో చాలామంది భావించగా, సిఆర్‌బితో నాకున్న సాన్నిహిత్యం వల్లే అది వచ్చిందని మరికొందరు అన్నారు. ఏదైతేనేం, నాకు అది పెద్దగా పట్టలేదు, ఎందుకంటే రైల్వేలో అవార్డులు, షీల్డులు అధికారుల ఇష్టాయిష్టాల ప్రకారం నిర్ణయించబడతాయని అందరికీ తెలిసిందే. నాకు తెలిసినదల్లా ఒక్కటే – ఐ.సి.ఎఫ్.లో జరిగిన రూపాంతరాన్ని కళ్లారా చూసిన లోహాని, బోర్డులో ఈ అవార్డును అడ్డుకోవాలనుకున్న ఇతరుల అభిప్రాయాలను తోసిపుచ్చి మరీ నాకు ఈ అవార్డును ఖరారు చేశారు. లోహాని ఒక నిజమైన నాయకుడి లక్షణాలు ఉన్న వ్యక్తి; తన బృందంలోని ఎవరినైనా ప్రశంసించడంలో ఎప్పుడూ ఎంతో ఉత్సాహం చూపుతారు. అప్పట్లో బోర్డులో ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్/ట్రాన్స్‌ఫర్మేషన్‌గా పనిచేస్తున్న సుధీర్ కుమార్ గురించి కూడా నేను తప్పక ప్రస్తావించాలి. భారతీయ రైల్వేలో పనులకు అడ్డుపడుతున్న రెడ్ టేపిజం (అధికారిక జాప్యం) అనే చిక్కుముడిని విప్పడానికి ఆయన ఒక్కొక్క సమస్యను తీసుకుని గొప్ప పని చేస్తున్నారు; ఐ.సి.ఎఫ్.కు ఈ అవార్డు రావడానికి తిరుగులేని బలమైన నివేదికను సిద్ధం చేసింది ఆయనే.

ఉద్దేశపూర్వకంగా జరిగినా, జరగకపోయినా ఈ మార్పులన్నీ ‘ట్రైన్ 18’ (వందే భారత్) తయారీతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి. ఈ మార్పులే నా కథలోని ‘ఎందుకు’, ‘ఏమిటి’, ‘ఎలా’ అనే ప్రశ్నలకు సమాధానాలు. వీటిలో చాలా ‘ఎందుకులు’, ‘ఏమిటిలు’, ‘ఎలాలు’ ఒకదానికొకటి మారుతూ ఉంటాయి; దీనివల్ల ఈ ‘ఎలా’ల ద్వారా ‘ఎందుకులు’ ‘ఏమిటి’లకు దారితీశాయా లేక దానికి విరుద్ధంగా జరిగిందా అని చెప్పడం కష్టం. మా హెచ్ఆర్ కార్యక్రమాల విషయంలో అడిగినట్లే, ఈ పరివర్తనాత్మక మార్పులు నిజంగా ‘ట్రైన్ 18’ తయారీలో సహాయపడ్డాయా అని ప్రజలు నన్ను అడుగుతుంటారు. ట్రైన్ 18 ఉన్నా లేకపోయినా మేము ఈ మార్పులు చేసి ఉండేవాళ్లమని, అవి ట్రైన్ 18 తయారీకి సహాయపడి ఉంటే అందుకు మేము మరింత సంతోషిస్తామని నా దగ్గర ఎప్పుడూ ఒకే సమాధానం ఉంటుంది.

ఆలోచించడానికి ఇప్పుడు నాకు మరింత సమయం దొరకడంతో, నేను ఏమి చేశాను మరియు ముఖ్యంగా ఏమి చేయలేకపోయాను అనే విషయాలను మరోసారి సమీక్షించుకోవాలి. వెనక్కి తిరిగి చూసుకుని తాను అన్నీ సరిగ్గానే చేశానని ఎవరూ చెప్పుకోలేరు. అలాగే, నేను టైమ్ మెషీన్‌లో వెనక్కి వెళ్లి, నేను నడిచిన అదే దారిలో మళ్లీ ప్రయాణించలేను కూడా. కానీ నేను భిన్నంగా చేయాల్సిన పనులు పెద్దగా ఏమీ లేవని నాకు అనిపిస్తోంది. అది బాగా చేసిన ఒక పని అని మాత్రమే నేను చెప్పగలను; దాని ఫలాలు చాలా కాలం పాటు అందుతూ ఉంటే చాలా మంచిది, ఒకవేళ అందకపోయినా అది జరగాల్సిన విధానం అదేనని సరిపెట్టుకోవాలి.

ఒక పెద్ద సంస్థలో సానుకూల మార్పుల కొనసాగింపు గురించి చర్చించడం నా లాంటి సాధారణ వ్యక్తికి సాధ్యం కాదు, ఎందుకంటే నేను మేనేజ్‌మెంట్ గురువును కాను. ఈ మార్పులన్నీ సానుకూలమైనవేనా అన్నది కూడా చాలామందికి వివాదాస్పదంగా ఉండవచ్చు. మీరు రోజువారీ మెరుగుదలలకు పూర్తిగా అంకితమైనప్పుడు, ఏది ఎప్పుడు కలిసి ఒక పెద్ద, మెరుగైన ఫలితంగా మారుతుందో పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. ఆ మార్పులను అమలు చేయడంలో, పూర్తి చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉండటం వల్ల, విశాల దృశ్యాన్ని గ్రహించే సామర్థ్యాన్ని మీరు కోల్పోతారు. మీరు చేసిన చిన్న చిన్న పనులు కూడా ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపుతాయని అమాయకంగా ఆశాభావం వ్యక్తం చేయడం మాత్రమే మీరు చేయగలరు.

షేక్‌స్పియర్ రాసిన ‘ది మర్చంట్ ఆఫ్ వెనిస్’ నాటకంలో పోర్షియా పలికిన మాటలను నావిగా చెప్పుకుంటాను – ఈ అసభ్యకరమైన ప్రపంచంలో ఒక మంచి పని ఎంతో కాలం పాటు, ఎంతో దూరం ప్రకాశిస్తూనే ఉంటుంది,

“ఆ చిన్న కొవ్వొత్తి తన కిరణాలను ఎంత దూరం ప్రసరింపజేస్తుందో కదా!”

(ఇంకా ఉంది)

Exit mobile version