[వందే భారత్ రైలు రూపకర్త సుధాంశు మణి అనుభవాల కథనం ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ ను తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]
అధ్యాయం 1: రైల్వేలపై ఉన్న అభిమానానికి అతీతంగా
“పాపా, దేఖో, ఇండియా జైసీ ట్రైన్” (నాన్నా, చూడు, మన భారతదేశపు రైలు లాంటి రైలు), అంటూ, మేము ప్రయాణిస్తున్న రైలు కిటికీలోంచి బయటకు చూస్తూ నా 12 ఏళ్ల కొడుకు ఆశ్చర్యంతో కేకలు వేశాడు.
మేము బెర్లిన్ నుండి పోలాండ్‌లోని వ్రోక్లా (Wroclaw) నగరానికి డ్యుయిష్ బాన్ (జర్మన్ రైల్వేస్) రైలులో వెళ్తుండగా, దారిలో పోలాండ్‌లోని ఒక చిన్న స్టేషన్‌లో మా రైలు ఆగింది. మా ప్లాట్‌ఫారమ్‌కు అవతలి వైపు ఉన్న ట్రాక్‌పై ఒక సాధారణ పెట్టె లాంటి, చూడటానికి అంత అందంగా లేని పోలిష్ రైలు నిలిచి ఉంది. అది బహుశా సోవియట్ కాలం నాటి అవశేషం కావచ్చు. అక్టోబర్ 2012 నుండి అక్టోబర్ 2015 వరకు బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో రైల్వే అడ్వైజర్ (మినిస్టర్)గా పనిచేశాను. భారతదేశం వెలుపల ఒక రైల్వే అధికారికి దక్కే ఏకైక జాయింట్ సెక్రటరీ స్థాయి బాధ్యత ఇదే కావడం విశేషం. ఈ పదవిలో భాగంగా నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ రైల్వే సంస్థలతో, రైల్వే పరిశ్రమలతో సమన్వయం చేసుకోవాల్సి ఉండేది. దీనివల్ల నేను చాలా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు, వారి ఇతర పనులకి, పాఠశాల సెలవులను బట్టి నా భార్య, అలాగే అప్పట్లో 12 ఏళ్ల వయసున్న నా కొడుకు కూడా నాతో పాటు వచ్చేవారు. జర్మనీ, ఇంకా యూరప్‌లోని ఇతర దేశాలలో అత్యాధునికమైన, జిగేల్‌మనే ఆధునిక రైళ్లను చూడటం అలవాటైన నా కొడుకు అలా స్పందించడం ఎంతమాత్రం వింత కాదు. భారతీయ రైల్వేలోని అన్ని రైళ్లను ఒకే గాటన కట్టేస్తూ, కేవలం ఒక చిన్న పిల్లాడు మాత్రమే చేయగలిగినట్లుగా, అతను అనుకోకుండానే తన తండ్రికి నిజాయితీతో కూడిన నిజాన్ని చూపించాడు.
‘ద డబుల్ ఫాల్స్‌హుడ్’ అనే నాటకంలో ఒక పాత్ర ఇలా అంటుంది: “తల్లిదండ్రుల వాక్కు దైవ సమానం, ఎందుకంటే వారి పిల్లలకు వారు స్వర్గపు ప్రతినిధులు.” (“The voice of parents is the voice of gods, for to their children they are heaven’s lieutenants”). ఈ నాటకం షేక్స్‌పియర్ రాసినదిగా కొంతమంది భావిస్తారు. ఇది కల్పితం కావచ్చు, కానీ అది ఇక్కడ అనవసరం. మరి మీ బిడ్డ వాక్కు సంగతి ఏంటి? షేక్స్‌పియర్ ‘ది మర్చంట్ ఆఫ్ వెనిస్’లో లాన్సిలాట్ ద్వారా దీనిని ప్రస్తావిస్తూ, “తన సొంత బిడ్డను అర్థం చేసుకున్న తండ్రే జ్ఞాని” (“It is a wise father that knows his own child.”) అని ప్రకటించాడు.
ఈ ఒక్కసారి నేను జ్ఞానిని అని నేను అనుకుంటున్నాను. దశాబ్దాలుగా నన్ను వేధిస్తున్న విషయాన్ని నా కొడుకు సరిగ్గా చెప్పాడు. మన రైళ్లు ఏడాదికేడాది ఎందుకు ఒకేలా కనిపిస్తాయి? అనాగరికమైన కిటికీలు, తలుపులతో అదే మెటాలిక్ బాక్స్. మారిన ఏకైక విషయం రంగు – గల్ఫ్ రెడ్ నుండి బ్లూ వరకు. ఎయిర్ కండిషన్డ్ కోచ్‌ల పరిచయం నిజంగా ఒక చిన్న మార్పు, కానీ అది నలభై ఏళ్ల క్రితం జరిగింది, ఈ ఏసీ కోచ్‌లు కూడా ఖచ్చితంగా పాత జ్ఞాపకాలనే కలిగి ఉన్నాయి. మేము జర్మనీ నుండి ఒక కొత్త సాంకేతికతను తీసుకువచ్చినప్పుడు రూపాన్ని కొంతవరకు మార్చాము, కానీ ఆ కొత్తదనం, ఇంకా దాని ప్రభావం స్వల్పకాలికమే; మేము ఈ జర్మన్-సాంకేతిక రైళ్లను చాలా పెద్ద సంఖ్యలో తయారు చేస్తున్నాము, కానీ అవి కూడా అదే పాత నిస్తేజమైన రూపాన్ని సంతరించుకున్నాయి. భారతీయ రైల్వేల ప్యాసింజర్ రైళ్లను చూడటం అనేది ఒకే విషయాన్ని మిలియన్ల సార్లు చూసిన ‘గత అనుభూతి’ (déja vu) లాంటిది.
నలభై ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఒక రైల్వే ఉద్యోగి, తెలివితక్కువ ప్రశ్న గురించి మాట్లాడుతున్నాడని మీరు ఆశ్చర్యపోవచ్చు. మీరు దీనిని, ఫలదీకరణం కాని పుప్పొడిలా అర్ధం చేసుకోవాలి. భారతదేశంలో విదేశీ తరహా రైళ్లను చూడాలనే ఆరాటంతో నేను కూడా నా చిన్నతనంలో అదే ప్రశ్నను మోశాను. చాలా మంది పిల్లలలాగే నాకు కూడా చిన్నప్పటి నుంచి రైళ్లంటే చాలా ఇష్టం. నేను నా చిన్నతనంలో విదేశాలకు వెళ్ళలేదు, కానీ పాశ్చాత్య దేశాల రైళ్ల చిత్రాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మన రైళ్లలో అలాంటి ఆకర్షణ, వేగం లేకపోవడం చాలా నిరాశ కలిగించేది. ఆ తర్వాత నేను ఒక ఇంజనీర్‌గా భారతీయ రైల్వేలో చేరి ఈ సమస్యను చూసినప్పుడు, నాకేమీ అర్థం కాలేదు, పైగా అది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. నేను భారతీయ రైల్వే యొక్క ఉన్నత పదవులకు చేరుకున్నప్పుడు, విషయాలను మార్చే సామర్థ్యం ఉన్నప్పటికీ, అత్యంత స్పష్టమైన ప్రణాళికలను కూడా ఇక్కడి అధికార యంత్రాంగం ఆచరణలోకి రానివ్వదని గ్రహించాను. క్షేత్రస్థాయిలో సాధారణ నిర్వహణ మరియు ఆపరేషన్ల నుండి రోలింగ్ స్టాక్ రూపకల్పన మరియు తయారీకి నేను మారినప్పుడు, విషయాలు మరింత స్పష్టంగా అర్థమయ్యాయి.
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు, నిజమైన ఆధునిక రైలు అయిన ‘ట్రైన్ 18’ తయారీ కథను నేను ఈ పుస్తకంలో మీ కోసం వెల్లడించాను. మన దేశానికి పూర్తిగా దేశీయంగా తయారైన ఆధునిక రోలింగ్ స్టాక్ లభించడం ఇదే తొలిసారి. అంటే, కాన్సెప్ట్ నుండి డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, వాలిడేషన్ & టెస్టింగ్ వరకు పూర్తిగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లోనే జరిగింది. ఇది ఒక్కడి కథ మాత్రమే కాదు, భారతదేశంలో మనం కూడా దీనిని సాధించగలమని నిరూపించిన ఒక అంకితభావం గల భారతీయుల బృందం కథ.
నేను నా జీవితాంతం రైల్వే ఉద్యోగిగా ఉన్నాను. నేను ఒక రైల్వే కుటుంబం నుండి వచ్చాను. ఇంటర్మీడియట్ విద్య కోసం లక్నోలోని ఒక బోర్డింగ్ కాలేజీకి వెళ్లే వరకు నేను చిన్న నగరాల్లోని రైల్వే కాలనీలలో నా తల్లిదండ్రులతో కలిసి ఉన్నాను. నేను రైల్వే స్టేషన్లు, రైళ్ల మధ్య పెరిగాను. ఆ తర్వాత, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుండి యూనివర్సిటీ ఆఫ్ రూర్కీకి మారి, చివరికి బీహార్‌లోని జమాల్‌పూర్‌లో ఉన్న ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్‌గా చేరాను. ఆ విధంగా ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్‌లో క్లాస్ I గెజిటెడ్ ఆఫీసర్‌గా నా ప్రయాణం ప్రారంభమైంది. 1981 లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా భారతీయ రైల్వేలో చేరిన తర్వాత, నా పదవీ విరమణ వరకు నేను అదే సర్వీసులో కొనసాగాను. కాబట్టి నేను ఎప్పటికీ ఒక రైల్వే ఉద్యోగిని.
నేను రైల్వే అడ్వైజర్‌గా జర్మనీలోని బెర్లిన్‌లో మూడేళ్లు గడిపాను. నేను అక్కడ నేర్చుకున్న పదబంధాలలో ఒకటి, “Ich verstehe nur Bahnhof”. వాచ్యంగా చెప్పాలంటే, “నాకు రైల్వే స్టేషన్ మాత్రమే అర్థమవుతుంది” అని అర్థం. బహుశా ఇది ఏదైనా ఒక విషయంపై గందరగోళాన్ని లేదా అవగాహన లేకపోవడాన్ని చూపే ఒక వ్యక్తీకరణ. కానీ నేను దీనిని నిజాయితీగా, “Ich verstehe nur Eisenbahn”, అంటే “నాకు రైల్వేలు మాత్రమే అర్థమవుతాయి” అని చెప్పడానికి ఉపయోగించగలను.
భారతీయ రైల్వేకు దాదాపు 170 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, వారసత్వం ఉన్నాయి. ఇది ఎనలేని అభిమానానికి, భావోద్వేగానికి గురిచేసే విషయం, దీనికి మీరు ప్రభావితం కాకుండా ఉండలేరు. చిన్నప్పుడు మీరు చేసిన రైలు ప్రయాణాలను మీరు మర్చిపోగలరా? మిమ్మల్ని ఎప్పుడూ ఆకర్షించేది, ప్రక్క సీటు కాకుండా, కిటికీ సీటే కదా? కిటికీ సీటు కోసం పడిన గొడవ మీకు గుర్తే ఉంటుంది, ఆ కిటికీ గుండా భారతదేశపు అద్భుతాలు, భారతీయుల జీవన విధానపు మాయాజాలం మీ కళ్ల ముందు నుండి కదిలిపోయేవి. రైల్వే స్టేషన్లు, రైళ్లు భారతదేశపు ఒక సూక్ష్మ రూపం. ప్రపంచమంతా మీ మంత్రముగ్ధమైన కళ్ల ముందు కొట్టుకుపోతున్నట్లు, ప్రవహిస్తున్నట్లు అనిపించేది కదూ. లేదూ, ఒక వయోజనుడిగా, భారతీయ రైళ్ళల్లో ప్రయాణించడం అనేది ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకోవడమే కావచ్చు, కానీ మీరు ప్రతి అడుగును ఆస్వాదిస్తారు; ఇక్కడ గమ్యస్థానం కాదు, గమనమే లక్ష్యంగా మారుతుంది. మీ రైలు తలుపు నుండి వెనక్కి తిరిగి చూసినప్పుడు కనిపించే ఆ పాములా మెలికలు తిరుగుతూ సాగిపోయే రైలు దృశ్యాన్ని మీ జ్ఞాపకాల నుండి చెరిపివేయగలరా?
నేపథ్యంలో వినబడే రైలు లయబద్ధమైన శబ్దంతో, విశాలమైన పొలాలు, పల్లెటూరి రోడ్లు, దారిలో వచ్చే చిన్న చిన్న స్టేషన్లలో ఆవిష్కృతమయ్యే అద్భుతమైన దృశ్యాలను చూస్తున్నప్పుడు – మిమ్మల్ని ఆకట్టుకునేది ఆ భారీ రైలు యంత్రాల వైభవం లేదా సాగిపోయే రైలు ప్రయాణపు మధురానుభూతి మాత్రమే కాదు.. భారతీయ నగరాలు, పట్టణాలు, పల్లెల జీవన వైవిధ్యాన్ని, వాటి సజీవ వర్ణాలను భారతీయ రైల్వేలు మన కళ్ళముందు ఉంచే తీరు! కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో కనిపించే నిశ్చలమైన, ఒకేలాంటి దృశ్యాలు కావు ఇవి, ఎంతో ఉత్సాహాన్ని కలిగించే ఆకర్షణీయమైన దృశ్యాలు. చిన్న చిన్న సంతోషాలు. కరుణ మరియు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలు. చాలా సాధారణమైనవి, కొండోకొచో ప్రాధాన్యత లేనివిగా అనిపించినా, వెంటనే మనసును కదిలించే విశేషాలు. ఒకచోట నిర్మానుష్యంగా, మరోచోట జనసందోహంతో. ఒకవైపు సున్నితంగా, మరోవైపు దృఢంగా. ఒక క్షణంలో వేడుక, మరో క్షణంలో విషాదం. పోరాటం, శ్రమ, బద్ధకం, ఇంకా సోమరితనం. కష్టపడి పనిచేసేవారు, పనిని ఎగ్గొట్టేవారు. ఎంతో సరళంగా ఉంటూనే, ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది.
ఎంతో హృద్యమైన ప్రేమకథలు, గోళ్లు కొరుక్కునేలా చేసే సస్పెన్స్ థ్రిల్లర్లు, పొట్టచెక్కలయ్యే కామెడీలు మరియు శ్రావ్యమైన మధుర గీతాలు.. ఇవన్నీ రైళ్లు, రైల్వే స్టేషన్లతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్న తీరును మీరు ఎప్పుడైనా మర్చిపోగలరా? అలాగే, రైల్వే స్టేషన్ అనేది ఒక గొప్ప సమానత్వ వేదిక. ప్లాట్‌ఫారమ్‌పై ఒకే రైలు కోసం అత్యంత పేదవాడి నుండి అత్యంత ధనవంతుడి వరకు అందరూ కలిసి వేచి ఉంటారు.
భారతీయ రైల్వేలోని ప్రయాణ అనుభవాలు ప్రజల మనస్సులలో బలంగా ముద్రించుకుపోయాయి. పగటిపూట కువకువలాడుతూ, రాత్రిపూట ఈలలు వేస్తూ, పర్వతాలను చీల్చుకుంటూ సొరంగాల గుండా వెళ్తూ లేదా మైదానాలను సున్నితంగా తాకుతూ, నిద్రిస్తున్న గ్రామాలను, సందడిగా ఉండే పట్టణాలను కలుపుతూ.. ఇలా దేశ నలుమూలలా విస్తరించిన ఉక్కు పట్టాలపై విరామం లేకుండా సాగిపోతూ, స్టేషన్లలో క్షణకాలం పాటు సేదతీరే రైళ్ల దృశ్యాలు మన కళ్లముందు కదలాడుతుంటాయి.
రైల్వే స్టేషన్లలో ఉండే పసుపు రంగు బోర్డులు ఆ ప్రదేశం యొక్క గుర్తింపును చాటుతాయి. రంగురంగుల దుస్తుల కలయిక, రైళ్ల సందడి, వ్యాపారుల అరుపులు, రికార్డ్ చేయబడిన అనౌన్స్‌మెంట్లు, వీటన్నింటి మధ్య అప్పుడప్పుడు వినిపించే లోకోమోటివ్‌ల తీక్షణమైన హారన్ శబ్దాలు, స్థానిక వంటకాల గుమగుమలు మరియు ఇత్తడి బకిల్స్ ఉన్న ఎరుపు రంగు షర్టులు వేసుకున్న కూలీలు. వీరితో పాటు ఎప్పుడూ కనిపించే టికెట్ కలెక్టర్లు, స్టేషన్ మాస్టర్లు వంటి యూనిఫామ్ ధరించిన రైల్వే అధికారులు. స్టేషన్‌లో కనిపించే ఈ ప్రత్యేకమైన దృశ్యాలు, శబ్దాలు, రంగులు మరియు రుచులు మన దేశం యొక్క నిరంతర క్రమబద్ధతను, ఇక్కడి విరుద్ధమైన జీవన శైలిని ప్రతిబింబిస్తాయి.
షేక్స్‌పియర్ ‘ది టెంపెస్ట్’ నాటకంలో ఆంటోనియోతో ఇలా చెప్పిస్తాడు: “బావిలో కప్పల్లా ఇంట్లోనే కూర్చునే జ్ఞానహీనులు ప్రయాణీకులను తప్పుపట్టవచ్చు. కానీ, లోకాన్ని చుట్టివచ్చే ప్రయాణీకులు ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు” (“Travellers never did lie though fools at home condemn them”.). అవును, భారతీయ రైల్వే ప్రయాణికులు ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని కళ్లారా చూస్తారు. ఈ అద్భుతాలను అభినందించలేనివారు, బహుశా వారి సంకుచిత పరిధులకు, వైరుధ్యాలకు అతీతంగా ఏదీ చూడలేని వాస్తవికతతో మొద్దుబారిపోయారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు.
దేశానికి జీవనాడి అయిన భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు తొమ్మిది వందల కోట్ల మంది ప్రయాణికులను రవాణా చేస్తుంది. ఇది ప్రస్తుత ప్రపంచ జనాభా కంటే 1.2 రెట్లు ఎక్కువ! అంటే భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా భారతీయ రైల్వేలో ప్రయాణించినట్లు లెక్క! గత 170 సంవత్సరాలుగా ఈ సంస్థ, మొదట భారతదేశంలో ఐక్యతకు దారితీసిన మేల్కొలుపుకు, ఆ తర్వాత దేశ స్వాతంత్ర్యానికి, దేశ అభివృద్ధికి ఎంతో కీలకమైన సాధనంగా నిలిచింది.
భారతీయ రైల్వే గురించి ఎంతో గొప్ప పేరున్న, ప్రతిభావంతులైన రచయితలు ఎంతో రాశారు, ఇంకా రాస్తూనే ఉన్నారు. కానీ నా పుస్తకం ఈ చరిత్ర లేదా వారసత్వం గురించి కాదు. ఇది నాలోని నిరాశ మరియు ఆవేదన గురించి. మన జాతీయ రవాణా సంస్థకు ఇంతటి మహోన్నతమైన శక్తి ఉన్నప్పటికీ, దాని వేలాది రైళ్లు ఒకదానికొకటి భిన్నంగా ఎందుకు కనిపించవని ఎవరైనా ఎందుకు ఆశ్చర్యపోతారనే ఆలోచన గురించి. ఈ నిరాశలోనే నా కథకి బీజం ఉంది, ఇక ఆ తర్వాత నా కథనం కొనసాగింది.
ఈ నిరాశ, ఆవేదన అనే భావన మీలో చాలా మందికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. భారతీయ రైల్వే అనేది చాలా మంది ప్రేమించే, కొందరు ప్రేమించడానికి ఇష్టపడే, మరికొందరు ద్వేషించడానికి ఇష్టపడే, కొద్దిమంది నిజంగానే ద్వేషించే ఒక వ్యవస్థ.. కానీ ఎవరూ దీనిని నిర్లక్ష్యం చేయలేరు. మన రైళ్ల గురించి ఈ ‘ఒకేలాంటి రూపం’ అనే ఆలోచన ఏదో ఒక సమయంలో మీకూ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కవి భరత్ భూషణ్ పంత్ కూడా, వేరే సందర్భంలో అయినప్పటికీ, ఇలా అన్నారు:
ఏక్ జైసే లగ్ రహే హైఁ సభీ చెహ్రే ముఝే
హోష్ కీ యే ఇంతెహా హై యా బహుత్ నషే మే హూఁ
(అన్ని ముఖాలు నాకు ఒకేలా కనిపిస్తున్నాయి; ఇది నేను స్పృహలోనే ఉన్నాననేదానికి పరీక్షనా? లేదా నేను విపరీతమైన మత్తులో ఉన్నానా?)
భారతీయ రైల్వేలకి ఏమైంది? వేలాది ఒకే రకమైన రైళ్లు ఉన్న ఇంత పెద్ద వ్యవస్థ, మళ్లీ అలాంటి పాతబడిన రూపంలోనే ఉండే మరిన్ని వేల రైళ్లను ఎందుకు తయారు చేస్తూ పోతోంది?
నేను ఈ రచనను జనవరి 2019 లో, నా పదవీ విరమణ చేసిన ఒక నెలలోనే రాయడం ప్రారంభించాను. ఇదంతా, అనేక పత్రికలు, జర్నల్స్ నన్ను ‘ట్రైన్ 18’ తయారీపై ఒక కథనాన్ని రాయమని అభ్యర్థించినప్పుడు ప్రారంభమైంది. కానీ ఎక్కడ ప్రారంభించాలో నాకు తెలియలేదు. అయినప్పటికీ, నేను కొన్ని వ్యాసాలు రాశాను, అవి వెంటనే ప్రచురితమయ్యాయి. కొన్ని మ్యాగజైన్లు నా ఇంటర్వ్యూను కూడా ప్రచురించాయి. దీనివల్ల మొదటి నుండి కూర్చుని రాయడానికి ఎక్కువ కష్టపడకుండానే కంటెంట్ సులభంగా అందుబాటులోకి వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. కానీ వందేభారత్ రూపకల్పనకు దారితీసిన గాథను కేవలం కొన్ని వ్యాసాలలో వివరించడం అంత సులభం కాదని నేను త్వరలోనే గ్రహించాను. దానికి మరింత వివరణ, మరింత స్థలం అవసరమైంది. అందువల్ల, నేను మూతపడే స్థితిలో ఉన్న నా బ్లాగ్ anindecisiveindian.blogspot.com ను పునరుద్ధరించాను, మరింత అర్థవంతంగా రాయడం ప్రారంభించాను. నేను దాదాపు మూడు నెలల పాటు రాయడం కొనసాగించాను, అంటే ముప్పైకి పైగా బ్లాగ్ పోస్ట్‌లు రాశాను. కానీ త్వరలోనే, ఆ రైలు యొక్క భవిష్యత్తు మరియు గతానికి సంబంధించి స్పష్టమైన ప్రతికూలత, అవినీతి పూరిత చర్చలు తెరపైకి వచ్చాయి, దాంతో నేను రాయాలనే ఉత్సాహాన్ని కోల్పోయాను. సరే, వాటన్నింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి, మార్చి 2020 లో కరోనా భయం వల్ల మనమందరం ఇళ్లలోనే లాక్‌డౌన్ అయినప్పుడు, నిశ్శబ్దం అనేది పరిష్కారం కాదని నేను గ్రహించాను. మళ్లీ రాయడానికి అవసరమైన ప్రేరణను, ఆపై వేగాన్ని పుంజుకున్నాను.
మనం చేయాల్సిన లేదా చేయకూడనివైన వెయ్యి విషయాల గురించి ఇప్పుడు మాట్లాడద్దు. మనం కేవలం ఈ ఆధునిక రైళ్ల గురించి మాత్రమే చూద్దాం, మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, రైల్వే పరిభాషలో వీటిని ‘ట్రైన్ సెట్స్’ (Train Sets) అంటారు. ఇంతకీ ట్రైన్ సెట్ అంటే ఏమిటి? ఒక సాధారణ రైలు అనేది కోచ్‌లు మరియు ఒక చివర లేదా రెండు చివర్లలో ఉండే లోకోమోటివ్ (సాధారణ భాషలో ఇంజిన్) తో రూపొందించబడుతుంది. అవసరాన్ని బట్టి (ఉదాహరణకు స్టేషన్లలో రైలు రివర్స్ చేయడానికి లేదా గమ్యస్థానంలో మెయింటెనెన్స్ కోసం) ఈ ఇంజిన్‌ను జోడించడం లేదా విడదీయడం చేయాల్సి ఉంటుంది. కానీ ‘ట్రైన్ సెట్’ అనేది శాశ్వతంగా ఒకదానికొకటి అనుసంధానించబడిన కోచ్‌ల సమూహం. ఇందులో రైలుకు శక్తినిచ్చే పరికరాలు లేదా బ్రేకింగ్, లైటింగ్ మరియు ఎయిర్ కండిషనింగ్ వంటి అన్ని పరికరాలు రైలు చాసిస్ (అడుగు భాగం) క్రిందనే అమర్చబడి ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి లోకోమోటివ్‌లు ఉండవు.
సాధారణ రైలుతో పోలిస్తే ట్రైన్ సెట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి: పవర్ పరికరాలు కేవలం ఒక ఇంజిన్‌కే పరిమితం కాకుండా, రైలు అంతటా విస్తరించి ఉండటం వల్ల ప్రయాణం వేగవంతంగా ఉంటుంది. యాక్సిలరేషన్ (వేగాన్ని అందుకోవడం), డిసిలరేషన్ (వేగాన్ని తగ్గించడం) చకచకా సాగుతాయి. ఇంజన్, బోగీలు వేర్వేరు డిపోలలో నిర్వహించబడే సాధారణ రైలులా కాకుండా, ట్రైన్ సెట్ మొత్తం ఒకే యూనిట్‌గా సులువుగా నిర్వహించబడుతుంది. గమ్యస్థానంలో లేదా ఇతర చోట్ల ఇంజిన్‌ను మార్చాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఇది టెర్మినల్స్ వద్ద విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. ఒక క్యాబ్ నుండి మరొక క్యాబ్ వరకు రైలులోని మొత్తం స్థలం ప్రయాణికుల సౌకర్యాల కోసమే అందుబాటులో ఉంటుంది. మన పాత రైళ్లలో ఉండే కదిలే వెస్టిబ్యూల్స్ లాగా కాకుండా, ఇందులో కోచ్‌ల మధ్య వెడల్పైన గ్యాంగ్‌వేలు ఉంటాయి. ఆధునిక ట్రైన్ సెట్ పొడవునా ఒక చివర నుండి మరో చివరకు సులభంగా నడవవచ్చు. సాధారణ రైళ్లలో లైటింగ్, ఎయిర్ కండిషనింగ్ మొదలైన వాటి కోసం విద్యుత్‌ను సరఫరా చేసే జనరేటర్ కార్లు (Power cars) అదనంగా ఉంటాయి. కానీ ట్రైన్ సెట్‌లో ఈ పరికరాలన్నీ కిందనే అమర్చబడి ఉంటాయి. ఇంజిన్లు మరియు పవర్ కార్లు లేకపోవడం వల్ల ప్రయాణికుల సంఖ్యతో పోలిస్తే రైలు బరువు తగ్గి, ఇది మరింత ఇంధన సామర్థ్యంతో పనిచేస్తుంది. లోకోమోటివ్‌లు, పవర్ కార్లు లేకపోవడం వల్ల, రైలులోని అన్ని బోగీలు ఒకే విధమైన రూపాన్ని కలిగి ఉండి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆధునిక రైళ్ల గురించి మన చిన్ననాటి కలలను నిజం చేసేలా కనబడుతుంది.
ట్రైన్ సెట్ స్పష్టమైన ప్రయోజనం ఏమిటంటే ఆపరేటింగ్ సౌలభ్యం, ఇంకా ప్రయాణ సమయం తగ్గడం. గత 25-30 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా ఇటువంటి రైళ్లకు మారిపోవడం, పాత సంప్రదాయ రైళ్లను పక్కన పెట్టడం ఒక ధోరణిగా మారింది. అభివృద్ధి చెందిన లేదా పెద్ద రైల్వే వ్యవస్థలు ఉన్న అన్ని దేశాలు – ఉదాహరణకు ఐరోపా (ముఖ్యంగా పశ్చిమ ఐరోపా), జపాన్ గత మూడు దశాబ్దాలుగా, అలాగే చైనా, దక్షిణ కొరియా, ఇంకా అనేక మధ్య ఆదాయ దేశాలు గత 15 సంవత్సరాలుగా మీడియం మరియు హై-స్పీడ్ సేవల కోసం కేవలం ట్రైన్ సెట్లను మాత్రమే ఉపయోగిస్తున్నాయి. భారతదేశంలో కూడా ఇటువంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టడం చాలా అర్థవంతమైనది. ఎందుకంటే మనది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్యాసింజర్ రైల్వే నెట్‌వర్క్. ఇది రైళ్లను సమయపాలనతో నడపడమే కాకుండా, మరిన్ని ఎక్కువ రైళ్లను నడపడానికి సహాయపడుతుంది. భారతదేశంలో రైలు ప్రయాణానికి ఉన్న విపరీతమైన ఆదరణ కారణంగా సమయపాలనపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన నెట్‌వర్క్ పూర్తిగా రద్దీతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో, ప్రయాణ సమయాన్ని తగ్గించే ఏ రోలింగ్ స్టాక్ అయినా మన అత్యంత ముఖ్యమైన అవసరాన్ని తీరుస్తుంది. మితిమీరిన రద్దీతో సతమతమవుతున్న మన రైల్వే వ్యవస్థకు ఈ ట్రైన్ సెట్స్ భారీ ఉపశమనాన్ని ఇస్తాయి.
ఈ స్పష్టమైన ప్రయోజనాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ కాన్సెప్ట్‌కు లభించిన దాదాపు పూర్తి ఆమోదం నేపథ్యంలో, భారతదేశంలో కూడా ‘ట్రైన్ సెట్ల’ వైపు మారాల్సిన అవసరం అనేది ఎటువంటి చర్చకూ తావులేని విషయం. మరి అలాంటప్పుడు మన దగ్గర అస్సలు ఇలాంటి రైళ్లు ఎందుకు లేవు? దశాబ్దాలుగా, ఏళ్ల తరబడి అదే రకమైన నిస్తేజమైన రైళ్లు ఎందుకు ఉన్నాయి? ఎందుకు ఎప్పుడూ ఒకేలాంటి రూపం? స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా, ఇటువంటి రైళ్లను తయారుచేసే సామర్థ్యం మనకు లేదా?
ఈ ప్రశ్నలకు సమాధానం భారతీయ రైల్వేలకి అంత గౌరవప్రదమైనది కాదని చెప్పడానికి నేను విచారిస్తున్నాను. మనం దీని గురించి దశాబ్దాలుగా చర్చిస్తూనే ఉన్నాం, కానీ శాఖల మధ్య ఉన్న ఆధిపత్య పోరాటాలు, వివాదాల వల్ల ఎక్కడికీ చేరుకోలేకపోయాం. రైల్వేలో కోచ్‌లను నిర్వహించే ఒక విభాగం ఉంటే, లోకోమోటివ్‌లను నిర్వహించే మరో విభాగం ఉంది. ఇప్పుడు, ఒక ‘ట్రైన్ సెట్’ అనేది అటు కోచ్ కాదు, ఇటు లోకోమోటివ్ కాదు. మరి అలాంటప్పుడు దీనిని ఎవరు తయారు చేయాలి? ఈ రైలు ఎవరి పరిధిలోకి వస్తుంది? ఈ అంతర్గత పోరాటమే వారి ప్రధాన ఆందోళనగా మారింది, దేశ అవసరాలు ఏమైపోయినా వారికి అనవసరం. ఆ తర్వాత, భారీ ఖర్చుతో సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసుకుంటూ ఈ రైళ్లను విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని చూసిన ఒక ఇంపోర్ట్ లాబీ ఉంది. మీ అందరికీ తెలిసినట్లుగా, దిగుమతి అనేది చాలా మందికి లాభదాయకమైన విషయం, కానీ ఏదేమైనా, ట్రైన్ సెట్స్ వద్దు అనుకున్న మరో వర్గం ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంది. నిర్ణయాధికారాలు తీసుకునే స్థానాల్లో ఉన్న నా సహచరులు మరియు సీనియర్లలాగే, ఈ సమస్యను విశ్లేషించేటప్పుడు పూర్తిగా నిజాయితీగా వ్యవహరించనందుకు నేను కూడా అంతే దోషిని అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. భారతీయ రైల్వే యొక్క ప్రధాన కేంద్ర ఆర్&డి విభాగమైన లక్నోలోని రీసెర్చ్, డిజైన్ & స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) లో డైరెక్టర్‌గా, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నేను కూడా ఈ సిగ్గుచేటైన అంతర్గత పోరాటంలో భాగమయ్యాను. అయినప్పటికీ, శాఖాపరమైన విధేయతలు నా విచక్షణను పూర్తిగా కమ్మేయలేదు. భారతదేశంలో ట్రైన్ సెట్ల యొక్క అత్యవసర అవసరాన్ని నేను అంతర్గతంగా గ్రహించడమే కాకుండా, నా మాట వినే ప్రతి ఒక్కరికీ ఒక విషయం స్పష్టం చేశాను – భారతదేశంలోకి ట్రైన్ సెట్లు ఎప్పుడో ఒకప్పుడు రావడం ఖాయం, కాబట్టి మనం ఈ కాలయాపనను, చిన్నచిన్న సాకులు వెతకడాన్ని పక్కనబెట్టి, మన అంతర్గత వైరుధ్యాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూ వీటిని సాధించే దిశగా పనిచేయాలి. ఈ వివాదాలకు ఒక పరిష్కారాన్ని కనుగొని, దేశానికి ఒక ఆధునిక రైలును అందించడానికి మనమందరం కలిసి రావాలని నేను ఉన్నతాధికారులకు చాలాసార్లు విజ్ఞప్తి చేశాను. కానీ పరస్పర వినాశకర ప్రయోజనాల ఈ యుద్ధభూమిలో నాది బహుశా ఒంటరి గొంతుక అయి ఉండవచ్చు. ఒక ఒంటరి ఆశావహ గొంతుక, భారతదేశం కోసం ట్రైన్ సెట్లను నిర్మించాలనే నాకున్న ఏదో ఒక చిన్న కల కేవలం ఒక కలగానే మిగిలిపోయింది.
కవి మునీర్ నియాజీ ఇలా చెప్పినప్పటికీ:
ఖ్వాబ్ హోతే హైఁ దేఖ్నే కే లియే
ఉన్ మే జా కర్ మగర్ రహా నా కరో
(కలలు కనడానికే ఉంటాయి, కానీ కలలలోనే బ్రతకకూడదు.)
నేను మాత్రం నిజంగానే ఆ కలలో బ్రతుకుతున్నాను.
ఆగస్టు 2016 లో, భారతీయ రైల్వేలో జనరల్ మేనేజర్ (జిఎమ్) గా పోస్టింగ్ పొందడానికి మరో ఇద్దరు సహచరులతో పాటు నేను కూడా అర్హుడినయ్యాను. జనరల్ మేనేజర్ పదవి అనేది వినడానికి సాధారణంగా అనిపించినా అది అంత సామాన్యమైనది కాదు; భారతీయ రైల్వేలలో అది ఒక గొప్ప వ్యవస్థ లాంటిది. మీ రైల్వే కెరీర్ అంతటా, మీ పని జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు జిఎమ్ ఒక సంజీవని లాంటి వారని మీరు భావిస్తారు. వ్యవస్థలో ఏదైనా గణనీయమైన మార్పు తీసుకురావడానికి, లేదా మీరు మార్పును కోరుకునే రకం కాకపోతే కేవలం ఆ పదవి ఇచ్చే అధికార ఫలాలను, ప్రయోజనాలను ఆస్వాదించడానికైనా మీ కెరీర్‌లో ఈ మైలురాయిని చేరుకోవాలని మీరు ఆశిస్తారు. భారతీయ రైల్వేల యొక్క సాంప్రదాయ యంత్రాంగ వ్యవస్థలో ఒక జిఎమ్ దాదాపు ఒక జమీందారు లాంటివాడు. అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. జోనల్ పరిధిని చూసే ఓపెన్ లైన్ పోస్ట్ లాగా కాకుండా, ప్రొడక్షన్ యూనిట్ (పియు – అంటే ఒక పెద్ద ఉత్పాదక కర్మాగారం) జిఎమ్ పరిధి చాలా చిన్నది, అయితే అది ఎప్పుడూ పనులతో బిజీగా ఉంటుంది. ఆ సమయంలో భారతీయ రైల్వేలోనే అతిపెద్ద కోచ్ తయారీ కర్మాగారమైన చెన్నైలోని ఐసిఎఫ్‌లో జిఎమ్ పదవి ఖాళీగా ఉంది, నాకు ఒక ఫ్యాక్టరీలో లేదా ఓపెన్ లైన్ జోన్‌లో పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. నా లక్ష్యం ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు; నేను నా కలను నిజం చేసుకోవాల్సి ఉంది. అందుకే నన్ను ఐసిఎఫ్‌కి కేటాయించమని అభ్యర్థించాను. ఓపెన్ లైన్ జోన్లలో పోస్టింగ్ కోసం సాధారణంగా వచ్చే విజ్ఞప్తులతో సతమతమయ్యే అప్పటి రైల్వే బోర్డు ఛైర్మన్ ఎ.కె.మిట్టల్‌కు నా ఈ అభ్యర్థన ఆశ్చర్యం కలిగించింది. ఓపెన్ లైన్ పోస్టింగ్ నాకు ఒక జమీందారీ వైభవాన్ని ఇవ్వవచ్చు కానీ నా మనస్సు మరెక్కడో ఉందని, నేను ఒక ప్రొడక్షన్ యూనిట్‌ను ఎంచుకోవడం ద్వారా ఆయన పనిని సులభతరం చేస్తున్నానని నేను ఆయనకు చెప్పాను. మిట్టల్ గారు ఊరట చెంది, సంతోషంగా అంగీకరించారు. నేను త్వరలోనే ఐసిఎఫ్‌లో జనరల్ మేనేజర్‌గా చేరాను.
ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు, అపోహలు మరియు ఆశావాదంతో నేను అక్కడ అడుగుపెట్టాను, కానీ నా మనస్సులో పదే పదే మారుమోగిన విషయం ఇదే:
అబ్ ఫలక్ యూన్ కరే కీ సచ్ యే ఖ్వాబ్ హో జాయే
బర్సోన్ కా మేరా షఫక్ అబ్ ఆఫ్తాబ్ హో జాయే
(ఇకనైనా ఆకాశం ఈ కలను నిజం చేయాలి, ఇన్నేళ్ల నా సంధ్యా సమయం తర్వాత, సూర్యుడు ప్రకాశించాలి.)
(ఇంకా ఉంది)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
