Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే భారత్ – ట్రైన్ 18 కథ-20

[వందే భారత్ రైలు రూపకర్త సుధాంశు మణి అనుభవాల కథనం ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ ను తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]

అధ్యాయం 19 రైలుకు ప్రాణాధారమైన విభాగాలు

ఇంతకుముందు నేను కొన్ని డిజైన్ అంశాల గురించి ప్రస్తావించాను. కానీ, మా డిజైన్ ప్రయత్నానికి అసలైన గుండెకాయ వంటి – లేదా గుండెకాయల వంటి విభాగాల గురించి చెప్పడం మర్చిపోయాను. నా దృష్టిలో, ట్రైన్ 18 డిజైన్ అభివృద్ధిలో అత్యంత కీలకమైన విభాగాలు ముఖ్యంగా మూడు ఉన్నాయి: 3-ఫేజ్ IGBT ప్రొపల్షన్ సిస్టమ్, 180/160 కి.మీ./గం. వేగంతో నడవడానికి వీలైన మోటరైజ్డ్ బోగీలు, ఇంకా బ్రేక్ సిస్టమ్. ఈ విభాగాలలో భాగస్వామ్య తయారీ కంపెనీల పాత్ర అద్భుతమైనది.

3-ఫేజ్ ప్రొపల్షన్ సిస్టమ్ రంగంలో హైదరాబాద్‌కు చెందిన ఒక భారతీయ కంపెనీ అద్భుతాలు సృష్టించింది. ఈ కంపెనీ ఎల్లప్పుడూ బలమైన పరిశోధన,   అభివృద్ధి (R&D) పనులను నమ్ముతుంది; రైలు ప్రొపల్షన్, దానికి అనుబంధ రంగాలలో తమ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఎంతో సమర్థులైన ఇంజనీర్ల బృందాన్ని సంవత్సరాల తరబడి నియమించింది. దేశంలోని పేరెన్నికగన్న బహుళజాతి సంస్థలు అందించే వ్యవస్థలతో పోలిస్తే వీరి ఉత్పత్తులు మరింత సమర్థవంతమైనవిగా, నమ్మదగినవిగా నిరూపితమయ్యాయి.  వీరి రాకతో లోకోమోటివ్‌లు, సెల్ఫ్-ప్రొపెల్డ్ వాహనాల ప్రొపల్షన్ సిస్టమ్ ధర కూడా సంవత్సరాలుగా తగ్గుతూ వచ్చింది. అదృష్టవశాత్తూ, ట్రాక్షన్ మోటార్లు, వాటి క్లిష్టమైన నియంత్రణ వ్యవస్థలతో సహా ప్రొపల్షన్ సిస్టమ్ ఆర్డర్‌ను వారు బహిరంగ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారానే దక్కించుకున్నారు.

పోటీదారులు అడిగే సమయంలో ఒక చిన్న భాగంలోనే వారు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను అందించారు. ప్రధానంగా వారి సామర్థ్యాల ఆధారంగానే, ప్రొపల్షన్ సిస్టమ్, కంట్రోల్స్ విభాగంలో మనం దాదాపు లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పగలము. మేము నిర్దేశించిన అధిక స్థాయి త్వరణాన్ని (high levels of acceleration) సాధించడానికి రైలు ప్లాట్‌ఫారమ్ కింద తగినంత శక్తిని నింపేలా ఈ వ్యవస్థ ఉండాలి. దీనికి తోడు, అత్యాధునిక బ్రేకులు, తలుపులు, ఎయిర్ కండిషనింగ్ వంటి అనేక అనుబంధ వ్యవస్థలను అనుసంధానించే బాధ్యత కూడా వారిపైనే ఉంది. వారు నిజంగానే ఆ పనికి తగినవారని నిరూపించుకున్నారు; మనం త్వరలోనే మాట్లాడుకోబోయే ఆ ప్రసిద్ధ ట్రాన్స్‌ఫార్మర్లు మినహా మిగిలిన అన్ని పరికరాలు సమయానికి సిద్ధమయ్యాయి, మా డిజైన్ బృందంతో నిరంతర సంప్రదింపుల వల్ల పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోయాయి. ఐ.సి.ఎఫ్.లో మేము కేవలం ట్రైన్ 18 కోసమే కాకుండా, ట్రైన్ 18 రెండు చిన్న చెల్లెళ్లతో సహా మరెన్నో ఉత్పత్తుల విషయంలో మా లక్ష్యాలను చేరుకోవడానికి, వారిని ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి మామూలుగా కంటే ఒక అడుగు ముందే వేశాము. ఈ కంపెనీలో ఉన్న అసాధారణ ప్రతిభను నేను చాలా కాలం క్రితమే గుర్తించాను, వారిని మరింత గొప్ప విజయాల వైపు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నాను; అలా చేయడంలో నాకు ఏదో స్వార్థం ఉండి ఉంటుందని చాలామంది మీతో చెబుతారు. అవును, నిజమే! ఒక భారతీయ కంపెనీ (లేదా కంపెనీలు) తమను తాము సవాలు చేసుకుంటూ, తమ సొంత గడ్డ నుండే ప్రపంచ స్థాయి ఉత్పత్తిని మాకు అందించాలన్నదే నా స్వార్థం.

నేను ఐ.సి.ఎఫ్. కి వచ్చినప్పుడు ఈ కంపెనీకి ‘మిత్రుడు’ అనే ముద్రతోనే వచ్చాను, కానీ నా మనసులో ఎలాంటి అవినీతి లేదా నిజాయితీ లేని ఉద్దేశాలు లేనప్పుడు ఆ మాటలు నన్ను ఎందుకు ప్రభావితం చేయాలి? శతాబ్దాల క్రితం మహాకవి షేక్స్‌పియర్ చెప్పిన బలమైన కారణాలే బలమైన చర్యలకు దారితీయాలి అనే ఒక సాధారణ ఆలోచన నుండి నేను బలాన్ని పొందాను; షేక్స్‌పియర్ రాసిన హెన్రీ IV నాటకంలో హాట్‌స్పర్ ఏమంటాడో గుర్తుందా, “ఓహ్, ఒక కుందేలును బెదిరించడం కంటే ఒక సింహాన్ని నిద్రలేపడానికే రక్తం ఎక్కువగా ఉడుకెక్కుతుంది!”.  2000వ దశకం ప్రారంభంలో, వారు కేవలం ఎలక్ట్రానిక్ స్పీడ్ ఇండికేటర్ల తయారీదారుగా మాత్రమే తెలిసిన రోజుల్లోనే, ఈ కంపెనీలో నిద్రాణంగా ఉన్న ఆ సింహాన్ని నేను చూశాను. అల్పమైన, లోతులేని సందేహప్రాణులు, పుకార్లు పుట్టించే వారి భయంతో నేను సరైన పని చేయకుండా ఆగిపోయి ఉంటే అది నాకు సిగ్గుచేటు అయ్యేది. అదృష్టవశాత్తూ, చిల్లర మనుషుల, తెలివితక్కువ వారి, బాధ్యతారహితుల కుయుక్తులకు, తీర్పులకు నేను ఎప్పుడూ లొంగలేదు. నేడు వారి నిరంతర విజయాల వల్ల మన దేశం మరింత సంపన్నమైంది. దురదృష్టవశాత్తూ, ప్రభుత్వ వ్యవస్థలో ఒక మంచి విషయాన్ని మీరు నిజంగానే అణచివేయగలరు. కానీ అదృష్టవశాత్తూ, గత పదిహేనేళ్లుగా ఈ కంపెనీ సాగించిన అద్భుతమైన ప్రయాణం కారణంగా, ఈ కంపెనీ యొక్క అమోఘమైన సామర్థ్యాన్ని ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్మే విజ్ఞులైన రైల్వే అధికారులు ఎందరో ఉన్నారు. మేము వారిపై అపారమైన నమ్మకం ఉంచామని, ట్రైన్ 18 తయారీలో వారి అద్భుతమైన కృషి తాలూకు కీర్తి ప్రతిష్ఠలలో మేము కూడా పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం సరిపోతుంది. ఫ్రాన్స్ నుండి రావాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లు మినహా, మిగిలిన అన్ని అభివృద్ధి, సరఫరా పనులు దాదాపు షెడ్యూల్ ప్రకారమే జరిగాయి.

ట్రాన్స్‌ఫార్మర్ల సకాలంలో సరఫరాపై ఒక ప్రశ్నార్థకం ఉందని తెలిసి మేము తీవ్ర నిరాశకు గురయ్యాము. అంతకుముందు నియమించిన భారతీయ కంపెనీ వేగాన్ని అందుకోలేకపోవడంతో, వారిపై ఇంకా ఆధారపడితే మొదటికే మోసమని భావించి, భారతదేశంలో కూడా పనిచేస్తున్న ఒక ఫ్రెంచ్ కంపెనీకి ట్రాన్స్‌ఫార్మర్లను అభివృద్ధి చేసే బాధ్యతను అప్పగించాల్సి వచ్చింది. ఈ ఫ్రెంచ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత, త్వరగా సరఫరా చేయాలని ఒత్తిడి తెచ్చేందుకు మేము వారిని ఒక అత్యవసర సమావేశానికి పిలిచి, వారిపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించాము. ఆ బృందానికి నాయకత్వం వహించిన మహిళ కనురెప్ప కూడా ఆర్పకుండా తన పట్టు వీడలేదు. ఆమె బృందం తమ అసలు పరిస్థితిని నిక్కచ్చిగా వివరించి, మేము విధించిన అసాధ్యమైన గడువులను తాము అందుకోలేమని తేల్చి చెప్పింది. మేము ఆ చేదు నిజాన్ని దిగమింగక తప్పలేదు, దాంతో ప్రాజెక్ట్ కొంతకాలం పాటు మందగించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

180/160 కి.మీ./గం. వేగంతో నడవడానికి అనువైన పూర్తిస్థాయి సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్లతో కూడిన మోటరైజ్డ్ బోగీలను అభివృద్ధి చేయడం ఒక పెద్ద సవాలు. రైలు భద్రత, ప్రయాణ అనుభవం, ఇంకా వేగ సామర్థ్యానికి బోగీనే కీలకం. సామాన్య ప్రజలు రైలు పెట్టెను (కోచ్) ఉద్దేశించి ‘బోగీ’ అనే పదాన్ని వాడుతుంటారు; కానీ నిజానికి బోగీ అంటే కోచ్ బాడీని మోసే వాహకం, సాధారణ ప్రయాణికుడి కంటికి అది అంతగా కనిపించదు. ఇది రైలుకు గుండెకాయ వంటిది, ఇందులోనే దాని డ్రైవ్ సిస్టమ్, గైడెన్స్ మెకానిజం, సస్పెన్షన్ ఏర్పాట్లు ఉంటాయి; ఇది వెహికల్ బాడీకి ఆధారాన్నిచ్చే ఒక చట్రం/ఛాసిస్ కలిగిన ట్రక్, ఇది చక్రాలను మోస్తుంది కాబట్టి, చక్రాల నుండి వచ్చే ట్రాక్షన్ మరియు బ్రేకింగ్ శక్తి దీని నిర్మాణం, పరికరాలు, విడిభాగాల ద్వారా రైలుకు బదిలీ అవుతుంది. భారతీయ రైల్వేలో మొట్టమొదటిసారిగా మేము ఒక కొత్త బోగీని మొదటి నుండి డిజైన్ చేయాల్సి వచ్చినందున ఒక కన్సల్టెంట్‌ను నియమించుకున్నాము. చాలా తక్కువ దిగుమతులతో, ఎక్కువ భాగాలను ఐ.సి.ఎఫ్. బోగీ షాప్ ద్వారా లేదా మార్కెట్ నుండి భారతదేశంలోనే సేకరించాలని మేము నిర్ణయించుకున్నందున, బోగీల కోసం మా ప్రాజెక్ట్ షెడ్యూల్‌లో కన్సల్టెంట్లతో పాటు అనేక సంస్థలు భాగమయ్యాయి.

కన్సల్టెంట్లు, ఐ.సి.ఎఫ్., అనుబంధ విక్రేతలు సంయుక్తంగా ప్రధాన కాన్సెప్ట్, విడిభాగాలను అభివృద్ధి చేసి ఖరారు చేసిన తర్వాత, సుదీర్ఘమైన పరస్పర చర్చల ప్రక్రియ ద్వారా ప్రాథమిక డేటాపై డిజైన్ ధృవీకరణ, వివరమైన డిజైన్, తుది ధృవీకరణ చేపట్టబడ్డాయి. డైనమిక్ విశ్లేషణ చివరకు 180 కి.మీ./గం. కంటే ఎక్కువ వేగంతో కూడా స్థిరమైన పనితీరును చూపించింది. పూర్తి-సస్పెండెడ్ మోటార్లు, ఎల్.హెచ్.బి. బోగీలలో లాగా యాక్సిల్‌పై కాకుండా చక్రంపై అమర్చిన బ్రేక్ డిస్క్, కాంపాక్ట్ బ్రేక్ కాలిపర్లు, సెకండరీ లొకేషన్‌లో ఎయిర్ స్ప్రింగ్‌లు, ఇతర సస్పెన్షన్ ఎలిమెంట్లు, డ్యాంపర్లు మొదలైన వాటితో కూడిన బోగీ కాన్సెప్ట్ 3-డి మోడల్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైలు భద్రతని, పట్టాలపై నడిచే సామర్థ్యాన్ని పరీక్షించేది ఆర్.డి.ఎస్.ఓ. కాబట్టి, పైన పేర్కొన్న సిమ్యులేషన్లు, ఎఫ్.ఇ.ఎమ్. పనులలో వారు కూడా భాగమయ్యారు. రైలు భద్రత, పట్టాలపై నడిచే సామర్థ్యం బోగీ ప్రవర్తించే తీరుపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.

బోగీ ఫ్రేమ్, డ్యాంపర్లు, స్ప్రింగ్‌లు, బేరింగ్‌లు, మెటల్-బాండెడ్ రబ్బరు ఎలిమెంట్లు, ఎయిర్ స్ప్రింగ్‌లు, వివిధ కాస్టింగ్, ఫోర్జింగ్ వస్తువులు వంటి కీలక భాగాల – అంటే యాభైకి పైగా విడిభాగాల – అభివృద్ధి ప్రధానంగా పరిశ్రమల ద్వారానే జరిగింది. ఇది ఎంతో విస్తృతమైన కార్యకలాపాలతో కూడుకున్న పని; అభివృద్ధి ప్రక్రియలో నేరుగా పాలుపంచుకోవడానికి ఐ.సి.ఎఫ్. బృందాలను ఆయా కంపెనీలకు క్రమం తప్పకుండా పంపాల్సి వచ్చింది.

దిగుమతి చేసుకున్న బోగీల స్వదేశీ వెర్షన్‌లను తయారు చేయడంలోనూ, అలాగే ఇప్పటికే ఉన్న ఫ్యాబ్రికేటెడ్ బోగీల డిజైన్‌ను మెరుగుపరచడంలోనూ ఎప్పటికప్పుడు మార్గదర్శక కృషి చేసిన కాన్పూర్‌లోని ఒక కంపెనీకి బోగీ ఫ్రేమ్‌ల తయారీ బాధ్యతను అప్పగించాము. కాస్ట్ అండ్ ఫోర్జ్డ్ విడిభాగాలతో అనుసంధానించిన బోగీ ఫ్రేమ్‌లను సరఫరా చేయాలని ఈ కంపెనీ కాంట్రాక్ట్ పేర్కొంది. భవిష్యత్తులో మేము సొంతంగా తయారు చేసుకోబోయే ట్రైన్ 18 బోగీల కోసం మేము ఏ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చామో, ఆ సంస్థల నుండే కాస్ట్ అండ్ ఫోర్జ్డ్ విడిభాగాలను సేకరించాలని మేము వారిని కోరాము. ఈ కాస్టింగ్ అండ్ ఫోర్జింగ్ సంస్థలు, ముఖ్యంగా కాస్టింగ్ సంస్థలు, సరఫరా తేదీల విషయంలో పదేపదే విఫలమవడం వల్ల బోగీ సరఫరాదారు కూడా సకాలంలో అందించలేకపోయారు.

అయినప్పటికీ, ఆ బోగీ సరఫరాదారు ఎప్పుడూ మా వెంటాడే జాబితాలో మొదటి స్థానంలో ఉండేవారు; మూడు షిఫ్టుల కంటే ఎక్కువ పనిచేసైనా సరే, సర్వశక్తులు ఒడ్డి సరఫరా చేయండి, సరఫరా చేయండి, సరఫరా చేయండి అని నేను కూడా ఆయనతో తరచుగా మాట్లాడుతూ ఉండేవాడిని. డెబ్బై ఏళ్లకు చేరువలో ఉన్న వారి MD అసాధారణమైన మెకానికల్ మేధస్సు కలవారు, ఆయన ప్రధానంగా తన స్వశక్తితోనే కంపెనీని నడుపుతున్నారు. అలా ఒకే వ్యక్తి చేతిలో నైపుణ్యం, నియంత్రణ కేంద్రీకృతమై ఉండటం వ్యాపారానికి మంచిదా కాదా అనేది ఇక్కడ విషయం కాదు; నేను ఎలాంటి వ్యక్తితో వ్యవహరిస్తున్నానో పాఠకులకు తెలియజేయాలనేదే నా ఉద్దేశం. ఆయన ఎప్పుడూ ఇలా అనేవారు, “సార్, ఈ ప్రాజెక్ట్ కోసం మేము మా అత్యుత్తమ కృషిని పెట్టాము. ముందు నాణ్యతను, ఆ తర్వాత వేగాన్ని పరిపూర్ణం చేయడానికి మేము రాత్రింబవళ్లు కష్టపడ్డాము. ఐ.సి.ఎఫ్., అంతకంటే ఎక్కువగా మీరు మాకు చాలా ముఖ్యం, కానీ దయచేసి రెండు పడవల మీద కాళ్లు వేయకండి. ఈ కాస్టింగ్ తయారీదారుతో మీరు మా చేతులు కట్టేశారు, ఇప్పుడు దయచేసి ఆయన చేసే ఆలస్యాలకు నన్ను సంజాయిషీ ఇవ్వమని అడగకండి”. నిజానికి, ఆయన చెప్పింది చాలా వరకు నిజమే, కానీ ఆయనే ప్రధాన సరఫరాదారు కాబట్టి, కేవలం ట్రైన్ 18 ప్రాజెక్ట్ మీదే పూర్తి దృష్టి పెట్టాలని నేను ఆయనకు పదేపదే చెబుతూనే ఉండాల్సి వచ్చింది.

ప్రాముఖ్యత ఉన్న మరో డిజైన్ అంశం బ్రేక్ సిస్టమ్. మా వేగవంతమైన త్వరణం (acceleration) కాన్సెప్ట్‌కు తగినట్లుగా, సాఫీగా కానీ దానికి సరితూగేలా వేగాన్ని తగ్గించడానికి (deceleration) ప్రస్తుత సాంకేతికతతో కూడిన, విఫలం కాని, అత్యంత సమర్థవంతమైన, నమ్మదగిన బ్రేకింగ్ వ్యవస్థ మాకు అవసరం. అదృష్టవశాత్తూ, బ్రేక్ సిస్టమ్ ఎప్పుడూ టెక్నాలజీ బదిలీ గురించిన తప్పుడు ఆలోచనలకు దూరంగా ఉంటుంది. మీ డ్రాయింగ్‌లు, స్పెసిఫికేషన్లు, వాటి అన్వయమే ఇక్కడ మేధో సంపత్తి హక్కుల సారాంశం, అసలు ప్రాణం ఎప్పుడూ తయారీదారు వద్దే ఉంటుంది; ప్రపంచవ్యాప్తంగా ఇది ఇలాగే పనిచేస్తుంది, ట్రైన్ 18 విషయంలోనూ ఇలాగే పనిచేస్తుంది. బ్రేక్ సిస్టమ్‌ను ఒక సాధారణ చిత్రం ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చు.

బ్రేక్ ప్యాడ్‌లు యాక్సిల్‌పై అమర్చిన డిస్క్‌పై కాకుండా నేరుగా చక్రంపై పనిచేస్తాయి. ఈ రైలులో ఆయిల్-ఫ్రీ కంప్రెసర్ ఉంటుంది. మేము ఇలాంటి కంప్రెసర్లను ఇఎంయులలో మంచి ఫలితాలతో ప్రయోగించి చూశాము; ఈ కంప్రెసర్లు చాలా ఖరీదైనవి అయినప్పటికీ, తక్కువ మరియు శుభ్రమైన నిర్వహణ అవసరం, ఇంకా చాలా ఎక్కువ విశ్వసనీయత కారణంగా ఆ అధిక ధరను భర్తీ చేయగల సామర్థ్యం వీటికి ఉంది.

సమస్య ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా రైలు బ్రేక్ సిస్టమ్ మార్కెట్ ఎల్లప్పుడూ మూడు ప్రధాన కంపెనీల ఆధీనంలోనే ఉంది: ఒకటి జర్మన్, ఒకటి ఫ్రెంచ్, మరొకటి అమెరికన్ కంపెనీ. రెండవదానిని మూడవది కొనుగోలు చేయడంతో, ఈ రంగంలో మాకు సమర్థులైన ఆటగాళ్లు ఇద్దరు మాత్రమే మిగిలారు. బ్రేక్ సిస్టమ్ అనేది ప్రయోగాలు మొదలుపెట్టే రంగం కాదని ప్రధాన బృంద సభ్యులకు స్పష్టంగా తెలుసు; మొదటి కొన్ని రైలు సెట్ల బ్రేక్ పరికరాలను ప్రస్తుత మార్కెట్ ధరకు – అది ఖచ్చితంగా కాస్త ఎక్కువే – దిగుమతి చేసుకున్నప్పటికీ, ఈ రెండు కంపెనీలకు భారతదేశంలో గణనీయమైన ఉనికి ఉన్నందున భవిష్యత్తులో స్వదేశీకరణ ద్వారా ధరను తగ్గించవచ్చనే ఆశతో, ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తును వారికి గట్టిగా నమ్మించి ఒప్పించడమే మా వ్యూహం. అలాగని, సొంతంగా బ్రేక్ సిస్టమ్‌ను డిజైన్ చేసి నిర్మించాలనే కలలు కనే ఎవరికైనా – అటువంటి నకిలీ కంపెనీలకు, భారతీయ రైల్వేలోని కొందరు పగటి కలలు కనేవారికి – ఆ ప్రయత్నాన్ని ట్రైన్ 18 మీద కాకుండా ఎల్.హెచ్.బి. కోచ్‌ల కోసం బ్రేక్ సిస్టమ్ అభివృద్ధి చేయడంలో పెట్టమని నేను స్పష్టంగా చెప్పాను; దురదృష్టవశాత్తూ, ఎల్.హెచ్.బి. కోచ్‌లు దశాబ్దాలుగా తగిన ప్రయోజనాలు లేకుండానే అనవసరంగా అధిక ధర కలిగిన వ్యవస్థ భారాన్ని మోస్తున్నాయి.

అదే సమయంలో, మాకు ఉత్తమ ధర లభించేలా చూసుకోవడానికి మేము ఒకరిపై ఒకరిని పోటీ పెట్టాల్సి వచ్చింది. మా ప్రారంభ ప్రామాణికాలను గుర్తుంచుకోండి: ఈ భవిష్యత్ రైలుకు అనుగుణంగా ఉండే అత్యాధునిక వ్యవస్థ మాకు కావాలి, త్వరలో పాతబడిపోయే వ్యవస్థ ఖచ్చితంగా వద్దు. రెండు కంపెనీలతో సుదీర్ఘ చర్చలు జరిపి, ప్రస్తుతమున్న బ్రేక్ సిస్టమ్‌లను అధ్యయనం చేసిన తర్వాత, మేము మా అవసరాలను నిర్వచించి, స్పెసిఫికేషన్లు, ఎన్వలప్ డ్రాయింగ్‌లను రూపొందించి బిడ్లను ఆహ్వానించాము. మొదటి రెండు రైలు సెట్ల ఆర్డర్‌ను జర్మన్ కంపెనీ గెలుచుకుంది. చివరికి, పోటీని సజీవంగా ఉంచడానికి తర్వాత రేక్ కోసం మేము రెండో కంపెనీకి కూడా ఆర్డర్ ఇచ్చాము.

ఈ జర్మన్ కంపెనీ యూరోపియన్ మార్కెట్లో కూడా అత్యంత ఆధునికమైన బ్రేక్ సిస్టమ్‌ను అందించింది. ఇది వీల్ స్లైడ్ ప్రొటెక్షన్, బ్రేక్ సిలిండర్ ప్రెజర్ కంట్రోల్‌లో రిడండెన్సీతో కూడిన ఎలక్ట్రానిక్-న్యూమాటిక్ సిస్టమ్‌ను కలిగి ఉంది, దీని పనితీరు అంశాలన్నింటినీ చూసుకోవడంతో పాటు ప్రధాన ట్రైన్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో అనుసంధానం కావడానికి అధునాతన డిజిటల్ నియంత్రణను కలిగి ఉంది. ఇది పూర్తిగా అభివృద్ధి చెందిన ఉత్పత్తి అయినప్పటికీ, రైలు ప్రాజెక్ట్‌లో ఏదైనా నేరుగా తెచ్చి బిగించేలా సిద్ధంగా ఉండటం అరుదు. ఈ వ్యవస్థను అమర్చడంలో ఈ కంపెనీ, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాలకు చెందిన ఐ.సి.ఎఫ్. డిజైన్ బృందాలు, ప్రొపల్షన్ సిస్టమ్ తయారీదారుల మధ్య క్రమం తప్పకుండా పరస్పర చర్చలు జరగాల్సి ఉంటుంది. పరికరాల లేఅవుట్ వివరాలు, మౌంటింగ్, ఎన్వలప్‌లలో మార్పులు, కేబుల్స్ రూటింగ్, ఇంకా సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్ వంటి విషయాలలో పరస్పర సహకారం, సామరస్యం ఎంతో అవసరం. ఈ జర్మన్ కంపెనీ మరియు ప్రొపల్షన్ సిస్టమ్ చేస్తున్న భారతీయ కంపెనీ భారతదేశంలో కలిసి ఎన్నో ప్రాజెక్టులు చేసినప్పటికీ, సున్నితమైన డిజైన్ అండ్ లేఅవుట్ సమస్యలను పరిష్కరించడానికి మేము తప్పనిసరి పరిస్థితుల్లో తరచుగా మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చింది.

ఈ కంపెనీతో వ్యవహరించిన అనుభవం చాలా సంతృప్తికరంగా ఉంది. ఈ కంపెనీ భారతీయ విభాగపు ఎం.డి.తో నాకు చిరకాల వృత్తిపరమైన సంబంధం ఉంది, కానీ 2017 ప్రారంభం తర్వాత మా చర్చలన్నీ ఎప్పుడూ వారి డెలివరీ షెడ్యూల్ పైనే కేంద్రీకృతమై ఉండేవి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, మా వైపు నుండి కొన్నిసార్లు అసమంజసమైన డిమాండ్లు ఉన్నప్పటికీ, ఆయన కొంత నిరసన తెలిపినా ఎప్పుడూ తుది తిరస్కరణ చెప్పకుండా తన వంతు ప్రయత్నం చేసేవారు, పైగా చాలాసార్లు అసాధ్యం అనిపించిన వాటిని కూడా అందించి చూపించేవారు. డిజైన్ లేదా సాఫ్ట్‌వేర్ సవరణల కోసం వారు తమ జర్మన్ ప్రధాన సంస్థపై ఆధారపడటం, వారి కార్యకలాపాలపై జర్మన్ సంస్థకు ఉన్న పట్టు గురించి నేను ఆయన్ను ఎప్పుడూ మందలిస్తూ ఉండేవాడిని; “ ఆప్ కో ఛీంక్నే కే లియే భీ జర్మనీ ఫోన్ ఘుమానా పడ్తా హై. (తుమ్మడానికి కూడా మీరు అనుమతి కోసం జర్మనీకి ఫోన్ చేయాల్సి వస్తుంది)”, అని నేను అనేవాడిని. ఒకానొక తుది డిజైన్ సమావేశంలో గోడకు నెట్టబడినంత ఒత్తిడి ఎదురైనప్పుడు, “ఠీక్ హై, పర్ హమారే జైసీ ఛీంక్ భీ ఆప్కో కహీం ఔర్ నహీఁ మిలేగీ. (సరే, కానీ మా లాంటి తుమ్ము కూడా మీకు మరెక్కడా దొరకదు)” అని ఆయన ఒకసారి బదులిచ్చారు. సరే, బహుశా మూడవ లేదా నాల్గవ ట్రైన్ 18 రేక్ కోసం ఆ రెండో కంపెనీ కూడా తుమ్మినప్పుడు మనం దాన్ని సంతోషంగా అంచనా వేద్దాం.

ఆ ఎం.డి. గారితో నా పోరాటం కొనసాగింది. మా మధ్య జరిగిన ప్రతి వాడివేడి ముఖాముఖి చర్చ చివరలో, ఆయన అంతకుముందు ఒప్పుకున్న దానికంటే కొంచెం ఎక్కువే హామీ ఇచ్చేవారు, దాదాపుగా దాన్ని నిలబెట్టుకునేవారు కూడా. కానీ ఆయన స్వరం, ధోరణి ఒక విషయాన్ని చెప్పకనే చెప్పేవి; ఆయన ఆర్థిక వ్యవహారాలలో అంత నేర్పరి కాకుండా, కార్పొరేట్ వేగం కంటే కొంచెం ఎక్కువ కవితాత్మక హృదయం ఉన్నవారైతే, ఆయన పరిస్థితి గాలిబ్ షేర్ లాగా ఉండేది:

తంగీ-ఎ-దిల్ కా గిలా క్యా యే వో కాఫిర్ దిల్ హై
కి అగర్ తంగ్ నా హోతా తో పరేషాన్ హోతా
(ఈ కఠిన హృదయపు వేదన గురించి ఫిర్యాదు ఎందుకు; ఒకవేళ అది వేదన చెందకపోతే, అది కలత చెందేది.)

ఎట్టకేలకు, అన్నీ ఒక కొలిక్కి రావడం మొదలైంది. అంతకుముందు ఆగస్టు చివరి నాటికి మాత్రమే ఐ.సి.ఎఫ్.లో మొదటి బోగీ అసెంబుల్ అవుతుందని తెలిసినప్పుడు నేను ఆందోళన చెందాను; అసెంబ్లీ కోసం బోగీ ఫ్రేమ్‌లు, గేర్ డ్రైవ్ మరియు బ్రేక్ డిస్క్‌తో కూడిన చక్రం, యాక్సిల్ అసెంబ్లీ, బ్రేక్ సిస్టమ్ భాగాలు, రబ్బరు భాగాలు, స్ప్రింగ్‌లు, డ్యాంపర్లు మొదలైనవి మా వద్ద ఉండాలి. మిగిలిన భాగాలు అప్పటికే అందడం గానీ లేదా రవాణాలో గానీ ఉన్నప్పటికీ, బోగీ ఫ్రేమ్‌లు మరియు రబ్బరు భాగాలు లేకపోవడం కీలకంగా మారింది. కొత్త లోకోమోటివ్‌ల విషయంలో నా గత అనుభవంలో, మొదటిసారిగా కార్ బాడీని బోగీపై అమర్చడం అనేది ఒక పీడకలలా ఉండేది, ఎందుకంటే ఏదో ఒక సమస్య, ముఖ్యంగా ఏదైనా విడిభాగం తగలడం (infringement) వంటివి ఎప్పుడూ ఎదురయ్యేవి. “మీరు మొదటిసారిగా మీ కోచ్‌ను బోగీలపై ఎప్పుడు దించుతున్నారు? బహుశా ఆరోజే మీకు అత్యంత భయంకరమైన అనుభవం ఎదురుకావచ్చు”, అని నేను షాప్ ఫ్లోర్‌లో ఉన్న శ్రీనివాస్ మరియు ఇతరులతో అనేవాడిని. వారందరూ నన్ను వేరే గ్రహం నుండి వచ్చినవాడిలా చూసేవారు, “అసలు సమస్య ఎందుకు వస్తుంది? అన్ని ముందస్తు తనిఖీల తర్వాతే కదా ప్రతిదీ బిగించేది” అన్నట్లు వారి మౌనం చెప్పేది. అతి విశ్వాసంతో ఉన్న ఈ కుర్రాళ్లకు చుక్కలు చూపించడానికి ఏదైనా ఒక చిన్న సమస్య రావాలని నేను దాదాపుగా కోరుకున్నాను! కానీ ఆగస్టు చివరి కంటే చాలా ముందే మొదటి రెండు బోగీలకు, అంటే మొదటి కోచ్‌కు అవసరమైనవన్నీ మాకు అందాయి.

ఒకరోజు నేను షాప్ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు, ఎలాంటి హడావుడి లేకుండానే మొదటి కోచ్‌ను విజయవంతంగా బోగీలపై దించామని, మొత్తం ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోయిందని శ్రీనివాస్ నాకు చెప్పాడు. నిజంగానా! నేను రెండుసార్లు నిర్ధారించుకుని, ఆ కోచ్‌ను చూడటానికి పరుగెత్తాను; అక్కడ అది తన సొంత మోటరైజ్డ్ బోగీలపై రాజసంగా నిలబడి ఉంది. శ్రీనివాస్ మరియు బృందం అక్కడ చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. నేను కూడా నవ్వుతూ, వారికి అదృష్టం కలిసొచ్చిందని నాలో నేనే గొణుక్కుంటూ ముందుకు సాగాను. అప్పుడు నేను పైకి చూపించలేదు కానీ, తర్వాత బృందంలోని ప్రతి సభ్యుడితో నా అంచనా తప్పు అని నిరూపించబడినందుకు నేను ఎంత ఆశ్చర్యపోయానో, ఎంత సంతోషించానో చెప్పాను. నిజంగానే నేను సంతోషించాను; ఏదేమైనా, అధునాతన డిజైన్ సాధనాల పరిచయం విషయంలో నేను పాతకాలపు వాడిని, లేదా కాలం చెల్లిన వాడిని అని చెప్పాలి. ట్రైన్ 18 కు అది ఒక గొప్ప రోజు. మొట్టమొదటి స్వదేశీ 180 కి.మీ./గం. బోగీ అక్కడ సిద్ధంగా ఉంది, అసెంబుల్ చేయబడి పరీక్షలకు రెడీగా ఉంది:

ఆ ట్రాన్స్‌ఫార్మర్ సంబంధిత మా ఫ్రెంచ్ మిత్రురాలికి ఫోన్ చేసి, కవి సహర్ చెప్పిన ఈ మాటలను ఆమెకు వినిపించాలని నాకు అనిపించింది:

ఘటా హై, బాగ్ హై, మై హై, సుబూ హై, జామ్ హై సాఖీ
అబ్ ఇస్ కే బాద్ జో కుఛ్ హై తేరా కామ్ హై సాఖీ
(మేఘావృతమైన ఈ రోజున, ఈ తోటలో మధువు ఉంది, పాత్రలు ఉన్నాయి, కూజా ఉంది. ఇవన్నీ సిద్ధమయ్యాక, ఇక మిగిలిన పని పూర్తి చేయాల్సింది నువ్వే సాఖీ.)

(ఇంకా ఉంది)

Exit mobile version