Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే భారత్ – ట్రైన్ 18 కథ-3

[వందే భారత్ రైలు రూపకర్త సుధాంశు మణి అనుభవాల కథనం ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ ను తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]

అధ్యాయం 2: ఐసిఎఫ్‌లో నా మొదటి వారం

ప్రస్తుత సాంకేతికతతో కూడిన రైల్వే కోచ్‌ల తయారీలో భారతదేశాన్ని స్వయంసమృద్ధం చేయాలనే అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కలల ప్రాజెక్టుగా 1950లలో ఐసిఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) స్థాపించబడింది. అప్పటి నుండి ఇది ఎన్నో మైలురాళ్లను దాటింది, ఎన్నో విస్తరణలను చూసింది. రకాలలో కాకపోయినా, ఉత్పత్తి సంఖ్యలో ఇది అద్భుతమైన సేవలను అందించింది. అలాగే మొత్తం తయారైన కోచ్‌ల సంఖ్య పరంగా ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుంది. సెల్ఫ్-ప్రొపెల్డ్ వాహనాలతో సహా అన్ని రకాల రైళ్లను తయారుచేసే సౌకర్యాలతో పాటు, ఇక్కడ ఒక సమగ్ర డిజైన్ కేంద్రం కూడా ఉంది. భారతీయ రైల్వేలలోని ప్రొడక్షన్ యూనిట్లలో ఇది ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమించింది. మరింత ఆధునికమైన మిగిలిన రెండు రైల్ కోచ్ ఫ్యాక్టరీలు – రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్) కపుర్తలా, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ (ఎం.సి.ఎఫ్) రాయ్‌బరేలి – కన్నా కూడా రైల్వే కోచ్‌ల రంగంలో కొత్త ప్రయోగాల కోసం భారతీయ రైల్వే పూర్తిగా ఐసిఎఫ్ పైనే ఆధారపడేది.

కానీ, ఐసిఎఫ్‌ను ఒక ప్రపంచ స్థాయి రైళ్ల తయారీ సంస్థగా తీర్చిదిద్దడానికి నెహ్రూ కన్న కలలు కనీసం ఒక స్పష్టమైన దార్శనికతగా కూడా మారలేదు; దానికి తగ్గ చర్యల గురించి ఇక చెప్పనవసరమే లేదు. 1950లలో చైనా ప్రధాని చౌ ఎన్ లై – ఐసిఎఫ్‌ను సందర్శించి, ఇక్కడి సందర్శకుల పుస్తకంలో “ఈ ఫ్యాక్టరీ తూర్పు దేశాలకే గర్వకారణమని, చైనా ఇంజనీర్లు ఐసిఎఫ్‌ను సందర్శించి నేర్చుకోవాలని తాను కోరుకుంటున్నట్లు” రాశారు.

మరి ఆ సంఘటన జరిగి అరవై ఏళ్లకు పైగా గడిచిన తర్వాతి కాలంలో ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం? రైల్వే సాంకేతికతలోని అన్ని రంగాలలో చైనా మనల్ని ఎంతో వెనుకకు నెట్టేసింది; కేవలం రైల్వేలే కాదు, చాలా రంగాలలో! అది ప్రపంచానికే ఒక తయారీ కేంద్రంగా మారింది. సరికొత్త వాణిజ్య రూపం సంతరించుకుని వేలాదిగా కొత్త ఉత్పత్తులను డిజైన్ చేస్తూ, సరఫరా చేస్తోంది. నేడు, మనం వారి నుండి నేర్చుకోవడానికి చైనాకు క్యూ కడుతున్నాం.

అమెరికన్ సామాజిక తత్వవేత్త ఎరిక్ హాఫర్ ఇలా అన్నారు: “తీరని కోరికల గురించిన అవగాహనే ఒక దేశానికి తమకో లక్ష్యం, ఒక గమ్యం ఉందనే భావనను కలిగిస్తుంది.” అంటే చైనీయులు దీనిని అర్థం చేసుకున్నారు గానీ, మనం అర్థం చేసుకోలేదా? ఇది చాలా తీవ్రమైన ప్రశ్న, దీనిని నేను ఇక్కడ విశ్లేషించదలుచుకోలేదు. కానీ 1950లలో మన రెండు దేశాల రైల్వే వ్యవస్థలలో మనదే ఎంతో ఆధునికమైనదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే, ఈరోజు వారి రైల్వే సాధించిన అపారమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునిక రైళ్లతో పోలిస్తే, అసలు మనకు వారితో సామ్యమే లేదు.

హామ్లెట్ నాటకంలో షేక్స్‌పియర్ గిల్డెన్‌స్టెర్న్ చేత హామ్లెట్‌తో ఇలా చెప్పిస్తారు: “కలలు నిజంగానే ప్రతిష్ఠాత్మకమైనవి, ఎందుకంటే ఆ ఆశయం యొక్క అసలు సారాంశం కేవలం ఒక కల యొక్క నీడ మాత్రమే.” (“Dreams indeed are ambition, for the very substance of the ambition is merely the shadow of a dream”.) మిస్టర్ నెహ్రూ, మీ గొప్ప ప్రణాళిక ఎందుకు ఇలా కుప్పకూలిపోయింది? మీ కలల నీడలు గొప్పవారైన భారతీయ రైల్వే అధికారుల చేతుల్లో చెదిరిపోయాయి లేదా రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు మీ కలల మార్గం చైనా గుండా వెళుతోంది!

నాకు ఉత్తర్వులు అందిన మూడు రోజుల తర్వాత నేను ఐసిఎఫ్‌లో అడుగుపెట్టాను. కానీ భారతీయ రైల్వేలో కేవలం జనరల్ మేనేజర్లకు మాత్రమే ఉన్న సదుపాయం ప్రకారం, నేను బెంగళూరులో ఉన్నప్పుడే బాధ్యతలు స్వీకరించాను. నేను అక్కడికి చేరుకోవడానికి ముందే ఒక సందేశాన్ని పంపాల్సిన అవసరం వచ్చింది. నేను జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ స్థాయి అధికారి అయిన జీఎం సెక్రటరీ కె.ఎన్. బాబును (ఆయన చాలా పరిణతి చెందిన, సమర్థుడైన, అన్ని విషయాలు తెలిసిన అధికారి అని నాకు త్వరలోనే తెలిసింది) వరుస నోట్‌లను, నోటీసులను జారీ చేయమని కోరాను. కొత్త జీఎం చిన్నపాటి ప్రోటోకాల్స్‌ని నమ్మరని, నివేదికలలో అసత్యాలను సహించరని ఆ నోట్లు స్పష్టం చేశాయి; అలాగే కొన్ని సాధారణ ఆదేశాలను కూడా జారీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సీనియర్ అధికారులలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన రాచరిక ఆలోచనా విధానాలు, మరియు కింది స్థాయిలలో కొత్త ఆలోచనల పట్ల ఉన్న అవిశ్వాసం కేవలం నచ్చజెప్పడం ద్వారా మాత్రమే మారిపోవు. ఆ ఆదేశాలు ఏమిటంటే:

నేను చెప్పిన విషయాలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా, ఆచరణలో చూపిస్తే తప్ప నా నోట్‌ను అధికారులు నమ్మరని, దానిని చాలా సందేహంగా, అపనమ్మకంతో చూస్తారని నాకు తెలుసు. అందుకే, అధికారులతో జరిగిన మొట్టమొదటి సమావేశంలోనే నేను ఈ విషయాలన్నింటినీ మళ్లీ నొక్కి చెప్పాను. చివరగా నేను ఇలా ముగించాను: “మనం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాలని మనకు చెబుతుంటారు, అది సరైనదే కూడా. కానీ ఊపిరాడకుండా చేసే ఇంతటి రాచరిక హోదాల వ్యత్యాసాల వ్యవస్థ, అర్థరహితమైన బానిసత్వపు ప్రోటోకాల్‌లతో మనం ఆ శతాబ్దంలోకి అడుగుపెట్టగలమా? మన ఆలోచనల్లో, ప్రవర్తనలో ఒక మార్పు రావాలి. ఈ మార్పులో ముఖ్యమైన భాగం ఏమిటంటే, మన సంస్థాగత సంస్కృతిలో ఉన్న కాలం చెల్లిన పద్ధతులను పూర్తిగా తొలగించడం. మనం కొన్ని ప్రతీకాత్మక చర్యలతో దీనిని ప్రారంభిద్దాం; కేవలం సూచనప్రాయంగా చేసే పనులు పెద్దగా సాధించకపోవచ్చు, కానీ అవి ఎప్పుడూ ఒక మంచి ఆరంభాన్ని ఇస్తాయి.”

అక్కడ ఎన్నో ప్రశ్నలు, పరిస్థితులు ఎదురయ్యాయి కానీ వాటిలో మూడు నాకు స్పష్టంగా గుర్తున్నాయి. మొదటిది, ఒక సీనియర్ పర్సనల్ అధికారి చెప్పిన విషయం: “ఎలాంటి అపాయింట్‌మెంట్ లేదా ఫార్మాలిటీస్ లేకుండా సిబ్బంది నేరుగా జీఎం ఛాంబర్‌లోకి వచ్చి కలిసే ఈ ‘ఓపెన్-డోర్ పాలసీ’ అస్సలు ఆచరణ సాధ్యం కాదు. మన దగ్గర దాదాపు 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు, మీరు వారి సమస్యల ప్రవాహంలో మునిగిపోతారు” అని. దానికి నేను చాలా సరళంగా – పర్సనల్ విభాగం వారు ఐసిఎఫ్‌లో మానవ వనరుల పరంగా ఎంత గొప్పగా పనిచేస్తున్నారో విన్నానని, కాబట్టి ఇక్కడ పెద్దగా ఫిర్యాదులు ఏవీ ఉండవని, అలాగే చాలా మంది సిబ్బందికి జీఎంను కలవాల్సిన అవసరమే రాదని సమాధానమిచ్చాను. ఆయన అప్పుడు నా మాటలను నమ్మలేదు, కానీ కాలమే ఆయనకు నమ్మేలా చేసింది, ఎందుకంటే నిజంగా అదే జరిగింది. ఏదైనా పని విషయంపై నన్ను కలవడానికి వచ్చే చాలా మందిని మినహాయిస్తే, నన్ను కలవడానికి ఉద్యోగుల గుంపులుగానీ, లేదా జనం ప్రవాహంలా రావడం గానీ ఎప్పుడూ జరగలేదు.

ఆ తర్వాత సివిల్ వర్క్స్ విభాగంలో రెండవ అత్యున్నత అధికారి అయిన మిస్టర్ రామాయణ్, ఈ ప్రారంభోత్సవ ఫలకాల గురించిన ఆందోళన నిజంగానే అంత తీవ్రమైనదా అని అడిగారు. ఆయనకు నమ్మకం కలిగించడం కోసం, ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, కాలనీలు, వసతులు, సంస్థలతో కూడిన మొత్తం 500 ఎకరాల ఐసిఎఫ్ ప్రాంగణంలోని అన్ని ప్రారంభోత్సవ ఫలకాలను సర్వే చేయమని నేను చెప్పాను. రాజకీయ నాయకుల పేర్లు ఉన్న ఫలకాలను మినహాయించి (ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు), మిగిలిన అన్ని ఫలకాలను పీకేసి స్క్రాప్ కింద పడేయాలని నేను ఆదేశించాను. మన జాతీయ సంస్కృతి వారి ఉనికిని ఇలాంటి ప్రదర్శనల ద్వారా ఘనంగా చాటాలని కోరుకుంటే, అలాగే కానివ్వండి అని కూడా అన్నాను. రామాయణ్ మరుసటి రోజుకల్లా చాలా వేగంగా ఆ సర్వేను, ఫలకాలను తొలగించే పనిని పూర్తి చేసి, తొలగించబడిన ఫలకాల సంఖ్య 85 అని చాలా మామూలుగా ప్రకటించారు. కానీ కొద్ది రోజుల్లోనే, ఐసిఎఫ్ గోడలను ఇంకా అలంకరిస్తూ – లేదా మలినం చేస్తూ – ఉన్న కొన్ని ఫలకాలను నేను గమనించాను. నేను రామాయణ్‌ను పిలిచి ఒక కథ చెప్పాను. నేను యువ అధికారిగా ఉన్నప్పుడు, ఈస్టర్న్ రైల్వేలో ఒక జీఎంను ఒక ప్రారంభోత్సవానికి ఆహ్వానించి, ఆయన పేరుతో (నా పేరుతో కూడా) ఉన్న ఒక ఫలకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరినప్పుడు, ఆయన నన్ను చాలా కోపంగా మందలించారు. ఫలకంపై తన పేరును చూసి ఆయనకు ఒళ్లు మండిపోయింది; ఆ తర్వాత ఆయన శాంతించి, ప్రారంభించబడుతున్న ఆ వసతిని ప్రభుత్వ నిధులతో నిర్మించారని, తను ప్రభుత్వ సేవకుడనే తప్ప రాజును కానందున తన పేరును ఏ ఫలకం పైనా ఉంచడానికి ఎప్పుడూ ఒప్పుకోనని వివరించారు. సర్వీసులో మనందరినీ నడిపించి, కమాండ్ చేసిన తర్వాత కూడా ఆయనకు మన హృదయాలలో స్థానం లభించకపోతే, ఒక రాతి పలకపై ఆయన పేరు ఉండటం వల్ల ఎలాంటి అర్థం లేదని ఆయన అన్నారు. నేను నియంత్రించలేని ఒకటి లేదా రెండు సందర్భాలను మినహాయిస్తే, అప్పటి నుండి నా పేరును ఏ ఫలకం పైనా వేయడానికి నేను ఎప్పుడూ ఒప్పుకోలేదని రామాయణ్‌కు చెప్పాను. ఇది నేను తర్వాత కాలంలో ఇతరుల హేళనకు గురికాకుండా ఉండటానికి కూడా సహాయపడింది; ఎందుకంటే ఎన్నో రకాల పిచ్చి సందర్భాలు, వేడుకలు, విజయాల కోసం ఫలకాలపై తమ పేర్లను చూసుకుని మురిసిపోయే ఎంతో మంది అధికారులను నేను చూశాను, కానీ వారి ఆడంబరం జూనియర్ అధికారులలో కేవలం జోకులకు, నవ్వులాటలకు మాత్రమే కారణమయ్యేది. చాలా ముక్కుసూటిగా చెబుతూ, రెండు రోజుల తర్వాత నాకు ఒక్క ఫలకం కూడా కనిపించడానికి వీల్లేదని నేను అతనికి స్పష్టం చేశాను. రామాయణ్ ఆ ఆదేశాన్ని పాటించారు, దాంతో తొలగించిన ఫలకాల సంఖ్య 155కి పెరిగింది. అలా మాజీ జీఎంల పేర్లతో ఉన్న ఎన్నో ఫలకాలు మట్టిలో కలిసిపోయాయి.

మాజీ అధికారులు మరియు ప్రముఖులందరికీ నా క్షమాపణలు, మిమ్మల్ని అవమానించాలని కాదు. మీరు చరిత్రలో నిలిచిపోతామని ఆశించారు, కానీ మీ మంచి పేరు అక్షరాలా మట్టిలో, ధూళిలో కలిసిపోయి అనాథగా పడి ఉంది!

సోచా థా దేగా నామ్ మేరా, తారీఖ్ కో నిఖార్
సుపుర్ద్-ఎ-ఖాక్ హో గయా మేరే నామ్ కా మజార్

[నా పేరు (ఐసిఎఫ్) చరిత్రకు మరింత అందాన్ని ఇస్తుందని నేను నమ్మాను, కానీ నా పేరుతో ఉన్న ఆ కట్టడం నేడు మట్టిలో పూడిపోయింది.]

నా పదవీకాలంలోని నాల్గవ రోజున మరొక సంఘటన జరిగింది. నా అలవాటు ప్రకారం నేను బాబు ఆఫీస్‌లోకి నడిచి వెళ్లాను (నా పదవీకాలం ముగిసే వరకు నా దినచర్య ఇలాగే సాగింది). అక్కడ ఒక సీనియర్ అధికారి, మరో ఐదారుగురితో కలిసి సోఫాలపై వేచి ఉండటం చూశాను. “ఏంటి విశేషం?” అని నేను అడిగాను. “మిమ్మల్ని కలవడానికి వేచి ఉన్నాం సర్,” అని ఆ సీనియర్ అధికారి సమాధానమిచ్చాడు. అంతే, నాకు విపరీతమైన కోపం వచ్చి ఆయనపై గట్టిగా, హెచ్చరిస్తూ అరిచాను: “నేను లోపల ఏదో పనికిమాలిన పనులు చేస్తున్నానని అనుకుంటున్నారా? మీ సమయాన్ని, మిగిలిన వారి సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు?” ఆ దెబ్బతో అంతా సెట్ అయిపోయింది. ఆ తర్వాత జీఎంను కలవడానికి సెక్రటరీ గదిలో ఎవ్వరూ ఎప్పుడూ వేచి ఉండలేదు.

ఆ తర్వాత బ్రీఫ్‌కేస్‌కి సంబంధించిన ఒక చిన్న సంఘటన జరిగింది. నేను ఆఫీసులో చేరిన రోజున, ఐ.సి.ఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) వారు నాకు గౌరవ వందనం సమర్పించారు. దేవుడికే తెలియాలి ఎందుకో! ఇది కేవలం ఉన్నతాధికారులకు మాత్రమే పరిమితమైన గౌరవం అని నేను అనుకున్నాను. బహుశా ఎవరో ఒక చీఫ్ సెక్యూరిటీ కమిషనర్, జీఎం దగ్గర మార్కులు కొట్టేయడానికి దీనిని ప్రారంభించి ఉండవచ్చు; ఆ తర్వాత అది అందరికీ నచ్చడంతో, దీనివల్ల తమ హోదా పెరుగుతుందని జీఎంలు భావించి ఉండవచ్చు.

ఏదేమైనా, ఆ గౌరవ వందనం ముగిసిన తర్వాత నేను లోపలికి నడుచుకుంటూ వెళ్తుండగా, యూనిఫాంలో ఉన్న ప్యూన్లు లేదా అటెండర్ల గుంపు అక్కడ నిలబడి ఉండటం గమనించాను. వారికి నాయకత్వం వహిస్తూ ఒక చురుకైన యువకుడు ఉన్నాడు, అతనే సురేష్ అని నాకు త్వరలోనే తెలిసింది (ఆయన జీఎం అటెండర్లలో ఒకరు). సురేష్ నా భుజానికి ఉన్న బ్యాగ్‌ను అందుకోవడానికి ఒక్కసారిగా ముందుకు దూకాడు. ఆ బ్యాగ్ కోసం మా ఇద్దరి మధ్య కొన్ని క్షణాల పాటు ఒక చిన్న పోరాటం జరిగింది. ఆ తర్వాత నేను అతనితో, “హలో, నా బ్యాగ్‌ను తీసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకు, అలాగే నా బ్యాగ్ తీసుకోవడం కోసం ఇక్కడ పోర్టికోలో అస్సలు వేచి ఉండకు. ప్రతిరోజు ఉదయం నా ఆఫీస్ తలుపు దగ్గర నీతో కుశలప్రశ్నలు పంచుకోవడానికి నేను సంతోషిస్తాను” అని చెప్పాను. సురేష్ కాస్త బిడియంగా నవ్వుతూ నా మాట విన్నాడు.

ఈ షోల్డర్ బ్యాగ్ డ్రామా వెనుక, నేను ఒక యువ అధికారిగా కొత్తగా చేరిన రోజుల్లో జరిగిన ఒక పాత కథ ఉంది. అప్పట్లో నాకు ఒక సరికొత్త బ్రీఫ్‌కేస్ ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే, నేను కొన్ని అధికారిక పత్రాలను ఆ బ్రీఫ్‌కేస్‌లో పెట్టుకుని, చాలా గర్వంగా పట్టుకుంటూ ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. ఒక సీనియర్ అధికారి (ఆయన అందరిలా కాకుండా చాలా విలక్షణమైన వ్యక్తి) ఛాంబర్‌లో, నేను నా పనిని ప్రారంభించబోతూ ఆ బ్రీఫ్‌కేస్‌ను టేబుల్‌పై పెట్టాను. అప్పుడు ఆ అధికారి నన్ను, “మిస్టర్ బ్రీఫ్‌కేస్, నువ్వు ఎప్పుడైనా ఏ రైల్వే అధికారి అయినా తన బ్రీఫ్‌కేస్‌ను స్వయంగా మోయడం చూశావా?” అని అడిగారు. అందులో అంత వింత ఏముందా అని నేను కాస్త అయోమయంగా చూశాను. ఆయన కొనసాగిస్తూ, “నువ్వు చూసి ఉండవు, ఎందుకంటే ఒక అధికారి ఎప్పుడూ తన బ్రీఫ్‌కేస్‌ను స్వయంగా మోయడు, అతని ప్యూన్ మోస్తాడు. కానీ ఒకవేళ ఆ ప్యూన్ టీ తాగడానికో దేనికో వెళ్లినప్పుడు అధికారి దానిని స్వయంగా పట్టుకోవాల్సి వస్తే, అతను చాలా వింతగా, ఒక హాస్య పాత్రలా కనిపిస్తాడు. తను తన స్థాయికి తగని పని చేస్తున్నాడని మరియు ప్రపంచమంతా తననే చూస్తోందని భావించి అతను దానిని చాలా ఇబ్బందిగా పట్టుకుంటాడు. అతను ఎంత ఎక్కువగా అలా ఆలోచిస్తే, అంత పెద్ద కార్టూన్‌లా తయారవుతాడు. అందుకే నేను ఎప్పుడూ బ్యాగ్‌ను స్వయంగా మోస్తాను” అని చెప్పారు. ఆయన నవ్వుతూ తన గుడ్డ సంచీని నాకు చూపించారు. ఒక యువ అధికారికి దక్కిన ఎంతటి అమూల్యమైన జ్ఞానోపదేశం అది! నేను దానిని కృతజ్ఞతతో స్వీకరించి, ఆ బ్రీఫ్‌కేస్‌ను నా అటెండర్‌కు బహుమతిగా ఇచ్చేసి, ఒక షోల్డర్ బ్యాగ్‌ను కొనుగోలు చేశాను. ఆ తర్వాత నేను ఎప్పుడూ బ్రీఫ్‌కేస్ వాడలేదు. కానీ భారత ప్రభుత్వం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ బ్రీఫ్‌కేస్‌లను ఇస్తూనే ఉండటంతో, ఇన్నేళ్లలో నా అటెండర్లు వాటిని అందుకని ఆశ్చర్యపోతూ ఉండేవారు.

ఈ ఫోటోలో నా అధికారిక కారుపై ఉన్న నీలిరంగు బీకాన్ లైట్ గురించి ఆలోచిస్తున్నారా? ఒకప్పుడు ప్రభుత్వ అధికారి కారుపై ఉండే ఈ బీకాన్ లైట్ అనేది వారి ప్రాధాన్యతకు గుర్తుగా, అధికారాన్ని, శక్తిని ప్రదర్శించే ఒక సాధనంగా ఉండేది. ఇది పూర్తిగా ఒక ఫ్యూడల్ భావన కావడంతో, దీనిని ఏమి చేయాలా అని నేను ఆలోచిస్తున్నాను. అయితే, నేను ఆలోచనల్లో ఉన్న కొద్ది రోజుల్లోనే, భారత ప్రధానమంత్రి మోదీజీ నేను కేవలం ఆలోచిస్తున్న విషయాన్ని ఆచరణలో పెట్టేశారు. ఒక్క కలం పోటుతో, దేశంలో అన్ని బీకాన్ లైట్లను నిషేధించి, తొలగించారు; దాంతో నా అధికారిక కారుపై ఉన్న లైట్ కూడా తొలగిపోయింది. ఆ చిన్న ఉపశమనానికి దేవుడికి కృతజ్ఞతలు.

భారత ప్రభుత్వ అధికార యంత్రాంగ సంస్కృతితో పరిచయం లేని వారికి, నేను పైన పేర్కొన్న సంఘటనలన్నీ చాలా చిన్నవిగా లేదా నవ్వులాటగా అనిపించవచ్చు. కానీ ఈ చిన్న చిన్న మార్పులే ఐసిఎఫ్‌లో ఒక విప్లవాత్మక మార్పు కాకపోయినా, ఒక గొప్ప మార్పుకు పునాది వేశాయి.

ఆ రోజులు చాలా సులువుగా గడిచిపోయాయి. కొత్త బాధ్యతలను అర్థం చేసుకోవడం, వ్యక్తిగత విషయాలను చూసుకోవడంలో మునిగిపోవడం వల్ల, నా అసలు లక్ష్యం గురించి ఆలోచించడానికి నాకు సమయం దొరకదని, కాస్త ఉపశమనం లభిస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ ఆ లక్ష్యం గురించిన ఆలోచన ఎప్పుడూ నా మనస్సులోనే మెదులుతూ, తరచుగా నన్ను తొందరపెడుతూ ఉండేది. కవి తాబన్ అబ్దుల్ హై విషయంలో జరిగినట్లే, అది నన్ను కూడా తీవ్ర అసహనానికి గురిచేసేది.

దేఖ్ ఉస్ కో ఖ్వాబ్ మే జబ్ ఆంఖ్ ఖుల్ జాతీ హై సుబహ్
క్యా కహూఁ మై క్యా ఖయామత్ ముఝ్ పే తబ్ లాతీ హై సుబహ్

(కలలో ఆమెను చూసి నేను ఉదయాన్నే నిద్రలేచేసరికి, ఆ ఉదయం నాలో ఎంతటి అలజడిని, అశాంతిని నింపుతుందో నేను మాటల్లో చెప్పలేను.)

(ఇంకా ఉంది)

Exit mobile version