Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే భారత్ – ట్రైన్ 18 కథ-8

[వందే భారత్ రైలు రూపకర్త సుధాంశు మణి అనుభవాల కథనం ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ ను తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]

అధ్యాయం 7: తెలియనితనాన్ని ఒప్పుకునేవాడే.. అసలైన జ్ఞాని!

ఏప్రిల్ 2017 ప్రారంభం నాటికి, ఐ.సి.ఎఫ్.లో ఉన్న ప్రతి ఒక్కరికీ మేము ఏదో ఒక ప్రత్యేకమైన పని చేయబోతున్నామని, ఒక అపూర్వమైన విజయం సాకారం కాబోతోందని అర్థమైంది. భారతీయ రైల్వేల చరిత్రలోనే ఇంతటి భారీ స్థాయి ప్రాజెక్టును చేపట్టడం ఇదే మొదటిసారి. మొదటి నుండి ఒక సరికొత్త, ఆధునిక ట్రైన్ సెట్‌ను నిర్మించడానికి తాము ఒక ఉత్సాహభరితమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నామని కోర్ టీమ్‌కు తెలుసు.

మనం ఎక్కడ ఉన్నాం?

జనవరి నుండి మేము నిర్వహించిన అనేక సమావేశాల కొనసాగింపుగా, ఈసారి మరింత స్పష్టమైన, కేంద్రీకృత విధానాన్ని అవలంబించాము. ఫ్రాన్స్ మినహా దాదాపు అన్ని దేశాలు అండర్-స్లంగ్ ఎలెక్ట్రిక్స్‌తో కూడిన ‘డిస్ట్రిబ్యూటెడ్ పవర్ ట్రైన్ సెట్స్’ (రైలు చివర్లలో పవర్ యూనిట్లు లేకుండా కేవలం క్యాబ్‌లు మాత్రమే ఉండి, రైలు కింద విద్యుత్ వ్యవస్థ అమర్చబడి ఉండే విధానం) వైపు మొగ్గు చూపడంతో మా వద్ద అపారమైన సమాచారం, జ్ఞానం అందుబాటులో ఉన్నాయి. వావ్రే, శ్రీనివాస్ భారీ ఎత్తున సమాచారాన్ని సేకరించారు. వారు భారతదేశంలోని, ఇంకా అవసరమైన మేరకు విదేశాలలోని ప్రధాన తయారీదారులు, సరఫరాదారులతో కూడా సంప్రదింపులు జరిపారు; ఐ.సి.ఎఫ్ దేశంలోని సమర్థులైన తయారీదారులతో కలిసి సన్నిహితంగా పనిచేయడం చాలా అవసరమని భావించాము. మన డిజైన్ మన పరిస్థితులకు, మన వాస్తవాలకు అనుగుణంగా ఉండాలి.

కాగితపు నిపుణులు ఎల్లప్పుడూ ఆచరణ సాధ్యం కాని, గాల్లో దీపాల్లాంటి ఆలోచనలతో మా ముందుకు వచ్చేవారు. వారికి ఆ అంశాలపై ఏదో లోతైన అవగాహన ఉందని కాదు, కేవలం వారు వాటి గురించి ఎక్కడో చదవడమో లేదా చూడడమో చేశారు కాబట్టి అలా అనేవారు. ఇది కేవలం ఒక తాత్కాలిక వ్యామోహంతో కూడిన వ్యవహారమే తప్ప, వారి సూచనలలో ఎటువంటి చిత్తశుద్ధి ఉండేది కాదు. మాకు ప్రాజెక్ట్ మంజూరు కావడానికి ముందు బోర్డులో నేను ప్రెజెంటేషన్లు ఇచ్చిన సందర్భాలు నాకు గుర్తున్నాయి; అక్కడకు వచ్చే చాలా మంది క్యాజువల్ అటెండీలు (అనవసర వ్యక్తులు) అందరి దృష్టిని ఆకర్షించడానికి, విషయాన్ని పక్కదారి పట్టించడానికి లేనిపోని అడ్డంకులు సృష్టించేవారు. ఆ సమయంలో మాకు తోచిన విధంగా మేము వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేవాళ్లం, కానీ మా డిజైన్ ఎలాంటి అనవసర ఆర్భాటాలు లేని ‘నో ఫ్రిల్స్’ (సరళమైన) డిజైన్‌గా ఉండాలని స్పష్టంగా ఉన్నాము. ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి అత్యుత్తమ ఫలితాన్ని ఇచ్చేలా మోడరన్ ఫీచర్లతో కూడిన రైలు డిజైన్ అది. ‘అతి మంచి అనేది మంచికి శత్రువు’ (the best is the enemy of the good) అనే సూత్రాన్ని మేము గట్టిగా నమ్మాము. ఈ క్రింది ఫీచర్లను పూర్తిగా పక్కన పెట్టాము:

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడవగలిగే, గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ధృవీకరణ పరీక్షలకు తట్టుకోగలిగే ట్రైన్ సెట్‌ను రూపొందించడమే మా ప్రాథమిక అవసరం. ఎలాంటి వివరణాత్మక పనిని ప్రారంభించడానికైనా ముందు, ఈ రైలు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలనే దానిపై మాకు స్పష్టత ఉండాలి – అంటే ఇది శతాబ్ది లాంటి పగటిపూట ప్రయాణించే రైలా? లేదా రాజధాని లాంటి రాత్రిపూట ప్రయాణించే రైలా? భారతీయ రైల్వేలలో కేవలం కొన్ని విభాగాలలో మాత్రమే, బహుశా ఢిల్లీ-భోపాల్ విభాగంలో (సుమారు 700 కి.మీ) మాత్రమే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడపడం సాధ్యమవుతుంది కాబట్టి, ఇది శతాబ్ది కంటే వేగంగా వెళ్లే ఒక పగటిపూట ప్రయాణించే రైలుగానే ఉండాలి.

ప్రతిపాదిత ట్రైన్ సెట్ ముఖ్యమైన లక్షణాల స్థితిని తెలియజేసేలా ఒక వివరణాత్మక పట్టికను తయారు చేయడం, వాటిని మూడు విభాగాలుగా విభజించడం మా తదుపరి తక్షణ పని: (1)మేము ఇప్పటికే సాధించిన లేదా దాదాపు సాధించే దశకు చేరుకున్న రంగాలు, (2) దిగుమతులతో సహా తయారీ వెండర్లను సరైన రీతిలో ఎంపిక చేసుకోవడం ద్వారా మనం అనుకున్నది సాధించగల రంగాలు – కానీ ఇవి కచ్చితంగా ఐ.సి.ఎఫ్. రూపొందించిన స్పెసిఫికేషన్లు, డ్రాయింగ్‌ల ప్రకారమే ఉండాలి, (3) కొంతమంది ఉన్నత స్థాయి నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణ/సహాయం ఉంటేనే మనం సాధించగల రంగాలు.

మేము ఇంతకుముందు కూడా ఒక పట్టిక తయారు చేశామని నేను పేర్కొన్నాను, కానీ అది చాలా ప్రాథమికమైనది. ఇప్పుడు మేము ప్రతి అంశానికి ఒక విభాగాన్ని (కేటగిరీ) కేటాయిస్తూ, ఒక సమగ్రమైన పట్టికను సిద్ధం చేశాము. మా ఉత్సాహంలో మా సామర్థ్యాన్ని మేము అతిగా అంచనా వేసుకోకుండా, మా ఆకాంక్షకు, వాస్తవానికి మధ్య ఉన్న వ్యత్యాసాలను నిష్పక్షపాతంగా బయటపెట్టేలా మేము ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి వచ్చింది. ఆ పట్టికను ఇక్కడ పూర్తిగా పొందుపరచడం సాధ్యం కాదు, పైగా అనవసరం కూడా, అందుకే దాని సంక్షిప్త సారాంశాన్ని మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను.

అంశం మనం ఎక్కడ ఉన్నాం?
కార్ బాడీ షెల్ డిజైన్, పెయింటింగ్‌తో సహా తయారీ మేము ఈ పనిని ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. కానీ అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగాలనే ఉద్దేశం మనకు ఉంటే, దానికి కావలసిన నాణ్యత, ఖచ్చితత్వం మన వద్ద లేవు.

కార్ బాడీతో పాటు దాని ఫిక్చర్‌లు, టూలింగ్ మరియు ప్రాసెస్‌లను మరింత ఖచ్చితత్వంతో, మెరుగైన నాణ్యతతో రూపొందించడానికి మనకు నిపుణుల మార్గదర్శకత్వం అవసరం. తయారీ సమయంలో కూడా వారి పర్యవేక్షణ అవసరమవుతుంది.

గంటకు 180 కి.మీ వేగానికి సరిపోయేలా ‘ఫుల్లీ సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్స్’ కలిగిన బోగీ

 

అయితే, భారతీయ రైల్వేస్‌లో గంటకు 180 కిలోమీటర్ల పరీక్షా వేగంతో నడపడానికి తగిన కోచ్ బోగీ డిజైన్ గానీ, లేదా ఫుల్లీ సస్పెండెడ్ మోటార్లను అమర్చడానికి వీలైన బోగీ గానీ మన వద్ద లేదు. నిజానికి మనకు అలాంటిది డిజైన్ చేసే సామర్థ్యం ఉందా?

మేము గతంలో చాలా బోగీలను డిజైన్ చేశాము. భారతీయ రైల్వేలలో ఈ క్లిష్టమైన, భారీ పనిని చేపట్టగల డిజైన్ వింగ్ ఏదైనా ఉందంటే అది కేవలం ఐ.సి.ఎఫ్. మాత్రమే.

ఆర్‌డిఎస్‌ఓ తో సహా భారతీయ రైల్వేలు ఇప్పటివరకు చేసింది ఏంటంటే – విదేశాల నుండి తెచ్చుకున్న డిజైన్‌లలో చిన్నపాటి మార్పులు చేయడం లేదా ఉన్న బోగీలనే కొద్దిగా మార్చడం మాత్రమే (అవి లోకోమోటివ్‌లు కావచ్చు లేదా కోచ్‌లు కావచ్చు). భారతీయ రైల్వేలు రూపొందించిన అన్ని కొత్త రోలింగ్ స్టాక్‌లు కూడా విదేశాల నుండి వచ్చిన డిజైన్ ఆధారంగా మార్చబడినవే. ఉదాహరణకు: WAP సిరీస్ లోకోమోటివ్‌లు (ఇవి WDM4 లోకోమోటివ్‌లతో పాటు జనరల్ మోటార్స్ నుండి పొందిన ఫ్లెక్సి-కాయిల్ బోగీల సవరించిన వెర్షన్లను కలిగి ఉన్నాయి) లేదా WAG/WDG సిరీస్ హై-పవర్ ఫ్రైట్ లోకోమోటివ్‌లు (ఇవి 6000 hp హిటాచీ లోకోమోటివ్‌ల నుండి పొందిన యూనిడైరెక్షనల్-TM టైప్ హై-అడ్హెషన్ బోగీల రీడిజైన్ వెర్షన్లను కలిగి ఉన్నాయి) మొదలైనవి. భారతీయ రైల్వేలలో ఎవరూ కూడా మొదటి నుండి ఒక బోగీని పూర్తిగా డిజైన్ చేసి, సిరీస్ ప్రొడక్షన్ చేయలేదు. ఎల్‌హెచ్‌బి కోచ్ బోగీని ఫుల్లీ సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్లకు  అనువుగా మార్చవచ్చా అని గతంలో కొన్ని అరకొర ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ విధానమే తప్పు, ఎందుకంటే ఆ బోగీ అలాంటి మార్పులకు ఏమాత్రం సరిపోదు. మనం ఎల్‌హెచ్‌బి బోగీలో ఏసి కోచ్‌ల కోసం ఆల్టర్నేటర్‌ను కూడా సరిగ్గా అమర్చలేకపోయాము, ఇక ట్రాక్షన్ మోటార్ (TM) సంగతి దేవుడెరుగు!
ట్రైన్ 18 (Train 18) కి అత్యంత అవసరమైన ట్రాక్షన్ మోటార్లను మోయగల కోచ్ బోగీ డిజైన్ అసలు అందుబాటులోనే లేదు; ఇది పూర్తిగా భిన్నమైన వ్యూహం, ఎందుకంటే మనం మొదటి నుండి ఒక సరికొత్త బోగీని స్క్రాచ్ నుండి డిజైన్ చేయాల్సి ఉంది.

మేము దీనిని చేయగలము, కానీ ఒక స్థిరపడిన మరియు నిరూపితమైన ఏజెన్సీ ప్రత్యక్ష మార్గదర్శకత్వం లేకుండా ఇది సాధ్యం కాదు; ఒకసారి డిజైన్ సిద్ధమై, కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా ధృవీకరించబడిన తర్వాత, ఫ్రేమ్, ఇంకా భాగాల తయారీ కోసం ఐ.సి.ఎఫ్, సమర్థవంతమైన భారతీయ కంపెనీలు రెండూ రంగంలోకి దిగుతాయి; చాలా పరిమితమైన దిగుమతులతో, మెజారిటీ భాగాలను భారతదేశంలోనే సేకరించడం సాధ్యమవుతుంది.

రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో కూడిన సమర్థవంతమైన 3-ఫేజ్ IGBT ప్రొపల్షన్ వ్యవస్థ దాదాపు సాధించే దశకు వచ్చాము. ఐ.సి.ఎఫ్ ఆర్డర్ చేసిన 3-ఫేజ్ ఎలెక్ట్రిక్స్ మూల్యాంకనం ఆధారంగా మరియు ఒక భారతీయ కంపెనీ చేసిన గొప్ప పరిశోధనల ఫలితంగా – రైలులోనే అత్యంత ఖరీదైన ఈ భాగాన్ని, మరికొంత అదనపు పరిశోధనతో స్వదేశీయుంగానే అభివృద్ధి చేయవచ్చని తెలుసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఐ.సి.ఎఫ్ అన్ని పక్షాల మధ్య సజావుగా పనిచేసే వాతావరణాన్ని మరియు సమన్వయాన్ని ఏర్పరుస్తుందనేది స్పష్టమైంది.
ట్రైన్ కంట్రోల్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (TCMS) పైన పేర్కొన్న విధంగానే, దాదాపు సాధించే దశకు చేరుకున్నాము.
ఆధునిక ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (PIS) పైన పేర్కొన్న విధంగానే, దాదాపు సాధించే దశకు చేరుకున్నాము.
స్మార్ట్ ట్రైన్ కాన్సెప్ట్‌లు ఈ సామర్థ్యం భారతదేశంలోనే ఉంది. దీనికి కొన్ని తీవ్రమైన ప్రయోగాలు, రూపాంతరాలు  అవసరమవుతాయి, కానీ దీని కోసం మేము ఎటువంటి విదేశీ వనరులను ఆశ్రయించబోవడం లేదు.
ఆకర్షణీయమైన మరియు ఎర్గోనామిక్‌గా (సౌకర్యవంతంగా) రూపొందించిన ఇంటీరియర్స్ (లోపలి అలంకరణ) మన ఇంటీరియర్స్ అధ్వాన్నంగా ఉంటాయని మనపై ఎప్పుడూ విమర్శలు వచ్చేవి. భారతీయ రైల్వేల సిబ్బందికి ఇంటీరియర్స్ గురించి పెద్దగా అవగాహన లేదు; అన్నింటికంటే ముఖ్యంగా వారు ఇంజనీర్లు, ఇంటీరియర్ డిజైనర్లు కారు.

మన బాడీ షెల్‌కు సరిపోయే డిజైన్ ఉండి, ఐ.సి.ఎఫ్ పని ప్రదేశాలలో సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ఇంటీరియర్స్‌ను అమర్చడానికి వీలుగా ఉంటే, భారతీయ కంపెనీల ద్వారా దీనిని చక్కగా అమలు చేయడం సాధ్యపడుతుంది. మేము పాతకాలపు, నిస్తేజమైన, విసుగు పుట్టించే భారతీయ రైల్వే డిజైన్ల వలయం నుండి బయటపడాలి. మాకు అత్యుత్తమమైన, కానీ ఆచరణ సాధ్యమైన కాన్సెప్ట్‌లను అందించే, క్లిష్టమైన వస్తువుల సరఫరాదారుల జాబితాను కూడా సూచించగల ఒక ఏజెన్సీ కోసం వెతకాలి. ఈ డిజైన్ ప్రకారం కొన్ని సమర్థవంతమైన భారతీయ కంపెనీల చేత తయారీ చేయించడం చాలా వరకు సాధ్యమే, ముఖ్యంగా మెట్రో కోచ్‌ల కోసం ఇలాంటి పనులు చేసే కంపెనీల ద్వారా ఇది సులభం అవుతుంది.

ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలకు సరితూగే టాయిలెట్లు పైన పేర్కొన్న విధంగానే.
దివ్యాంగులైన ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు పైన పేర్కొన్న విధంగానే.
బ్రేక్ సిస్టమ్ (బ్రేకింగ్ వ్యవస్థ) మనకు సరికొత్త వ్యవస్థ అవసరం, ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసం తయారుచేసే ఈ ఆధునిక రైలులో త్వరలోనే పాతబడిపోయే వ్యవస్థను ఉంచి మనం భారాన్ని మోయలేము. ప్రస్తుతం వాడుకలో ఉన్న బ్రేక్ సిస్టమ్స్‌ను అధ్యయనం చేసిన తర్వాత మేము మా అవసరాలను స్పష్టం చేస్తాము, మా స్పెసిఫికేషన్లు మరియు ఎన్వలప్ డ్రాయింగ్‌లను సిద్ధం చేస్తాము. మొదటి రెండు ట్రైన్ సెట్ల కోసం ప్రపంచంలోని రెండు ప్రధాన బ్రేక్ తయారీదారులలో ఒకరి నుండి దిగుమతి చేసుకుంటాము. ఇందులో ఎలాంటి ప్రయోగాలు చేయబోము, ఎందుకంటే ఇది భద్రతకు సంబంధించినది, రైలు పనితీరుపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్/క్యాబ్ సిగ్నలింగ్ మొదలైన వాటితో అనుసంధానం మేము చేయగలిగినంత ఉత్తమంగా చేస్తాము, కానీ దీనిని ప్రాజెక్టుకు అడ్డంకిగా మారనివ్వము. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ అవసరం ఇంకా పూర్తిగా నిర్వచించబడలేదు.
మైనర్ స్ట్రక్చరల్ అసెంబ్లీలు దీనిని అంతర్గతంగా చేయడానికి ఐ.సి.ఎఫ్ తన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలి.
మెకానికల్ మరియు ఎలెక్ట్రికల్ అసెంబ్లీలు దీనిని అంతర్గతంగా చేయడానికి ఐ.సి.ఎఫ్ తన నాణ్యత ప్రమాణాలను సిద్ధం చేసుకోవాలి.
కేబ్లింగ్ ఒక కన్సల్టెంట్ సహాయంతో దీనిని అంతర్గతంగా చేయడానికి ఐ.సి.ఎఫ్ తన డిజైన్ నైపుణ్యాలను, క్వాలిటీ కంట్రోల్‌ను మెరుగుపరుచుకోవాలి.
ఆసిలేషన్, బ్రేక్ మరియు ఇతర పరీక్షల కోసం ఆర్‌డిఎస్‌ఓ రంగంలోకి దిగడానికి ముందు ఐ.సి.ఎఫ్‌ లోనే వాలిడేషన్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ దీనిని అంతర్గతంగా చేయడానికి ఐ.సి.ఎఫ్ తన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలి.
ఇతరాలు మేము ముందుకు సాగుతున్న కొద్దీ వీటిని పరిష్కరించుకోవాలి.
బయట నుండి కొనుగోలు చేయవలసిన కొన్ని ప్రధాన వస్తువులు

 

ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోసం తిప్పగలిగే (rotatable) సీట్లతో సహా ఎయిర్‌క్రాఫ్ట్ తరహా సీట్లు

 

 

 

రిట్రాక్టబుల్ స్టెప్స్‌తో కూడిన ఎలెక్ట్రికల్ ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు.

 

ప్యాసింజర్ ఏరియాకి ఇరువైపులా కాంటాక్ట్‌లెస్ స్లైడింగ్ డోర్లు

 

ఒకవేళ దిగుమతి చేసుకుంటే, సమర్థుడైన భారతీయ భాగస్వామి అవసరం.

భారతదేశంలో ఇన్ని విమానాలు నడుస్తున్నప్పటికీ, ఇటువంటి సీట్లను తయారుచేసే ఒక్క తయారీదారుడు కూడా లేడు. మేము దిగుమతికి మొగ్గు చూపక తప్పదు. అదే సమయంలో స్వదేశీ తయారీ ప్రక్రియను కూడా ఏదైనా సమర్థవంతమైన సంస్థ ద్వారా ప్రారంభించాలి.

 

భారతదేశంలో ఏ తయారీదారు కూడా లేరు, కాబట్టి ఈ డోర్ల విషయంలో కూడా మనం పైన పేర్కొన్న ప్రణాళికనే అనుసరిస్తాము.

 

పైన పేర్కొన్న విధంగానే

నేను పైన పేర్కొన్నట్లుగా, ఆ జాబితా ఇంకా చాలా పెద్దదే, కానీ మా డ్రాయింగ్‌లు, స్పెసిఫికేషన్ల ప్రకారం వస్తువులను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్న, సమర్థవంతమైన భారతీయ కంపెనీలను మెజారిటీ అంశాల కోసం గుర్తించగలిగాము. ఒకవేళ దిగుమతి తప్పనిసరి అనిపిస్తే, మేము మళ్లీ మొదటికి వచ్చి భారతదేశంలోనే ఆ వస్తువు దొరికేలా మా అవసరాలలో చిన్నపాటి మార్పులుచేయడానికి ప్రయత్నించేవాళ్లం. మేము ఖర్చును అదుపులో ఉంచుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే అంతర్జాతీయంగా చలామణిలో ఉన్న సమానమైన ట్రైన్ సెట్ ధరలో 50% కంటే చాలా తక్కువ ఖర్చుతోనే ఈ నమూనాను నిర్మించడం మాకు అత్యంత అవసరం. షేక్‌స్పియర్ రాసిన ‘కింగ్ హెన్రీ IV’ నాటకంలో లార్డ్ బార్డాల్ఫ్ చెప్పిన ఈ మాటలు ఇక్కడ మాకు సరిగ్గా సరిపోతాయి, “మనం ఒక భవనాన్ని నిర్మించాలనుకున్నప్పుడు, మొదట స్థలాన్ని సర్వే చేస్తాం, ఆపై నమూనాను (model) గీస్తాం; ఇంటి రూపాన్ని చూశాక, దాని నిర్మాణానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తాం; ఒకవేళ ఆ ఖర్చు మన సామర్థ్యానికి మించి ఉందని తెలిస్తే, అప్పుడు మనం చేసేదేమిటి? మళ్లీ కొత్తగా మరో నమూనాను గీస్తాం.”

కానీ మన సామర్థ్యానికి – అవసరానికి మధ్య ఇంతటి పెద్ద వ్యత్యాసం ఉన్న రంగాల సంగతి ఏమిటి? అన్నింటికంటే మొదట, ఈ వ్యత్యాసాలను నిజాయితీగా గుర్తించడం చాలా ముఖ్యం. షేక్‌స్పియర్‌ను మరోసారి గుర్తుచేసుకుంటే, ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకంలో టచ్‌స్టోన్ ఇలా అంటాడు, “మూర్ఖుడు తాను జ్ఞానినని అనుకుంటాడు, కానీ జ్ఞానికి తాను మూర్ఖుడనని తెలుసు”.

మన లక్ష్యాలు ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ, మనం క్షేత్రస్థాయి వాస్తవాలకు కట్టుబడి ఉండాలని నేను స్పష్టం చేశాను. మేము మూర్ఖపు తెలివితో కాకుండా, తెలివైన అమాయకత్వంతో ముందుకు సాగాలనుకున్నాము. దీనిని మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సి వచ్చింది. పని పూర్తి కాకముందే జ్ఞానిలా నటించడం కంటే, ఇప్పుడే మూర్ఖుడిగా ఉండి ఆ తర్వాత జ్ఞానాన్ని సంపాదించడం చాలా ఉత్తమం.

పట్టికను పరిశీలిస్తే, చాలా రంగాలలో మనం ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నామని మాకు అర్థమైంది, కానీ మేము కొంతమంది సహాయం లేదా మార్గదర్శకత్వం తీసుకోవలసిన మూడు ప్రధాన రంగాలు ఉన్నాయి. మొదటిది – గంటకు 180 కిలోమీటర్ల పరీక్షా వేగానికి తట్టుకోగల, రైలును మోసే ‘బోగీలు’. వీటిని భారతదేశంలో ఇంతకుముందెన్నడూ డిజైన్ చేయలేదు. నిజానికి, భారతీయ రైల్వేస్‌లో ఏ రోలింగ్ స్టాక్ బోగీని కూడా మొదటి నుండి పూర్తిగా ఇక్కడే డిజైన్ చేయలేదు. రెండూ – ‘ఎక్స్‌టీరియర్స్’, ఎందుకంటే రైలు పనితీరు పరంగానే కాక, చూసేందుకు కూడా అత్యాధునిక శైలిలో కనిపించాలి. మూడు – శరీరానికి సౌకర్యాన్ని, కళ్లకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా డిజైన్ చేయబడిన ‘ఇంటీరియర్స్’. జర్మనీలో నాకున్న అనుభవం నుండి, రోలింగ్ స్టాక్ డిజైన్ల కోసం అత్యంత సమర్థవంతమైన సలహాదారులు అందుబాటులో ఉన్నారని, పెద్ద పెద్ద రోలింగ్ స్టాక్ కంపెనీలు కూడా తమ ప్రధాన పనుల కోసం వారి సేవలను ఉపయోగించుకుంటాయని నాకు తెలుసు. అందువల్ల, ఈ క్లిష్టమైన రంగాల కోసం ఒక్కో విభాగానికి ఒక కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని మేము నిర్ణయించుకున్నాము.

మన సామర్థ్యానికి మరియు అవసరానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నేను ‘సుపీరియర్ ఇంటెలిజెన్స్’ (ఉన్నత మేధస్సు) అని పిలిచే నిపుణుల సేవల ద్వారా పూరించాలని అనుకున్నప్పుడు, డిజైన్ కన్సల్టెంట్లను నియమించుకోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇటువంటి కన్సల్టెంట్లు ఏదైనా పెద్ద బహుళజాతి కంపెనీలో సభ్యులు కానందున, మన డిజైన్ మరియు నిర్మాణ ప్రక్రియ విజయవంతం కావడంలో వారికి కూడా సమానమైన బాధ్యత ఉంటుంది. టెక్నాలజీ బదిలీ (ToT) చేసే కంపెనీలలాగా, భవిష్యత్తులో మనకు విడిభాగాలను సరఫరా చేసి లాభాలు పొందాలనే ఉద్దేశం వీరికి ఉండదు. ఒక మంచి డిజైన్‌ను అందించడమే వారి ఏకైక లక్ష్యం, మనం వారిని సరిగ్గా ఉపయోగించుకుంటే, మొదట మన సామర్థ్యాన్ని అంచనా వేసి, దానికి అనుగుణంగానే తమ భావనలను, డిజైన్లను రూపొందించేలా వారిని మలచుకోవచ్చు. ఈ రకమైన ఏర్పాట్లలో నేర్చుకునే ప్రక్రియ, కేవలం ఒప్పందం ప్రకారం డిజైన్ మరియు తయారీని పూర్తి చేయడమే కాకుండా, చాలా సమగ్రంగా ఉంటుంది. ఐ.సి.ఎఫ్ డిజైన్ సిబ్బందికి అన్ని డిజైన్ కాన్సెప్ట్‌లు మరియు ప్రక్రియల యొక్క సూక్ష్మ నైపుణ్యాలను (ఎందుకు అలా చేయాలి అనే జ్ఞానాన్ని) నేరుగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత, ఈ డిజైన్లను తయారీ దశకు తీసుకెళ్లినప్పుడు, కన్సల్టెంట్లతో నిరంతర పరస్పర సమన్వయం ద్వారా ఆ పనిని ఎలా చేయాలనే లోతైన అవగాహన కూడా పెంపొందుతుంది.

ఐ.సి.ఎఫ్ లోని మా బృందాల విషయంలో ఇది నిజమవడం నేను కళ్లారా చూశాను; వారు తమ సామర్థ్యాన్ని ఎంతో మెరుగుపరుచుకున్నారు, ఇది భవిష్యత్ ప్రాజెక్టులలో ఐ.సి.ఎఫ్ కు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది మా మొదటి ప్రయత్నం కావడం వల్ల, భవిష్యత్తులో నిర్మించే రైళ్లను మరింత మెరుగుపరచడానికి చాలా పెద్ద అవకాశం లభిస్తుంది. టెక్నాలజీ బదిలీ (ToT) కోసం వచ్చే ఒక బహుళజాతి కంపెనీ కంటే, ఇటువంటి కన్సల్టెంట్లు భారతదేశంలో లభించే వనరులను ఉపయోగించుకోవడానికి, ఇంకా కొత్త ఆవిష్కరణలతో సహా సాధ్యమైన అన్ని మెరుగుదలలను పరిశీలించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

మేము వారితో కలిసి పనిచేస్తామని కాంట్రాక్ట్‌లో స్పష్టంగా నిబంధనలు పెట్టాలనుకున్నాము. వారు గీసే ప్రతి ఒక్క లైన్ లేదా వారు రాసే ప్రతి ఒక్క పదం కూడా మన బృందంతో కలిసే చేయాలి, తద్వారా అన్ని డిజైన్ల వెనుక ఉన్న ‘ఎందుకు’ అనే కారణాలు మాకు తెలుస్తాయి. రోజు ముగిసేసరికి, కన్సల్టెంట్ల నుండి వచ్చిన ఇన్పుట్‌లతో సంబంధం లేకుండా, ఈ ప్రక్రియలో అభివృద్ధి చేసిన డ్రాయింగ్‌లు, స్పెసిఫికేషన్‌లపై పూర్తి యాజమాన్య హక్కులు ఐ.సి.ఎఫ్.కే చెందుతాయి. భారతీయ రైల్వేల చరిత్రలోనే మొదటిసారిగా, భవిష్యత్తులో దీని విలువ ఎంత ఉన్నప్పటికీ, మనమే మేధో సంపత్తి హక్కులకు నిజమైన యజమానులం అవుతాము; భవిష్యత్తులో మళ్లీ ఏ ఇతర ఉన్నత మేధస్సు గల సంస్థను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ఉత్పత్తిపై పూర్తి యాజమాన్యం మనకే ఉంటుంది.

ఏం చేయాలో స్పష్టమైంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్లు, “మీరు సన్నద్ధం కావడంలో విఫలమైతే, మీరు విఫలం కావడానికి సిద్ధపడుతున్నట్లే”, కాబట్టి ఇక చర్యలను ప్రణాళికాబద్ధంగా రూపొందించి, త్వరగా అమలు వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. పూర్తి ప్రశాంతతతో ప్రణాళికలు వేసుకునే వెసులుబాటు మాకు లేదు, పైగా అమలు చేసే వేగం సూపర్ సోనిక్‍లా ఉండాలి. ఈ సమయంలో నేను ఒక చిన్న వ్యూహాన్ని ఉపయోగించాను; సి.ఆర్.బి పదవీ విరమణ చేయడానికి ముందు, అంటే జూలై 2018 నాటికే మనం ఈ ప్రోటోటైప్‌ను సిద్ధం చేయాలని నేను బృందానికి చెప్పాను. నేను బాస్‌ను కాబట్టి ఎవరూ నన్ను చూసి నవ్వలేదు. కానీ వారి ముఖాల్లోని నమ్మశక్యం కాని భావం మరియు ఆశ్చర్యం బహుశా “ఈయనకు పిచ్చెక్కింది” అనే అర్థాన్ని ఇచ్చి ఉండవచ్చు. అయినప్పటికీ, త్రివేది బృందంలోని ఇతర ముఖ్య సభ్యులతో కలిసి టైమ్‌లైన్ సమస్యలను విడిగా పరిష్కరించడం ప్రారంభించారు. అది పని చేసింది. తమపై ఉన్న బాధ్యత నుండి త్వరగా బయటపడాలనో ఏమో గానీ, మా ప్లానింగ్ మరియు డిజైన్ విభాగాల వారు ఆకట్టుకునే ‘గాంట్ చార్ట్‌’ లతో కూడిన ఒక ప్రణాళికను సిద్ధం చేశారు, అది జూన్ 2018 నాటికే ప్రోటోటైప్ సిద్ధం కాగలదని చూపించింది. ఎవరు ఎవరిని బురిడీ కొట్టిస్తున్నారో దేవుడికే తెలియాలి, కానీ గాలిబ్ మా కోసం ఈ పరిస్థితిని అంచనా వేశారు, అలాగే ఫాని బదాయుని ఒక బోధకుడిని కూడా ఆహ్వానించారు:

హమ్‌కో మాలూమ్ హై జన్నత్ కీ హకీకత్ లేకిన్

దిల్ కే బెహ్లానే కో గాలిబ్ యే ఖయాల్ అచ్చా హై

(స్వర్గం ఉనికి గురించిన నిజం నాకు తెలుసు, కానీ నా హృదయాన్ని ఆనందంగా ఉంచడానికి ఈ ఆలోచన బాగుంది.)

అప్నీ జన్నత్ ముఝే దిఖ్లా నా సకా తూ వాయిజ్

కూచా-ఎ-యార్ మే చల్ కే దేఖ్ లే జన్నత్ మేరీ

(ఓ బోధకుడా, నువ్వు నీ స్వర్గాన్ని నాకు ఎప్పటికీ చూపించలేకపోయావు, కానీ నా ప్రియురాలి ఇంటి సందులోకి వచ్చి చూడు, నా స్వర్గం ఇక్కడే ఉంది.)

కానీ జూన్ 2018 రావడానికి 15 నెలల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది, ఇప్పటివరకు ఒక్క కాంట్రాక్ట్ కూడా ఖరారు కాలేదు. జూన్ 18 దగ్గరపడుతున్న కొద్దీ, హ్యామ్‌లెట్‌లోని ‘ప్లేయర్ కింగ్’ లాగా నా వైపు వెటకారంగా చూస్తూ, నా బృందం నాపై షేక్స్‌పియర్ డైలాగులను విసరబోతోందా? “మన కోరికలు మరియు మన తలరాతలు పరస్పరం విరుద్ధంగా నడుస్తాయి, అందుకే మన ప్రణాళికలు ఎల్లప్పుడూ తలకిందులవుతాయి. మన ఆలోచనలు మనవే కావచ్చు, కానీ వాటి ముగింపులు మన చేతుల్లో ఉండవు”. అప్పుడు నా నిస్సారమైన వ్యూహానికి అంతకంటే పెద్ద ముగింపు ఏముంటుంది!

ఏదేమైనప్పటికీ, ఐ.సి.ఎఫ్.లో అందరి ఉత్సాహం ఆకాశాన్నంటుతోంది. మేము మా పనిని ప్రారంభించినందున, ప్రాజెక్ట్ గురించి అంతర్గతంగా, వెలుపల కూడా ఒక పెద్ద చర్చ సృష్టించడం చాలా అవసరం. వావ్రే, శ్రీనివాస్ ద్వయం ప్రపంచవ్యాప్తంగా ట్రైన్ సెట్స్ ట్రెండ్‌పై సమగ్ర అధ్యయనం చేసి సేకరించిన సమాచారం ఆధారంగా కొన్ని కథనాలను సిద్ధం చేశారు; వారు బోర్డుతో సహా పలువురికి ప్రెజెంటేషన్ల శ్రేణిని సిద్ధం చేశారు. వారు ప్రాజెక్ట్ రూపురేఖలను మరియు ప్రతిపాదిత టైమ్‌లైన్‌ను నొక్కి చెబుతూ వరుస సమావేశాలను నిర్వహించారు. స్టోర్స్, ఇంకా ఫైనాన్స్ విభాగాల సభ్యులతో సహా బృందంలోని ప్రతి ఒక్కరికీ ‘ట్రైన్ 18’ ప్రాజెక్ట్ పట్ల అవగాహన కల్పించారు. నిజానికి, కొందరు మినహా మిగిలిన వారందరూ ఈ గొప్ప అవకాశాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యారు. ఐ.సి.ఎఫ్ ఒక సరికొత్త, అపూర్వమైన ప్రయోగాన్ని ప్రయత్నిస్తోందని అన్ని శాఖలకు స్పష్టమైంది మరియు వారంతా అందులో భాగం కావాలని కోరుకున్నారు. మరి మేము దీనిని ఎలా ప్రారంభించాము?

అంశం (Item) మనం ఎలా ప్రారంభించాం?
కార్ బాడీ షెల్ డిజైన్, పెయింటింగ్‌తో సహా తయారీ మన డిజైన్లు, టూలింగ్, ప్రక్రియలను మరింత ఖచ్చితత్వానికి, మెరుగైన నాణ్యతకు అనుకూలంగా మార్చుకోవడం కోసం.. ఈ రంగంలో అగ్రగాములుగా ఉన్న ఒక యూరోపియన్ లేదా జపనీస్ సంస్థతో త్వరితగతిన కన్సల్టెన్సీ ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి వచ్చింది. యూరోపియన్ ప్రముఖ కంపెనీల కోసం ఇలాంటి పనులే చేసిన మూడు కంపెనీలను (ఒకటి పోలాండ్‌లో, రెండు స్విట్జర్లాండ్‌లో) ఎంపిక చేశాం. వేగవంతమైన ప్రక్రియ ద్వారా, ఈ ఒప్పందాన్ని పోలాండ్ కంపెనీకి అప్పగించాం.
180 కిమీ/గంట వేగానికి సరిపోయే ఫుల్లీ సస్పెండెడ్ టిఎమ్ బోగీ భిన్నమైన వ్యూహంతో, కన్సల్టెన్సీని మరొక పెద్ద కొనుగోలు ప్రక్రియతో కలిపి ఒక సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాం. అనుకోకుండా, పైన పేర్కొన్న అదే పోలాండ్ కంపెనీతోనే ఈ ఒప్పందాన్ని కూడా త్వరగా ఖరారు చేయడానికి మేము ముందడుగు వేశాం.
ఆధునిక 3-ఫేజ్ IGBT ప్రొపల్షన్,

ట్రైన్ కంట్రోల్ & మేనేజ్‌మెంట్ సిస్టమ్, PIS మరియు స్మార్ట్ ట్రైన్ కాన్సెప్ట్‌లు

ట్రైన్ సెట్ ఎలక్ట్రికల్స్, ఇంకా దానికి సంబంధించిన అంశాల కోసం రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఒక సమగ్ర టెండర్‌ను పిలిచాం. సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దాదాపు ఏడాది కాలంగా మూలనపడిన ఒక పాత కేసును దీని ద్వారా మళ్లీ పునరుద్ధరించాం. ఇకపై ఎటువంటి తాత్సారానికి లేదా ఆలస్యానికి తావు లేదు. మేము కొత్తగా బిడ్లను ఆహ్వానించాం, ఎవరిపైనా ఎటువంటి ప్రత్యేక ఒత్తిడి లేకుండా కేవలం మూడు నెలల వ్యవధిలోనే టెండర్‌ను ఖరారు చేశాం. ఐ.సి.ఎఫ్. ఇంతటి భారీ స్థాయి ఒప్పందాన్ని అప్పగించడం ఇదే మొదటిసారి. అంతకుముందు ఇలాంటి ఒప్పందాలను రైల్వే బోర్డు చూసుకునేది, వాటిని ఖరారు చేయడానికి సాధారణంగా దాదాపు రెండేళ్ల సమయం పట్టేది.
ఆహ్లాదకరమైన ఇంటీరియర్స్, ప్రపంచ అత్యుత్తమ ప్రమాణాలకు సరితూగే టాయిలెట్లు, దివ్యాంగులైన ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు బాడీ షెల్ డిజైన్లు సిద్ధమైన తర్వాతే ఇంటీరియర్స్ రూపకల్పన జరుగుతుంది కాబట్టి, మాకు ఇక్కడ కొంచెం సమయం దొరికింది. మేము యూరప్‌లోని కొన్ని కంపెనీలను గుర్తించి, ఐ.సి.ఎఫ్.లో వరుస ప్రెజెంటేషన్లు నిర్వహించాం. చివరకు, స్పెయిన్ మరియు ఫ్రాన్స్‌కు చెందిన ఒక సంయుక్త సంస్థకు ఈ కన్సల్టెన్సీ ఒప్పందాన్ని అప్పగించాం.
బ్రేక్ సిస్టమ్ ధరతో సంబంధం లేకుండా, సామర్థ్యం మరియు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే స్పష్టమైన ఆదేశంతో స్పెసిఫికేషన్లను త్వరగా ఖరారు చేశాం. మెకానికల్, ఎలక్ట్రికల్, సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్‌ల పరంగా బ్రేక్ సరఫరాదారు; ఎలక్ట్రికల్స్ తయారీదారు ఇద్దరూ చాలా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందని మాకు తెలుసు కాబట్టి, ఈ ఒప్పందాన్ని చాలా ముందుగానే ఖరారు చేశాం.
చిన్న చిన్న నిర్మాణ అసెంబ్లీలు

ఇతర మెకానికల్, ఎలక్ట్రికల్ అసెంబ్లీలు

ఈ పనులను చేయడం కోసం ఐ.సి.ఎఫ్. లోని ప్రధాన బృందాన్ని గుర్తించడం ప్రారంభించాం.
కేబ్లింగ్ మితిమీరిన ధరల ప్రతిపాదనల వల్ల, దేశంలో తగిన సామర్థ్యం లేకపోవడం వల్ల కన్సల్టెంట్‌ను నియమించుకునే మా ప్రయత్నం విఫలమైంది. అందువల్ల ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రికల్ పరికరాల తయారీదారు సంప్రదింపులతో, ఒక అంకితభావం కలిగిన ఐ.సి.ఎఫ్. బృందమే ఈ పనిని పూర్తి చేయాలని మేము నిర్ణయించుకున్నాం.
ఇతరాలు ప్రయాణంలో భాగంగా (పని నడుస్తున్న కొద్దీ) తర్వాత చూసుకున్నాం.
ఎయిర్‌క్రాఫ్ట్ తరహా సీట్లు, ప్లగ్ డోర్లు & కాంటాక్ట్‌లెస్ స్లైడింగ్ డోర్లు మొదలైన దిగుమతి చేసుకున్న వస్తువులు మేము అంతర్జాతీయ వనరులను  గుర్తించాం, వీటి కొనుగోలు ప్రక్రియను అత్యంత వేగవంతం  చేశాం.

అనుబంధంగా బయట నుండి సేకరించాల్సిన అన్ని వస్తువుల అభివృద్ధి, తయారీ కోసం పరిశ్రమ నుండి సమర్థవంతమైన కంపెనీలను గుర్తించడం చాలా అవసరం. రైలు యొక్క మొత్తం అంచనా వ్యయం రూ. 100 కోట్ల కంటే తక్కువగా ఉండేలా చూసుకోవడానికి, మేము పెద్ద సంఖ్యలో భారతీయ తయారీదారులను ఐ.సి.ఎఫ్.కు భాగస్వాములుగా చేరమని ప్రోత్సహించాల్సి వచ్చింది. దేశీయంగా కొనుగోలు చేసే వస్తువుల విషయంలో కూడా, సరైన వెండార్లను ఎంపిక చేసుకోవడం అనేది ఒక రోలింగ్ స్టాక్ యొక్క విజయవంతమైన అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నా సందేశం చాలా స్పష్టంగా, నిష్పాక్షికంగా ఉంది: ప్రధాన బృందమే అటువంటి వెండార్ల జాబితాను నిర్ణయిస్తుంది; అది ఓపెన్ టెండర్ అయినా, లిమిటెడ్ లేదా సింగిల్ టెండర్ అయినా – కాలయాపన చేసేందుకు ఎలాంటి ముసుగులూ, సాకులూ ఒప్పుకోబోము. ఈ ప్రాజెక్ట్‌కు తగినంత సమర్థత ఉందని మా బృందం భావించిన కంపెనీలకే మేము ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చింది, మేము సరిగ్గా అదే చేశాము – అదీ రికార్డు సమయంలో సి.డి.ఇ (CDEs) ల ద్వయం పూర్తి చిత్తశుద్ధితో పనిలో నిమగ్నమైంది. నేను వారితో ఇలా అన్నాను, “మీ ఎంపికలు చాలా హేతుబద్ధంగా ఉంటాయని నాకు తెలుసు, కాబట్టి మీరు తీసుకునే నిర్ణయమే నా నిర్ణయం కూడా.”

ప్రతి సంస్థలోనూ పని చేయడం, ఫలితాలు సాధించడం పట్ల పెద్దగా పట్టింపు లేని వ్యక్తులు కొందరుంటారు. వారు తమ చిన్న గదుల్లో కూర్చుని, కేవలం తాము సురక్షితంగా ఉండటం గురించి లేదా తమ వ్యక్తిగత ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. వారు వంకలు పెడతారు, మాటలు మారుస్తారు లేదా కాలయాపన చేస్తూ అవునని కానీ, కాదని కానీ చెప్పరు. ఇది మీకు ఎప్పటికీ ముగింపు లేని, గుండ్రంగా చుట్టల వలె కనిపించే భారతీయ మిఠాయి ‘జిలేబీ’ని గుర్తు చేయడం లేదు? నాకు ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడల్లా, నేను ఆ ఫైల్‌ను నా వద్దకు తెప్పించుకుని, నా స్వంత నిర్ణయం తీసుకునేవాడిని. ఒకవేళ ఎవరైనా అధికారులు ఆ కేసును అనవసరంగా ఆలస్యం చేస్తున్నారని గుర్తిస్తే, వారిని నా గదికి పిలిపించి, జిలేబీలు ఆర్డర్ ఇచ్చి వారికి ఆఫర్ చేసేవాడిని. “మీరు ఈ విందుకు నిజంగా అర్హులు” అని వారితో చెప్పేవాడిని. ఇది ఒక గొప్ప గౌరవం కాబట్టి, మధుమేహం ఉన్నవారు సైతం ఈ జిలేబీలను కచ్చితంగా తినాల్సిందేనని నేను గట్టిగా చెప్పేవాడిని. అధికారులు జిలేబీలు తినేలా తప్పులు చేయాలని నా ఉద్దేశం కాదు గానీ, ఆ జిలేబీ దెబ్బకు భయపడిపోయిన అధికారుల ముఖాల్లోని ఆందోళనను చూడటం నాకు, బాబుకు మంచి వినోదంగా ఉండేదని నేను ఖండించలేను. సంబంధిత అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకున్నారా లేదా అనేది చర్చించాల్సిన విషయమే, కానీ వారికి చేరాల్సిన సందేశం మాత్రం కచ్చితంగా చేరింది.

2017 మధ్య నాటికి,

జూన్ 2017 ప్రాంతంలో మా పి.ఆర్. విభాగం ఒక నివేదికను సిద్ధం చేసింది. అది విడుదల కావడానికి ముందు నా పరిశీలనకు వచ్చినప్పుడు; వావ్రే, శ్రీనివాస్ ద్వయానికి ఈ కొత్త ‘ట్రైన్ 18’ టైమ్‌లైన్ నా అంత కష్టంగా అనిపించడం లేదని నాకు అర్థమైంది. నేను ఆ నివేదికను ఇక్కడ యథాతథంగా అందిస్తున్నాను:

“ఐ.సి.ఎఫ్ 30 జూన్ 2018 నాటికి ‘ట్రైన్ 18’ ప్రోటోటైప్‌ను సిద్ధం చేయాలని యోచిస్తోంది. ఇది వేగవంతమైన యాక్సిలరేషన్, ప్రపంచ స్థాయి ప్రయాణీకుల వసతులతో కూడిన సెమీ-హై స్పీడ్ (గంటకు 180/160 కి.మీ) ట్రైన్ సెట్. అన్ని కోచ్‌లు పూర్తిగా సీల్ చేయబడిన గ్యాంగ్‌వేల ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి, దీనివల్ల ఒక కోచ్ నుండి మరొక కోచ్‌లోకి సులభంగా ప్రయాణించవచ్చు. ఇందులో ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు ఉంటాయి, ఇవి రైలు పూర్తిగా ఆగినప్పుడు మాత్రమే తెరుచుకుంటాయి మరియు మూసుకుంటాయి. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను వీక్షించడానికి వెడల్పైన కిటికీలు మరియు ఎర్గోనామిక్‌గా (సౌకర్యవంతంగా) రూపొందించిన సీట్లు ఉంటాయి. రైలు కింద అమర్చబడిన (under-slung) అత్యాధునిక, ఇంధన-సమర్థవంతమైన 3-ఫేజ్ IGBT ఆధారిత ప్రొపల్షన్ సిస్టమ్‌తో కూడిన ఈ రైలులో పాసెంజర్స్ ఏరియా చాలా విశాలంగా ఉంటుంది. అన్ని కోచ్‌లలో ఆన్-బోర్డ్ వై-ఫై, ఇన్ఫోటైన్‌మెంట్, జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సౌకర్యాలు కల్పించబడతాయి. రైలు లోపల ఆకర్షణీయమైన ఇంటీరియర్స్, ఇంకా డిఫ్యూజ్డ్ ఎల్‌ఈడీ లైటింగ్ ఉంటాయి. ఈ కోచ్‌ల టాయిలెట్లు ‘జీరో-డిశ్చార్జ్ వ్యాక్యూమ్-ఎవాక్యుయేషన్ బయో-టాయిలెట్లు’, ఇవి టచ్-ఫ్రీ ఫిట్టింగ్‌లతో అమర్చబడి ఉంటాయి. ప్రయాణంలో కుదుపులు, ప్రకంపనలు లేకుండా ఉండటానికి, ఈ రైలులో మెరుగుపరచబడిన మెకానికల్ కప్లర్లు, ఫుల్లీ-సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్లతో కూడిన ఆధునిక బోగీలు, న్యూమాటిక్ సెకండరీ సస్పెన్షన్, ఇంకా యాంటీ-రోల్ బార్ అమర్చబడతాయి. ఈ రైలులో మైక్రోప్రాసెసర్ ఆధారిత ఆధునిక ఎలెక్ట్రో-న్యూమాటిక్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది, ఇది తక్కువ బ్రేకింగ్ దూరంతో సురక్షితమైన బ్రేకింగ్‌ను అందించగలదు. ఈ రైలులో యాంటీ-క్లైంబింగ్ ఫీచర్‌తో కూడిన సెమీ-పర్మనెంట్ కప్లర్ల వంటి కొత్త కాన్సెప్ట్‌లతో భద్రత మరింత మెరుగ్గా ఉంటుంది. భారతీయ రైల్వేలలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ‘ట్రైన్ 18’ ఒక ఆధునిక ట్రైన్ సెట్‌గా నిలుస్తుందని, ఇది పూర్తిగా సరికొత్త ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇస్తోంది.”

అద్భుతం! మొదటి లైన్ మినహా వారు అన్ని విషయాలనూ కచ్చితంగా పట్టుకున్నారు. లేదా వారు నిజంగానే నా వ్యూహాన్ని పూర్తిగా నమ్మేశారా? వారు రాత్రింబగళ్లు కష్టపడి పనిచేస్తారని, ప్రతి ఒక్కరినీ అదనంగా శ్రమించేలా చేస్తారని నాకు తెలుసు, కానీ ఇది ఎంతటి కష్టమైన పోరాటం? నా వ్యూహమే నా వైపు చూసి నవ్వుతూ, నన్ను కొంత అయోమయానికి గురిచేసింది. నా శ్రేయోభిలాషి, నమ్మకస్తుడు మరియు పాత ఐ.సి.ఎఫ్ ఉద్యోగి అయిన ఒకరు నన్ను ఓదారుస్తూ, “సార్! ఏం పర్వాలేదు సార్. ఐ.సి.ఎఫ్ లో జూన్ 18 నాటికి రైలును బయటకు తీసుకురావాలనే లక్ష్యం కచ్చితంగా సాధించదగినదే” అన్నారు. బాబు కూడా తన తల ఊపాడు. నాకు బెర్లిన్ (జర్మనీ) లో ఉన్న రోజుల్లోని ఒక జర్మన్ సామెత గుర్తుకొచ్చింది – “దాస్ బ్లూ వోమ్ హిమ్మెల్ వెర్‌స్ప్రెచెన్” (Das Blaue vom Himmel versprechen), దీని అర్థం సాధ్యం కాని వాటిని లేదా ఆకాశంలో ఉన్నవన్నీ తెచ్చి ఇస్తానని వాగ్దానం చేయడం.

నిజమే! అతను షేక్స్‌పియర్ రాసిన ‘మచ్ అడో అబౌట్ నథింగ్’ నాటకం చదివి ఉండకపోవచ్చని నాకు తెలుసు, అయినప్పటికీ నేను బెనెడిక్ పాత్ర చెప్పిన మాటలను అతనిపై ప్రయోగించాను: “నా గుర్రానికి కూడా నీ నాలుకకున్నంత వేగం ఉంటే ఎంత బాగుండు!”

(ఇంకా ఉంది)

Exit mobile version