[వందే భారత్ రైలు రూపకర్త సుధాంశు మణి అనుభవాల కథనం ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ ను తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]
అధ్యాయం 8: పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విధానంలో విక్రేతలు (వెండర్స్) భాగస్వాములు కాగలరా?
మా విజయానికి గల ముఖ్యమైన కారణాలలో ఒకటి.. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ద్వారా పలువురు విక్రేతలకు ఆర్డర్లు ఇస్తూ, పరికరాలు, విడిభాగాల అభివృద్ధి, తయారీ మరియు సరఫరా కోసం సమర్థవంతమైన ఒప్పందాలను (కాంట్రాక్టులను) కుదుర్చుకోవడం. ఇక్కడ తలెత్తే ప్రశ్నలు ఏమిటంటే:
మీరు మీ విక్రేతలను మీ భాగస్వాములుగా చేసుకోగలరా?
పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అనేది ఒక అడ్డంకిగా మారుతుందా లేదా ఒక సాధనంగా ఉపయోగపడుతుందా?
ఏది ఏమైనప్పటికీ, మా ట్రైన్ 18 వ్యూహాలు చక్కగా పనిచేస్తున్నాయి, ఇతర అన్ని రంగాలకు కూడా విస్తరిస్తున్నాయి. ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టులు వేగంగా ఖరారవుతున్నాయి. స్టోర్స్ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి ప్రధాన ట్రైన్ 18 కథనం నుండి కాస్త పక్కకు జరిగి, ప్రభుత్వ సంస్థలలో తరచుగా వినిపించే ఒక క్లిచ్ (బాగా నలిగిన మాట) గురించి నేను వివరంగా మాట్లాడతాను. ఇది కేవలం పైకి చెప్పే మాటగానే మిగిలిపోయింది తప్ప, ఒక పరిపాలనా మంత్రంగా మారలేదు, అదే – “మీ విక్రేతలను భాగస్వాములుగా భావించండి”.
నేను దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం నాటి విషయానికి వెళ్తాను, అప్పుడు నేను భారతీయ రైల్వేల ప్రముఖ పరిశోధన మరియు అభివృద్ధి విభాగమైన RDSOలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. ప్రతిరోజూ, పెద్ద సంఖ్యలో పరిశ్రమల అధికారులు మా డైరెక్టరేట్‌ను సందర్శించేవారు. ఎవరో ఒక అధికారితో మాట్లాడటం కోసం వారు కారిడార్లలో నిలబడి వేచి ఉండటం చూసేవాళ్ళం. కొందరు అటెండెంట్ల స్టూల్స్‌పై కూర్చుని కనిపించేవారు. ఇది నాకు ఎప్పుడూ చాలా ఇబ్బందికరంగా అనిపించేది.
ఉమ్మడి వాష్ ఏరియాలోని ఒక టాయ్‌లెట్ తలుపు ఎన్నో ఏళ్లుగా విరిగిపోయి ఉండేది. ఒకసారి ఒక విదేశీయుడు లోపల తన తలని అరచేతిలో దాచుకుని ఉండటం నేను చూశాను; బహుశా ఢిల్లీ బెల్లీ (కడుపు నొప్పి) ఒత్తిడి అతని ఆత్మగౌరవాన్ని కూడా మించిపోయి ఉండవచ్చు. ముఖ్యమైన సందర్శకులకు కనీస మర్యాదలు కూడా ఇవ్వని ఇటువంటి వ్యవస్థతో మనం ఎక్కడికైనా వెళ్లగలమా?
అదృష్టవశాత్తూ, అప్పటి మా డైరెక్టరేట్ బాస్ ఒక గదిని తాత్కాలిక సందర్శకుల గదిగా మార్చారు. అప్పట్లో ఇటువంటి సర్కారీ తరహా కార్యాలయంలో అది ఒక కొత్త విషయంగా ఉండేది, నా దృష్టిలో ఏమీ లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉండటం మేలు కదా. ఈ పరిస్థితి నన్ను కలచివేసేది, కానీ నా సహోద్యోగులలో చాలామందికి దీని గురించి కనీస పట్టింపు కూడా ఉండేది కాదు; వారి అభిప్రాయం ప్రకారం, “ఈ ప్రజలు వారి పని కోసం ఇక్కడికి వచ్చారు, మనమెందుకు వారి గురించి పట్టించుకోవాలి”. మనం ఇక్కడ ప్రయోజనాలను పంచిపెట్టే సంస్థగా ఉన్నామా లేక పరిశ్రమలతో కలిసి పనిచేస్తూ భారతీయ రైల్వేల కోసం అత్యాధునిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్నామా?
ఇక మనం 2003వ సంవత్సరం నాటి విషయానికి వద్దాం, అప్పట్లో నేను వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (DLW) లో చీఫ్ డిజైన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఒకరోజు నాకు ఒక ముఖ్యమైన టెండర్ నెగోషియేషన్స్ (చర్చలు) ఉన్నాయి. ఆ కమిటీ కన్వీనర్ నా వద్దకు వచ్చి, సంబంధిత కంపెనీ జనరల్ మేనేజర్ వచ్చారని, నన్ను తన గదికి రమ్మని సమాచారం ఇచ్చారు. నేను అతని గదికి వెళ్తుండగా, దారిలో ఆ జిఎం గారు గది బయట నిలబడి ఉండటం చూశాను. కమిటీ సభ్యులు ఆ టెండర్ గురించి, ఇతర సాధారణ విషయాలు మరియు కుశలప్రశ్నల మధ్య చాలా సేపు చర్చించారు.
చివరకు ఒక గంట కంటే ఎక్కువ సమయం తర్వాత, ఆయన్ని లోపలికి పిలిచారు. మేము చర్చలు ప్రారంభించే ముందే ఆయన ఇలా అన్నారు, “సార్, మీరు రైల్వేలో పెద్ద అధికారులు కావచ్చు, కానీ నేను కూడా ఒక ప్రతిష్ఠాత్మకమైన కంపెనీకి జీఎమ్ని. నేను గంటల తరబడి మీ గది బయట నిలబడాల్సి వస్తే, నా కంపెనీ ప్రయోజనాల కోసం నేను దాన్ని భరిస్తాను. కానీ ఆ అవమానం నాది కాదు, పూర్తిగా మీ ఉన్నత హోదాకు మరియు మీ సంస్థకే చెందుతుంది.” మేము నోటమాట రాకుండా ఉండిపోయాము, కానీ మిగతావారు దానిని చాలా త్వరగానే మర్చిపోయి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అయితే, ఆయన చెప్పింది ఎంత నిజమో కదా అని నేను భావించాను.
అప్పటి నుండి, నేను ఎక్కడ పనిచేసినా, సందర్శకులను గౌరవంగా చూసేలా మరియు సాధారణంగా వారు వేచి ఉండేలా చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. ఒకవేళ వేచి ఉండటం తప్పనిసరి అయితే (నిజానికి అలా తరచుగా జరుగుతుంటుంది), వారిని సరైన సందర్శకుల గదిలో కూర్చోబెట్టేవారు. ఒకవేళ ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తే, నేను నా పని ముగించుకుని వారితో మాట్లాడే వరకు, నా గదిలోనే ఉన్న సోఫాలు లేదా పక్క కుర్చీలలో కూర్చోమని నేనే స్వయంగా వారిని ఆహ్వానించేవాడిని. ఇదో పెద్ద విషయమా? ఖచ్చితంగా కాదు. కానీ దీనివల్ల వెళ్ళిన సందేశం మాత్రం చాలా సానుకూలమైనది, “మీరు మాతో భాగస్వామ్యం వహించడానికి, కలిసి పనిచేసే మార్గాలను అన్వేషించడానికి ఇక్కడికి వచ్చారు, అంతేగాని ప్రయోజనాలు ఆశించి యాచించడానికి కాదు.” ఆ జీఎం గారు ఇప్పటికీ నాకు మంచి మిత్రుడు మరియు మేము కలిసి అనేక ప్రాజెక్టులు చేసాము, కానీ అవన్నీ పూర్తిగా ఆయా ప్రాజెక్టుల అర్హత ఆధారంగానే జరిగాయి.
మన ఆలోచనా విధానంలో మరియు ప్రవర్తనలో మార్పును ప్రతి స్థాయిలోనూ అలవర్చాల్సి ఉంది; మన పరిశ్రమ భాగస్వాములు మన ప్రయత్నాలలో తోటి ప్రయాణీకులని, వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలే తప్ప ఉదాసీనతతో కాదని గ్రహించాలి. మా బృందంలోని కొందరు సభ్యులు ఇప్పటికే నా ఆలోచనల కంటే ముందే ఉన్నారు. ఉదాహరణకు, శ్రీనివాస్ అప్పటికే విక్రేతలతో ఎంతో వృత్తిపరంగా (బిజినెస్-లైక్), అదే సమయంలో అద్భుతమైన మర్యాదతో వ్యవహరిస్తాడని పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత CDE/ఎలక్ట్రికల్‌గా బాధ్యతలు స్వీకరించిన దాష్ గురించి, మా సప్లై అండ్ డెవలప్మెంట్ చైన్‌లోని విక్రేతలందరి నుండి నేను కేవలం ప్రశంసలు మాత్రమే విన్నాను. త్రివేది కూడా మా విక్రేతలతో చాలా ప్రొఫెషనల్ పద్ధతిలో లావాదేవీలు జరుపుతాడని పేరుంది. త్రివేది సూచన మేరకు, మాకు స్టోర్స్ సరఫరా చేసే ప్రముఖ కంపెనీల అధిపతులకు నేను నా ఇంట్లోనే రాత్రి విందుకు ఆతిథ్యం ఇచ్చాను; ఐ.సి.ఎఫ్. చరిత్రలో ఇది మొదటిసారి. విక్రేతలతో మా సంబంధాలు క్రమంగా మరింత ప్రొఫెషనల్‌గా మరియు వృత్తిపరంగా మారాయని నేను భావిస్తున్నాను, అంతేకానీ ఒక అహంకారపూరితమైన కొనుగోలుదారుడికి, యాచించే విక్రేతలకు మధ్య ఉండే సంబంధంలా కాదని నా నమ్మకం.
అయితే, మా అంచనా ప్రకారం మెరుగుపడటానికి ఎలాంటి పట్టుదల చూపించని విక్రేతలపై (వెండర్స్) మేము ఎల్లప్పుడూ కఠినంగా వ్యవహరించేవాళ్ళం. శిక్షాత్మక చర్యలు అనేవి ఒక ఉదాహరణగా నిలవాలే తప్ప, కేవలం పైపైన చేసేవిగా లేదా ఏదో ఒక ఆనవాయితీగా ముగించేవిగా ఉండకూడదు. షేక్స్పియర్ రచించిన ‘మెజర్ ఫర్ మెజర్’ నాటకంలోని ఏంజెలో మాటలను మనం తప్పక అనుసరించాలి: “మనం చట్టాన్ని ఒక దిష్టిబొమ్మలా మార్చకూడదు, వేటాడే పక్షులను భయపెట్టడానికి దాన్ని అక్కడ నిలబెట్టి, చివరికి ఆ పక్షులు దానికి అలవాటుపడి, దానిపైనే వచ్చి కూర్చునేలా చేయకూడదు. చట్టం వాటికి భయం కలిగించేదిగా ఉండాలి తప్ప, పక్షులు విశ్రమించే స్థావరం కాకూడదు.”
మా ప్రస్తుత లేదా కాబోయే విక్రేతలు మన భాగస్వాములే అనే స్పష్టమైన సందేశం ఐ.సి.ఎఫ్. లోని ప్రతి స్థాయి అధికార క్రమానికి చేరింది. లిక్విడేటెడ్ డ్యామేజెస్ (నష్టపరిహారం) విధించడానికి సంబంధించిన మా కఠినమైన నిబంధనల వంటి కొన్ని విషయాలలో మేము విక్రేతల అన్ని సమస్యలను వారి పూర్తి సంతృప్తికి అనుగుణంగా పరిష్కరించలేకపోవచ్చు. కానీ మేము వారి కోసం ప్రయత్నించామనే భావన మాత్రం వారికి కలగాలి. మా విక్రేతలతో వ్యక్తిగతంగా మాట్లాడే సమయంలో పరిస్థితులు నిజంగానే మెరుగయ్యాయనే నమ్మకం నాకు కలగడం ప్రారంభమైంది. ఇది ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుందని నేను నమ్మాను; మా సిబ్బంది యొక్క అంకితభావం ఎంత ముఖ్యమో, అంతే ప్రాధాన్యత కలిగిన నిబద్ధత గల విక్రేతల బృందం కూడా అంతే ముఖ్యం.
ఇతర ప్రభుత్వ సంస్థల వలె, మేము కూడా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ నిబంధనలను, మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉండేది. ఈ విధానాల గురించి చాలా అపోహలు ఉన్నాయి; కొనుగోలుదారులు మరియు సరఫరాదారుల మధ్య ఉన్న ప్రధానమైన సందేహం ఏమిటంటే – దాని ఉద్దేశం మరియు అమలు. ఈ పాలసీ మనల్ని ఉత్తమమైన వస్తువులను కొనుగోలు చేయకుండా అడ్డుకుంటుందని మరియు ‘L-1 సిండ్రోమ్’ (అత్యల్ప ధర పలికిన వారికే ఆర్డర్ ఇవ్వడం) కారణంగా ఉత్పత్తి యొక్క నాణ్యత మరియు మన్నికను పక్కనబెట్టి, అత్యల్ప ధర బిడ్డర్‌కే మొగ్గు చూపేలా చేస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ ఇది ఎంతమాత్రం నిజం కాదు. ప్రభుత్వ నిధులు సముచితంగా ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి, ఇప్పటికే స్థిరపడిన సరఫరాదారులతో పోలిస్తే కొత్తగా వచ్చే సరఫరాదారులకు కూడా ఒక సమానమైన అవకాశాన్ని కల్పించడానికి మాత్రమే ఈ విధానం మార్గనిర్దేశం చేస్తుంది. ప్రజాధనంతో వ్యవహరించే ప్రభుత్వ అధికారికి, ఒక నిర్దిష్ట అవసరానికి ఏ ఉత్పత్తి అత్యంత ఉత్తమమైనదో నిర్ణయించే గట్టి నమ్మకం మరియు ధైర్యం ఉండాలి. ఆ తర్వాత పారదర్శకమైన మరియు హేతుబద్ధమైన వాదనలతో దాని ప్రొక్యూర్మెంట్ను నిర్ధారించుకోవాలి. ఈ విధానం మిమ్మల్ని అలా చేయకుండా అడ్డుకోదు; దానికి భిన్నంగా, ఇది మిమ్మల్ని అలా చేయడానికి మరింత బలోపేతం చేస్తుంది మరియు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.
చాలామంది అధికారులకు ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ కొన్ని షరతులకు లోబడి, ఒక టెండర్లో ఒకే ఒక్క బిడ్ వచ్చినప్పటికీ, ఆ కేసును పరిష్కరించడానికి ఈ పాలసీ మనకు అనుమతినిస్తుంది. షేక్స్పియర్ తన ‘హ్యామ్లెట్’ నాటకం ద్వారా ఇలా చెప్తాడు: “అయితే, అది నీకు ఏమీ కాదు, ఎందుకంటే మంచి లేదా చెడు అనేది ఏదీ లేదు, మన ఆలోచనే దాన్ని అలా మారుస్తుంది.” ఇది ముమ్మాటికీ నిజం. మీరు దేనిని కొనుగోలు చేయాలనుకుంటున్నారు లేదా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అనే విషయంలో మీ లక్ష్యం పారదర్శకంగా ఉండి, ఎవరి నుండి, ఎందుకు కొనుగోలు చేస్తున్నారనే దానికి స్పష్టమైన కారణాలు ఉంటే, ప్రభుత్వ వ్యవస్థలోనైనా సరే దానిని సాధించడానికి ప్రతి అవకాశమూ ఉంటుంది.
చాలా మంది ప్రభుత్వ అధికారులు తమ సొంత విచక్షణను ఉపయోగించకుండా మరియు దృఢమైన సంకల్పాన్ని ప్రదర్శించకుండా.. ప్రొక్యూర్మెంట్ పరిష్కారం తమకు ప్లేట్లో పెట్టినట్లు సులభంగా లభించాలని కోరుకోవడమే ఇక్కడ అసలు సమస్య; వివాదాలకు తావులేని అత్యంత సులువైన మార్గంలో వెళ్లడానికే వారు మొగ్గు చూపుతారు. ఎలాంటి ప్రతిఘటన లేని మార్గాన్ని ఎంచుకోవడం ఎల్లప్పుడూ సురక్షితం, మరియు వారి ఈ చర్యను సమర్థించుకోవడానికి సరైన పద్ధతులను కూడా తమకు నచ్చినట్లు మార్చేస్తుంటారు; దీనికోసం వారు చెప్పే నిరంతర సాకు ఏమిటంటే – ప్రైవేట్ సంస్థలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లా తాము పనిచేయలేమని, ఎందుకంటే ఆ ప్రైవేట్ అధికారికి ఎలాంటి ప్రశ్నలు ఎదురుకాకుండా వెంటనే సరైన నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని వాదిస్తారు. కానీ, అలాంటి ప్రైవేట్ అధికారి కూడా కంపెనీ షేర్‌హోల్డర్స్, బోర్డు, సంస్థ యొక్క లాభనష్టాల పట్ల బాధ్యత వహిస్తాడని, అతని నిర్ణయాలు ఏవీ కూడా ఇష్టానుసారంగా తీసుకునేవి కావని వారు మర్చిపోతుంటారు. కొన్నిసార్లు అత్యంత సాహసోపేతమైన అధికారులు సైతం ఏది సరైనదో నిర్ణయించడంలో ఇబ్బంది పడవచ్చు; ఫిర్యాదులు, చిక్కులు మరియు ఆరోపణలను నివారించడానికి వారు తాత్కాలిక ఉపశమనం కలిగించే (బ్యాండ్-ఎయిడ్) పరిష్కారాలను ఎంచుకునే ధోరణిని కలిగి ఉంటారు. ప్రారంభ రోజుల్లో ఒబామాకేర్ సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన లోపాలు మరియు బగ్‌లు మీకు గుర్తున్నాయా? ఈ భూమిపై అత్యంత శక్తివంతమైన వ్యక్తి అయిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం.. సాఫ్ట్వేర్ పనిని చేయాల్సిన ఏజెన్సీని ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఎంపిక చేయడం వల్లే ఈ హెల్త్ పాలసీ అమలులో సమస్యలు వచ్చాయని వాపోయారు! నా అభిప్రాయం ప్రకారం, ఇలాంటి కేసులు కేవలం మినహాయింపులుగా ఉండాలి తప్ప, ఒక తప్పనిసరి నియమంగా మారకూడదు.
మా కన్సల్టెన్సీ కాంట్రాక్టుల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చిన ప్రొక్యూర్మెంట్ చర్యలను మేము చాలా త్వరగా చేపట్టి, ముగించాల్సి ఉండేది. అంతేకాకుండా, ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను వేగంగా ఖరారు చేయడం కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే సంబంధిత విక్రేతలకు (వెండర్స్) సబ్-అసెంబ్లీలను అభివృద్ధి చేయడానికి తగిన సమయం కావాలి. ప్రభుత్వంచే ఎంతో విమర్శించబడిన పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీపైనే ఆధారపడి ఉన్న భారతీయ రైల్వేల ప్రొక్యూర్మెంట్ నిబంధనలను మా పని కోసం ప్రత్యేకంగా మార్చాల్సిన అవసరం రాలేదు. మేము ఆ విధానాన్ని దాని నిబంధనల నుండి మనకు నచ్చిన వాటిని మాత్రమే ఎంచుకునే పద్ధతిలో కాకుండా, పూర్తిగా దాని సమగ్ర రూపంలో ఉపయోగించాము. ఈ పాలసీ ఒక వస్తువును ఒకే ఒక మూలం నుండి సేకరించడాన్ని నిషేధించదు. సమర్థులైన విక్రేతలతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, ఒక ప్రత్యేక లిమిటెడ్ టెండర్ ద్వారా కేవలం ఆ విక్రేతల నుండి మాత్రమే బిడ్లను ఆహ్వానించడాన్ని ఇది నిరోధించదు. ఒక ఓపెన్ అడ్వర్టైజ్డ్ టెండర్లో అర్హత ప్రమాణాలను స్పష్టంగా పేర్కొనడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది, తద్వారా 80% ఆర్డర్ కేవలం ఆమోదించబడిన గుర్తింపు పొందిన సంస్థలకు లేదా నిర్దేశిత అర్హతలను పూర్తి చేసిన సంస్థలకు మాత్రమే వెళుతుంది. పనికిరాని లేదా ఆచరణ సాధ్యం కాని ఆఫర్లను తొలగించడానికి ఇది ఒక మార్గాన్ని అందిస్తుంది. కానీ ఇవన్నీ జరగాలంటే, మీ సమర్థన స్పష్టంగా మరియు పక్షపాతం లేకుండా ఉండాలి. మీకే ఆ నమ్మకం లేకపోతే, అది మీ కలం రాసే రాతలో ప్రతిబింబిస్తుంది మరియు ఆ కేసు గందరగోళంగా మారి, వృథాగా లేదా నష్టదాయకంగా మారుతుంది.
పరిమిత కాలవ్యవధిలో ఇంతటి భారీ ప్రాజెక్టు విజయవంతం కావడానికి విక్రేతల యొక్క వివేకవంతమైన ఎంపిక చాలా విలువైనది. ఇటీవలి సంవత్సరాలలో రైల్వే బోర్డు కల్పించిన ఫీల్డ్ యూనిట్ల అధికార వికేంద్రీకరణ అప్పటికే అందుబాటులో ఉంది. ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో విక్రేతలను ఎంపిక చేయడంలో మేము దీని ఫలితాలను సులభంగా అందుకోగలిగాము.
అన్ని కీలక రంగాలలో, ప్రపంచవ్యాప్తంగా ట్రైన్ సెట్లకు విడిభాగాలను సరఫరా చేసిన అనుభవం ఉన్న లేదా అలా చేయడానికి నిజమైన సామర్థ్యం ఉన్న సుస్థిరమైన, నిరూపితమైన విక్రేతల (వెండర్స్) నుండే మేము వస్తువులను ఆర్డర్ చేయాల్సి వచ్చింది. దీనితో పాటు, సాధ్యమైనంతవరకు భారతీయ విక్రేతల నుండే కొనుగోలు చేయాలనే ప్రాధాన్యతను కూడా మేము మర్చిపోకూడదు. స్టోర్స్ అండ్ ఫైనాన్స్ విభాగాలతో సహా ఐ.సి.ఎఫ్. లోని మెజారిటీ బృంద సభ్యులు ఈ విషయాన్ని గ్రహించారు, స్టోర్స్ కేసులను పరిష్కరించేటప్పుడు సాధారణ సర్కారీ పద్ధతి నుండి పక్కకు తప్పకోవడానికి వారు వెనుకాడలేదు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా స్పందించి, సకాలంలో వస్తువులను సరఫరా చేయడంలో విఫలమైన వారికి ఆర్డర్ ఇచ్చిన సందర్భాలు – కేవలం ఒకటీ అరా మినహాయిస్తే – నాకు ఎక్కడా గుర్తుకు రావు. అవును, విషయాలను సూటిగా చూడకుండా, సాహసోపేతమైన చర్యలకు వ్యతిరేకంగా అన్ని రకాల సాకులు లేదా కారణాలు వెతికే కొందరు అధికారులు కూడా ఉండేవారు. నకిలీ సానుకూలత ముసుగులో తమ ప్రతికూలతను చాకచక్యంగా తెలియజేసే వారి శైలి, గాలిబ్ రాసిన ఈ గొప్ప తాత్విక గజల్ తరహాలో ఉండేది:
నా థా కుచ్ తో ఖుదా థా, కుచ్ నా హోతా తో ఖుదా హోతా
డుబోయా ముఝ్కో హోనే నే, నా హోతా మైన్ తో క్యా హోతా
హుయ్ ముద్దత్ కే గాలిబ్ మర్ గయా పర్ యాద్ ఆతా హై
వో హర్ ఏక్ బాత్ పర్ యే కెహనా కే యున్ హోతా తో క్యా హోతా
(ఏమీ లేనప్పుడు దేవుడు ఉన్నాడు. ఏమీ లేకపోయినా దేవుడే ఉండేవాడు. నా ఉనికి వల్లే నేను మునిగిపోయాను, నేనే లేకపోతే ఏమయ్యేవాడిని? నా ఉనికి ఎప్పుడో మరణించింది, కానీ ప్రతి విషయానికి ‘ఇలా కాకపోతే ఎలా ఉండేది’ అని నువ్వు అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి.) ఆధ్యాత్మికత మరియు జీవన విధానాలలో బహుళ అర్థాలను ఇచ్చే గొప్ప కవితా కావ్యమిది, కాబట్టి ఇక్కడ కేవలం దీని శబ్దార్థాన్ని మాత్రమే గమనించండి.
ఇలాంటి అప్పుడప్పుడు ఎదురయ్యే ప్రతికూలతలను అధిగమించడం ఎప్పుడూ పెద్ద సవాలు కాలేదు; అయితే, ఈ తరహా వ్యతిరేకత, తప్పులు వెతకడం అనేది జిలేబీలు చుట్టడం కంటే బహుశా ఈ ప్రాజెక్ట్‌కు మరింత హానికరం. మేనేజ్మెంట్ స్థాయిలో త్రివేది నుండి, సాంకేతిక విషయాలలో వావ్రే, శ్రీనివాస్ నుండి, అలాగే సాధారణంగా స్టోర్స్ అధికారుల నుండి ఆశించిన మద్దతు ఎప్పుడూ లభిస్తూనే ఉండేది. మేము అనుకున్న విధంగా ప్రొక్యూర్మెంట్ చర్యలు ముగియడంతో, ఎంపిక చేసిన విక్రేతలను డిజైన్ ప్రక్రియలో అర్థవంతంగా భాగస్వామ్యం చేయడం మాత్రమే మిగిలింది; చాలా వరకు సబ్-అసెంబ్లీలు మరియు విడిభాగాలలో ఏదో ఒక సాంకేతిక కొత్తదనం ఉండటం వల్ల, ఈ కీలక విక్రేతలు ఈ అభివృద్ధి ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగంగా మారాల్సి వచ్చింది. ఉదాహరణకు, శబ్దం లేని మరియు సౌకర్యవంతమైన ఎయిర్ కండిషనింగ్ (ఎసి) పరికరాన్ని అభివృద్ధి చేయడానికి.. డ్రాయింగ్ల ఆమోదం పొందిన తర్వాత కూడా, ప్రాజెక్ట్ మధ్యలో ఎసి డక్టింగ్ యొక్క మూడు నమూనాలను తయారు చేయాల్సి వచ్చింది మరియు యూనిట్లను పూర్తిగా పునఃరూపకల్పన చేయాల్సి వచ్చింది. భారతీయ రైల్వేలు మరియు మెట్రోలలో విస్తృత అనుభవం ఉన్న ఒక భారతీయ సంస్థ అయిన మా ఎంపిక చేసిన భాగస్వామి, ఆ పరికరాన్ని పూర్తిగా రీడిజైన్ చేసి, కాలక్రమాన్ని పెద్దగా ప్రభావితం చేయకుండా సకాలంలో సరఫరా చేసింది.
అవును, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా మనకు కావలసిన వస్తువులను, మనకు కావలసిన వారి నుండి కొనుగోలు చేయవచ్చు మరియు మన ప్రయాణంలో వారిని తోటి ప్రయాణీకులుగా మార్చుకోవచ్చు.
మనందరి కోసం ఈ క్రింది లైన్లు రాసి, ‘ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్’ నాటకంలోని హెలెనా పాత్ర ద్వారా మాట్లాడిన ఆ గొప్ప కవికి గౌరవపూర్వకంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను:
“మన సమస్యలకు పరిష్కారాలు తరచుగా మనలోనే ఉంటాయి, కానీ మనం వాటిని దైవ నిర్ణయంగా భావిస్తాము.”
(ఇంకా ఉంది)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
