ప్రముఖ రచయిత పరేశ్ దోశీ వివిధ భాషల నుంచి తెలుగులోకి అనువదించిన కథల సంపుటి ఇది.
ఇందులో మొత్తం 51 అనువాద కథలున్నాయి. పంజాబీ కథలు 3, హిందీ కథలు 7, ఉర్దూ కథలు 4, భారతీయాంగ్ల కథలు 3, గుజరాతీ కథలు 10, ఒడియా కథలు 2, బెంగాలీ కథలు 6, మరాఠీ కథ 1, మళయాళీ కథలు 6, రష్యన్ కథ 1, నేపాలీ కథ 1, ఆంగ్ల కథలు 2, తమిళ కథలు 2, దక్షిణాఫ్రికా కథ 1, మైథిలీ కథ 1, రాజస్థానీ కథ 1 ఉన్నాయి.
***
“అలనాటి నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి ఆర్.కె. నారాయణ్, ఆశాపూర్ణాదేవి, యశ్‌పాల్, అమృతా ప్రీతమ్, అనితా దేశాయ్ వంటి ఎందరెందరో జగత్ జెట్టీల కథలు ఇందులో ఉన్నాయి.
ఈ అనువాద కథలు చదువుతుంటే ఎందరు మనుషులు? ఎన్ని జీవితాలు? ఎన్ని సంఘటనలు? ఎన్ని రకాల మనస్తత్వాలు, ఎంత స్వార్థం, ఎంత సేవాభావం మన చుట్టూ వైఫైలా నిరంతరం పరిభ్రమిస్తున్నాయా అనిపించక తప్పదు. అంతే కాదు… ఎవరి జీవితమూ పూలనావలా సాగడం లేదన్న వాస్తవాన్నీ గ్రహిస్తాం.
~~
పరేష్ శైలి అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా చెప్పేవరకు ఇవి తెలుగు కథలే అనుకుంటాం. మూలం చెడకుండా కథను అనువదించడం నిజంగా మీద సామే! ఐతే ఆ ప్రక్రియను పరేశ్ అవలీలగా చేసి మెప్పించారు.
ఈ కథలు చదువుతుంటే మనలోకి మనం చూసుకుంటున్నట్లు ఉంటుంది. రచయిత మన గురించే రాశాడా అని అనుమానం వస్తుంది. నిజజీవితాలోని సంఘటనలు, సంఘర్షణలు, సంక్లిష్టతలు అక్షరాలుగా మారి కాయితాలోకి ప్రవహించాయా అన్న సందిగ్ధం ఏర్పడుతుంది. మనం నివసించే లోకంలో ఇన్ని కరడు గట్టిన (అ)ధర్మాలు కొనసాగుతున్నాయా? అనిపిస్తుంది. అక్కడక్కడ నల్ల మబ్బుకు వెండి అంచులా ‘మంచితనం’ మెరుస్తుంది. నేనున్నా భయపడకండి అని అభయమిస్తుంది. గుండెలకు హత్తుకుని ఓదారుస్తుంది.
ఇందులో ఏ ఒక్క కథా పాఠకుడిని నిరాశ పరచదు. పైగా కొత్త ‘ఎరుక’ను సంతరించి పెడుతుంది. లోకాన్ని ఎలా చూడాలో? మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలో నేర్పుతుంది. ఒక పుస్తకానికి ఇంతకన్నా సార్థకత ఏం కావాలి?
~~
కొత్తగా అనువాద రంగంలోకి వచ్చే వారికి పాఠ్యగ్రంథంగా కూడా ఈ పరేశ్ కథలు ఉపకరిస్తాయని నా విశ్వాసం” అని తమ ముందుమాట ‘షడ్రుచుల కథా విందు’లో చంద్ర ప్రతాప్ పేర్కొన్నారు.
***
వరదగుడి
(అనువాద కథలు)
అనువాదం: పరేశ్ దోశీ
ప్రచురణ: ఛాయ రిసోర్స్ సెంటర్, హైదరాబాద్
పుటలు: 353
వెల: ₹200/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు