Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వరదయ్య వీలునామా

[శ్రీమతి గాడేపల్లి పద్మజ రచించిన ‘వరదయ్య వీలునామా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

వేణుగోపాలస్వామి గుడి దగ్గర కుడివైపుకు తిరిగితే, వీధి చివర వేపచెట్టు ఉన్న ఇల్లు వరదయ్యది. తెల్లవారి ఆరుగంటలైనా చలి దయ్యం పట్టుకుంటుందనే భయంతో జనమంతా దుప్పటి ముసుగు తన్నారు. వరదయ్యకు మాత్రం చలి, ఎండ, వాన ఏదన్నా భయం లేదు. ‘బాబోయ్ వరదయ్య లేచాడు. నాదే ఆలస్యం’ అనుకుంటు సూర్యుడు తూర్పువైపు నుండి తొంగి చూస్తాడు. వరదయ్య లేచాడంటే ఇంక తెల్లవారినట్లే అని చెట్టు మీద పక్షులు, పక్కింటి పార్వతమ్మ కోళ్ళు అరవడం మొదలుపెడతాయి. అంత ప్రొద్దునే లేచి అతడు ఏ వాకింగ్ వెళ్తాడంటే పొరపాటే. తను పడుకున్న నులక మంచాన్ని కిర్రున చప్పుడు చేస్తూ తీసి బయట పెడతాడు. తాతలనాటి ఆ నులక మంచం అంటే ప్రాణం వరదయ్యకు. భార్య సుందరమ్మకు మాత్రం అదంటేనే కంపరం. ఓసారి దాన్ని విరిచేసి బయట పడెయ్యాలని చూసింది. కానీ వరదయ్య పడనివ్వలేదు. దాని జోలి రావద్దంటు ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రొద్దునే ఓ బక్కెటు తీసుకుని పంపు కింద పెట్టి, దాన్ని కిర్రుకిర్రున చప్పుడు చేస్తూ నీళ్ళు పట్టుకుంటాడు. అక్కడ ఉన్న నాలుగు పాదులు పొర్లిపోయేలా నీళ్ళు పోస్తాడు. ఆ పంపు చప్పుడంటే చచ్చేంత కోపం సుందరమ్మకు.

“ఏందయ్య ఆ గోల? నువ్వేమన్నా ఉద్యోగం చెయ్యాలా? ఊళ్ళేలాలా? కాసేపు పడుకో” అని అరుస్తుంది.

“ఎందుకే సుందరమ్మ, అలా అరుస్తావు? ఇరుగుపొరుగు వింటే గయ్యాళి దానివనుకుంటారు” అంటాడు వరదయ్య.

“అనుకుంటే అనుకోనీయవయ్య, నా బాధ వాళ్ళకేం తెలుసు? నీలాంటి పైసా సంపాదన లేని మొగుణ్ణి నేను కాబట్టి భరిస్తున్నాను. మరొకరైతే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళే. మీ నాన్న ఇచ్చిన ఆస్తి నీ దాన, ధర్మాలకు ఏనాడో హరించుకు పోయింది. తాను దూర కంత లేదు మెడకో డోలులా, మనకే జరుగుబాటు లేదు. అందరి సంగతి నీ కెందుకు?” అంటూ విరుచుకు పడుతుంది.

ఈ గొడవ అంతా ఆ ఇంట్లో రోజూ ఆ జరిగే భాగవతమే. సుందరమ్మ నోటికి జడిసి వరదయ్య తల్లిని కూడా తన చెల్లెలు కమల దగ్గర ఉంచేశాడు. సుందరమ్మ కోపానికి ఓ అర్థం ఉంది. ఆమె పెళ్ళి నాటికి నలభై ఎకరాల మాగాణి, డబ్బు ఉండేవి. కానీ ఇంటి ఖర్చుల కోసం వరదయ్య చాలా వరకు అమ్మేశాడు. ఎవరు కష్టంలో ఉన్నా సహించలేడు.

‘ఎలా సాయపడాలా’ అని ఆలోచిస్తాడు. అందుకే చాలావరకు ఆస్తి పోగొట్టుకుని సుందరమ్మకు చులకన అయ్యాడు. సుందరమ్మ ఇచ్చే కాఫీ నచ్చదు అతనికి. ఫిల్టర్ కాఫీ నురుగు తేస్తూ కనిపించాలి. కమ్మగా ఓ అరసోలెడు కాఫీ పట్టించి, పది బక్కెట్ల నీళ్ళతో స్నానం పూర్తిచేస్తాడు. ఈలోపు సుందరమ్మ తన పని చేసుకుంటు ఉంటుంది. అప్పటికే వేపచెట్టు మీద చేరి గోలగోలగా అరుస్తున్న కాకులను ఉష్ ఉష్ అని తరుముతూ తన కోపం అంతా వాటి మీద చూపిస్తూ ఉంటుంది. ఆమె లోపలికి వచ్చే లోపు ఓ ఇరవై రూపాయలు జేబులో వేసుకుని బయటపడతాడు వరదయ్య.

ఆ రోజు కూడ ఇంట్లోంచి బయటకు వచ్చి, గుడి దారి పట్టాడు. అతనికి దారిలో కావడి పకీరయ్య కనిపించాడు. ‘మాతా అన్నపూర్ణేశ్వరీ’ అంటు ఇల్లిల్లు తిరిగి అడుక్కుంటాడు పకీరయ్య. ఎవరినీ ఏమీ అడగడు. పెట్టింది తీసుకుని వెళ్ళిపోతాడు. వరదయ్య దగ్గరకు రాగానే ఓ క్షణం ఆగాడు. వరదయ్య జేబులో ఐదు రూపాయల బిళ్ళ పకీరయ్య కావడిలో చేరింది. నుదిటిన విభూతి రేఖలతో, కాషాయ బట్టలతో చాలా పవిత్రంగా కనిపిస్తాడు పకీరయ్య. జీవన తత్త్వాన్ని ఔపోసన పట్టిన అతనికి నీ, నా బేధం లేదు. ఓ సారి పకీరయ్య కావడి నిండా అన్నం ఉండడం చూసి, “అంత ఏం చేసుకుంటావు పకీరయ్యా?” అని అడిగాడు వరదయ్య.

“సత్రంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు బాబు. ఆ తల్లి ఎప్పుడు రోగంతో మూలుగుతూ ఉంటుంది. ‘ఆకలి తాతా’ అని పిల్లలిద్దరు నా దగ్గర చేరతారు. ముందు వాళ్ళకు పెట్టాలి బాబు” అన్నాడు. మానవత్వమే లోకకళ్యాణానికి గొప్ప ఉపకరణం అనుకున్నాడు వరదయ్య. మరింత నిర్మలంగా ముందుకు నడిచాడు పకీరయ్య.

గుడికి చేరుకున్న వరదయ్య మెట్ల మీద కూర్చున్న భిక్షగాళ్ళందరికీ తలా ఓ రూపాయి ఇచ్చాడు. ‘నాకు, బాబు, నాకు’ అంటూ గోలగోలగా అరుస్తున్నారు వాళ్ళంతా.

“ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి” అంటుంది ఓ పెద్దామె.

“బాబుగారు రోజు ఇస్తారు కదా! అట్లా గొడవ పడకండహె” అంటాడు మరొకాయన.

ఈ తతంగం అంతా దూరం నుండి రోజు గమనిస్తున్న గుడి పూజారి, “వరదయ్యా, మీకే జరుగుబాటు అంతంత మాత్రం. ఎందుకలా రోజు దానధర్మాలు చేస్తావు? సుందరమ్మ చూసిదంటే రాద్ధాంతం చేస్తుంది” అంటూ హెచ్చరిస్తాడు. ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు వరదయ్య.

‘ఆటపాటల కృష్ణుడెంతవాడో, యశోద నీ కొడుకెంతవాడే’ అంటూ పాట పాడుతూ తాళం అందుకున్నారు గుళ్ళోని భక్తబృందం. వాళ్ళతో బాటు తన కలుపుతూ తాళం అందుకున్నాడు వరదయ్య. భక్తి పారవశ్యంలో లీనమై ఉన్నారు భక్తులంతా. ఇంతలో హారతికి సమయం అయినట్లుగా పూజారి గంట మ్రోగించాడు. తీర్ధం, ప్రసాదం తీసుకుని భక్తులతో బాటు వెనుదిరిగాడు.

ఇంతలో జేబులో ఉన్న ఫోన్ మోగింది. ‘ఎవరబ్బా’ అనుకుంటూ తీసి చూశాడు. చెల్లెలు కమల.

“అన్నయ్యా నేను” అంది.

‘ఇంకా నయం ఇంట్లో ఉన్నప్పుడు చెయ్యలేదు. సుందరమ్మ చూస్తే చాలా పెద్ద గొడవ చేస్తుంది’ అనుకుంటూ “చెప్పు కమలా, ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు?” అంటూ అక్కడే గుడి మంటపంలో కూర్చున్నాడు.

“ఏంలేదు అన్నయ్యా, ఇంకో పది రోజుల్లో నీ మేనకోడలు పెళ్ళి కదా! నాన్న ఉంటే మా పరిస్థితి అర్థం చేసుకుని సాయం చేసేవాడు. నాన్న లేడయ్యె. నువ్వే మాకు సాయం చెయ్యాలన్నయ్యా. నిన్ను అడగాలంటే మనసు ఒప్పడం లేదు. కానీ తప్పదు” అంది.

ఆ మాటలు వింటుంటే పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లయింది వరదయ్యకు. తనంటే మండిపడే సుందరమ్మ కమలకు డబ్బులిస్తే ఒప్పుకుంటుందా? ఏం చెయ్యాలి? అనుకుంటూ, “సరే కమలా నేను చూసి పంపిస్తాను” అని చెప్పాడు.

“సరే అన్నయ్యా, నువ్వు, వదిన నాలుగు రోజులు ముందు రండి” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

ఆలోచిస్తూ కాసేపు అక్కడే కూర్చున్నాడు. సుందరమ్మ ఎంత గొడవ చేసినా, తను అనుకున్నది చేస్తాడు వరదయ్య. ఉన్నదాన్ని పదిమందితో పంచుకుని తినాలనుకుంటాడు. భోజనం టైముకు ఇల్లు చేరాడు వరదయ్య.

“వచ్చావా? రా. రా. అయిందా ఊరేగింపు? నేను తప్ప నీకు తిండిపెట్టే వాళ్ళెవరు లేరు” అంటూ తిట్లతో కలిపి అన్నం వడ్డించింది. అన్నిటినీ కలిపి కడుపు నింపుకున్నాడు వరదయ్య. అలవాటు ప్రకారం నులకమంచం మీదపడుకుని నిద్రలోకి జారుకున్నాడు. నిద్రపోయిన వరదయ్య మరిక లేవలేదు. చాలాసేపటి తర్వాత అనుమానం వచ్చి గట్టిగా తట్టిలేపింది సుందరమ్మ. అతడు చనిపోయిన విషయం అప్పుడు అర్థమైంది ఆమెకు.

దాంతో పెద్ద పెద్దగా రాగాలు తీస్తూ ఏడుపు మొదలుపెట్టింది. గట్టిగా కేకలు వేసి నలుగురినీ పిలిచింది. వచ్చిన వాళ్ళంతా వరదయ్య మంచితనం గురించే మాట్లాడుకుంటున్నారు. తన చేతిలోని ఆయుధం జారిపోయినట్లుగా అనిపించింది సుందరమ్మకు. బుడిబుడి రాగాలు తీస్తూ, ఎలాగో పదిరోజుల కర్మకాండ జరిపించింది. వరదయ్య లేని లోటు ఆమెను సన్నని నులిపురుగులా తెలుస్తోంది.

ఒకరోజు బీరువాలో అట్టడుగున ఒక నీరుకావి పట్టిన వరదయ్య ధోవతి కనపడింది. ‘ఇదెందుకు ఇక్కడ?’ అనుకుంటూ దాన్ని బయటకు తీసింది. అందులో ఏవో కాగితాలు. ఒక ఉత్తరం కూడా ఉంది. ఆశ్చర్యంతో సుందరమ్మ ఉత్తరం విప్పి చూసింది.

“సుందరమ్మకు, నాకు సాయం చెయ్యడమే గానీ, సంపాదించడం తెలీదు. నా దృష్టిలో డబ్బుకు విలువ లేదు. ఒక వయసు దాటాక మనిషికి అవసరాలు మాత్రమే ఉండాలి. మిగిలినవన్నీ చిత్తుకాగితాలే. కన్నతల్లికి న్యాయం చెయ్యలేని నన్ను భగవంతుడు క్షమిస్తాడో లేదో? నీకు అన్యాయం చేశానని అనుకోవద్దు. ఎలా బతకాలి అనే ప్రశ్న నీకు వద్దు. బ్యాంకులో నీ పేరిట డబ్బు ఉంచాను. ఈ ఇల్లు కూడ నీ పేరునే రాశాను. ఊరి లోని పొలాన్ని మాత్రం మా అమ్మకు, మా చెల్లెలికి ఇచ్చేశాను. దానికి సంబంధించిన కాగితాలు ఇవన్నీ. ఇవి తీసుకుని లాయర్ దగ్గరకు వెళ్ళు. నీవి, నువ్వు తీసుకుని నీకు నచ్చినట్లు బ్రతుకు. వరదయ్య.” అని ఉంది ఉత్తరంలో.

తానే ముందుపోతానని ఊహించి వరదయ్య రాసిన ఆ ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి సుందరమ్మ గుండె బరువెక్కింది. ఆ బరువంతా కన్నీళ్ళ రూపంలో బైటికొచ్చింది. గుండెలవిసేలా వెక్కి వెక్కి ఏడ్చింది సుందరమ్మ. ఏది ముఖ్యమో తెలుసుకునేలోపే, చేజారి పోయింది. పోగొట్టుకున్నది వస్తువు కాదు, తిరిగి పొందడానికి.

Exit mobile version