Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వరమా శాపమా

[శ్రీమతి మంగు కృష్ణకుమారి రచించిన ‘వరమా శాపమా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

లిత నీరసంగా మంచం మీద వాలింది. తన్నుకొంటూ దుఃఖం వస్తోంది. తనలాటి పరిస్థితి వచ్చిన స్త్రీల కథలు ఎన్నో చదివింది. అప్పుడు మానస ఇంకా చిన్నపిల్ల. అందుకే ఆ కథల్లో స్త్రీల ఆవేదన బోధపడలేదు.

భగవంతుడు తెలిసిరావాలని ఈ శాపం పెట్టేడా? కళ్ళలో నీళ్ళు‌ వస్తుంటే తుడుచుకుంటూ లేచి కూచుంది.

డాక్టర్ నవ్వుతూ చెప్పిన మాటలు మళ్ళా తలపులోకి వచ్చేయి.

“మీకు పిరియడ్స్ పోయేయి అని ఎలా అనుకున్నారు? మీకింకా నలభై రెండే కదా!”

“మా నాయనమ్మకి ముఫ్ఫై అయిదుకే ఆగిపోయేయిట! ఆ పోలిక వచ్చిందో ఏమో అనుకున్నాను.”

“లేదు. యు ఆర్ ఆన్ ది ఫేమిలీ ‌వే!”

అప్పటికే ఆ అనుమానం ఉన్న లలిత ఏమీ మాటాడలేకపోయింది.

“మీరు చాలా వీక్‌గా ఉన్నారు. ఈ మందులు వాడండి” ఆ తరవాత డాక్టర్ చెప్తున్నవి సగమే వింది లలిత.

టేబుల్ మీద ఆవిడ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పెట్టి దానిమీద ఓ ప్లాస్టిక్ డబ్బా పెట్టింది. రెండు రోజుల ముందే తన ఆందోళన భర్తతో చెప్పింది.

సుందరరావు మొదట నవ్వుతూ ఆట పట్టించేడు. తరువాత మాత్రం సీరియస్‌గా “అలా అయినా నాకు చాలా సంతోషం. ‌‌నువ్వు వేరే ఏమీ ఆలోచించకు” అన్నాడు.

తన పెళ్ళీ, మానస పుట్టడం, తనకి మొదట జరిగిన సీమంతం అన్నీ గురుతొచ్చేయి. మానసకి ముందు ఒక ఎబార్షన్ జరిగింది.

మానస పుట్టిన తరవాత రెండేళ్ళకి మళ్ళా నెల తప్పితే తల్లి “ఈ సారి కొడుకే పుడతాడేమోనే” అని సరదా పడింది. అయిదోనెల మళ్ళా పోయింది. లలిత ఏడుస్తూ మంచం పట్టేస్తే సుందరం లలితని ఎంతో బాగా ఓదార్చేడు. “మనకి మానస చాలు లలితా! ఇహ నీకు ఈ బాధ వద్దు” అనేసాడు. ఆ తరవాత కూతురి పెంపకంలో‌ పడిపోయింది.

తమ్ముడి పెళ్ళి, వాడి పిల్లలూ, పెద్దక్క కూతురుకి పెళ్ళి అవడం, దాని పెళ్ళికీ దాని డెలివరీకి సహాయపడ్డం వీటి మధ్య ఎప్పుడో పెద్దరికం వచ్చేసింది. తల్లి పోయింది కూడా.

మానస పెళ్ళికి ఇంకా టైముంది. ఇంకా ఇరవై ఏళ్ళే. ఎమ్ఎస్సి చదువుతోంది. ఈ కాలం పిల్ల. చదువు అవాలి, ఉద్యోగం రావాలి అంటుందని ఆలోచిస్తూ ఉంటే ఇలా ముంచుకొచ్చింది.

లలితకి భర్త మీద చాలా కోపం ముంచుకొచ్చింది. పాపిష్ఠి కోరికలు. అయినా ఇన్ని వాంఛలు ఉన్న మనిషి ఫేమిలీ ప్లానింగ్ ఆపరేషన్లు అందరూ చేయించుకుంటున్న రోజుల్లో ఎందుకు చేయించుకోలేదు. తనకి కూడా బుద్ధిలేదని ఒప్పుకోవలసిందే.

కూతురుకి పెళ్ళి చేయవలసిన వయసులో కొత్తగా తల్లి అవడం‌ ఒక స్త్రీగా తను ఎందరి హేళనలు భరించాలో?

మానస సంతోషంతో గెంతులేస్తోంది.

“అమ్మా! నాకెంత సంతోషంగా ఉందో తెలుసా! చెల్లి తమ్ముడు ఎవరయినా ఇష్టమే” సిగ్గుతో ప్రాణం పోతుంటే లలిత మాటాడలేకపోతోంది. సుందరరావు అన్నాడు. “అది కాదమ్మా, ఇప్పుడు చెల్లీ, తమ్ముడూ అంటే నీకు వయసు తేడా వస్తుంది అనిపించటం లేదా?”

“అలా ఏం ఉండదు నాన్నా! మీకు ఒక నిజం చెప్పనా! మా ఫ్రండ్స్ మధ్య ఈ టాపిక్ చాలా సార్లు వచ్చింది. అందునా ఒక్కపిల్ల ఉన్న వాళ్ళం మరీ ఫీల్ అవుతూ ఉంటాం. మా నీతా వాళ్ళ చిన్నాన్న గారి అబ్బాయికి పదేళ్ళు. వాడు సైన్స్ చదివి వాళ్ళమ్మని అడిగేడుట. ‘నాకు చెల్లి గానీ తమ్ముడు గానీ కావాలి. కని ఇయ్యి. ఇప్పుడయినా ఫరవాలేదు’ అని. అలా అడిగే వయసు నాకు లేదేమో అని ఫీల్ అయేను. ఇప్పుడు నాకెంత హేపీగా ఉందో” గెంతుతూ వెళ్ళి హార్లిక్స్ కలిపి తల్లికి తీసుకొచ్చింది.

ఆ రోజు రాత్రి సుందరరావు లలితని ఓదార్చేడు. “మనమ్మాయే మనలని ఇంత సపోర్ట్ చేస్తే మనకి ఇంక భయం దేనికి లలితా! నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో.”

మానస అక్కడితో ఆగలేదు.

తరవాత చెకప్‌కి తల్లితో వెళ్ళి డాక్టర్‌తో మాటాడింది. డాక్టర్ మానస మెచ్యూరిటీకి చాలా సరదాపడి లలితకి తీసుకొవలసిన జాగ్రత్తలన్నీ చెప్పింది. తు.చ. తప్పకుండా తల్లి పాటించేలా చూసింది.

ఇంట గెలిచినా లలితకి కాస్త దగ్గర బంధువులు, తెలిసిన వాళ్ళ దగ్గర వేళాకొళాలు, సన్నాయి నొక్కుల మాటలూ తప్పలేదు.

“ఇదేం చిత్రం. ఈ రోజుల్లో ఎవరన్నా ఇలా కంటున్నారా”

“కొడుకు వయసు తమ్ముడితో మానస ఆడాలి కాబోలు”

“అయినా మగాడికి బుద్ధి లేకపోతే ఆడదానికయినా ఉండొద్దా?” లలిత దాకా ఇలాటివి ఎన్నో వచ్చేయి.

అందరినీ గడగడ లాడించే సుందరమ్మ లలితకి అత్త వరస అవుతుంది. మొహానే అడిగింది

“ఏమే లలితా! మీ ఆయన అప్పట్లో ఆపరేషన్ చేయించుకోలేదే?”

లలిత చాలా శాంతంగా అడిగింది – “అత్తా! నాకు ఆరో నెల. మా ఆయన ఆపరేషన్ చేయించుకుంటే ఎలా వస్తుంది?”

“కాదే! పోనీ ఏవో జాగ్రత్తలు ఉంటాయిట కదా, తీసుకోలేదా” అంది అత్త.

“నా జాతకంలో ఇద్దరు పిల్లలు రాసి ఉన్నారో ఏమో! అయినా నీలాటి పెద్దలే అంటారు కదా! ‘దేవుడు తలచుకుంటే దెయ్యం కూడా కంటుంది అని’. అవి తలచుకునే నేనూ ధైర్యం తెచ్చుకుంటున్నాను. నీ పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించు అత్తా” వినయంగా అన్న లలిత మాటలకి అంత సుందరమ్మా కరిగిపోయింది.

ఆప్యాయంగా “నీకు పండులాటి కొడుకు పుడతాడే” అని దీవించేసింది.

నెలలు నిండి, ఆరోగ్యంగా కొడుకు పుట్టేడు. తమ్ముడిని చూసుకుంటూ మానస పడే సంబరం చూసి సుందరరావు, లలితా పరవశించిపోయేరు.

తమ్ముటి బారసాల అట్టహాసంగా చేయాలని మానస పట్టుపట్టింది.

రోహిత్ అన్న పేరు తనే పెట్టింది వాడికి. బారసాలకి మానస ఫ్రండ్స్ అందరూ వచ్చేరు. అందరూ డేన్స్ చేస్తూ పాటలూ పాడడం, సందడిగా మానసకీ చంటి వాడికీ ఫొటోలు తీస్తూ ఉంటే, లలిత తనని అందరూ ముల్లు గుచ్చినట్టు అన్న మాటలు గురుతుకే రాలేదు.

***

మానస బేంక్ పరీక్షలు రాసి ఆఫీసర్‌గా చేరింది. రోహిత్ ‘అక్కా అక్కా’ అంటూ క్షణం వదలడు. లలిత మానస పెళ్ళి విషయం ఎత్తితే “కొన్నాళ్ళు తమ్ముడితో ఆడుకోనీమ్మా” అంటూ మాటాడనివ్వలేదు.

రోహిత్ ఫస్ట్ స్టాండర్డ్‌కి వచ్చేడు. మానస పెళ్ళి కోరి వచ్చిన బేంక్ ఆఫీసర్‌తో. వరుడి కాశీయాత్రకి సుందరరావు రోహిత్కి చెప్పేడు.

“ఇప్పుడు బావ కాశీ వెళిపోతానంటాడు రా! నువ్వే బతిమాలి కాశీ వెళ్ళవద్దని చెప్పాలి సుమీ” రోహిత్ కొంచెం బెదురు మొహంతో పెళ్ళి కొడుకు సాకేత్‌ని పట్టుకొని “బావా! కాశీ వద్దు వద్దు” అంటూ ఉంటే అందరూ సరదాగా నవ్వడం మొదలెట్టేరు.

లలిత మరదలు నవ్వుతూ “వదినా! మీరూ, అన్నయ్యగారూ కూడా అదృష్టవంతులండీ! మానస అత్తవారింటికి వెళ్ళినా రోహిత్ ఉంటాడు. వాడితో మీకు టైమే తెలీదు.”

లలిత కూడా తనలో తను అనుకుంది.

‘నిజమే! ఆ రోజు తనకి కన్సీవ్ అయింది అని తెలిసిన రోజు శాపం తగిలినట్టే భయపడింది. ఈ రోజు అదే వరంలా ఉంది. రోహిత్ తమ ఇద్దరికీ కంటిపాపలాటి వాడే! ఇంక వాడికి చక్కటి భవిష్యత్తు ఉండేలా పెంచటమే తన పని. భర్త రిటైర్ అయేసరికి రోహిత్ చదువు అవకపోయినా ఫరవాలేదు. బేంక్‌లో దాచిన డబ్బుతో వాడి చదువు అయిపోతుంది. మంచి సలహాలు ఇవ్వడానికి మానసా అల్లుడు ఉన్నారు కూడా!’

Exit mobile version