Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వారెవ్వా!-19

వైద్యో నారాయణో హరిః
వేదవాక్కు పుణ్యప్రదము.
వైద్య విద్య వ్యాపారమాయె
అధిక ఫలమగు సేద్యమాయె.
పేదవారికి దూరమాయెను
మధ్య తరగతి యాతనాయె.
సీట్ల పంపకమందు ప్రైవేట్
సీట్లు జేసి కోట్లు దోచిరి.
వైద్య విద్యాలయము కోసం
ప్రభుత్వం ఖర్చెంతో జేసె.

***

ప్రభుత్వ వైద్య విద్యాలయము
వసతులెన్నో పరచి వుంచె.
ప్రజల పన్నుల తోటి డిగ్రీ,
పీ.జి. కోర్సులు చదివినారు.
సూపర్ స్పెషాలిటీ చదువులు
స్టై ఫండుతో పూర్తి చేసిరి.
ప్రజాసేవలో మునుగుతామని
ప్రమాణాలు చేసి వచ్చిరి.
ఆస్పత్రిలో చేరగానే
ఆది విలువలు మరిచిపోయిరి.

***

సంప్రదింపుల ఫీజు నాలుగు
అంకెలంటెను రూపాయలు.
పలు పరీక్షలు తప్పవందురు
పల్లవించును చార్జిలెన్నో.
ఆపరేషన్ పరేషాన్లకు
అంతు, అదుపు లేకపోయెను.
బెడ్డు చార్జీలన్నీ కలియగ
నడ్డి విరుచుట ఖాయమాయె.
ఎన్నికైనది, ఎదురులేనిది
వైద్యవ్యాపారమ్ము నేడు.

Exit mobile version