ఓ వైపు ఎండ మండిపోతోంది… ఎన్ని నీళ్లు తాగినా దాహార్తి తీరటం లేదు. లీటర్లకొద్దీ నీళ్లు నిమిషానికోసారి తడుపుతున్నా… నాలుక మాత్రం పిడచకట్టుకుపోతూనే ఉంది. ఈ దశలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతే… దారి పొడవునా సన్నని వాన తుంపరలు శరీరాన్ని తాకుతూ… గాలిలో వేడి హఠాత్తుగా మాయమై… పిల్ల గాలులు శరీరాన్ని జలదరింపజేస్తూంటే ఆ అనుభూతి ఒక్కసారి ఊహించుకోండి..
ఆకాశంలో మేఘం మీ శరీరాన్ని స్పృశిస్తూ, మీరు ఆ మేఘంపై ఉండి.. మీ కింది నుంచి ఆ మబ్బులు వెళ్తుంటే.. వావ్.. ఆలోచిస్తుంటేనే అద్భుతంగా ఉంటుంది. అలాంటిది నిజంగా అనుభవిస్తే, అది అనుభవైకవేద్యమే కానీ, వర్ణించటానికి అలవికానిది. తమిళనాడులోని కొడైకెనాల్ కు వెళ్లే కచ్చితంగా ఇదే అనుభూతి కలుగుతుంది.
భారతదేశపు పశ్చిమ కనుమల్లో, సముద్ర మట్టానికి దాదాపు రెండువేల మీటర్ల ఎత్తున ఈ కొండప్రాంతాన్ని మాంఛి సమ్మర్‌లో సందర్శించటం కంటే అపూర్వమైన అనుభూతి మరొకటి ఉండదు. మండే ఎండల్లో కొడైకెనాల్‌కు వెళ్తే నగరానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో కూడా ప్రచండ సూర్యుడు నిప్పులు కక్కుతుంటాడు. ఇంత ఎండ ఉండి కొడైకెనాల్‌లో చల్లగా ఎలా ఉంటుందంటే అదే అద్భుతం. హిల్ స్టేషన్ అయిన ఈ నగరం పలు పర్వతశ్రేణుల మధ్య నిర్మితమైంది. అనేక కొండలను కలుపుతూ ఏర్పాటైన ఈ నగరం ఘాట్ రోడ్ ప్రారంభం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. బయటి నుంచి ఒక్కసారిగా ఏసి హాల్ లోకి వస్తే వాతావరణం ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. ఒక కొండ నుంచి మరో కొండ.. ఆ కొండ నుంచి ఇంకొక కొండ.. ఇలా దారి ఒకటే. ఒక కొండ నుంచి మరో కొండకు ఎలా దాటిపోతున్నామో తెలియకుండానే జరిగిపోతుంది. పైకి వెళ్తున్న కొద్దీ కింద ఎక్కడో దూరంగా మరో కొండ పైనున్న రహదారిని గమనిస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. కొండల్ని తవ్వుకుంటూ నిర్మించిన రోడ్డుపై మలుపుల మీద మలుపులు తిరుగుతూ… వెళ్తుంటే ఆ అనుభూతికి ఏమని పేరు పెట్టగలం?
కొడైకెనాల్ పశ్చిమ కనుమల్లో శీతల ప్రదేశాల్లో ఒకటి. నూట యాభై అడుగులకు పైగా నిటారుగా ఎదిగిన వృక్ష సముదాయంతో దట్టమైన అడవి. సరస్సులు, జలపాతాలు, కొండ గుహలు ఒకటా రెండా దాదాపు పది నుంచి పాతిక కిలోమీటర్ల పొడవైన ప్రయాణంలో చూసేందుకు ఎన్ని కళ్లున్నా చాలవు. డాల్మిన్ సర్కిల్‌లో జలపాతాలు అద్భుత సుందర దృశ్యం. అక్కడి నుంచి సైలెంట్ వ్యాలీ, పిల్లర్ రాక్‌ల దగ్గరకు వెళ్లే మేఘాలు మిమ్మల్ని ఆత్మీయంగా స్పృశించి వెళ్తాయి. మనం నిలుచున్న చోటి నుంచి చూస్తే మేఘాలు మన కింది నుంచి కదిలిపోతుంటాయి. అవి మనల్ని తాకుతుంటే, వాటిని మనం కదిలిస్తుంటే ఒక్కసారి మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందో..
అది దాటాక గుణ గుహ.. కమల్ హసన్ గుణ సినిమా గుర్తుంది కదా… ఆ సినిమా షూటింగ్ జరిగిన గుహ ఇదే.. ఆ తరువాత అక్కడే ఉన్న చెట్టియార్ పార్క్, కోకర్స్ వాక్, బ్రయాంట్ పార్క్ ఇలా ప్రతి ఒక్కటీ చూడదగిన ప్రదేశమే. వీటన్నింటికీ మించి అక్కడ ఉన్న వాక్స్ మ్యూజియం చాలా అద్భుతమైంది. చివరగా కొడైకెనాల్ సరస్సులో బోటు షికారు.. దాని పక్కనే 7డి మోషన్ మూవీ థియేటర్..
ఆ పక్కనే అమ్మ క్యాంటిన్లో అయిదు రూపాయలకే భోజనం.. భోజనానంతరం తిరుగు ప్రయాణం. హాట్ సమ్మర్‌లో కూలెస్ట్ కొడైకనాల్.. ఒక్కసారి విజిట్ చేసి రావలసిందే.
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. వీరి టీవీ సీరియల్ పుస్తకం దేవ రహస్యం అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది.