వానరాకతో చిన్నప్పుడు
అమ్మమ్మ చీరకొంగు చాటులో
టప్ టపా టప్… శబ్దహోరు వినేవాణ్ణి..
బడిదారిలో చినుకులు కురిస్తే
పలక తలపై అడ్డుపెట్టుకుంటే
ఫట్ ఫటా ఫట్… దరువు
నన్ను పరుగులు పెట్టించేది…
వరినాట్లు వేసి వారాలు గడుస్తున్నా
వాన తల్లి చల్లని చూపుకై
అందరూ దండాలు పెడుతుంటే
హఠాత్తుగా చినుకు పలకరిస్తే
నాన్న కళ్ళలో పులకిత మెరుపు
శ్రమైక జీవన గమన మలుపు…
మెతుక్కి శ్రుతీ బ్రతుక్కి లయా
మానవాళికి సతత హరిత ప్రేరణ
సగటుజీవికి సహృదయ ఆలంబన
గగన మేఘామృత జల్లు దీవెన..
చినుకుల నిత్య పవిత్ర సవ్వడి
దేశ దేహ ప్రగతికారక ఉరవడి !