[డా. సుంకర రమేశ్ రచించిన ‘వసంత గాలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
గాలి మెడ మీద
గోరువెచ్చని తాపడం
యుగాల వేడి బంధనం
అలుముకున్న దాహం
దరిచేరని తీరాలు
ప్రేయసి కోసం
మల్లెపూల లాంతరు మోసుకొస్తున్నాడు
పూలతోటను పట్టుకొని బయలుదేరాడు
ప్రియురాలిని వెంటేసుకుని
సలాలా వెళదామనుకున్నాడు
సీతాకోకచిలుకల్ని
భుజాన తిప్పుకునేవాడే కవి
సుకుమారుడు కదా
కాలం అల్లిన వేడివంతెన దాట గలడా
మోహిని తెచ్చిన కానుక
కాదన గలడా
వేసవి సోయగంలో
మెరిసే ముత్యపు ముక్కుపుడక
తరుముకొస్తున్న చల్లని గాలికి
దారులు తీసిన ఆకాశాపందిరి
ఏ చుక్కనందుకుంటావు
తొలిజాము రాతిరి
గంధపు సానపై
అరగదీసిన వెన్నెల
ఋతువులెన్నో చూసి
రాగమాలిక అందుకున్నాడు
వసంత గాలికి అలసిపోతున్నాడు
తుమ్మెదల ఝంకారానికే
కందిపోతున్నాడు
కరుణించే రాత్రికోసం
కలగంటున్నాడు.
