[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]
[అమ్మవారి విగ్రహం వెనుక ఉన్న అరలో దొరికిన ఉత్తరాన్ని తీసుకుని బయటకు వస్తారు స్వపిక, నిత్య. ఆ కవర్‍లోని ఉత్తరంలో ఏముందో చదవమని చెప్తుంది స్వప్నిక. నిత్య చదివి వినిపిస్తుంది. ఆ ఉత్తరం నందిని బహాదూర్ – తన కూతురు స్వప్నికకు వ్రాసినది. అందులో కాత్యయని అమ్మవారి ఆదేశాలు, తమ వంశపు శాపం, దానికి నివారణగా ఏం చేయాలో చెప్పడం.. తదితర వివరాలు ఉంటాయి. అమ్మవారి సూచన మేరకు స్వప్నిక వివాహాన్ని బ్రాహ్మణుడైన సుధీర్ వర్మతో జరిపించామనీ, అమ్మవారి ఆదేశాల మేరకు స్వప్నిక సుధీర్ వర్మల కుమార్తె నిర్వహించాల్సిన బాధ్యత ఏమిటో రాస్తుంది నందిని. మన బిడ్డ వల్ల ఇదంతా సాధ్యమేనా స్వప్నిక ఆశ్చర్యపోతే, సుధీర్ ధైర్యం చెప్తాడు. నిత్య చూపించిన దిశలో వెళ్తే, రాజవంశపు తాలూకు నిధి, కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్, లభిస్తాయి. కోటని స్వప్నిక కూతురుకి అప్పగిస్తూ ‘వసంత లోగిలి’ పేరుతో ఒక డాక్యుమెంట్‍తో పాటు బ్యాంక్ పాస్ బుక్ ఉంటుంది. వాటిని భద్రపరిచి, నిత్య చదువు పూర్తయ్యాకా, అమ్మవారు ఆదేశించిన బృహత్కార్యాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. సంచిత రామవర్మ సూచనల మేరకు వాళ్ళంతా విశాఖపట్టణం బయల్దేరుతారు. దారిలో కారుకి యాక్సిడెంట్ అవుతుంది. ధనంజయ్ జైలు నుంచి తప్పించుకుని వారిని టార్గెట్ చేస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుసుకున్న స్వప్నిక వాళ్ళు ఓ పోలీస్ అధికారి సాయంతో కొంతకాలం రహస్యంగా ఉండి, దెబ్బలు తగ్గకా, మద్రాసుకి మకాం మారుస్తారు. నిత్య అక్కడి కాలేజీ నుంచి ఎంబిఎ పూర్తి చేస్తుంది. ఇక చదవండి.]
“అక్కడ నేను నవీన్‌తో ప్రేమలో పడ్డాను. ఇక నవీన్ గురించి చెప్పాలంటే.. చాలానే ఉంది శారదా!
ఆయన ఒక అనాథ. పిల్లలు లేని దంపతులు నవీన్‌ని తెచ్చి పెంచుకున్నారు. చదివించారు.. నవీన్ అంటే వాళ్లకి పంచప్రాణాలు.. వాళ్ళు రాజమండ్రిలో ఉండేవారు. అతనికి ఎంబిఎ మద్రాస్‌లో మా కాలేజ్‌లో సీట్ వచ్చింది. అతనిని వదిలి ఉండలేని తల్లితండ్రులు రాజమండ్రి నుంచి మద్రాస్‌కి మకాం మార్చేసారు. ఒక ఫార్మ్ హౌస్‌లో పని చేస్తూ ఆ దంపతులు నవీన్‌ని చదివించేవారు.
నవీన్.. పేరు లాగానే మనిషి కూడా కొత్తగా ఆలోచిస్తాడు, కొత్తగా ఉంటాడు అని మొదటసారి నవీన్‌ను చూసి అనుకున్నాను.
కాలేజ్‌లో ఏ విషయం మాట్లాడాలన్నా ప్రొఫెసర్స్ తననే లేపి అడిగేవారు.. ఒక విషయాన్ని అందరూ ఒకలా ఆలోచిస్తే, తానొకలా అలోచించి సమాధానం చెప్పేవాడు. అందువల్ల ప్రొఫెసర్స్ అందరికీ నవీన్ అంటే చాలా ఇష్టం. ఆ ప్రత్యేకత వల్లేమో నేను నవీన్ పట్ల ఆకర్షితురాల్ని అయ్యాను.
ఒకరోజు కాలేజ్‌లో ఓ ఫంక్షన్ అవుతోంది.. ఇంకా గెస్ట్స్ రావడానికి కొద్దిపాటి టైం ఉంది. ఇంతలో స్టేజ్ మీద నవీన్.. ‘ఫన్నీ టాపిక్’ అంటూ మొదలుపెట్టాడు.. కాని అది చివరికి ప్రేమ, పెళ్లి, పిల్లల వరకూ వెళ్ళిపోయింది.
ఇంతలో ఓ అబ్బాయి లేచి, ‘ప్రేమ, పెళ్లి, పిల్లల మీద మీ అభిప్రాయం ఏంటి నవీన్’ అని అడిగాడు.
వెంటనే.. ‘ప్రేమ పేజీ చదివి ఊరుకుంటే సరిపోదు, పెళ్లి వరకు వెళ్ళాలి, తీరా పెళ్లి చేసుకుంటే, పిల్లల పేజీ తెరవాల్సిందే.. అక్కడ నుంచి మీ అమ్మా మీ నాన్న, మా అమ్మా మా నాన్న అంటూ ఎన్నో సతాయింపులు, బాధ్యతలు, బరువులు మొయ్యాలి. ఇప్పుడు ప్రశాంతంగా నేను మా అమ్మానాన్నలతో ఉంటున్నాను.. ఇలాగే ఉండాలనుకుంటున్నా.. కనీసం ప్రేమ పేజీ కూడా నేను చదవాలనుకోవడం లేదు.. కాబట్టి ఇటువంటి తుక్కు ప్రశ్నలు అడగకుండా.. కొత్తగా ఏమైనా అడగండి’ అన్నాడు నవీన్.
ఈ మానవుడు నాకు కొత్తగా అనిపించాడు.
ప్రతి రోజు గ్రూప్ వర్క్‌లో నాతో పాటు నవీన్ కూడా ఉండేవాడు. తను ఒక కదిలే లైబ్రరీ (మొబైల్ ఎన్‌సైక్లోపీడియా). చాలా విషయాల మీద మంచి అవగాహన ఉంది.. సినిమాలు, రాజకీయాలు, స్పోర్ట్స్, సాహిత్యం.. ఇలా అన్ని విషయాలు కూలంకుషంగా మాట్లాడుతాడు. ఎదుటవాళ్ళకి ఆసక్తి కలిగేలా మాట్లాడుతాడు. ఎందుకో నాకు బాగా కనెక్ట్ అయ్యాడు.. కాని తనకి ఏ అమ్మాయి కనెక్ట్ కాలేదు. బహుశా ప్రేమ పేజీ తెరవాలనుకోలేదు కాబట్టి.. మనసు తలుపులు మూసుకుని ఉన్నాడు అని నాకర్థమైంది.
ఒడ్డు, పొడుగు ఉన్న ఆరడుగుల అందగాడు.. తన మనసు తలుపులు తెరుచుకుని తన మనసులో నేను ఉండాలి. కాని, ఎలా? అనుకున్నాను.
ఇంతలో నేను ఒక థీసిస్ రాయాల్సి వచ్చింది.. అది నేను నా ‘వసంత లోగిలి’కి ఉపయోగపడే టాపిక్ రాయాలనుకున్నా. ‘వృద్ధులు-పిల్లలు’ అన్న టైటిల్‌తో నేను నా థీసెస్ సబ్మిట్ చేశాను.
అందులో వృద్ధులు- అనుబంధాలు, వృద్ధులు-వాళ్ళ అవసరాలు – వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళకుండే ఆరోగ్య సమస్యలు, వాళ్ళ పై ఉండే ఒత్తిడి లాంటి అంశాలు తీసుకున్నా.. అలాగే పిల్లలను వాళ్లకి అనుసంధానం చేస్తే, పిల్లల తరం ఎటువంటి లాభాలు పొందుతారు, వాళ్ళనించి ఏమి నేర్చుకుంటారు? నేటి వృద్ధాప్యం రేపటి తరానికి ఒక వనరు కాగలదా! పిల్లలు తమ తాత తండ్రుల నుంచి ఏమి తెలుసుకుంటారు లాంటి ఎన్నో విషయాలు అందులో పొందుపరిచాను.
ఆ థీసిస్‌లో ప్రతి పేజీ చదివాడు నవీన్.. ప్రతి అంశాన్ని ఆకళింపు చేసుకున్నాడు..
ఆ రోజు నన్ను కలవాలని వచ్చిన నవీన్.. నాకు ప్రపోజ్ చేసి వెళ్ళాడు. భలే విచిత్రంగా అనిపించింది నాకు. ఈ గురుడు మనసు తలుపులు తెరవకపోతే, నేనే తెరిచేద్దాం అనుకున్నా. కాని తనే నా వద్దకు వచ్చి, ‘నా జీవితంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా నిత్యా! రాగలవా!’ అని అడిగాడు
ఆఁ.. ఆఁ.. అని తెరిచిన నా నోటిని తన చేత్తో మూసేస్తూ.. ‘టైం తీసుకుని, అలోచించి చెప్పు.. ఇప్పటికిప్పుడే నీ నిర్ణయం చెప్పాల్సిన పని లేదు’ అన్నాడు.
ఆశ్చర్యపోయాను.. ఎగిరి గంతేసాను.. నేను కోరుకున్న ప్రేమ ఇంత తొందరగా దొరుకుతుందని, వచ్చి నా ఒడిలో వాలుతుందని ఊహించలేదు.. ఇది కలా! నిజమా! అని అనిపించింది నాకు. కాని ఒకటే సందేహం.. అందరి ముందు ప్రేమ పేజీ తెరవను, పెళ్లి దాకా వెళ్ళను అన్న నవీన్.. నాతో ప్రేమలో పడడానికి కారణం ఏమై ఉంటుంది అన్న ప్రశ్న నా బుర్రని తొలిచేస్తోంది.
బహుశా నా థీసిస్ నచ్చిందా! నేను నచ్చానా! అడిగి తెలుసుకోవాల్సిందే అనిపించింది. క్షణం ఆలోచించకుండా నవీన్ దగ్గరకి వెళ్ళాను.
‘నవీన్ నాకొక సందేహం.. తీరుస్తావా!’ అని అడిగాను
‘అడుగు డియర్.. చెప్తాను’ అని కాస్తా ముందుకు వచ్చాడు
‘ఆగు.. ఆగు.. అక్కడే ఆగు నవీన్’ అంటూ తనని కాస్తా వెనక్కి నెట్టి,
‘థీసెస్ నచ్చి ఆహ్వానించావా! నేను నచ్చి ఆహ్వానించావా – నీ జీవితం లోకి’ అని అడిగాను
నిజాయితీగా ‘రెండూ నచ్చి, నీతో జీవితం పంచుకోవాలని ఆశ పుట్టి.. ఆహ్వానించా’ అన్నాడు.
‘జీవితంలో ‘పెళ్లి పేజి’ వద్దు అనుకుంటున్నాను అన్నావు. కారణం తెలుసుకోవచ్చా’ అన్నాను.
‘ఎందుకు వద్దన్నానో తెలుసుకోవాలంటే నా గురించి నువ్వు చాలా తెలుసుకోవాలి’ అంటూ తన గురించి చెప్పాడు నవీన్.
‘కడుపున పుట్టిన బిడ్డని డబ్బు కోసం అమ్ముకునేవాళ్ళని చూసాం, ఆస్తుల కోసం అమ్ముకునేవాళ్ళని చూసాం, చివరికి ఆకలి తీర్చుకోవడం కోసం అమ్ముకోవడం కూడా చూసాం.. కాని, కల్లుకుండ కోసం కన్నబిడ్డని అమ్మేసుకున్న వాడ్ని చూసావా! నిత్యా చిన్నప్పడు నన్ను సంతలో ఓ కసాయి తండ్రి ఒక కల్లుకుండ కోసం అమ్మకానికి పెట్టాడు. ఆ కసాయి తండ్రి ఎవరో కాదు నా కన్న తండ్రి. నిజానికి ఆయన కన్నతండ్రో, నన్ను ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చి అమ్మేశాడో కూడా ఎవ్వరికీ తెలీదు. సంతలో కల్లు కుండని చూసి, ఆ కుండ ఇస్తే, ఈ బాబుని ఇస్తాను అన్నాడంట. కల్లు వ్యాపారం చేస్తున్న ఓ దంపతులకు పిల్లలు లేరు, చేతిలో బిడ్డని తీసుకుని తమ వద్ద ఉన్న కల్లు కుండను ఇమ్మన్న వ్యక్తిని చూసి ఆశ కలిగింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా, ఆలోచించకుండా బిడ్డని తమ చేతుల్లోకి తీసుకున్నారు ఆ దంపతులు. తమ వద్ద ఉన్న కల్లుకుండని ఆ వ్యక్తికి ఇచ్చేసారు. మళ్ళీ వచ్చి ఆ బిడ్డని ఎక్కడ తీసుకుంటాడో అని, ఆ ఊరు వాడ వదిలేసి, పరుగు పరుగున బిడ్డని తీసుకుని రాజమహేంద్రవరం వచ్చి అక్కడే ఉండిపోయారు ఆ దంపతులు. ఆ బిడ్డ ఎవరో తెలుసా నిత్యా. అది నేనే..’ అన్నాడు నవీన్.
ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయాను.
‘ఆ కల్లు అమ్ముకునే దంపతులు మా అమ్మా నాన్న. వృత్తి విద్య దైవం లాంటిది. నిత్యం తిండి పెట్టే వృత్తిని నా కోసం త్యాగం చేసారు. పాపం వాళ్ళ వృత్తిని, ఊరుని వాడని, వదిలేసి, రాజమహేంద్రవరంలో దొరికిన పని చేసుకుంటూ అల్లారు ముద్దుగా ప్రేమతో పెంచి నన్ను ఇంతవాడ్ని చేసారు నిత్యా!
నాకున్న ప్రపంచం నేను – మా అమ్మా నాన్న ఇదే. నా ప్రపంచంలో కొత్తగా ఎవరైనా వస్తే, మా మధ్య దూరం పెరుగుతుందేమో అన్న భయంతో మా ప్రపంచం లోకి ఎవ్వర్నీ రానివ్వలేదు. నన్ను పెంచుకున్న మా అమ్మా నాన్నకు నేను తప్ప వేరే ప్రపంచమే లేదు. వాళ్ళతోనే నేను నిత్యం ఉండాలి. ఎంత ఎదిగినా, ఎంత ఒదిగినా వాళ్ళ మధ్యనే ఉండాలి. ప్రేమ, పెళ్లి లాంటివి జరిగితే నాలుగో మనిషి వచ్చి మా మద్య దూరం పెంచుతుందేమో అన్న భయం. అందువల్ల ప్రేమ పేజీ తెరవకుండా ఉండిపోయాను నిత్యా. ఓ రకంగా ఆసక్తిని కోల్పోయాను.
నీ ఆలోచనలు నాకు నచ్చుతున్నాయి, మెల్లిగా నువ్వు నాకు నచ్చుతున్నావ్. ఈ రోజు నిన్ను చూసాక నువ్వు కావాలి అనిపిస్తోంది. నువ్వైతే, మా మధ్య దూరం పెరగదు అనిపిస్తోంది.. నీ థీసిస్ చదివాక నా ఆశకి బలం వచ్చింది. నా మది నిండా నువ్వు నిండి పోయావ్ నిత్యా’ అన్నాడు నవీన్.
నాకు చాలా హ్యాపీ అనిపించింది. తన కోరిక న్యాయమైన కోరికే అనిపించింది నాకు.
కాసేపు నా గతం గురించి, నా గురించి మాట్లాడుకున్నాం. కాసేపు పోయాక, పిల్లల్ని కనాలని అనుకోవటం లేదు నిత్యా అన్నాడు. ఒక్కసారిగా తలమీద పిడుగు పడ్డట్టు అయింది. ‘అయ్యో రామ! పిల్లలు లేకుండా ఎలా! జీవితం పరిపూర్ణం కాదు కదా’ అన్నాను.
‘ఈ ప్రపంచంలో చాలా మంది అనాథ పిల్లలున్నారు, వారిలో నీకు నచ్చిన వాళ్ళను మనం దత్తత తీసుకుందాం. మన పిల్లలకి మనం అమ్మా నాన్నలవడంలో థ్రిల్ ఏముంది చెప్పు. అది సమాజంలో ప్రతి ఒక్కరూ చేసే పనే, వాళ్ళ పిల్లలను, సాకటం, పెంచడం, చదివించడం, వాళ్ళ కోసం అష్ట కష్టాలు పడి, కడుపు కట్టుకుని, వాళ్ళ కోసం ఆస్తులు సంపాదించడం.. ఇవన్నీ తమ పిల్లల కోసం అందరు తల్లి తండ్రులు చేస్తారు. అందులో కొత్తేం ఉంది నిత్యా!
తల్లీ తండ్రీ లేక, దిక్కు మొక్కు లేక గాలికి దూళికి పెరిగే పిల్లలని చేరదీసి, మంచి మర్యాద నేర్పి, సమాజానికి పనికొచ్చే బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్ది, వాళ్ళు ఎదిగాక ఒదిగి ఉండే క్షణంలో వీళ్ళ అమ్మానాన్న వీళ్లేరా! అని సమాజం మనల్ని గుర్తిస్తుంది చూడు, అప్పుడు.. అప్పడు అందులో ఉంటుంది కిక్ నిత్యా! అందులో ఉంటుంది’ అన్నాడు.
దీనికి కాస్త ఇబ్బంది పడ్డాను.. పోనీ ఒకరిని కనీ ఒకరిని పెంచుకుందాం అన్నాను.
కానీ, నవీన్ దానికి ఒప్పుకోలేదు సరికదా! ఒక మంచి విశ్లేషణ చేసాడు.
అదేంటి అంటే?.. ‘నువ్వు ఒకరికి కన్నతల్లివి, ఒకరికి పెంచిన తల్లివి అవుతావు.. కన్న బిడ్డ పట్ల ఉన్న ప్రేమ, పెంచిన బిడ్డపై చూపించలేక నలిగిపోతావు.. అంతే కాదు స్వార్థం నీ మనసులో పెరిగిపోయి తల్లిగా విఫలమైపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది.. ఆలోచించుకో..
ఈ కారణం చేత నన్ను నువ్వు పెళ్ళాడకపోయినా నేనేమీ అనుకోను.. ఎందుకంటే నీ అభిప్రాయం నీది.. దాన్ని నేను గౌరవిస్తాను.. కాని, నువ్వు వద్దన్నా నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను నిత్యా’ అన్నాడు నవీన్.
నవీన్ విశ్లేషణ నాకు బాగా నచ్చింది, కన్విన్సు అయ్యాను. ఆ తరువాత నేనే ఒప్పుకున్నాను.. అలా నా పెళ్లి నవీన్‌తో అయిపొయింది శారదా! అమ్మ నాన్నకి నవీన్ సిద్ధాంతాలు, ఆలోచనలు చాలా నచ్చాయి. పిల్లల విషయంలో అమ్మ కాస్త ఆలోచించింది. పిల్లలు పుట్టే సామర్థ్యం లేని వాళ్ళు పెంచుకుంటారు. నీకేం అవసరం అంది. పోనీ ఒక్కర్ని కనండి, ఇంకొకర్ని పెంచుకోండి అని నేను అన్నట్టే అమ్మ కూడా అంది.. ససేమిరా అన్నాడు నవీన్.
‘చూడమ్మా! నా ఆశలకు, ఆశయాలకు తను అడ్డు చెప్పనప్పుడు నేను కూడా తన ఆశయాలకు అడ్డు చెప్పకూడదు అనుకుంటున్నా! పైగా అతని విశ్లేషణ నాకు నచ్చింది. బంగారం లాంటి ఇద్దరి పిల్లలను పెంచుకుని రత్నాల్లా తీర్చిదిద్దుతా, చూస్తూ ఉండు’ అన్నాను. ఇక అమ్మ కాదనలేకపోయింది. పెళ్ళైన రెండు సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేసాం. ఆ తరువాత నా ఒళ్లోకి ఇద్దరు బిడ్డలు వచ్చారు. వారు అనాథలంటే ఎవరూ నమ్మరు. రోజుల పిల్లల్ని తెచ్చుకున్నాం. వారి ఆలనా, పాలనలతో రోజులు సంతోషంగా గడిచిపోయాయి. వారిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాం. చదివించుకుంటూన్నాం.. ఇంకేం కావాలి నాకు. అత్తయ్య మామయ్యకి నవీన్ అంటే పిచ్చి. అందుకేనేమో నేనంటే కూడా వల్లమాలిన ప్రేమ వాళ్లకి. నీ కడుపున పిల్లలైతే బాగుండు అనేవారు అత్తయగారు మొదట్లో.. నాకు చెప్పినట్టే నవీన్ వాళ్లకి చెప్పడంతో వాళ్ళు కూడా మిన్నకుండిపోయారు. వీళ్ళందరితో పాటు ఈ ‘వసంత లోగిలి’ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉండనే ఉంది. బహుదూర్ వంశ౦ నా మీద పెట్టుకున్న ఆశయాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నా.. ఇంతకంటే ఏమీ కోరుకోదలచుకోలేదు శారదా.
మా అమ్మా వాళ్ళని కూడా మాతోనే ఉండమంటాడు నవీన్. కాని, వాళ్ళు ఒప్పుకోలేదు.. కాలు చెయ్యి బాగుండగా మేం ఎందుకు మీ దగ్గర.. బాగోని పక్షంలో మీ దగ్గరకి వస్తాం.. మీ సేవలు మాకు అవసరం అన్నప్పుడు తప్పకుండా వస్తాం అంటారు.
‘బ్యాంక్‌లో పని చేస్తున్న నవీన్‌తో పాటు వారి తల్లితండ్రులు, ఇద్దరు పిల్లలు.. వసంత లోగిలి.. వెరసి ఓ కుటుంబం అయింది నాకు’ అంది మా నిత్య” ఓ క్షణం చెప్పడం ఆపింది శారద.
మళ్ళీ భర్తతో మాట్లాడుతూ.. “మానస పుత్రిక లాంటి ‘వసంత లోగిలి’ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తోంది నిత్య. అలాంటి నిత్య నడుపుతున్న ‘వసంత లోగిలి’కి నన్ను తీసుకుని వెళ్ళింది.
అలాంటి మంచి మనసున్న ‘మహా మనిషి’ మా నిత్య.. ఈ ‘వసంత లోగిలి’ అంటే ఏంటి? దీని ద్వారా ఏఏ కార్యక్రమాలు జరుగుతాయో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు కూడా పెరిగింది. అందుకే తన వెంట వెళ్ళాను. సొంత తల్లి తండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది నవీన్ తల్లితండ్రులను. అలాగే దత్తత తీసుకున్న పిల్లల్ని కూడా అంతే బాధ్యతగా సొంత తల్లి కంటే ఎక్కువగా పెంచుతుంది.. వీటికీ తోడూ వంశాన్ని వృద్ధి చేసే వినూత్నమైన బాధ్యత ఈ ‘వంసంత లోగిలి’.
తన మాటలు, తను చేసే కార్యక్రమాలు నన్ను ఎంతో ఉత్తేజపరిచాయి సునీల్.. మన కోసం మనం జీవించడంలో గొప్పేముంది.. ఇతరుల కోసం బతుకుతోంది మా నిత్య. తను నడిపే ‘వసంత లోగిలి’ చూడాలని ఉంది అని చెప్పగానే మద్రాస్ దగ్గరలో ఉన్న వాళ్ళ కోటకు నన్ను తీసుకుపోయింది. ‘వసంత లోగిలి’ వాళ్ళ పూర్వీకుల కోట. ప్రాకారానికి ‘వసంత లోగిలి’ అన్న అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. ఆ ప్రాకారం లోపలి వెళ్ళగానే అదో ప్రపంచం అనిపించే అనుభూతి పొందాను.
అదో అందమైన లోగిలి.. చుట్టూ అందమైన పచ్చదనం.. కాసేపు గడుపుదామనుకుని వచ్చి, తిరిగి వెళ్లాలని అనిపించని కొత్తదనం, ‘క్షణాలెందుకు పని ఉన్నట్టు అలా పరుగెడుతున్నాయి’ అని కంటికి కనిపించని కాలం మీద విసుగు వచ్చింది. కొత్తగా ఆత్రుతతో కూడిన ఉత్తేజం నన్ను ఆవహించింది.. మళ్ళీ ఎన్నాళ్ళకు ఇక్కడకు రాగలమో! అన్న నిరుత్సాహం.. ప్రతి రోజు రావాలనిపించే ఓ అందమైన బృదావనం, అ సుందర నందనవనం.
60 నుంచి 90 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధులు ఈ కోటలో 2500 మంది ఉంటారు. చక్కని వాతావరణం, చూడచక్కని సదుపాయాలు.. అప్పుడే ఉతికి ఇస్త్రీ చేసినట్టు కనిపించే బట్టల్లో మల్లెపూవుల్లా మెరిసిపోతున్నారు ఆ వృద్ధులు. ఆ ‘వసంత లోగిలి’ వయసు మూడేండ్లు. తెల్లారింది మొదలు యంత్రాల్లా కొంత మంది యువత ఆ వృద్దుల బట్టలు మార్చడం, మంచం పై పక్క మార్చడం, తినిపించడం, మందులు వెయ్యడం, వాళ్ళ ఒంటికి ఎలర్జీ లేకుండా ఒంటి నిండా చక్కని నువ్వుల నూనె రాయటం, ఇలా దేనికోసం కేటాయించినవాళ్ళు, ఆ పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతారు.
అప్పుడే మొగ్గ తొడిగిన 5-10 సంవత్సరాల పాపాయిలు అమ్మ ఒడిని వదిలి గుడి లాంటి బడిని చేరి కొత్త ప్రపంచం లోకి అడుగుపెడతారు. అక్షరాలూ, అంకెలు అంటూ తమ లేత చేతులతో రుద్ది రుద్ది అలసి పోతారు. హోం వర్క్‌లు, ప్రాజెక్ట్‌లు అంటూ పిల్లలను ‘మిషన్స్’ లా చూసే టీచర్స్.. బలవంతంగా, అమాంతంగా వాళ్ళ బుర్రల్లోకి దూరాలని ఆశతో చాల ప్రయత్నాలు చేస్తారు.. ఇది బడిలో జరుగుతుంది. ఆ తరువాత ఇంటికెళ్ళిన పిల్లలతో తల్లి తండ్రులు పిల్లల హోం వర్క్‌తో సతమత మవుతూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇబ్బంది పడతారు. వారి పసి వయసుకి పరిగెత్తే అవకాశ౦ ఉండదు, ఆడుకునే అవకాశ౦ ఉండదు.. అట్లాంటి పిల్లలకి సాయంత్రం పూట ఆట విడుపు ‘వసంత లోగిలి’.
నిత్య నాతో ఇలా చెప్పింది.
“ఇంటికి వెళ్లేముందు పిల్లలను ఇక్కడికే తీసుకురావాలని వాళ్ళ పేరెంట్స్‌తో, అలాగే టీచర్స్‌తో మాట్లాడి పిల్లల ‘మానసిక వికాసం’ పొందాలంటే, తాతయ్య, అమ్మమ్మ ఎంత అవసరమో! శారీరక వికాశానికి ఆటలు, పాటలు ఎంత అవసరమో! ఇలా కొన్ని మీటింగ్స్ పెట్టి చుట్టూ పక్కల స్కూళ్ళల్లో మాట్లాడి, సాయంత్రం ఇక్కడ గడపడానికి ఆమోదం తీసుకున్నాం..
బడి సమయం అయిపోగానే ‘వసంత లోగిలి’ బస్ వారిని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకురావడానికి వారి ముందు ప్రత్యక్షం అవుతుంది. బిలబిలమంటూ పిల్లలంతా ఆ బస్ ఎక్కుతారు. వారికి బడి ఇష్టం లేకపోవచ్చు, కాని ‘వసంత లోగిలి’ అంటే చచ్చేంత ఇష్టం.
‘వసంత లోగిలి’ కి వచ్చిన పిల్లలు అమ్మమ్మ, తాతయ్యల ఒడిలో ఆడుకుంటూ.. తమ చిన్ని బుర్రలలో ఉదయించే ప్రశ్నల వర్షంలో తడిపేస్తూ, పెద్దవాళ్ళను మురిపిస్తూ, మైమరిపిస్తూ, కథలు, కథనాలలో మునిగిపోతూ బాల్యాన్ని అనుభవిస్తూ ఉంటారు, బాధ్యతను తెలుసుకుంటూ పద్నాలుగేళ్ళ వరకు ఉండే చిరు ప్రాయం, తమ బాల్య౦ ఇక్కడ గడపాలని ఆశిస్తారు. సాయంత్రం అయితే చాలు పిల్లల నవ్వులతో నిండిపోయిన ‘బాల చంద్రుల నెలవే’ అవుతుంది ఈ ‘వసంత లోగిలి’.
అక్షరాల కోసం గుడి లాంటి బడి వదిలిన పిదప ‘వసంత లోగిలి’ ఒడిలోకి చేరి కేరింతలు కొడతారు, బడి ఎప్పుడు వదులుతారా అని ఎదురుచూస్తుంటారు ఆ చిన్నారులు. అక్షరాల బడి వదిలీ వదలగానే అమ్మలా అక్కున చేర్చుకుంటుంది ఆ చిన్నారులని ఈ ‘వసంత లోగిలి’.
పిల్లలు సరాసరి బడి నుంచి ఇక్కడకే రావడంతో ఉడికించిన పల్లీలు, జొన్న సంగటి, రాగి సంగటి, వేడి వేడి ఉలవచారు, కొత్తావకాయ, ఊరగాయలతో కలగలిపిన అల్పాహారం ప్రేమగా కలిపి పిల్లల కోసం ఎదురుచూస్తుంటారు సుధా, మాధవి, రాజమ్మలు.
వీళ్ళు ముగ్గురి పిల్లలు అమెరికా లో ఉన్నారు.. వాళ్ళ మనవలని చూసింది లేదు. అందుకే వాళ్ళ దగ్గరకి వచ్చిన పిల్లలను ప్రేమతో పలకరిస్తూ వాళ్ళ మనవలకే గోరుముద్దలు తినిపిస్తున్నాం అనుకుంటూ పిల్లల నోటికి అందిస్తారు. వీళ్ళు ఇష్టపడి చేసిన ప్రతి పనికి ఏంతో కొంత వేతనం కూడా ‘వసంత లోగిలి’ నుంచి ఇస్తాం. అవసరం ఉన్నవాళ్ళు తీసుకుంటారు. అవసరం లేని వాళ్ళు వద్దు అని సున్నితంగా తిరస్కరిస్తారు. ఈ పిల్లలను చూస్తుంటే మా మనవలను మనవరాండ్లతో గడిపినంత ఆనందంగా ఉంది అంటారు. ఇక్కడ ఉన్న వృద్ధులు వచ్చిన చిన్నారులను తమ మనవలు మనవరాల్ళే అన్నట్టు ఫీల్ అవుతారు.
ఇప్పుడేమేమి ఆడబోతున్నారు.. ఏఏ కథలు వినబోతున్నారు వంటి విషయాలు ఊరిస్తూ.. అమ్మమ్మ అందించే గోరుముద్దలు తినే చిన్నారులు పోటీ పడి తింటారు.. పోటీగా కథ నచ్చితే కథకి, ఆట నచ్చితే ఆటకి వస్తాదుల్లా నడుస్తూ వెళ్తున్న పిల్లలను చూసి మురిసిపోని వారు ఉంటారా మరి. సాయంత్రం నాలుగు నుంచి ఏడు వరకు బోసినవ్వులతో.. కిలకిల రావాలతో నిండిపోయే ఆ లోగిలి నుంచి బయటకి రావాలని ఎవరికి అనిపిస్తుంది?
ఇక సెలవు దినాల్లో అదే పనిగా అక్కడే ఉండి నిత్యం ఏదో ఒక వ్యాపకంలో తల మునకలైపోతున్న బుల్లి శాస్త్రవేత్తలు ఏ మూల చూసినా దర్శనమిస్తారు.” ఆపింది నిత్య.
“ఇంత అందమైన కలను నెరవేర్చుకోవడానికి నువ్వు చాలా కష్టపడి ఉండాలి కదా! నిత్యా” అన్నాను. “కొత్తగా.. సరికొత్తగా ఉన్న నీ ఆలోచనలకు అభినందనలు నిత్యా. ఈ ‘వసంత లోగిలి’ ఆనంద డోలికల్లో మునిగిపోయి తరించాలని నాకు కూడా ఉంది నిత్యా” అన్నాను.
“నేను ఒక లక్ష్యంతో చదివాను, సమాజానికి నా వంతుగా ఏదో ఒకటి చెయ్యాలని చదివాను. ఒక పెద్ద కంపెనీ పెట్టి, నలుగురికి ఉద్యోగాలిచ్చి ఉపయోగపడాలని మొదట అనుకునేదాన్ని. కానీ కాత్యాయనీ అమ్మవారు బహుదూర్ వంశంలో జరిగిన ఘోరమైన తప్పిదాలను ఇలా సరిచెయ్యాలనుకున్న తన ‘ఐడియాలజీ’ నాకు చాలా నచ్చింది. నా గమ్యాన్ని మారుస్తూ దిశ, నిర్దేశం చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తోంది ఆ అమ్మవారే. ఇన్‌ఫాక్ట్.. నేను ఎంబిఎ చదివే ప్రతి రోజు నా చదువుని ఈ ‘వంసంత లోగిలి’కి ఎలా లింక్ చెయ్యాలి అన్న ఆలోచనే తప్ప.. వేరే ఏది ఆలోచించలేదు సుమా! బహుదూర్ వంశం యొక్క ఆశయం నా ద్వారా తీరటం ఆవశ్యం. ఆ అమూల్యమైన అవకాశ౦ నాకు దక్కినందుకు చాల సంతోషంగా ఉంది. నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని శారద” అంది నిత్య.
(సశేషం)
శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో జన్మించారు. బంటుపల్లి సన్యాసప్పలనాయుడు, రమణమ్మ గార్లు తల్లిదండ్రులు. పద్మావతి మహిళా యునివర్సిటీ ‘మాస్టర్స్ ఇన్ కమ్యునికేషన్ & జర్నలిజం’ చేశారు. న్యూఢిల్లీ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ నుంచి ‘డిప్లొమా ఇన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా అండ్ పాలసీ’ చేశారు. ప్రస్తుతం విజయనగరం కన్యూమర్ కమిషన్‌లో సబ్ జడ్జ్‌గా (కన్స్యూమర్ కమిషన్ మెంబర్) వ్యవహరిస్తున్నారు. భర్త శ్రీ ఎస్.వి.సన్యాసి రావు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
శ్రీదేవి గారు కవితలు, కథలు, వ్యాసాలు రచించారు. పలు కథలకు వివిధ పత్రికలలో బహుమతులు పొందారు. లేత గులాబి అనే బాలల పుస్తకం వెలువరించారు. 60 రేడియో టాక్స్ చేశారు. చిన్ని ఆశ, పేపర్ బోట్ అనే డాక్యూమెంటరీలు తీశారు. మనోరంజని అవార్డ్ అందుకున్నారు. ‘వసంత లోగిలి’ వీరి తొలి నవల.