[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘‘వసంత లోగిలి’’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]
[మర్నాడు ఉదయం నిత్య నిద్ర లేచేసరికి అత్తగారు తయారై ఉంటారు. కాత్యాయని అమ్మవారి గుడికి వెళ్ళాకి కదా అని గుర్తు చేస్తారు. నిత్య, శారద కూడా త్వరగా తయారై ఆలయానికి వెళ్ళి వస్తారు. సాయంత్రం అందరూ కల్సి ‘వసంత లోగిలి’కి వెళ్తారు. ఇంతలో అక్కడికి స్వప్నిక, సుధీర్, సంచిత రామవర్మ వస్తారు. నిత్య ఎంతో సంతోషిస్తుంది. తర్వాత ‘వసంత లోగిలి’లో చక్కని కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతలో ఒక పెద్దావిడ వచ్చి నాకు బట్టలు ఇవ్వలేదు అని అరుస్తోందని చెబుతుంది సూరమ్మ. ఆ వచ్చినామెను తన అత్త అంజనగా గుర్తిస్తుంది స్వప్నిక. నిత్య ఆమెకు బట్టలు ఇవ్వబోతుండగా, అక్కడికి వచ్చిన పోలీసులు – ధనంజయ్ అనే వ్యక్తిని చంపేసిన ఓ ముసలామె ఇందులో దూరిందని వెతకడానికి వస్తారు. ఆమెను పోలీసులకి అప్పజెప్తుంది స్వప్నిక. ఆలస్యంగా వచ్చిన డాక్టర్ మామయ్యకి అన్నం వడ్దిస్తూ, తన లక్ష్యం గురించి, వృద్ధుల సేవ గురించి చెప్తుంది నిత్య. ఆయన నిత్యని అభినందిస్తాడు. అప్పుడు శారద ఇక నుంచీ తాను నిత్య వెంట నడుస్తాననీ అంటుంది. ఇవి చెప్తూ భర్త సునీల్‌కి చెప్తున్న గతాన్ని ముగిస్తుంది శారద. ఇక చదవండి.]
‘వసంత లోగిలి’ వేడుకకి హాజరవుతాడు శారద భర్త సునీల్. అన్నీ కార్యక్రమాలు ముగుస్తాయి. ఆత్మీయులంతా ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
“నిత్యా! ఏమో అనుకున్నాను మీ గురించి. కాస్త తప్పుగా కూడా అనుకున్నాను. శారద మీ గురించి, మీ ఆశయం గురించి చెప్పిన తరువాత మీ గొప్పతనం అర్థం అయింది. మీకు మేము చాలా ఋణపడి పోయాం.. నాన్నగారి ఆరోగ్యం బాగైంది.. ఆపరేషన్ అయిన తరువాత కొంచెం రెస్ట్ తీసుకుంటారని మా ఊరు తీసుకు వెళ్ళాలనుకున్నా.. కాని నాన్న ‘వసంత లోగిలి’కి వెళ్లాలని ఒకటే గొడవ. మీ మామయ్యగారు ఈ ‘వసంత లోగిలి’ గురించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి చెప్పారట. అది విన్న నాన్న ససేమిరా మా ఊరు రాను అంటున్నారు. అందుకే ఇక్కడకు తీసుకొచ్చేసాను” అన్నాడు సునీల్.
“నేను మీరు అనుకునేంత గొప్పదాన్ని కాదండోయ్ సునీల్ గారు.. కొంచెం మంచిదాన్ని అంతే..” అంది నిత్య.
“మీ నాన్నగారికి ఈ వాతావరణం నచ్చుతుంది. పైగా ఆయన మంచి తెలుగు మాస్టారు కూడా కదా! ఆయన చేసిన పనికి వేతనం లెక్కించి అందులో కొంత ఆయన ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు కింద జమ చేసుకుంటాం, అదీ ఆయనికి నచ్చితే సుమా!” అంది నిత్య.
“ఎంత మాట. నా సేవ ‘వసంత లోగిలి’కి పనికొస్తే అదే చాలు తల్లీ.. నాకు వేతనం, జీతం ఇలాంటివి ఏమీ వద్దు తల్లి.. ఇక్కడ నన్ను ఉంచితే చాలు.. వీళ్ళ మద్య నా శేష జీవితం గడిపితే చాలు” అన్నారు తెలుగు మాస్టారైన శారద మామయ్య.
“అయితే రండి మీ కోసం ఓ పెద్ద పని ఎదురుచూస్తోంది. అది మీరు మాత్రమే చెయ్యగలరు..” అంది నిత్య.
“ఏంటమ్మా! చెప్పు” అన్నారు తెలుగు మాస్టారు.
“ఇక్కడకు వచ్చే చిన్నారుల్లో ఓ అయిదుగురు గడుగ్గాయలు ఉన్నారు.. వారు పరమ పెంకి ఘటాలు.. వాళ్ళని మీ మనవళ్ళు అనుకుని కాస్తా దారిలో పెట్టండి.. అదే మీ పని” అంది నిత్య.
“ఆఁ.. అలాగే.. వాళ్ళు నాకంటే పెంకి ఘటాలా.. అయితే నేను వాళ్ళ బాధ్యత తీసుకుంటాను. వాళ్ళేరీ? ఎక్కడ ఉన్నారు?” అంటూ అటూ ఇటూ చూస్తున్న ఆయనతో
“ఆగండి ఆగండి.. సాయంత్రం.. వాళ్ళు దిగుతారు.. తొందరపడకండి.. అంతవరకు అదిగో అక్కడ చెస్ ఆడుతున్న గ్రూప్‌లో జాయిన్ అవండి” అంటూ పంపింది నిత్య.
“ఎవర్నైనా చిటికెలో ఎంగేజ్ చేసేస్తుంది.. అదే నా కూతురు ప్రత్యేకత” అన్నాడు సుధీర్.
“అది నా క్వాలిటీ” అంది స్వప్నిక.
“అది నీది కాదోయ్.. నాది” అన్నాడు సుధీర్
“ఈ క్వాలిటీ మీ ఇద్దరిదీ కాదు.. మా తాతయ్యది” అంటూ తాతయ్య ఒళ్ళో దూరిన నిత్యని చూస్తే భలే ముచ్చట వేసింది శారదకు.
***
కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న సుధీర్‌ని చూసి, “నాన్నా! మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకు మీ మూడ్ ఆఫ్ అయింది?” అంటూ ఎదురుగా ఉన్న కుర్చీని లాక్కుని కూర్చుంది నిత్య.
“ఏం లేదు నిత్యా! మన జీవితాలు. వచ్చిన మలుపులు చూస్తుంటే గమ్మత్తుగా, ఆశ్చర్యంగా లేదూ!
నేనో బ్రాహ్మణుడిని.. మధ్యతరగతి కుటుంబంలో సాదా సీదాగా బతుకుతున్న సామాన్యుడిని.. కాని, బహుదూర్ వంశపు రాకుమారితో వివాహం.. ఊరొదిలి పోవడం, పవిత్రమైన నైమిశారణ్యం లాంటి ప్రాంతాలలో స్వప్నికా బహుదూర్‌తో కలిసి తిరగడం, అతి సామాన్య జీవితం, రహస్య జీవితం గడపడం.. మాకు నువ్వు పుట్టడం..
అదో ప్రపంచం.. నా ఈ ప్రపంచంలో నిత్య, సుమతి పేరుతో స్వప్నిక, నేను అంతే.. ఆ తరువాత క్రమంలో బహుదూర్ వంశం..
నా బిడ్డ బహుదూర్ వంశాన్ని నిలబెట్టే నిప్పు కణిక.. కాత్యాయనీ దేవి వరపుత్రిక కావటం.. వెరసి ఎంతోమంది వృద్ధుల చివరి మజిలీని ఆనందమయం చేస్తూ వాళ్ళ మనసులు నిత్యం ఉల్లాసంగా హాయిగా ఉంచే ఓ వింజామరగా మారిపోవటం.. చిత్రంగా లేదూ!
ఇదంతా ఓ ఎత్తైతే, తరాన్ని నిర్మించే ఓ నిర్మాత నా కూతురు.. మనసు ఉప్పొంగిపోతోంది నిత్యా.. రెండు తరాలను ఏకం చేసే వారధిలా నిలబడి, రేపటి తరాన్ని, తాతల తరంతో కలిపి ఓ కొత్త తరానికి ప్రాణం పోసే రథసారథి కావడం ఈ కార్యం.. నీ చేతుల మీదుగా జరగడం.. ఎప్పుడో తాతల తరం నాటి తప్పిదాన్ని ఆ జగన్మాత నీతో సరిచెయ్యడం చూస్తుంటే నా శరీరంలో ప్రతి అణువు పులకరించిపోతోంది. ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన భావన కలుగుతోంది నాకు” అన్నాడు సుధీర్.
“అవును మామయ్యా.. నిజంగా ఇదంతా అద్భుతం గానే ఉంది.. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే కాని ఇటువంటి అవకాశం రాదు. సాక్షాత్తు ఆ జగన్మాత కృప.. నిత్య భార్యగా రావడం నా అదృష్టం” అన్నాడు నవీన్.
“నీకే కాదురా! మాది కూడా అదృష్టమే.. నిత్య మాకు కోడలుగా రావడం, చంటి బిడ్డల్లా మమ్మల్ని చూసుకోవడం మా అదృష్టమే కదా!” అన్నారు నిత్య అత్తమామలు.
“ఇక పొగడ్తలు ఆపవలెను.. ఎందుకంటే కాసేపట్లో నా కూతురు సునంద, నా కొడుకు చక్రి వస్తున్నారు” అంది నిత్య.
ఇంతలో రానే వచ్చారు సుందోపసుందులు చక్రి, సునందలు.. వస్తూ వస్తూ.. అమ్మని సునంద, నాన్నని చక్రి కౌగలించేసుకుని.. “మన సీనియర్ సిటిజన్స్ ఎక్కడ” అని అడిగారు.
“ష్.. ఈ రోజు వాళ్ళని డిస్ట్రబ్ చెయ్యద్దు” అని చెప్పిన నిత్యతో “మా సుజాత అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి వస్తా.. మంచిగా పాయసం చేసి పెడుతుంది.” అంటూ పరిగెత్తాడు చక్రి.
“నీకు ఎప్పుడూ నీకు తిండి గోలే. రామనాధం తాత దగ్గర కూర్చుని రా. ఎంత మంచి విషయాలు చెబుతారో.. ఎంత సరదాగా చెబుతారో” అంది సునంద.
“మీ రామనాధం తాతగారు ఏమి చెబుతారు జూనియర్ నిత్యా?” అంటూ సునందని పిలచిన నిత్య మామయ్య డాక్టర్‌తో.. “ఆ తాతగారు ఎన్ని విషయాలు చెబుతారో తెలుసా! మీకు.. ఆయన ఓ మొబైల్ లైబ్రరీ, ఆయనకి తెలియని విషయం లేదు, తెలియని మనిషే లేడు. తెలుసా!” అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ సునంద.
“అవునా! అయితే ఆయన చెప్పే విషయాలు మాకు కూడా చెప్పు” అంటూ కుర్చీ లాక్కుని సునంద వైపు తిరిగారు తాతయ్య సురేంద్ర, స్వప్నికలు.. ఆ పక్కనే మరో కుర్చీలో డాక్టర్ మామయ్య.. ఆ పక్కనే నిత్య, శారద కూర్చున్నారు.
“లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా! ప్రకృతిలో ఏదో ఒక ‘సూపర్ సోనిక్ పవర్’ మన వెంటే ఉండి మనం చేసే తప్పిదాలను లెక్కపెడుతూనే ఉంటుందంట.. తరాలు మారినా అంతరంగాలు మారినా ప్రకృతి మారదంట.. అది తన పని తానూ చేసుకుంటూ పోతూ మంచి ఫలితాన్ని అయినా, చెడు ఫలితాన్నైనా మరో తరానికి సరఫరా చేస్తూ ముందుకు పోతుందిట. ఏదో ఒక తరంలో ఆ తప్పిదాల లెక్కలను సరిచేస్తూ పునరజ్జీవం పొందుతూ కాలప్రవాహాన్ని తనలో కలుపుకుని సమాజంలో సమతుల్యతను సాధిస్తుందిట. ఇది ప్రకృతి ధర్మం. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి ఉపయోగపడే మనం అదృష్టవంతులం అని చెప్పారు డాక్టర్ తాత” అంది సునంద తన చారడేసి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ.
“ఓహ్.. అవునా! ఇది చాలా నిజం.. ఇప్పుడు నిత్య చేస్తున్న పని అదేగా” అన్నాడు నవీన్.
“ఇది ఈశ్వరేచ్ఛ.. ఎవరిని ఏ పని చెయ్యమని భగవంతుడు ఈ భూమి మీదకి పంపుతాడో ఆ పని మనం చెయ్యాల్సిందే” అంటూ ముందుకు సాగింది నిత్య, ‘వసంత లోగిలి’ బృందంతో. ఆమెతో పాటు అందరూ కదిలారు.
~
యవ్వనం కన్నా వార్ధక్యానికి ఉన్న ప్రత్యేకతే వేరు. అపారమైన జీవిత పాఠాలు నేర్చుకుని అనుభవసారాన్ని భవిష్యత్తు తరాలకి లేదా ముందు తరాలకి అందించే దిక్సూచిగా నిలవాల్సింది పెద్దవారే. వీరి చెయ్యి పట్టుకుని ప్రతి తరం ఆనాటి పరిస్థితులను బట్టి మెరుగులు దిద్దుతూ నడవాల్సిందే. గత చరిత్ర పాఠాలు కొత్తగా సరికొత్తగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. గత చరిత్ర లేని ఎన్నో దేశాలే మట్టి కరుచుకుపోయాయి. చరిత్రలో నిలబడలేక పోయాయి. ఆఫ్ట్రాల్ మనమెంత. ఈ జగతిలో, ఈ విశ్వంలో ఆవగింజంత. ఎత్తిపడేసే ఎంగిలి మెతుకంత. అందుకే మనం బలహీనపడుతున్న తాతయ్య, అమ్మమ్మ, నానమ్మల మధ్య మనవళ్ళ మధ్య బలహీనపడుతున్న బందాల గొలుసును బలపరిచే ప్రయత్నం చేద్దాం. ఆ తరాన్ని ఈ తరంతో కలిపి కొత్త తరాన్ని సమాజానికి అందిద్దాం.. రండి మీరూ చేయి కలపండి.
మీ ఇంట్లో గాని మీ చుట్టు పక్కల గాని వృద్ధులు ఉంటే ప్రేమగా పలకరించండి, వాళ్ళతో గడపండి, వాళ్ళతో నడవండి, వాళ్ళతో కలిసి భోజనం చెయ్యండి. వాళ్లకి అవసరాలు ఉంటే అవకాశంగా తీసుకుని వాళ్ళ అవసరాలకు ఉపయోగపడి తరించండి. వాళ్ళను చూస్తూ పెరగండి, వాళ్ళ నుంచి నేర్చుకోండి. భవిష్యత్తు తరాన్ని మేల్కొలిపే ఎన్నో విషయాలు అవగతమవుతాయి. రేపటి తరానికి ఉపయోగపడే వనరుని తయారు చెయ్యడంలో భాగస్తులుగా మీరూ పాలు పంచుకోండి.
(సమాప్తం)
శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో జన్మించారు. బంటుపల్లి సన్యాసప్పలనాయుడు, రమణమ్మ గార్లు తల్లిదండ్రులు. పద్మావతి మహిళా యునివర్సిటీ ‘మాస్టర్స్ ఇన్ కమ్యునికేషన్ & జర్నలిజం’ చేశారు. న్యూఢిల్లీ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ నుంచి ‘డిప్లొమా ఇన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా అండ్ పాలసీ’ చేశారు. ప్రస్తుతం విజయనగరం కన్యూమర్ కమిషన్‌లో సబ్ జడ్జ్‌గా (కన్స్యూమర్ కమిషన్ మెంబర్) వ్యవహరిస్తున్నారు. భర్త శ్రీ ఎస్.వి.సన్యాసి రావు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
శ్రీదేవి గారు కవితలు, కథలు, వ్యాసాలు రచించారు. పలు కథలకు వివిధ పత్రికలలో బహుమతులు పొందారు. లేత గులాబి అనే బాలల పుస్తకం వెలువరించారు. 60 రేడియో టాక్స్ చేశారు. చిన్ని ఆశ, పేపర్ బోట్ అనే డాక్యూమెంటరీలు తీశారు. మనోరంజని అవార్డ్ అందుకున్నారు. ‘వసంత లోగిలి’ వీరి తొలి నవల.