[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘వసివాడనిదే అసలైన ప్రేమ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
పూవులా నవ్వాను
పరిమళాలతో సవ్వడి చేసాను
రంగు హంగులతో కాంతులీనాను
అమ్మ చాటునా కొమ్మ మాటునా మెరిసాను
ఏదో చేయి నన్ను తాకితే
హాయిగా వుందనుకున్నాను
కొమ్మ నుంచి వేరు చేస్తే
బాధనిపించినా కాదనలేకపోయాను
నా సువాసనను ఆఘ్రాణిస్తే
జన్మ తరించిందనుకున్నాను
నన్ను నలిపేస్తుంటే
వలపేనని సరిపెట్టుకున్నాను
తీరా చూసేసరికి
చేయి నుంచి విసిరికొట్టి
నేల పాలు చేసావు
కర్కశంగా కళ్ళ కిందన చిదిమేసావు
కానీ నిన్ను ఆరాధిస్తునే వున్నా
నీ కాళ్ళకు నా సుగంధాన్ని అద్దుతూనే
తనువు చాలిస్తున్నా
ప్రేమంటే ఏమిటో నీకు
చవి చూపించి మరీ చనిపోతున్నా
వసివాడనిదే అసలైన ప్రేమని
అవనికి చెబుతూ తరలిపోతున్నా
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
