Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వసుధైక కుటుంబం

[డా. అంబల్ల జనార్దన్ రచించిన ‘వసుధైక కుటుంబం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

“ఇది విన్నారా? ఆ కొమురయ్య కూతురు కిరస్తాని అబ్బాయిని ప్రేమించిందట. వచ్చే నెల పెళ్ళట.”

“కొమురయ్య ఎవరు? అతని కూతురెవరు?” అమాయకరావు ప్రశ్నార్థకం.

“అబ్బబ్బ, మీకు ఎన్నిసార్లు చెప్పినా మరిచిపోతుంటారు. అతనేనండీ ఆ బ్రాహ్మణ ఆవిడ కరుణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక, మాల కొమురయ్య కాస్తా కరణ్ కుమార్ గా పేరు మార్చుకున్నతను.”

“ఓ అతనా? ఆవు పొలంలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకుంటే, వారి కూతురు ఏకంగా మతాంతర పెళ్ళి చేసుకోబోతుందన్న మాట. భేష్.”

“అంతే కాదండీ! ఆ అబ్బాయి మరాఠీ వాడట. మన మతం కాదు, మన భాష కాదు. పిదప కాలం, పోయే బుద్దులు.” బుగ్గలు నొక్కుకుంది కుతూహలమ్మ.

“ఇది ఇంకా బాగుంది. మతాంతర, రాష్ట్రాంతర వివాహమన్నమాట. మనం ప్రగతి పథంపై దూసుకు పోవడం లేదని ఎవరన్నారు?” ఏ విషయం ఐనా తేలికగా తీసుకునే అమాయకరావు, అప్పుడప్పుడు వ్యంగ్యంగా కూడా మాట్లాడ గలనని నిరూపించాడు.

కుతూహలమ్మ దంపతులు, కరుణ దంపతులు ఒకే కాలనీలో ఉండే సగటు మధ్య తరగతి వారు. కుతూహలమ్మ వారు కాస్త సనాతన వాదులైతే, కరుణ వాళ్లు అభ్యుదయ వాదులమని చెప్పుకుంటారు.

ఎవరేమనుకుంటేనేం, కరుణ వాళ్ల అమ్మాయి పెళ్ళి, మరాఠీ యువకుడు యేసోబాతో, ఉన్నంతలో ఘనంగా జరిపించారు కరుణ, కరణ్ కుమార్ దంపతులు. ఐతే ఆ పెళ్ళికి ముందు వాళ్లింట్లో ఓ ఆర్నెళ్లపాటు చాలా తర్జన భర్జనలు జరిగాయి. కరణ్ కుమార్ గారు పెద్దగా పట్టించుకోక పోయినా, కరుణ గారికి మతాంతర, రాష్ట్రాంతర సంబంధం ఇష్టం లేకపోయింది. రెండాకులు ఎక్కువ చదివిన వారి కూతురు నికిత, తన తల్లిదండ్రుల కులాంతర ప్రేమ వివాహం ఉదాహరణగా చూపి, వారి నోరు మూయించింది. ఆ అమ్మాయి పెళ్లి తర్వాత, ఇరు కుటుంబాల ఆచార వ్యవహారాల్లో చాలా వ్యత్యాస ముండడంతో అమ్మాయి నికితకు అత్తవారింట్లో సర్దుకోవడానికి చాలా సమయం పట్టింది. అత్తవారు క్రిష్టియన్ మతస్తులైనా, నికిత తన హిందూ ఆచార వ్యవహారాలు, దేవుళ్ల పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దానికి ముఖ్య కారణం, యేసోబా లోని ఉదారత. అతను నికితను ‘ఘాడంగా’ ప్రేమించాడాయె!

అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కరుణ, కరణ్ కుమార్ ల కుటుంబం, మళ్ళీ ఆ కాలనీలో చర్చనీయాంశం అయింది. అప్పుడు వారి కుమారుడు అభినవ్, కథానాయకుడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే అతను, తన సహోద్యోగి సయీదాతో పీకల్లోతు ప్రేమలో కూరుకు పోయాడు. సయీదా సూరత్ కు చెందిన ముస్లిం అమ్మాయి. ఇంకేముంది? కాలనీ అంతా అట్టుడికి పోయింది. కాలనీ లోని కొందరు సనాతనులు ఆ సంబంధాన్ని గట్టిగా వ్యతిరేకించారు. వారికి తమ సంతానం కూడా అదే  బాటలో పయనిస్తారేమో అనే భయం పట్టుకుంది. అంతే కాదు, తమ మగపిల్లలు హిందూ ఆడపిల్లలను పెళ్లి చేసుకోవడం ప్రోత్సహించే ముస్లిం సమాజం వారుకూడా, తమ మతం అమ్మాయి ఒక హిందూ అతన్ని ఇష్టపడి, పెళ్లిచేసుకో పూనడం జీర్ణించుకోలేక పోయారు. కరుణ వాళ్లింటిపై దాడికి కూడా దిగారు. అప్పుడు కాలనీలోని కొందరు పెద్దలు, ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను వలలో వేసుకొని లవ్ జిహాద్ లోభాగంగా ఆ అమ్మాయిలను తమ మతంలోకి మార్చి ఆ తర్వాత వారిని హింసించిన సవాలక్ష ఉదాహరణలు ఉటంకించి వారి నోరు మూశారు. ఆ కుటుంబంపై ఈగ వాలినా, కాలనీ అంతా కలిసి వారిని రక్షిస్తారని నమ్మ బలికారు. దాంతో కరుణ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.

ఎట్టకేలకు అభినవ్, సయీదా, హిందూ ఆచారం ప్రకారం పెళ్లి పీటలు ఎక్కారు. ఉదార మనస్కులైన కరుణ దంపతులు, సయీదాకు తమ మతం పాటించే వెసులుబాటు కల్పించారు. కాని సయీదా, తన పేరు ‘సహజ’ గా మార్చుకొని హిందూ మతం పుచ్చుకొంది. నిజానికి ఆమె అభినవ్ ను, అతని మతం పట్ల అభిమానం పెంచుకొనే ప్రేమించింది. ఆమెకు తమ మతంలో, ఆడవారిపై చిన్న చూపు, వారిని పిల్లలు కనే మశీన్లను గా చూసే ధోరణి నచ్చలేదు. అలాగే మగవారికి నాలుగు పెళ్లిళ్లు చేసుకునే వెసులుబాటు కూడా నచ్చలేదు. ఆ సంగతి పెళ్లి తర్వాత స్పష్టం చేసింది. అది విని, వారి పెళ్లిని వ్యతిరేకించిన సనాతన వాదులకు చాలా ఆనందం కలిగింది.

 కాలక్రమంలో నికిత – యేసోబా, అభినవ్ – సయీదా పిల్లలు, ఉన్నత చదువులు చదివి పెళ్లీడుకొచ్చారు. అప్పుడు మళ్లీ వారి కుల, మతాల ప్రసక్తి తలెత్తింది. పిల్లలేమో మేము భారతీయులం అంటారు, కానీ సమాజం ఒప్పుకోదు. వారిపై సంకర జాతి వారని ముద్రవేసి, సమాజంలో గౌరవ స్థాయిలో ఉన్న ఎవరూ వారితో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి ఇష్టపడరు. నాయకుల ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కులాల, మతాల మధ్య విభజన మరింత ఉధృతమయింది. దేశంలో కుల, మత గణన జరుగాలనే నినాదం ఊపందుకొంది. దాంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, జాతీయ జనగణనలో భాగంగా కుల, మత గణన కూడా చేయాలని నిర్ణయించింది. దేశ పరిస్థితులు కరుణ, కరణ్ కుమార్ మనవల, మనవరాండ్ల పెళ్లిళ్లకు అడ్డంకిగా మారాయి. అంతలో నికిత కూతురుకు అమెరికాలో మంచి ఉద్యోగం లభించింది. ఆమె రెక్కలు కట్టుకొని ఆ దేశంలో వాలింది. ఓ సంవత్సరంలోపే తన కంపెనీలో పని చేస్తున్న నీగ్రో అబ్బాయితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది. అంతే కాదు తన తల్లిదండ్రులు ఒప్పుకోరనే ఆలోచనతో, ఏకంగా పెళ్లి పీటలెక్కింది. విషయం తెలిసిన నికిత – యేసోబా లబోదిబో మన్నారు. ఐనా వారు చేయగలిగింది ఏమీ లేకపోయింది. గతిలేక తన కూతురు ప్రసవానికి అమెరికా వెళ్లాల్సి వచ్చింది.

ఇక అభినవ్ -సయీదా వాళ్ల అబ్బాయిది ఇంకో కథ. ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వెళ్లిన ప్రమోద్, ఎవరూ ఊహించని విధంగా ఒక ట్రాన్స్ జెండర్ ప్రేమలో పడ్డాడు. అంతేకాదు అతనితో సహజీవనం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న కరుణ – కరణ్ కుమార్ లు ఉక్కిరి బిక్కిరయ్యారు. మన కుల, మత వ్యవస్థపై విరుచుకుపడ్డారు. ఇక్కడి జనాల మధ్య, కులం, మతం అడ్డుగోడలు కట్టడం వల్లే కదా తమ మనవరాలు, మనవడు విదేశాల్లో తమ జీవిత భాగస్వామిని ఎంచుకున్నారని వాపోయారు. తమ పెళ్లి విషయంలో లేని పట్టింపు, వారికి మన దేశ సనాతన ధర్మంపై, మన వివాహ వ్యవస్థపై మక్కువ కలిగింది. తమ పిల్లలకు కులాంతర, మతాంతర వివాహాలు జరిపించినందుకు పశ్చాత్తాపం కలిగింది. వారికి, వారి పిల్లలకు వాగ్వివాదం మొదలయింది.

“అమ్మా! మాది, కులాంతర, భాషాంతర, మతాంతర పెళ్ళి అయినా, మేము అన్యోన్యంగానే ఉన్నాము కదా? మా అత్తింటి వారు, మా వారు, నన్ను మన మతాచారాలు పాటించే వెసులుబాటు కల్పించారు కదా? ఈ కులాలు, మతాలు, మనుషులు సృష్టించిన అడ్డుగోడలు. మానవత్వమే అసలు మతం. మంచితనమే అసలు కులం. అంతకు మించి ఏ కులమూ లేదు. మతమూ లేదు. మా అమ్మాయి ఒక నీగ్రోని పెళ్లాడినా ఆమె ఆనందంగా, ప్రశాంతంగా ఉంది. వారి కాపురాన్ని మేము అమెరికా వెళ్లినప్పుడు స్వయంగా చూశాం. మా అల్లుడు ఎంత మర్యాదస్తుడో, ఎంత గుణవంతుడో స్వయంగా అనుభవించాము. మన దేశస్తులలో అంతటి విశాల భావాలున్నవారు చాలా అరుదు. అది చాలు మాకు. ఈ విషయమై మీరేమీ దిగులు పడవద్దు.” నికిత తన తల్లికి విశద పరిచింది.

అభినవ్ కూడా తన తల్లిదండ్రులను సముదాయించాడు.

“నాన్నా! కొందరు పిల్లలు జన్యులోపం వల్ల ట్రన్స్ జెండర్లుగా మారుతారు. అలాగే ఇంకొందరు అదే జన్యులోపం వల్ల, వారి పట్ల ఆకర్శితులౌతారు. కొన్ని దేశాల్లో స్వలింగ పెళ్లిళ్లు చట్టబద్దమయ్యాయి. మన దేశంలో కూడా కోర్టులు ట్రన్స్ జెండర్ల హక్కులను గుర్తించాయి. అందుకే వారిలో కొందరు ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లోకి కూడా ప్రవేశించారు. మా అబ్బాయి చేసిన పనిని నేను సమర్థించను. అలా అని వ్యతిరేకించను కూడా. పిల్లలను పెంచి, విద్య నేర్పి, పెద్దచేయడమే మన చేతుల్లో ఉంది. ఆ పైన ఎవరి జీవితం వారిది.

ఈ ప్రపంచమే ఒక కుగ్రామమైన సందర్భంలో మనం ఇంకా సనాతన ధర్మాన్ని పట్టుకొని వేళ్లాడడం అనవసరం. మన సంప్రదాయానికి విరుద్ధంగా జరిగినంత మాత్రాన అది చెడ్డదని ముద్ర వేయకూడదు. మారుతున్న కాలంలో మార్పులను మనం అంగీకరించాలి. ముఖ్యంగా మన చేతుల్లో లేనిదానికి వగచి, ఆ ఒత్తిడితో బి.పి. పెరిగి, మధుమేహం పొడచూపి, ఆ తర్వాత గుండెపోటు వచ్చి, మన ఆరోగ్యం పాడుచేసుకోవడం తప్ప, వేరే ప్రయోజనం లేదు.” అభినవ్ చెప్పినదాన్ని విన్న కరుణ, కరణ్ కుమార్ లు తల ఊపారు కాని, వారు పరిస్థితులను అంగీకరించ లేకపోతున్నారు. తరతరాలనుండి వారి రక్తంలో జీర్ణించుకుపోయిన మన సంప్రదాయాల నుండి వారు బయటపడ లేకున్నారు. ఐనా ఏమీ చేయలేక, నవ యువకుల ప్రవర్తనను ఆమోదించ లేక, గమ్మున ఉన్నారు.

ఆ మధ్యలో విశ్వనరుడు గుర్రం జాషువా నూట ముప్పైయవ జయంతి ఉత్సవం జరుపాలని, ఆ కాలనీలోని కొందరు అభ్యుదయ వాదులు నిర్ణయించారు. ఆ సందర్భంగా,  కరుణ, కరణ్ కుమార్, అభినవ్, సహజ, నికిత, యేసోబా దంపతులను ఘనంగా సన్మానించారు. ఆ కాలనీ అధ్యక్షుడు మాట్లాడుతూ..

“ఈ దంపతులు మన కాలనీలో ఉండడం మనందరికీ గర్వ కారణం. మనుషులంతా ఒకటే అని గొంతు చించుకొని అరిచే చాలా మంది, తమ పిల్లల పెళ్ళిళ్ల  విషయానికి వచ్చేసరికి, తమ కులం లోని వారి కొరకే ప్రయత్నిస్తారు. అంతే కాదు, కొందరైతే తమ శాఖ, ఉపశాఖ వారి కొరకు కూడా పట్టుపడతారు. వీరి కుటుంబం, ఏ నినాదాలు లేకుండా ఆచరణలో ‘వసుధైక కుటుంబం’ అని నిరూపించారు.

కులాంతర, రాష్ట్రాలాంతర వివాహాలు తమ కుటుంబంలో జరిపించి, తమవి శుష్క ఆలోచనలు కావని, ఆచరణలో మనకు చాటి చూపారు. అంతే కాదు వీరి మూడో తరం, రెండాకులు ఎక్కువే చదివారు. వారు విదేశీయులను తమ జీవిత భాగస్వాములుగా ఎన్నుకున్నారు. వీరిది నిజమైన భారతీయ కుటుంబం. ఈ కుటుంబ సభ్యులు తమకు నచ్చిన కుల మతాచారాలు పాటిస్తూ, అందరు కలిసి కట్టుగా ఉంటున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో వీరు ప్రపంచ పౌరులు కూడా.

‘జనులంతా ఒక కుటుంబం.. జగమంతా ఒక నిలయం’ అని గుర్రం జాషువా గారన్న మాటలను తమ చేతలతో సాకారం చేశారు. ఆ రోజుల్లో, యాదవ కులస్థుడైన జాషువాగారి తండ్రి క్రైస్తవం స్వీకరించి పాస్టర్ గా పనిచేసేవాడు, తల్లి మాదిగ కులస్తురాలు. అందువల్ల జాషువా గారు, ఎంతో వివక్షను ఎదుర్కొన్నారు. ఐనా కాని, వారు సృజించిన సాహిత్యం వల్ల, వారి ఉన్నత వ్యక్తిత్వం వల్ల, మేధావులు వారికి బ్రహ్మరథం పట్టారు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డారు జాషువా గారు. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. స్వర్ణ కంకణం సొంతం చేసుకున్నాడు. భారత ప్రభుత్వము పద్మభూషణ్ పురస్కారం అందజేసింది.  ప్రజలు వారిని ఇప్పటికీ గౌరవిస్తున్నారు.  అలాగే కరణ్ కుమార్ కుటుంబం, ఎంత వివక్షకు గురైనా, తాము నమ్మిన పనిని చేసి చూపించారు.ఈ సందర్భంగా వారిని సన్మానించడానికి నా కెంతో గర్వంగా ఉంది.” అన్నాడు.

కరణ్ కుమార్ గారు స్పందిస్తూ..

“అందరికీ నమస్కారం. మా కుటుంబం పట్ల ఈ కాలనీలో తొలుత, కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. ఐతే కాలక్రమేణా, కొందరి పెద్దల ప్రమేయం వలన ఆ భావన తొలగి, మమ్మల్ని మీలో కలుపుకున్నారు. దానికి మీ అందరికి కృతజ్ఞతలు. మనసులు కలిస్తే మనుషులంతా ఒకటే అని నమ్మేవారిలో మేము మొదటి వరుసలో ఉంటాము. జగమంతా ఒక కుగ్రామంగా మారిన ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంకా, కులం, మతం, ప్రాంతం, పట్టుకొని వేళ్లాడడంలో అర్థం లేదని మేము నమ్ముతాము. ఒకే రక్తం గ్రూపు ఉన్న పది మంది వేరు వేరు కులాల, మతాల మనుషుల రక్తం కలిపితే, అది ఏ కులం లేక ఏ మతం వారిదో గుర్తు పట్టగలమా? అందుచేత ఈ కులాలు మతాలు మనుషులు ఏర్పరచుకున్న అడ్డుగోడలు. ఆ గోడలు మనుషుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయి. లోకంలో ఉన్నది ఒకటే మతం. అది మానవత్వ మతం. ఉన్నది ఒకటే కులం. అది మంచితనం.

మా మనవలు ఒకడుగు ముందుకు వేసి, ఏకంగా విదేశీయుల్ని తమ జీవిత భాగస్వాములుగా చేసుకొని పెళ్లి విషయంలో, దేశ సరిహద్దుల్ని కూడా బద్దలు కొట్టారు. ప్రపంచంలోని మనుషులంతా ఒకటే అని నిరూపించారు. మమ్మల్ని అర్థం చేసుకొని ఈ రకంగా సన్మానించినందుకు అనేక ధన్యవాదాలు. మన పిల్లలను అర్థం చేసుకొని, వారిది పై పై ఆకర్శణ కాదు, నిజమైన ప్రేమ అని రూఢీ ఐతే, వారి కాపురం సజావుగా సాగుతుందనే నమ్మకం ఉంటే, వారు ఏ కులం, మతం వారైనా, వారి ఎంపికను అమోదించాలి. పెళ్లి విషయంలో వారిపై మన భావాలు, ఆలోచనలు రుద్ద వద్దని మీకు విన్నవిస్తూ.. సెలవు” అన్నారు.

Exit mobile version