Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వసుధైక కుటుంబం

ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ప్రచురణార్హమైన కథలని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.

ఐ.ఎ.ఎస్. ట్రయినింగ్ పూర్తి చేసుకుని యింటికి బయలుదేరాను. పండుగలు త్వరలో రాబోతున్నాయి. ముగ్గురు అక్కలు మేనమామలు పిల్లలతో యిళ్ళంతా సందడే సందడి.

ఈ సారి చాలా ముఖ్యమైన సంఘటలు చోటు చేసుకుంటాయనిపిస్తుంది.

తన ధ్యేయం కోరిక నెరవేరింది. ఇప్పుడు తల్లిదండ్రులు కోరిక, తోడబుట్టిన వారి ముచ్చట్లు తీర్చాలి.

తన ఆశయానికి అభ్యుదయానికి విరుద్ధమైన పనుల తీర్పులు చెప్పగలడా? తెలియ చెప్పగలాడా? సంతోష పెట్టగలడా?

ఆ మాత్రం చెయ్యకపోతే కలెక్టరుగా తను పనికిరాడు. ఎందరో అజ్ఞానులు, అహంభావులు, మూర్ఖులు, ఆకతాయిలు, బలిసిన తలలేని రాజకీయనాయకుల అహంభావంతో, అధికారంతో తలనొప్పి తెప్పించే పనులు చేస్తారు. వాళ్ళకందరికి సమాధానాలు యివ్వాలి. సంతృప్తి పరచాలి. తన కర్తవ్యానికి భంగం కలగకుండా చూడాలి. వాళ్ళను సముదాయిస్తూ రాజ్యాంగాన్ని రక్షించాలి. క్రమశిక్షణను పద్దతిగా అమలు చెయ్యాలి.

ఇంటికెళ్ళి నేను చేయాల్సింది కూడా అదే! బయటగెలుస్తానేమో గాని ఇంట గెలవడం అసాధ్యమనిపిస్తుంది.

ఒకటి బంధం లేని బాధ్యత. మరొకటి బంధంతో ముడవడిన బాంధవ్యపు బాధ్యత. మొదటిది అవసరంతోనే బంధం. ఇంట్లో అనురాగం ఆప్యాయతలతో మానసిక కట్టుబాట్ల ఆంక్షలతో నా స్వాతంత్రం నిర్ణయం పరిధి దాటనివ్వను. న్యాయం చెయ్యలేనేమో.

అందులో మా నాన్నగారు చండశాశనుడు. పిడివాదం, మంకుపట్టు. నా వంశం నా ప్రతిష్ఠ ప్రాణం నాకు మిగిలిన రాజవంశాలన్నీ దిగతుడుపే. చెడిపోయినాటివి. తను అనుకున్నదే నిజం.

ఈ విషయంలోనే యిద్దరికీ చుక్కెదురు. ఒక్కగానొక్క కొడుకుని. పైగా ముగ్గురు ఆడపిల్లల తరువాత ఎన్నో నోములు వ్రతాలు మొక్కుబడులు తీర్చుకున్న తరువాత పుట్టిన వాడ్ని.

ఏ విషయాన్ని యింత వరకు ఎదురించలేదు. మనసు ఎప్పుడూ కష్టపెట్టలేదు. కానీ యిప్పుడు తప్పదేమో!!

అక్కలకు సంబంధాలన్నీ కూత వేటు దూరంలోనే చేసారు. చిన్నక్కకు మాత్రం నెల్లూరు ప్రాంతంలో యిచ్చారు. గోదారి పెన్నా సంగమం అని ఎక్కిరిస్తుంటాము. కొన్ని సమయాల్లో చాలాసార్లు కలుసుకోలేదు. ఆ అక్కకు నాకూ చాలా అనుభంధం ఉంది. అందరికంటే ఆవిడకు నేనంటే ప్రాణం. అమ్మ కంటే ఎక్కవదాక్క.

మా ఊరు ప్రధాన రోడ్డు నుంచి మూడు కిలోమీటర్లు లోపలికెళ్ళాలి. ఆ రోజు కూడా మా ఆస్థాన పాలిగాపు మా రామ లక్ష్మణుల్ని సింగారించి బండి కట్టుకొచ్చాడు. కార్లు ఉన్నా మా యింటికి మాత్రం బండిలోనే రావాలి. ఆ మువ్వల గజ్జెలగంటలు ఊరంతా వినిపించాలి. చుట్టాలొచ్చారని తెలియాలి. పలకరింపులకు రావాలి. ఇది ఆనవాయితీ. మా వంశపు అహంకారం, ప్రతిష్ఠ. మా నాన్న ఆనందం.

కదిలింది మొదలు మాట్లాడుతూనే ఉన్నాడు ఎంకయ్య. ఆ పసిడి చేల మధ్యలో మువ్వల శబ్ధం మనసుని ఉర్రూతలూగిస్తుంది. ఎంతో ఆహ్లాదంగా ఉంది.

“దిగండి” అనే పిలుపుతో రామ లక్ష్మణుల నిలుపుతో కదిలిపోతున్న సాయంకాలపు మలువు నుంచి సూర్యుని వీడ్కోలు నుంచి బండి కుదుపుతో దృష్టి మరల్చాను. బహుశా యిదే మా పొలం ఏమో అనుకుంటూ దిగాను.

“చూడండి” పైరును చూపిస్తూ విరక్తి కసి కలిపి అన్నాడు.

“చూసాను చాలా బాగుంది” అనబోయి ఏదో అనుమానం వచ్చి మునిగాళ్ళ మీద వంగి పైరు తాకాను. పొట్ట మీద ఉంది. మరి కొన్ని ఎదురు తీస్తున్నాయి. మరి కొన్ని వెన్ను విరిచాయి. కొంత పండిపోయింది. కొంత వెన్నే రాలేదు. వచ్చినా పాలు బట్టలేదు. ఏమిటిది? అంతా ఒకేసారి నాటారు కాదా !

వెంకయ్య వైపు అనుమానంతో చూసాను. చాలా కోపంగా ఉన్నాడు. చిరాకు బాధ అతని ముఖాన్ని కమ్మేసింది. కళ్ళల్లో నీళ్ళునిండి ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఏడ్చేసేటట్లున్నాడు.

అర్థమే కాలేదు. వెళ్ళి ఎంత అడిగినా జవాబు చెప్పక ఏడుస్తూ తల బాదూకుంటూ మట్టి తీసి ముఖానికి రుద్దుకుంటూ నన్ను చూస్తూ పొలం చూపిస్తూ గుండెలు బాదుకుంటున్నాడు.

కోపం వచ్చింది.

“ఏమిటో చెప్పి ఏడువు. ఎందుకలా చేస్తాను. ఏం జరిగింది? ” గట్టిగా కోప్పడ్డాను.

కాసేపటికి సముదాయిచుకుని “పొలమయ్యా! అప్పులు పాలయిపోతాం. పది సంవత్సరాల నుంచి పాతిక పంట కూడా రావడం లేదు. పెట్టుబడి గుల్లవుతున్నాది. ఎన్ని తెగుళ్ళు ఎన్ని మందులు. పెద్దయ్యకు ఎంత చెప్పినా యినుకోవడం లేదు. నన్ను నానా తిట్లు తిడుతున్నాడు. మొన్న తన్నాడు. అయినా పరవాలేదు. వదల్ను. అదేవంటే నా యిత్తు నికార్సు నా పొలం బంగారం. మా వంశం నికార్సు. అది మా ప్రతిష్ఠ ఏదోదో మాట్లాడి నా నోరు మూయిస్తున్నాడు. నువ్వే కాపాడలయ్యా! ఆయనని వొప్పించాలి. కుక్క మూతి పిందెలు కాసే ఆ వంశం ఏం వంశం. అప్పులు మీద బతికితే అదేం పతిష్ఠ. కాపాడు సామీ! సంసారాన్ని దివాలా తియ్యకుండా నాశనం గాకుండా నిలుపయ్యా నీ కాళ్ళు మొక్కుతా!” అంటూ వంగాడు ఎంకయ్య.

దూరం జరుగుతూ “ఏ చేయ్యమంటావు” అడిగాను.

“యిత్తు మార్పించు సామీ చాలు.”

ఆ మాట నాలో ఎన్నో ఆలోచనలను రేపింది.

“విత్తా! మరి పొలం…?”

“అంతేనయ్యా! నికార్సయిన కండగల పొలం. బంగారం పండుతుంది. తెగుళ్ళు గిగుళ్ళు రావు.”

“మరయితే వాతావరణం…!”

“అవి ఏం చెయ్యవు బాబూ! ఒక విత్తుని ఒకే పొలంలో అన్నిసార్లు ఎయ్యకూడదు. ఆ మాత్రం తెలవదా! అదేమంటే మార్చినాం కదరా! పెద్దమ్మోళ్ళది చిన్నమ్మోళ్ళది!! అవి యాడవంట. మనం యిచ్చినాటివే కదా! సామీ ఎనకాడాబాక.. నీ చేతిలో ఉంది. ఈ కొంప పరువు ప్రతిష్ఠ” అంటూ దండం పెట్టాడు.

వంశపారంపర్యం లేని కుటుంబ ప్రతిష్ఠ ఆనవాయితీ వలన పైర్లే కాదు, మనుషులు జీవితాలు కూడా నాశనం అవుతాయి. దగ్గర సంబంధాలు బంధుత్వాలలో పెండ్లిడ్లు చేసుకుంటే ఎదురుచూడని ప్రమాదకరమైన జబ్బులతో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. దానికి ఉదాహరణ తన సంసారమే.

ప్రపంచంలో ఇలా దగ్గర సంబంధాలు చేసుకుని అంగవైకల్యం, చెవుడు, గుడ్డితనం, చక్కెర వ్యాధి, మందబుద్ధి, వణుకుడు రోగం ఎన్నో ఎదురు చూడని జబ్బులతో ఐదోవంతు జనాభా కృశించి నరకం యాతన అనుభవిస్తున్నారు.

ఇంటికి రాగానే సంతోషంతో పొంగిపోతూ తనివి తీరా ముద్దులు కురిపించింది నా తల్లి. హృదయం ప్రేమతో నిండిపోయింది.

నాన్న వరండాలో పడక కుర్చీలో గంభీరంగా కూర్చుని చుట్ట తాగుతున్నాడు. ఆయన నన్ను చూసి చూపులో గర్వం దాచి పెట్టుకున్న ఆనందం చూడగలిగాను.

కాళ్ళు చేతులు కడుక్కుని దగ్గర కూర్చుని మెల్లగా మొదలు పెట్టాను. మా వాదోపవాదాలు ఎంత వరకు వెళ్ళాయంటే ఎందుకొచ్చావు, వెళ్ళిపో అనేంత దూరం వచ్చాయి. భోజనానికి ఎన్నో సార్లు పిలిచిందో అమ్మ. కదల్లేదు. ఆయనా తగ్గలేదు.

“పిల్ల కాకి నీకేం తెలుసు. నా పొలంలో నా గింజే నాటాలి, మరో విత్తనం నాటితే ఆ రోజుతో మన వంశం ప్రతిష్ఠ గంగలో కలిసినట్లే. నా ౘావు త్వరలో చూస్తావు. నోరు మూసుకు పడుండు, నీకేం తెలియదు” అనేంత దూరం వెళ్ళింది.

విసిగిపోయి “నేను చెయ్యల్సింది నేను చేస్తాను” అంటూ లేచి వెళ్ళి తినాలని లేదు అయినా అమ్మకోసం ఏదో తిని పడుకున్నాను.

రాత్రంతా నిదుర లేదు. ఉదయం అందరూ వస్తున్నారు. మాగన్నుగా ఎప్పుడు నిదురపోయానో ఏవో శబ్ధాలకు లేచాను.

లేచి చూస్తే అందరూ వచ్చేసారు.

నన్ను చూడగానే ఆత్మీయ దాడి చేసారు. దాసోహమయ్యాను. పేరు పేరునా నా అందం రాజసం మా అక్కలు అబ్బురపోతూ చూసారు. పొగుడుతూనే ఉన్నారు. భరించలేక మోహమాటంతో తబ్బిబ్బు అయిపోయాను.

పిల్లలు వచ్చి అల్లుకుపోయారు. ఎంత సంతోషం వేసిందో అంత బాధ వేసింది. ఎంత బాగున్నారు. కానీ ఒక్కరూ పనికిరారు.

అక్కలందరూ ముద్దులతో నన్ను ముంచేసారు.

మామలందరూ చలోక్తులతో తిక్క పుట్టించారు.

అందరిలోనూ ఒకరు కనిపించలేదు. వెతుకుతున్నాను. అసంతృప్తి నాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది ఎప్పుడో గమనించారు అక్కలు.

“ఏంరా ఎవరి కోసం చూస్తున్నావు. నీ కోసం రావల్సిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళూ రాలేదా!” అంది పెద్దక్క తారకేశ్వరి.

ఆమెను మా అమ్మ తమ్ముడికి యిచ్చి చేసారు. ముగ్గరు పిల్లలు. పెద్దవాడు ఆడంగితనంతో, రెండవది చెవిటి మూగ, మూడవది ఎప్పుడు ఎక్కడుంటుందో తెలియదు. ఎవరు పిలిచినా పిలవకపోయినా వాళ్ళతో వెళ్ళిపోతుంది. అందుకే ఆ అమ్మాయికి బంధాలు కాళ్లకయినా వేస్తారు. లేదా తలుపులకు తాళాలు వేస్తామని చెప్పింది. అందటా పెద్దవాళ్ళయిపోయారు.

రెండవ అక్క మల్లీశ్వరి.

ఒక కొడుకు. మంద బుద్ది. విపరీతంగా తిని విరీతంగా బలిసిపోయి ఉన్నాడు. ఆ అక్కను కూడా తమ్ముడుకు యిచ్చి చేసింది అమ్మ. కూతురుంటే మరుగుజ్జు. వయసుకు వచ్చేసింది.

“ఎవరి కోసం రా! ఇంకా వెతుకుతున్నావు” అంటూ చిలిపిగా కవ్విస్తూ దగ్గర కొచ్చి ఆమె కూడా వెతుకుతున్నట్లు నటించింది.

మొహమాటాన్ని తట్టుకోలేక నును సిగ్గుల చిరునవ్వుతో తలదించుకున్నాను.

 “వెతుకు… వెతుకు. కళ్ళు దించకు. ఆకాశంలో భూమంతా పదనాలుగు లోకాల్లో ఎక్కడుందో… కనుమూసావో ఒక జీవిత కాలం పొగొట్టుకుంటావు” అని బుగ్గ గిల్లి వెళ్ళిపోయింది.

అప్పుడు కనిపించింది ఆ తార. చూపులు మరల్చ లేకపోయాను. తల త్రిప్ప లేకపోయాను. గుండె పరుగును ఆపలేకపోయాను. ఆ అద్భుతాన్ని చూసి అన్నీ మరిచిపోయాను. కాలాన్ని కూడా మరిచిపోయిన నన్ను “ఏమిటో అలా మైమరచి పోయినట్లు విన్నూ రా! విన్నూత్న. నా కూతురు. ఇప్పుడు డాక్టరు. రేపు… !” అంటూ కొంటెగా చూసింది మా చిన్నక్క చాముండేశ్వరి.

ఉలిక్కి పడ్డాను. అయినా ధ్యాస ఆ రూపు మీదనే ఉంది. ఏమిటి యింత ఆకర్షణ. ఎందుకీ మైమరుపు. ఎప్పడిదో ఎక్కడిదో యుగయుగాల బంధం పెనవేస్తున్నట్లు. రాసి పెట్టి ఉన్నట్లు ఈ అనుకోని ఆత్మీయత, ప్రేమానుబంధం ఏమిటి?

మొగడు పెళ్ళాలు అని చిన్నప్పట్నుంచి రాసేసి హృదయాల్లో నాటేసి పెరుగుతున్న కొలది కలిసి మెలసి చూపుల్తో చేతల్తో ఆరాదించుకుని మాపుల్లో కలలు కనడం వలన యవ్వవంలాగా ఎదిగే మనస్సు కల్పించే మహత్తర మయాజాలపు అల్లరి. ఇదే నేమో జన్మ జన్మల బంధం.

“నీదే లేరా!” అంది కవ్విస్తూ చిన్నక్క.

నోరు ఎండిపోయింది. నాలుక పిడచ కట్టుకుపోయింది. దూరం చేసుకునే శక్తి నాకు ఉందా! మార్పు తీసుకు రాగలనా! ఈమెను నేను కాదనగలనా! ఆనవాయతీ మార్చగలనా!

పాపం అక్క… మరీ పాపం విన్నూత్న.

మా చిన్నక్కను నాన్నగారి చెల్లెలు కొడుక్కి యిచ్చి చేసారు. ఎందుకో ఒక్క అమ్మాయితో నిలుపుకున్నారో, పుట్టలేదో తెలియదు.

“ఏరా లేపుకుపోతావా!” అంటూ… తారకేశ్వరక్క వచ్చి కవ్వించింది.

గుండె జల్లుమంది. నన్ను తీసుకుపోతుందోమోననిపించింది. మా అక్క కళ్ళల్లోని ఆప్యాయత కవ్వింపు! అనుబంధపు చిలిపితనం చూసి దొరికిపోయానని సిగ్గు పడ్డాను.

ఆ విన్నూత్న వరూధినీ వలలో నుంచి అతి కష్టం మీద తప్పించుకుని వెలుపల కొచ్చి అరుగు మీద కూర్చున్నాను. విపరీతమైన ఆలోచనలతో సతమతమయిపోయాను.

నాతోనే తారకేశ్వరక్క, మల్లీశ్వరక్క వచ్చి కూర్చున్నారు.

“ఎక్కువగా ఆలోచించకు. అది నీదేలే!”

దాన్ని గురించి కాదు అని చెప్పేలోగా నా తలను వొళ్ళో ఉంచుకుని తన కాళ్ళ పై పటుకోబెట్టుకుని వీపు మీద మెల్లగా నిమురుతూ సుతారంగా తట్టుతూ మైమరిచిపోయింది. నా చిన్నతనం కళ్ళ ముందు కనిపించి మనసు ఆనందంతో మురిసిపోయింది.

నాలో మళ్ళీ అల్లకల్లోలమైన ఆలోచనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి పిల్లలతో వీళ్ళు ఎలా సుఖంగా జీవిస్తున్నారా అని ఆశ్చర్యపోయాను.

ఏమిటో ఈ బ్రతుకులు. ముస్లిమ్ దేశాలలో చిన్నాయనా పెదనాయన బిడ్డల్ని చేసుకుంటారు. వాళ్ళ మతాచారం. మనం పూర్తిగా భిన్నంగా అక్క చెల్లెళ్ళ కూతుర్లు అన్నదమ్ముల్లకు యిచ్చి చేసుకోవడాలు ఎక్కువ.

ఇసుక దేశాలు, సౌత్ ఆఫ్రికా దేశాలతో మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ. ఎంత చెప్పినా నిదర్శనాలు చూపించినా మారరు.

అక్క కదిలే సరికి నేను లేచాను.

నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆనందంతో “దేన్లో వస్తుంది ఈ తృప్తి. ఏది యిస్తుంది యింత మనశ్శాంతి. రక్త సంబంధం గాకపోతే” అంటూ కన్నీళ్ళు తుడుచుకుంది.

తలలో వేళ్ళు దూర్చి నిమురుతున్న మల్లీశ్వరక్క దగ్గరకు తీసుకుని నొసట ముద్దు బెట్టుకుంది.

ఎందుకో భయం వేసింది. ఈ రక్త సంబందం తాకిడికి నా ధ్యేయాన్ని మరిచిపోతానేమోననిపిచింది.

చిన్నక్కకు నేనంటే ప్రాణం. అమ్మ కంటే ఎక్కువగా నా ఆలనాపాలనా చూసింది. ఎందుకంటే అప్పటికే పెద్దక్కయ్యలకు పెండ్లిడ్లు అయిపోయాయి. చిన్నక్కకు పెండ్లయి వెళుతుంటే మమ్మల్నిద్దరినీ వేరు చెయ్యలేకపోయారు.

మరి యిప్పుడు ఆమెను నేను ఎలా బాధ పెట్టగలను. విన్నూత్న అంటే అయిష్టం కూడా లేదు. ఉంది అక్కకూతురు మరో అభాగ్యుడికో, అభాగ్యురాలికో జన్మనిచ్చే తల్లి.

పెద్దక్క, “లే… భోజనాలు పెట్టాలి ” అంటూ చెయ్యి అందించింది.

“వాడు మనకు తోడుగా నిలిచి చెయ్యి అందించాలి గాని మనమేమిటి?” అంది నవ్వుతూ మల్లీశ్వరక్క.

“నో ఛాన్సు! మాది ఏ వంశం” అన్నాను లేస్తూ.

“మా వంశం” అంటూ చెవి పట్టుకుని “నోరు మూసుకు పడుండాలి మా లాగా” అంది చామండేశ్వరక్క

మామల వైపు చూసాను ముఖాలన్ని వాడిపోయినట్లు కనిపించాయి.

“అలాగయితే మామల పార్టీలో చేరుతా!” అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళాను.

“నువ్వు రా రా అల్లుడా ఆడవాళ్ళ మాటలు నమ్మకు” అన్నారు అందరూ ఒక్కటిగా.

“నన్ను కాదంటారా నాన్నలూ” అంటూ ముందుకొచ్చింది విన్నూత్న.

“నువ్వు రామ్మా బంగారు, ఎంతయినా శత్రువు మిత్రుడవుతాడా. రా… గంటకు గుక్కెడు నీళ్ళు తాపిద్దాం” అంటూ ముదిగారం చేసారు.

“మావయ్యా! ఇది నమ్మకం ద్రోహం” అంటూ అలిగాను.

“పోనీ రా! పాపం యిదిగో తీసుకో” అంటూ విన్నూత్నను నా పై బడేటట్లు తోసాడు. ఆవిడ పడిపోతుందేమోనని వాటేసుకున్నాను. అందరూ ఆ భయాన్ని ఆ భంగిమల్ని చూసి విరగపడి నవ్వారు.

విన్నూత్న సిగ్గుతో విరబూసి దూరంగా జరిగింది. ముఖం వింతకాంతుల్ని చిందిస్తుంది. చూపులు వలపునంతా పరువంలోని ప్రాయాన్ని విరజిమ్మాయి.

మాటలు రాక అలాగే చూస్తుండిపోయాను,.

ఇంతలో మా తారకేశ్వరక్క కొడుకు నా దగ్గరకు వగలుపోతూ వచ్చి సిగ్గు పడిపోతూ “మామయ్యా… మామయ్యా… మరే నువ్వూ విను అక్కా అది చేసుకుటారా !” అంటూ అందరు చూస్తుండగానే లైంగిక చర్య చూపించాడు.

అంతే పెద్దమామయ్య వాడ్ని నానా తిట్లు తిడుతూ వీపు పగలగొట్టి వీధిలోకి తోసి అలసిపోయి వచ్చికూర్చున్నాడు.,

మా అక్క ఏడుస్తూ అరుస్తూనే ఉంది “వాడికి ఏం తెలియదు. కొట్టకండి” అని కాని అడ్డు రాలేదు..

అంతవరకు తాండవమాడిన ఆనంద ఉత్సహాలు హరివిల్లులు తగలబడి మాడిపోయాయి.

భయంకరమైన నిశ్శబ్దం నిండిపోయింది.

క్షణం క్రితం ఉన్న చిరునవ్వు వెలుగు ఎంత వెతికినా కనిపించేటట్లు లేదు.

నేను తారకేశ్వరక్క వైపు చూసాను. ఆకాశంలో ఎక్కడో చూస్తుంది. కన్నీటి చారలు కనిపించాయి.

ఇంతలో బయటనుంచి “నాన్నోయ్… నాన్నోయ్…” అనే తారకేశ్వరక్క కొడుకు అరుపుతో అందరూ ఒక్కసారిగా లేచారు.

ఈలోగా వాడే చేతిలో చిన్న కోడి పిల్లను పెట్టుకుని తల్లికోడి తరుముతూ ఉంటే వచ్చి “చూడు నాన్నా! ఈ బిడ్డను ఎత్తుకుంటే వాళ్ళమ్మ నన్ను పొడుస్తుంది, తరుముతుంది” అంటూ అక్క వైపు మావయ్య వైపు చూస్తూ నవ్వుతున్నాడు.

తన బిడ్డను ఆదుకోలేని తన బ్రతుకెందుకని తల వంచేసింది తారక్క.

మావయ్య వాడి దగ్గరకు వెళ్ళి ఆ కోడిపిల్లను చేతిలోనుంచి తీసుకుని క్రింద వదుల్తూ “అమ్మ కదా నాన్నా. తన బిడ్డల్ని కాపాడుకోవాలి కాదా!” అంటూ దగ్గరకు తీసుకున్నాడు.

తారకేశ్వరక్క ఏడుస్తున్నట్లు బాగా తెలుస్తుంది. మల్లీశ్వరక్క చాముండేశ్వరి ఆమె ప్రక్కనే కూర్చుని ఉన్నారు.

పిల్లలందరూ బిక్కు బిక్కుమంటూ దిగులుతో చూస్తున్నారు. కొందరు ఏవీ జరగనట్లు ఆడుకుంటున్నారు.

మామయ్య అక్కయ్య దగ్గరకెళ్ళి “మీ యింట్లో భోజనాలు పెట్టరా” అని కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ కవ్వించాడు.

సంతోషంతో ఎగిరి గంతేసి “అన్నీ సర్ది పెట్టి ఉంది రండి మీదే ఆలశ్యం. కాళ్ళూ చేతులు కడుక్కోండి” లేచింది.

ఆమె కంటే ముందుగా ఎంతో బరువు దిగినట్లు యిద్దరక్కలూ గాఢ నిట్టూర్పు వదలుతూ లోపలికెళ్ళారు.

అక్కడే కూర్చొనేసాను. ఇన్ని రంగు లేంటి ఒక్క క్షణంలో ఒక్క రోజులో! ఆవిడ జీవితం రోజూ యిలాగే ఉంటుందా !

అన్నీ ఒక ఎత్తు, ఈ బిడ్డల్ది మరో ఎత్తు.

కనీసం మామూలుగా ఉండే ఆర్థిక యిబ్బందుల్ని మానసిక కష్టాల్ని ఎదుర్కోవచ్చు. ఈ పిల్లలు బ్రతికి ఉన్నంతకాలం వాళ్ళకు జీవితం లేదు.

పోనీ ఏదయినా రిహబిలిటేషన్సులో చేర్చితే? అందుకు వీళ్ళు ఒప్పుకోరు. పాశం కన్నా పరువు ముఖ్యం. ‘అందరూ వేలెత్తి చూపిస్తారు’ అని అదో రకమైన దరిద్రపు మొహమాటం.

ఎంతో మామూలుగా అయిపోయారు అందరూ. నవ్వులు విసుర్లు నా మీద విన్నూత్న మీద. నేను ఆనందించలేకపోయాను. కానీ విన్నూత్న ఆ పిల్లల్ని ఎంతో సమర్ధవంతంగా ఆడిస్తూ పాడిస్తూ ఉంటే మెచ్చుకోక ఉండలేకపోయాను.

సాయంకాలం కూడా అయిపోయింది.

నాలో కూడా ఒక స్థిరమైన నిర్ణయం బలపడింది. విత్తు మార్చాలి. ఈ రాతల్ని మార్చాలి.

భోజనాలు చేసి తీరిగ్గా కూర్చున్న తరువాత అనుకునట్లుగానే పెండ్లి మాట ఎత్తారు.

ఎన్నో ఎంతో వాదోపవాదాలు జరిగాయి. మొండిగా అడ్డు తిరిగాను. ప్రమాదాల్ని ఎత్తి చూపాను. మామూలుగా చేసుకున్నా వస్తున్నాయి కదా! రాత కర్మ పూర్వ జన్మ పాపం అని వాదించారు. దగ్గర బందుత్వాలు చేసుకున్నా రావటం లేదు కదా! అది అదృష్టం. అలాగే మీ విషయంలో ఉండొచ్చు కదా అని ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. చిన్నక్క విన్నూత్న ఏడుస్తూ లోపలికెళ్ళిపోయారు. మావయ్యలు అవమానం జరిగినట్లు కోపంగా తలవంచుకున్నారు. నా తల్లి ఏడుస్తుంది. వింతగా నా తండ్రి కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అందరిని బాధ పెట్టి నేనేం సాధిస్తాను. మనసు చిందరవిందరగా అయిపోయింది. బెదిరిస్తునే ఉన్నాడు. నా శవం ఉదయం చూస్తావన్నాడు. లేచి బయటకొచ్చికూర్చున్నాను.

చిమ్మ చీకటి.

విన్నూత్నను పొగొట్టుకున్నాందుకు చాలా బాధగా ఉంది. భరించలేకపోతున్నాను. పిచ్చి పట్టి పోతుందేమో ననిపిస్తుంది

మోకాళ్శు నిలువుగా ముడుచుకుని తల మధ్యలో గట్టిగా బిగించి పగలిపోతుందోమో అన్నంతగా రుద్దుకోసాగాను.

ప్రేమకు ఆశయాన్ని వదులుకోలేకపోయాను. ఇందులో స్వార్థం లేదు. అందరి మంచి భవిషత్తు ఉంది. తన సుఖం కోసం మరో వికృత జీవికి నరకాన్ని బహుమతిగా యివ్వలేను. కష్టమైనా సరైన నిర్ణయమేనని సమర్థించుకోసాగాను.

ఆ ఆలోచనల్లో ఒక మెరుపు మెరిసింది. అసలు పిల్లలే లేకుంటే… !!

“తమ్ముడూ” చిన్నక్క పిలుపు.

ఉలిక్కిపడి తలెత్తి చూసాను. అక్కా విన్నూత్న కాస్త దూరంలో నిలుచోనున్నారు. విన్నూత్న ఏడుస్తున్నట్లు తెలుస్తుంది. నా వైపు చూడలేదు.

మామయ్యలు ద్వారం దగ్గర, అమ్మనాన్నలు ఎదురుగా. కట్టిన బండి తోలే ఎంకయ్య. ఏవిటిది?

“ఎక్కడికి ఈ రాత్రి పూట?” ఆత్రుతతో పాటు ఆందోళనను అణుచుకోలేకపోయాను.

మాట్లాడలేదు అక్క.

జరిగిన అవమానం చాలు అన్నాడు మావయ్య.

అక్క మెల్లగా బాధతో దృఢంగా అంది.

“అవలక్షణాలు అంటున్నావే అదే గాకపోతే మా సంసారాలు ఎప్పుడో బజారులో పడి ఉండేవి. రక్త సంబంధంలోని ఆత్మీయత అనురాగాలు పటుత్వం విలువ నీకు తెలియదు. ఒకర్నొకరు అర్థం చేసుకుని సముదాయించుకుని ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని పరిష్కరించుకోగల సంస్కారం మరే తరం లోనూ దొరకదు” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ తలదించుకుంది.

నేనేం మాట్లాడలేకపోయాను. సమస్యను అహ్వానించి గడ్డు సమస్య అని తెలిసి ఆ ప్రయత్నం చెయ్యడం ఎందుకు? దాన్ని పరిష్కరించుడానికి అనుభవించడానికి జీవితాంతం సంస్కారాన్ని అనుబంధాలను పరీక్షలకు గురిచేయ్యడం ఎందుకు? తెలిసిన మూర్ఖత్వం.

కానీ ఆమెనుగాని ఎవ్వరినైనా అవమానించదలచుకోలేదు. బంధానుబంధాల మీద దెబ్బ తగిలితే ప్రాణమున్నంత వరకు రక్తం చిందిస్తూనే ఉంటాయి. మనసును తగల బెడుతూనే ఉంటాయి. అందునా తోబుట్టువు…?

“అక్కా! నన్ను మన్నించు. నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు. నా మీద నీకున్న ప్రేమ నిజమైతే లోపలికెళ్ళు. నేను విన్నూత్నతో మాట్లాడుతా!” అంటూ చేతులు భుజంమీద వేసి లోపలికి నడిపించాను.

విన్నూత్న బైటే నిలబడిపోయింది.

తిరిగి వచ్చి ఆమెకు ఎదురుగా నిలచున్నాను.

ఒక సారి కళ్ళెత్తి నా వైపు చూసి కళ్ళు దించుకుంది.

బాధను అవమానాన్ని అణుచుకోలేక పోతుందని తెలుసు.

అలా ఎంతసేపు నిలుచున్నామో తెలియదు. ఎప్పుడు కలిసాయో చూపులు? ఏ మాట్లాడుకున్నాయో? ఎలాంటి నిర్ణయానికి తెచ్చాయో; మేం మాత్రం అలాగే ఉండిపోయాం.

“నన్ను దూరం చేయ్యకు బావా!!” అంటూ నా కాళ్ళ దగ్గర కూలిపోయింది.

లేపి గాఢంగా కౌగిలించుకున్నాను. అంత వరకు మమ్మల్ని చూస్తున్న అందరూ లోపలికెళ్ళిపోయారు.

ఎవరో వచ్చి కాళ్ళకు చుట్టుకుని గట్టిగా గురకపెడుతున్నట్లనిపించి చూసాం.

పిల్లలంతా మా చుట్టున్నారు.

వాళ్ళను ఎత్తుకుంటూ “ఇక నుంచి మన పిల్లలు, దత్తత తీసుకుంటున్నాను” ముద్దులు పెడుతూ అంది.

ఆశ్చర్యంగా చూస్తూ “మరి నేనూ!” అడిగాను.

ప్రపంచాన్ని నవ్వించే నవ్వు నవ్వింది.

Exit mobile version