[‘ఒక చిన్నమాట’ సినిమాలోని ‘మధురము కాదా తిరుమల నాథా నిను తెలిపే ప్రతిగాథ’ అనే పాటని విశ్లేషిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]
బాల భానుడి లేలేత కిరణాలు భూమిని తాకక ముందే నిద్రలేచి, తలారా స్నానం చేసి సూర్యుడు ఉదయించే సమయానికి పూజ చేసుకోవటం భారతీయ సాంప్రదాయం. అలా సూర్యోదయాన్నే దైవ ప్రార్థన చేసుకుంటే ఆ రోజు పనిచేయగలిగే శక్తి వస్తుందని ప్రజల విశ్వాసం. ప్రార్థన రకరకాలుగా ఉంటుంది. కొంతమంది సూర్యనమస్కారాలు చేస్తారు. కొంతమంది తులసికోటకు పూజ చేస్తారు. కొంతమంది దేవుడి గదిలో దీపారాధన చేసి ధ్యానం చేస్తారు. పాత సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడొచ్చే సినిమాల్లో ఇలాంటివి కనుమరుగు అయిపోయాయి. అయినా ఎడారిలో ఒయాసిస్‌లా ఇప్పుడు కూడా అడపాదడపా మంచి సినిమాలు వస్తూ ఉన్నాయి.
మంచి సన్నివేశం, అందుకు తగిన సందర్భం కలసివస్తే కవి కలం కదం తొక్కుతుంది. పైన చెప్పినలాంటి పాట ఒకటి ‘ఒక చిన్నమాట’ చిత్రంలో వస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతాన్ని రమణీ భరద్వాజ్ సంగీత దర్శకత్వంలో గాయని చిత్ర ఆలపించింది. ముందుగా ఈ పాట నేపథ్యం చూద్దాం.
ఆ కాలనీలో ఆ భార్యాభర్తలిద్దరినీ వాళ్ళ అసలు పేర్లు ఏమైనా, అందరూ అబ్బాయిగారు (కైకాల సత్యనారాయణ), అమ్మాయిగారు (బెంగుళూరు పద్మ) అంటూ ఉంటారు. ఆయనకి సుమారు యాభై ఏళ్ళు ఉంటాయి. ఆమెకి నలభై ఏళ్ళు ఉండవచ్చు. ఇద్దరూ కుర్రాళ్ళలాగ జోక్స్ వేసుకుంటూ ఉంటారు.
వన్, టు, త్రీ.. అంటూ ఎక్సర్ సైజులు చేస్తూ ఆమె “నేనిలాగే ఎక్సర్‌సైజులు చేసి, నెలరోజుల్లో స్లిమ్‌గా తయారైపోతాను. నువ్వు కూడా ఎక్సర్‌సైజులు చేసి ఆ పొట్ట తగ్గించుకోకూడదూ!” అన్నది.
“పొట్ట తగ్గించానంటే నీకే నష్టం” అన్నాడు.
“నాకేం నష్టం?” అడిగింది.
“ఏం నష్టమా! పొట్ట తగ్గిస్తే నాకు గ్లామర్ పెరిగిపోతుంది. అప్పుడు అమ్మాయిలందరూ ‘ఐ లవ్ యు.. ఐ లవ్ యు’ అంటూ నా వెంటపడతారు. అప్పుడు నువ్వు లబోదిబో మంటూ ఏడుస్తూ కూర్చుంటావు”. అన్నాడు హాస్యంగా.
వాళ్ళు జోక్స్ వేసుకోవటానికి కారణం వాళ్లకి పెళ్ళయి ఇరవై ఏళ్ళు దాటినా పిల్లలు లేరు. ఆ బాధ మర్చిపోవటానికి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా ఓ రోజు అయన మేనకోడలు గీత (ఇంద్రజ) కి ఆ ఊళ్ళో మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్‌గా జాబ్ వస్తుంది. తన ఇంట్లోనే ఉండి రోజూ కాలేజీకి వెళ్లి రమ్మని అడుగుతాడు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన గీత రాకతో ఆ ఇంటికి కొత్తవెలుగు వచ్చినట్లయింది. ఆ రోజు గీత ఉదయాన్నే తలమీద స్నానంచేసి, టవల్‌తో పాటు జుట్టు ముడివేసి, పట్టుచీర కట్టుకుని దేవుడి గదిలో పాట పాడుతూ పూజ చేస్తూంది ఈ విధంగా —-
“మధురము కాదా తిరుమల నాథా నిను తెలిపే ప్రతిగాథ
నామాలెన్నో రూపాలెన్నో తెలుసుకునే దారుందా!”
తిరుమల కొండపై వెలసిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ స్వామి లీలలను తెలిపే కథలు ఎన్నో! భృగుమహర్షి శ్రీమహావిష్ణువుని పరీక్షించటానికి వైకుంఠానికి వెళ్ళటం, ఆయన్ని కాలితో తన్నటం, అది చూసి లక్ష్మీదేవి అలిగి భూలోకం వెళ్ళటం, ఆమెని వెతుక్కుంటూ విష్ణువు శ్రీనివాసుడు అన్న పేరుతో భూలోకం రావటం, అక్కడ ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూడటం, ఆమెని వివాహం చేసుకోవటం, ఇంకా భక్తుడైన బావాజీతో పాచికలాడటం, తొండమాన్ చక్రవర్తి కథ, వకుళమాత కథ.. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చాలా ప్రాచుర్యం పొందినవి. ఇంకా బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, పద్మ పురాణం, స్కందపురాణం వంటి అనేక చోట్ల శ్రీవేంకటేశ్వర స్వామి కథలు వస్తాయి. ప్రతి కథా మధురమైనదే!
అలాగే వేంకటేశ్వర స్వామికి అనేక నామాలు, అనేక రూపాలు ఉన్నాయి. త్రేతాయుగంలో రాముడుగా, ద్వాపరయుగంలో కృష్ణుడుగా, క్షత్రియులను అంతమొందిచిన పరశురాముడిగా, వేదోద్ధారణకై మత్స్యావతార రూపుడిగా అవతరించాడు. త్రివిక్రముడై మూడులోకాల్ని ఆక్రమించాడు. అంజనాద్రికి ప్రభువు, లక్ష్మీదేవిని వక్షస్థలంపై ధరించినవాడు అయిన తిరుమలనాథుడు అష్టోత్తర శతనామావళితో పూజలందుకుంటున్నాడు. అవన్నీ తెలుకోవటం నా వంటి సామాన్యురాలికి అసాధ్యం కదా అని ప్రార్థిస్తున్నది నాయిక. పాట పల్లవి అయిపోయింది. ఇక మొదటి చరణంలో ఇలా అంటున్నది.
“కరి వరదుడవని కవి వరులచే విని కరముల జోడించినానే
శరణను వారిని కరుణించేవని మరిమరి ప్రార్థించినానే
ఆ కథలన్నీ కల్పనలేనా కలనైనా రావేమీ!”
ఆపదలో ఉన్న ఏనుగుని రక్షించావని కవులు చెబుతుంటే విని చేతులు జోడించి ప్రార్థించాను కదా అంటున్నది ఆమె. ఈ కథ పోతన రచించిన భాగవతంలో గజేంద్రమోక్షం ఘట్టంలో వస్తుంది. ఓ ఏనుగు జలక్రీడలు ఆడటానికి ఒక మడుగులో దిగింది. అందులో భయంకరమైన మొసలి నివసిస్తూ ఉంది. ఏనుగు క్రీడించే సమయంలో గభాలున కాలు ఒడిసి పట్టుకుంది రాహువు సూర్యుడిని పట్టుకున్నట్లు. ఏనుగు కాళ్ళను బంధించి కదలకుండా చేసి తోకతో కొడుతూ నీటిలోకి లాగటానికి ప్రయత్నించింది. ఏనుగు మొసలిని తొండంతో కొడుతూ గట్టు మీదకు రావటానికి ప్రయత్నించింది. రెండూ చాలాకాలం పోరాడాయి. ఏనుగు బలం క్రమక్రమంగా క్షీణించిపోతున్నది. నీళ్ళలో ఉన్నప్పుడు మొసలికి బలం ఎక్కువ. రెట్టించిన ఉత్సాహంతో ఏనుగుని నీటిలోకి లాక్కునిపోతూ ఉంది. ‘ఈ మొసలి బారినుంచీ నన్నెవరు కాపాడతారు? నా కెవరు రక్ష?’ అనుకుంటూ కరి విష్ణువుని ప్రార్ధించింది.
“లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యె ప్రాణంబుల్
ఠావుల్ దప్పెను, మూర్ఛ వచ్చె, దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!”
“భగవంతుడా! నాలో శక్తి కొంచెం కూడా లేదు, ధైర్యం దిగజారిపోయింది, ప్రాణాలు ఎగిరిపోయేటట్లున్నాయి, మూర్ఛ వచ్చేటట్లు ఉంది, శరీరం అలసి పోయింది, ఇప్పటివరకూ ఎంతో శ్రమపడ్డాను. ఇక నీవు తప్ప నాకు దిక్కులేదు, నన్ను కాపాడు స్వామీ!” అని అర్థం. భక్తుడి మొర విని విష్ణుమూర్తి వైకుంఠం నుంచీ పరుగున వచ్చి చక్రాయుధం వేసి మకరిని సంహరించి కరిని రక్షించాడు. ఆపదలో ఉన్న కరిని కాపాడావనీ, శరణుకోరిన వారిని కరుణించావని నిన్ను మరీ మరీ ప్రార్ధిస్తున్నానే! నన్ను కాపాడవే? ఇప్పుడు చెప్పిన కథలన్నీ కల్పితాలేనా? అని అడుగుతున్నది నాయిక. గజేంద్రమోక్షంలో ఏనుగు కూడా మొదట ఇలాగే అనుకున్నది.
“కలడందురు దీనుల యెడ
గలడందురు పరమయోగి గణముల పాలన్
గలడందురు అన్ని దిశలను
గలడు గలడనెడి వాడు గలడో లేడో?”
దేవుడు దీనుల వెంట ఉంటాడంటారు. ఉత్తములైన యోగుల చెంత ఉంటాడంటారు. అన్ని దిక్కులలోనూ ఉంటాడని అంటారు. ఉన్నాడు ఉన్నాడు.. అనే వాడు అసలు ఉన్నాడో లేడో! ఉంటే, నేను ఇంతకాలం నుంచీ మకరితో పోరాడుతూ ఉంటే చూస్తూ ఉన్నాడా! కాపాడటానికి రాడే? అనుకుంది. చివరకు సంపూర్ణ ఆత్మసమర్పణ చేసి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అనుకున్నప్పుడు వచ్చాడు (కనుక మనకి శక్తి ఉన్నంతవరకూ పోరాడాలి. మన ప్రయత్నం మనం చేయాలి. మన శక్తి మించి పోయినప్పుడు దేవుడు తప్పకుండా ఆదుకుంటాడు అని అంతరార్థం). పోతన రచించిన భాగవతంలోని ప్రతి పద్యం ఆణిముత్యం లాంటిదే! ఇక రెండవ చరణంలో నాయిక ఇలా వేడుకుంటున్నది.
“నా మదినే నీ మందిరమనుకుని కొలువుండగా తరలి రావా!
నీ మధునామమే నా అణువణువున పలికించవా ఆదిదేవా!
వందనమయ్యా కొండలరాయా! అభయమునందించ రావా!”
నా మనసునే నీ కోవెల అనుకుని కొలువుండటానికి రావా! నీ మధురమైన నామమే నా తనువులోని అణువు అణువులోనూ పలింకించేటట్లు చేయవా దేవా! ఏడుకొండల మీద కొలువైన స్వామీ, నీ అభయాన్ని నాకు అందించు అని ప్రార్థిస్తున్నది. ప్రహ్లాదుడు తన శరీరంలో ప్రతి అణువులోనూ శ్రీహరి నామమే తలుస్తూ ఉంటాడు. తండ్రి తనను సముద్రంలో పడవేయించినా, గదలతో మొత్తించినా, అగ్నిలో తోసినా, విషసర్పాలతో కరిపించినా క్షేమంగా బయటపడగలిగాడు. అలాగే నారదుడు కూడా నిరంతర హరినామ స్మరణ చేస్తూ ఉంటాడు. అందుకే దేవతలు అయినా, వారి విరోధులు రాక్షసులు అయినా ముల్లోకాలలో ఎక్కడికి వెళ్ళినా అందరూ గౌరవంగా లేచి నిలబడి నమస్కరిస్తూ ఉంటారు. ..ఇదీ ఈ గీతం విశ్లేషణ!
ఈ పాట పాడిన గాయని చిత్ర మాతృభాష మలయాళం. కానీ ఆమె ఉచ్చారణ చూస్తుంటే తెలుగు అమ్మాయేమో అనుకుంటారు. అంత స్పష్టంగా, చక్కగా పాడుతుంది. అందుకే కళకు భాషాభేదం లేదు అంటారు. ఓసారి పత్రికల వారు సీనియర్ గాయని యస్. జానకిని ఇంటర్వ్యూ అడిగారు. “నా ఇంటర్వ్యూలు చాలాసార్లు వేశారుగా! ఈమధ్య చిత్ర అనే అమ్మాయి బాగా పాడుతున్నది. ఆమెని అడగండి” అని అన్నది.
ఒక రంగంలో ఉన్నవాడు అదే రంగంలో ఉన్న ఇంకొకడిని ఎప్పుడూ మెచ్చుకోడు. ఎదుటివాడిని ప్రత్యర్థి గానే భావిస్తాడు. అతడి ప్రతిభ గుర్తించినా గుర్తించనట్లే ప్రవర్తిస్తాడు, “ఉన్నమాట అయినా మన నోటితో ఇతరుల గొప్ప చాటరాదు” అని మాయాబజార్ సినిమాలో శకుని అన్నట్లుగా. ఒక రచయిత కథని మరో రచయిత ప్రశంసించటం, ఒక గాయని మరో గాయనిని మెచ్చుకోవటం అరుదుగా జరుగుతుంది. అలా మెచ్చుకున్నారంటే వారు విశాల హృదయం ఉన్నవారుగా భావించాలి.
Image Source: Internet
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.