Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వెదురు అడవిలో విహారం

[డా. నర్మద రెడ్డి గారి ‘వెదురు అడవిలో విహారం’ అనే రచనని అందిస్తున్నాము.]

బాడ్మింటన్ పోటీ:

నేను బాడ్మింటన్ ప్లేయర్‌ని. అవకాశం ఉన్నప్పుడల్లా, వివిధ టోర్నమెంటుల్లో పాల్గొంటాను. అలా బయటి ప్రదేశాలకు పోటీలకు వెళ్ళినప్పుడు సమీపంలో పర్యాటక స్థలాలను చూసి రావడం అలవాటు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగూడెంలో శ్రీ గుజ్జుల సుధాకర్ రెడ్డి మెమోరియల్ యోనెక్స్-సన్‍రైజ్ 10th తెలంగాణా స్టేట్ మాస్టర్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. నేను, నా పార్ట్‌నర్ అపర్ణ ఈ పోటీల్లో పాల్గొనడానికి 5వ తారీకు సాయంత్రం కొత్తగూడెం బయలుదేరాము. రైలెక్కడానికి సికింద్రాబాద్ స్టేషన్‌కి 5 గంటలకు చేరుకున్నాను. ఈ లోపల అపర్ణ ఫోన్ చేశారు. “నేను జూబ్లీహిల్స్‌లో ఉన్నాను. రోడ్ చాలా రద్దీగా ఉంది. ట్రైన్ అందుకోగలనో లేదో” అన్నారు. “లేదు లేదు, ఖచ్ఛితంగా చేరుతారు.. తొందరగా వచ్చేయండి, ఫాస్ట్‌గా” అని చెప్పాను. అయితే 5.20కి మా ట్రైన్ బయలుదేరింది. అప్పటికి అపర్ణ కాల్ చేసి “నేను మౌలాలిలో మిమ్మలిని కలుస్తాను. ట్రైన్ అక్కడ ఎక్కుతాను” అని చెప్పారు. “అవునా మౌలాలి స్టేషన్ లో ఆగుతుందా?” అని పక్కన వాళ్ళని అడిగితే “అవును అగుతుంది. అయితే ఒకటే నిమిషం అగుతుంది” అని చెప్పారు. నేను తనకి ఫోన్ చేసి మీరు తొందరగా వచ్చి ట్రైన్ ఎక్కాలి అని చెప్పాను. మౌలాలీలో ట్రైన్ ఆగే సరికి ఆమె స్టేషన్ దగ్గరకు వచ్చేసారు. సినిమాల్లో చూపించినట్లుగా పరుగెత్తుకుంటూ వచ్చి రన్నింగ్ ట్రైన్ అందుకున్నారు. నేను బోగీ తలుపు దగ్గర నిలబడి చెయ్యి ఊపుతూ పిలిచాను. తను పరుగెత్తుకుంటూ వచ్చి మా బోగీలోకి ఎక్కేసారు. రాత్రి ఒంటిగంటకి మేము భద్రాచలం చేరుకున్నాము. మా వెంబడి వచ్చిన ఒక ప్లేయర్ మా ఆటోని ఫాలో చేసారు. మేము కొత్త గూడెం లోని హోటల్ లేపాక్షి‌లో దిగాము. లేపాక్షి హోటల్లో రిసప్షనిస్టుతో సహా, అందరు పడుకొని ఉన్నారు. మేము వెళ్ళగానే స్వాగతం చెప్పి ఒక రూము ఇచ్చారు. మేమిద్దరం హాయిగా పడుకున్నాము.

చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అపర్ణ ఎక్కడ మిస్ అవుతారో అని చాలా కంగారుపడ్డాను. 5వ తారీకు రాత్రి అలా ముగిసింది.

6 వ తారీకు ఉదయం నేను 7 గంటలకు లేచాను. పొద్దున్నే 7.30 కల్లా తయారై 8 గంటలకు కిందకి ర్షిపషన్‌కి వచ్చి అక్కడ దగ్గరల్లో ఉన్న హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసి బయలుదేరాము. కొత్తగూడెం బ్యాడ్మింటన్ అసోషియేషన్‌లో మా మాస్టర్స్ గేమ్స్ అవుతున్నాయి. అక్కడకి వెళ్ళాము. అక్కడకి వెళ్ళే సరికి చాలా చాలా హంగామాగా.

దగ్గర దగ్గర 200 మంది దాకా ప్లేయర్స్ ఉన్నారు. అందరితో ఒక ఫోటో తీసేసుకొని, మా గేమ్స్ సాయంత్రం 4 గంటలకు పెట్టించుకొని అక్కడ నుంచి మేము భద్రాచలం గుడి చూడటానికి పల్లె వెలుగు బస్సులో బయలుదేరాము. భద్రాచలంల ఆలయాన్ని సందర్శించుకుని వెనక్కి వచ్చి ఆ రోజు సాయంత్రం బ్యాడ్మింటన్ ఆడి సింగిల్స్, డబుల్స్ మిక్స్డ్ డబల్స్ విభాగాలలో స్టేట్ చాంఫియన్‌షిప్ గెలుచుకొని ఎంతో సంతోషంతో మారేమిల్లికి వెళ్లాం.

మారేడుమిల్లి:

తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవులు రాజమండ్రి నగరానికి 90 కి.మీ. దూరంలో ఉంటాయి. మారేడుమిల్లి అరణ్యం గొప్ప జీవవైవిధ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతం తూర్పు కనుమలలో భాగమైన ఆస్థిర భూభాగాలతో సెమీ సతత హరిత అడవులను కలిగి ఉంది. మారేడుమిల్లి – భద్రాచలం రహదారిలో దాదాపు 4 కి.మీ. మారేడుమిల్లి గ్రామం నుండి దూరంగా, ఈ ప్రాంతం అడవుల్లోని రాళ్ళపై ప్రవహించే అనేక లోతైన ప్రవాహాలను కలిగి ఉంది. ఏ సందర్శకుడైనా ప్రకృతిలో ఉత్కంఠభరితమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు.

పర్యావరణ పర్యాటక ప్రాజెక్టును స్థానిక స్వదేశీ గిరిజన సంఘమైన వలమురు, సోమిరెడ్డిపాలెం మరియు వాల్మీకిపేట వన సంరక్షణ సమితి ప్రజలు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క క్రియాశీల సహకారంతో నిర్వహిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు సహాయంతో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ నుండి సకాలంలో ఆర్థిక సహాయంతో పాటు అధిక ప్రేరణ పొందిన సమాజ భాగస్వామ్యం యొక్క నిబద్ధత కారణంగా ఈ ప్రాజెక్ట్ స్వల్ప వ్యవధిలో విజయవంతంగా పూర్తయింది. పరిరక్షణ సందేశాన్ని ప్రజలకు వ్యాప్తి చేయడానికి స్థానిక జాతి సమాజానికి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది. రామయణ కాలంలో వాలి-సుగ్రీవుడి యుద్ధభూమిగా నమ్ముతున్న వాలి-సుగ్రీవ కొండకు ఎదురుగా మూడు వైపులా ప్రవహించే ప్రవాహంతో వంగమూరు నదికి ఆనుకొని జంగిల్ స్టార్ క్యాంప్ సైట్‌లో ఇతర కొండలపై అడవులతో చుట్టుముట్టబడిన గడ్డి భూముల ఉనికితో యుద్ధభూమి యొక్క విశేషమైన వైవిధ్యం సందర్శకులని ఆకట్టుకుంటాయి.

పర్యాటక అభివృద్ధిలో భాగంగా, మారేడుమిల్లి ఫారెస్ట్ రెస్ట్ హౌస్ 1914లో నిర్మించబడింది, ఫారెస్ట్ రెస్ట్ హౌస్ అన్ని సౌకర్యాలతో ఉంది. విశ్రాంతి గృహం పేరు అభయారణ్య ఫారెస్ట్ రెస్ట్ హౌస్. పర్యాటకుల బస కోసం సూట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

మారేడుమిల్లిలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి: పుడ్, పక్షుల గూడు, అరణ్య కబిన్ రిసార్ట్, మన విహారీ.. మొదలైనవి.

మేము మారేడుమిల్లికి బయలుదేరినప్పుడు, మావారు, మరికొందరు ఫ్రెండ్స్ అంతా ఖమ్మంలో కలిసారు. ఖమ్మం నుంచి మారేడుమిల్లి వరకు కారులో వెళ్లాము. కారులో వెళ్ళేటప్పుడు కూడా దట్టమైన అడవి. ఇక్కడే సీతారామరాజు గ్రామం ఉంది. ఇక్కడ వెదురు వృక్షాలు ఎక్కువ. వెదురు చెట్లు చాలా అందమైన ప్రకృతి సౌందర్యాలను ఒలకపోస్తూ మాకు కన్నుల పండుగ చేశాయి. ఆ అడవిని అలా దాటుకుంటూ లోపలి వెళ్ళి మేము ఒక రిసార్ట్ బుక్ చేసుకొని మా మూడు జంటలు వెళ్ళాము. మూడు రూమ్లు తీసుకొని ఆ రోజు రాత్రి అక్కడ విశ్రమించాము.

మర్నాడు ఉదయం అక్కడే ఉన్న ఒక జలపాతం దగ్గరకు వెళ్ళి అరణ్య, పక్షుల గూడు, తరువాత అక్కడే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా మొత్తం తిరిగి చూసి అక్కడ నుంచి మరల మా రిసార్ట్‌కు వచ్చాము. మా రిసార్ట్ మాత్రం చాలా తక్కువలోనే దొరికింది మాకు. రోజుకు పదిహేను వందలు. చాలా బాగుంది. వెదురుతోటి తయారు చేసిన వెదురుకట్టెలోనే చక్కటి చికెన్ తయారుచేస్తున్నారు అక్కడ. ఆ ప్రదేశం బేంబు చికెన్‌కి చాలా ప్రసిద్ధి చెందింది. మేము అందరము ఆ బేంబు తోటి ఉన్న ఆ చికెన్ తీసుకొని అక్కడ పక్కనే ఉన్న చిన్న హోటల్ లాగా కూడా పెట్టారు, అక్కడే రైసు, ఆ చికిన్ తినేసి మా రూమ్‌కి తిరిగి వచ్చాము.

తరువాత రోజు జలపాతాన్ని చూడ్డానికి వెళ్ళి, జలపాతంలో ఆటలాడి చక్కగా తడిసి ముద్దయ్యాం. అక్కడ ఆ అడవి అందాలు చూడనలవికాని దృశ్యమాలిక. ఎంత చక్కగా ఉందంటే కన్నులు తిప్పుకోలేము. అడవి అంతా చూస్తూ మళ్ళీ మేము ఎర్లీ మార్నింగ్ ఒక కొండ చివర ఒక వ్యూ-పాయింట్ ఉందని చెప్పి, అక్కడ కూడా వెళ్ళాం. అక్కడ అంతా మంచు. అంటే దట్టమైన పొగమంచు. అయినా మనకు చాలా బాగా కనిపిస్తుంది అడవి మొత్తం కూడా. అది అంతా చూస్తూ తిరిగి వచ్చాం.

పాపికొండలు:

తర్వాత పాపికొండలకి బయల్దేరాం. మా క్లోజస్ట్ ఫ్రెండ్ కూతురు నిశ్చితార్థానికి అక్కడకి బయలుదేరాము. అక్కడ నాకు పరిచయమైన అమ్మాయి తోటి ఒక పడవ మాట్లాడుకొని తన స్నేహితురాళ్ళలను పిలవమని చెప్పాను. కాని ఆ టైమ్‍లో నదిలో నీళ్ళు పుల్ పారుతున్నాయి గాబట్టి అన్ని గేట్లు తెరచి ఉంచారట. అది చాలా చాలా ప్రమాదకమైన పని అని, బోటు ఎప్పుడైన మునిగిపోవచ్చు అని, అందకు ముందే ఓ బోటు మునిగిపోయిందని చెప్పారట. దాంతో ఈ ఎనిమిదిమందికి ఫోన్ చేస్తే వాళ్ళల్లో ఒకరు కూడా రాలేదు. అందరు భయపడ్డారు. కాని నేను తను మాత్రం పొద్దున్నే ఆరు గంటలకు రాజమండ్రి బస్సు స్టాండ్లో నిలబడి అక్కడ మాకోసం ఏర్పాటు చేసిన పికప్ బస్సు (ఒక మనిషికి పదిహేను వందల రూపాయలు) ఎక్కాము. పడవలు బయల్దేరే దగ్గర మమ్మల్ని దించేసారు. ఆ పడవ దగ్గరకు వెళ్ళేటప్పుడు కూడా మనకు సీతారామరాజుగారి ఊరు కన్పిస్తుంది. ఆ అడవిని దాటుకుంటూ పాపికొండలకి వెళ్ళాము.

పొద్దున్న 10 గంటలకు బయలుదేరితే సాయంత్రం 5 గంటల వరకు మా ప్రయాణం గడువు. పాపికొండలు, అక్కడి అడవులు, నదిలోని నీటి తళ తళలు చూసి ఆనందించాం. ఆ పడవలో ఉన్న వాళ్ళందరితోటి, ఇద్దరు ఇద్దరు జంటగా అమ్మాయిలతోటి చక్కగా డ్యాన్స్ చేశాం. ఇద్దరు అబ్బాయిలు చక్కటి ప్రణాళిక వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ఉర్రూతలు ఊగిస్తూ, ఆడవాళ్ళందరికి కూడా ఒక ఆట, మగవారికి ఒక ఆట. ఆ అమ్మాయిలకు ఒక ఆట, అలాగ ఆటలు ఆడిపిస్తూ పాటలు పాడుతూ, పాటలకి డ్యాన్స్లు చేయిస్తూ రోజు మొత్తం మమ్మళ్ళన్ని అలరించారు. వాళ్ళే మాకు టిఫిన్, భోజనం పెట్టారు. సాయంత్రం 4 గంటలకు టీ పకోడి ఇచ్చారు. మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 గంట వరకు భోజనాలు. తిన్న తరువాత మమ్మల్ని ఒక ఊరికి తీసుకెళ్ళారు. ఈ ఊరికి తీసుకెళ్ళిన దగ్గర ఒక చింత చెట్టు ఉంది. ‘గోదావరి గట్టుంది, గట్టుమీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది’ అనే పాటని, ఆ సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారట. ‘మూగమనసులు’ సినిమాలో చూపించారట. అక్కడ్నించి ఊర్లోకి తీసుకువెళ్ళారు.

అదో ఒక పల్లెటూరు. స్థానికులు వెదురుకట్టెల తోటి చక్కటి బేంబూ గప్పలు, విసినకర్రలు, బొమ్మలు, చాలా చాలా రకరకాలుగా తయారుచేస్తున్నారు. వాళ్ళ దగ్గర నేను కొన్ని కొన్నాను. తర్వాత అక్కడున్న ఓ గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొన్నాను. అక్కడ నుంచి వస్తూవుంటే ఇంకో జలపాతం ఉందని తీసుకెళ్ళారు. ఆ జలపాతంలో అందరం చక్కగా కూర్చుని ఆడాం. స్నానం చేయలేదు కాని నీళ్ళు చల్లుకొని కాసేపు ఆడుకొని మెల్లిగా మా పడవ చేరుకున్నాము.

ఇదంతా ఎంత హ్యాపీగా గడిచిందంటే, నమ్మశక్యం కానంత! చాలా చాలా ఆనందంగా ఒడ్డుకు చేరాము. ఒడ్డుకు ఉన్న పాత ఆంజనేయ స్వామి గుడి, అమ్మవారి గుడిలో దర్శనం చేసుకుని  బస్సు స్టాండ్‌కి వచ్చాం. బస్సు ఎక్కిన తరువాత సీతారామరాజు గారి ఊరు వరకు వచ్చాకా, అక్కడ బస్సు టైయిర్ పంచర్ అయింది. “ఇది ఎప్పుడికి తయారౌతుందో తెలియదమ్మా, మీరు వేరే బస్సులు వస్తే వెళ్ళి పోండి అమ్మా” అని డ్రైవర్ చెప్పాడు. సరేనని మేము నడుచుకుంటూ సగం దూరం వచ్చాము ఈ లోపల బస్సులు ఏవీ రాలేదు. చాలా సేపు, సుమారు ఒక గంటసేపు నిలబడిన తరువాత ఒక ఆటో వచ్చింది. మేము ఒక ఆరుగురం ఉన్నాము. నలుగురు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు. ఆ ఆటో అబ్బాయిని బ్రతిమిలాడి మమ్మల్ని తరువాత ఊరు వరకు దించమని, రాజమండ్రి వరకు దించమని అడిగాం. సరే అన్నాడతను. అతనికి తలా వందరూపాయలు ఇస్తే ఓకె అన్నాడతను. అది ఎక్కేశాం. నేను ఎప్పుడు ఆటో ఎక్కలేదు. సో ఈసారి కొత్త అనుభవమన్నమాట. అందరం మాట్లాడుకుంటూ ఊరు చేరేసరికి రాత్రి 8.30 అయింది.

రాత్రి పడుకొని, మర్నాడు నిశ్చితార్థం చూసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చాం. సో, కొత్తగూడెం, ఖమ్మం, పాపికొండలు, మారేడుమిల్లి, పాపికొండలు.. వరుసగా ఇన్ని ప్రదేశాలు చూస్తూ; అడవంతా ఈ చివర నుంచి ఆ చివర వరకు కనుల విందుగా, కనుల పండుగతో నడుస్తూ, పక్షుల కిలకిలరావాలను వింటూ ఆ సంధ్యాసమయంలో చక్కటి సూర్యకిరణాలని ఆస్వాదించాం, ఎన్నో మధుర స్మృతులను నింపుకుని తిరిగి వచ్చాం.

Exit mobile version