Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వీధి తలుపు

[శ్రీ జిల్లేళ్ళ బాలాజీ రచించిన ‘వీధి తలుపు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

కమలమ్మకు మెలకువ వచ్చి చాలాసేపైంది. కానీ, మంచంమ్మీద పడుకున్న స్థితిలోనే ఉండిపోయింది. కొడుకును లేపాలనిపించలేదు. ‘పాపం వాడైనా కంటి నిండుగా నిద్రపోనీ..’ అనుకుని మౌనం వహించింది. మునుపు ఉదయాన్నే తొందరగా మెలకువ వస్తే, ఆమే లేచి టాయిలెట్‌కు వెళ్లొచ్చి మంచినీళ్లు తాగి మళ్లీ పడుకునేది. ఎప్పుడైతే ఆమె మంచానికే పరిమితమైపోయిందో అప్పటినుండే ఆమె అన్ని అవసరాలకూ కొడుకుపైన్నే ఆధారపడుతోంది.

సమయం గడుస్తున్నా.. ఆమెకు గొంతెత్తి కొడుకును పిలవాలనిపించలేదు. తన రెండు చేతుల్నీ పరుపుపై నొక్కి పట్టి శక్తినంతా కూడదీసుకుని ఎలాగో అతి కష్టమ్మీద వెనక్కు జరిగి మంచం డూమ్‌కు వీపును ఆనించి కూర్చుంది. హాల్లోని జీరోవాట్‌బల్బు వెలుతురులో ఎదురుగా గెడియ పెట్టిన వీధితలుపు అస్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఆ తలుపునే చూస్తూ ఉండిపోయింది.

అలా చూస్తుంటే.. చిన్నప్పుడు పల్లెలో ఆమెనెంతో అల్లారుముద్దుగా చూసుకున్న తాతయ్యా, వాళ్లింటి వీధి తలుపును పట్టుకుని ఆడుకున్న ఆటలూ.. అన్నీ గుర్తుకు రాసాగాయి.

కమలమ్మ కమలగా ఉన్న రోజుల్లో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. కమలకు వాళ్ల తాతయ్య అన్నా, వాళ్ల ఇల్లు అన్నా ఎంతో ఇష్టం. ఉప్పరపల్లెలోని కమల వాళ్ల తాతయ్యది మామూలు పెంకుటిల్లే. ఆ ఇంటి ముందు విశాలమైన వాకిలి, రెండువైపులా ఎత్తైన అరుగు, లోపల పొడవైన తాళువారం, రెండు గదులు, మట్టిపొయ్యితో ఉన్న వంటగది, ఇంటి వెనక పెరడు, పెరట్లోని బావి, పక్కనే కొబ్బరిచెట్టు.. ఇలా అన్నీ ఎంతో చూడ ముచ్చటగా ఉండేవి. అయినా, ఆ ఇంటికున్న వీధి తలుపు ఆకర్షించినంతగా కమలను మరేదీ ఆకర్షించలేదు.

ఆ ఇంటి వీధి తలుపు ఉండాల్సినంత ఎత్తు లేదు, పొట్టిగా ఉంటుంది. కానీ ఆ తలుపు ఎంతో అందంగా ఉంటుంది. తలుపు ముందు భాగాన.. పైనా, కిందా, మధ్యలోనూ పొడవైన మూడు దిమ్మెలుండేవి. ఒక్కో దిమ్మెకూ వరుసగా మూడేసి బుడిపెల్లాంటివి చెక్కారు. కమల అమ్మమ్మ ఆ తలుపు మధ్యలో గుండ్రంగా పసుపు పూసి అడ్డంగా వేలెడంత వెడల్పుతో కుంకుమతో గీతలు గీసేది. అది చూడ్డానికి ఎంతో అందంగా బాగుండేది. తలుపును లాగటానికి ఒక చిన్న ఇనుప వలయం కూడా వ్రేలాడుతుండేది.

కమల ఆ వలయాన్ని గట్టిగా పట్టుకుని కిందున్న దిమ్మెపై ఒక కాలు పెట్టి మరో కాలితో నేలపై ముందుకు నెట్టేది. అది కదలగానే రెండో కాలును పైకెత్తేసేది. తలుపు కదిలి చివరిదాకా వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చి ఆగేది. వెనక్కు వచ్చాక మళ్లీ కాలితో నేలపై నెట్టేది. అలా తలుపును పట్టుకుని ఊగుతూ ఆడుకోవటంలో కమలకు ఎంతో ఆనందం కలిగేది. కానీ ఆ ఆటంతా అమ్మమ్మ ఇంట్లో ఉంటే సాగేది కాదు. ఆమె ఇంట్లో ఉండగా తలుపుతో ఆడుకుంటే గట్టిగా కేకలు పెట్టేది. తలుపు లక్ష్మీదేవితో సమానమనీ, దానిమీద కాళ్లు పెట్టి ఆడుకోవటం తప్పనీ, లెంపలేసుకోమని చెప్పేది. కమల మనసెరిగిన తాతయ్య శబ్దం కాకుండా ఆడుకోమని సైగ చేసేవాడు. కానీ తలుపు కదులుతున్నప్పుడల్లా వచ్చే కిర్రుమన్న శబ్దంతో అమ్మమ్మ అట్లకాడ పట్టుకుని కేకలు పెడుతూ కొట్టటానికి వస్తే కమల వీధిలోకి పారిపొయ్యేది.

“ఏమిటే నీ చాదస్తం. తలుపేమైనా అరిగిపోతుందా, విరిగిపోతుందా ఏంటీ? మనవరాలు ఆడుకోనీ. ఎప్పుడో ఆర్నెల్లకో, ఏడాదికో ఒకసారి వచ్చే బిడ్డ ముచ్చట తీరనీ.” అని తాతయ్య కమలను వెనకేసుకొచ్చేవాడు. “ఆడుకోటానికి ఇంట్లో బొమ్మలా లేవు, తలుపుతో ఆడుకోవటమేంటీ..? నాకు నచ్చదు.” అని కరాకండిగా చెప్పేది.

‘టౌనులో ఉన్న తమ ఇంటికీ ఇలాంటి తలుపుంటే ఎంత బాగుణ్ణు? ఎంచక్కా అక్కడే హాయిగా ఆడుకునేది’ తనలో తాను అనుకునేది కమల.

ఏళ్లు గడుస్తున్న కొద్దీ వీధి తలుపుతో తనివితీరా ఆడుకోలేదన్న అసంతృప్తి మాత్రం ఆమెలో అలాగే ఉండిపోయింది.

క్రమంగా కమల పదవ తరగతి కొచ్చింది. ఆ యేడాది వాళ్ల నాన్న కొత్తగా ఇల్లు కట్టిస్తున్నప్పుడు కమల, “నాన్నా, కొత్తింటికి తాతయ్య వాళ్లింటికున్నట్టు తలుపు పెట్టించు నాన్నా!” అంది.

“అది పాత మోడలమ్మా, అలా ఇప్పుడెవరూ పెట్టించుకోరు!” అంటూ ఇంటిని మోడర్న్‌గా కట్టించాడు. దాంతో కమల ఎంతగానో నిరుత్సాహపడింది.

ఆమెకు ఇంటి తలుపుతో ఆడుకునే ప్రాయం దాటిపోయినా అలాంటి తలుపున్న ఇంటిని మాత్రం మర్చిపోలేకపోయింది. క్రమంగా కమల పెళ్లీడుకొచ్చింది. వీధి తలుపుతో తాను ఆడుకోలేకపోయినా తన పిల్లలైనా ఆడుకోవాలన్న కోరిక ఆమెలో బలపడసాగింది.

కమలకు ఓ మంచి సంబంధం కుదిరింది! అత్తగారింటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూడసాగింది. కారణం, ఆ ఇంటికైనా ఆమె కోరుకున్న వీధి తలుపుందేమో తెలుసుకోవాలనే. కానీ మెట్టినింట అడుగు పెడుతూ వీధి తలుపు కేసి చూసిన ఆమెకు నిరాశే మిగిలింది. ఆ తలుపుకు ఆమె కోరుకున్న హంగులేవీ లేవు. అప్పుడే కమల ఒక గట్టి నిర్ణయానికొచ్చేసింది. ‘తాము భవిష్యత్తులో సొంతంగా ఇల్లంటూ కట్టుకుంటే ఆ ఇంటికి తాను కోరుకున్నట్టుగా తలుపును పెట్టించాలని!’

ఆ రోజే భర్తతో, “ఏమండీ, వీధి తలుపును పట్టుకుని మన పిల్లలు హాయిగా ఆడుకుంటూంటే, మనకు దాన్ని చూసి ఆనందించటం కన్నా మించింది ఏదీ ఉండదండీ!” అంటున్న కమలను చూసి భర్త నోరు వెళ్లబెట్టి అలాగే చూస్తూండిపొయ్యాడు.

‘తమ పిల్లలు’ వీధి తలుపుతో ఆడుకోవాలని కమల ముచ్చట పడింది కానీ, ఆమె కడుపులో కాసింది ఒక్కటే కాయ. వాడికి రెండేళ్లప్పుడు మశూచి సోకి ప్రాణం మీదికొచ్చింది. తాను మొక్కిన దేవుళ్ల దయ కారణంగా కొడుకు మరణం నుండి బయటపడ్డాడు కానీ, ముఖమంతా మచ్చలతో మిగిలాడు. అయినా వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంది.

రెండేళ్లకు ఆ దంపతులు కొంత స్థలం కొనుక్కుని, ఇల్లు కట్టటం మొదలుపెట్టారు. కమల కోరుకున్న విధంగానే ఆ కొత్త ఇంటికి వీధి తలుపును పెట్టించింది.

కొడుకు వీధి తలుపుపై నిలబడి ఆడుకుంటాడని కమల భావించింది. కానీ వాడు బలహీనంగా ఉండటంతో ఆ ఆటను వాడు ఆనందంగా ఆడలేకపోయేవాడు. బలవంతంగా ఆమే వాడిని తలుపుమీద నుంచోబెట్టి ఊపేది. కానీ ఐదు నిమిషాలకు మించి వాడు తలుపు మీద నిలబడలేకపోయేవాడు.

అంతేకాక, వాడితో కలిసి ఆడుకునేందుకు ఇరుగుపొరుగు పిల్లలు కూడా వచ్చేవారు కారు. కారణం, స్ఫోటకపు మచ్చలతో ఉన్న వాడిని చూస్తూ దూరంగా వెళ్లిపోయేవాళ్లు. అప్పటినుండే వాడికి ఒంటరితనంతో గడపటం బాగా అలవాటైంది. దాన్ని పోగొట్టటానికి కమలమ్మ ఎంతగానో ప్రయత్నించేది.

పెద్దవాడవుతున్నకొద్దీ వీధితలుపుతో వాడు ఆడుకునే దృశ్యం ఆమె మదిలో నుండి క్రమంగా దూరం కాసాగింది.

వాడు ఎం.బి.ఏ చదువు పూర్తిచేసి, ఉద్యోగస్థుడయ్యాక.. కొడుక్కు పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు ఎన్నో సంబంధాలను చూశారు. కానీ ఏదీ కుదరలేదు.

చిన్నప్పుడు కొడుకుతో ఆడుకోవటానికి ఎలాగైతే ఎవరూ ముందుకు రాలేదో, అలాగే ఇప్పుడు అతని జీవితాన్ని పంచుకోవటానికి ఏ అమ్మాయా ముందుకు రాలేదు. కొడుకు అనాకారితనమే వాడి పెళ్లికి అడ్డంకిగా ఉందని ఆవేదన చెందేది కమలమ్మ.

ఒకరోజు వాడు తండ్రితో – “నాన్నా నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. దయచేసి మీరు నా పెళ్లి ప్రయత్నాలు మానుకోండి.” అని చెప్పాడు. కొడుకు విసిగిపోయి విరక్తితో అంటున్న ఆ మాటలను సరిగ్గానే అర్థం చేసుకుంది కమలమ్మ. అయినా పట్టు విడవకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు.

మూడేళ్ల క్రితం భార్యాభర్తలిద్దరూ స్కూటర్లో వెళుతుంటే జరిగిన ఆక్సిడెంట్‌లో భర్త అక్కడికక్కడే చనిపోయి ఆమె కాళ్లు రెండూ నుజ్జు నుజ్జు అయ్యాయి. వాటిని తీసెయ్యాల్సి రావటంతో కమలమ్మ మంచానికే పరిమితమైపోయింది.

కొడుకే తల్లిలా మారి ఆమెకు చెయ్యాల్సిన సేవలే కాదు, ఇంటి పనులు కూడా అతనే చెయ్యసాగాడు. దాంతో ఎంతగానో కృంగిపోయింది కమలమ్మ. శారీరక బాధకు తోడు మానసిక వేదన కూడా ఆమెను మరింత బాధించసాగింది.

తను చనిపోయేలోపు ఎలాగైనా కొడుక్కు పెళ్లి చెయ్యాలనుకుంది కమలమ్మ. తమకు కట్నం అక్కర్లేదనీ, అమ్మాయికి చదువులేక పోయినా, పేదింటిదైనా పర్లేదని ఎందరితోనో చెప్పి ఉంచింది.

చివరకు ఓ మంచి సంబంధం కుదిరింది. ఆ అమ్మాయి కమలమ్మ కొడుకును పెళ్లి చేసుకోవటానికి అంగీకరించింది. ఓ శుభ ముహూర్తాన కొడుక్కు పెళ్లిచేసి వెయ్యి దేవుళ్లకు తన కృతజ్ఞతలను చెప్పుకుంది.

పెళ్లయ్యాక, కొత్త దంపతులు పెళ్లి మంటపం నుండి ఇంటికెళ్లినప్పుడు “వీధి తలుపు తెరుచుకుని, ముందు కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్లమ్మా!” ఆటోలో ఉన్న కమలమ్మ కొత్త కోడలితో అంది. కోడలు యామిని అలాగే చేసింది.

అప్పుడే కమలమ్మలో అణగారిన కోరిక మళ్లీ తలెత్తింది. ‘హమ్మయ్య, శుభప్రదంగా కోడలు మెట్టినింట అడుగుపెట్టింది. ఆమెకు పుట్టబోయే బిడ్డలైనా తమ ఇంటి వీధి తలుపుతో హాయిగా ఆడుకుంటే తనకంతే చాలు!’ అనుకుంది..

అంతలో.. వీధి తలుపు తీసే శబ్దం కావటంతో ఆలోచనల్లో నుండి బయటపడి వీధి తలుపు కేసి చూసింది. వాకిలి ఊడ్చే చీపురు, నీళ్లు నిండిన బక్కెట్టును చెరో చేత్తో పట్టుకుని వీధిలోకి వెళుతున్నాడు కమలమ్మ కొడుకు రామమూర్తి.

సమయం నాలుగైనట్టుంది. చీకట్లు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఎవరూ లేవక ముందే వాకిలి ముందు చెత్తను ఊడ్చి, కళ్లాపి చల్లి, తనకు తోచిన ముగ్గుకర్రను వేస్తాడు రామమూర్తి.

కొడుకు చేస్తున్న పనులను చూస్తున్నకొద్దీ ఆమె కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరగసాగాయి. కొడుక్కు పెళ్లి అయ్యిందన్న మాటే కానీ వాడి కాపురం ముచ్చటగా మూడు రోజులైనా కొనసాగక పోవటాన్ని తలుచుకుని కుమిలిపోయింది.

ఇంతకీ పెళ్లైన మూడవ రోజు ఏం జరిగింది?

ఆ రోజు.. సరదాగా సముద్ర తీరానికి వెళ్దామని రామమూర్తితో అంది యామిని. అందుకతను అంగీకరించాడు.

బీచ్‌లో, ఆ కొత్త దంపతులిద్దరూ మెల్లగా ఇసుకలో నడుస్తున్నారు. తల తిప్పి యామినికేసి చూశాడు రామమూర్తి.

యామిని ఎందుకో ముభావంగా ఉంది. మధ్యలో ఒకసారి పక్కకెళ్లి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడింది. అప్పటినుండే ఆమె మూడ్‌ మారిపోయినట్టుగా అనిపించింది రామమూర్తికి.

“ఎందుకలా ఉన్నావు? ఏమైంది నీకు?” ప్రేమగా అడిగాడు రామమూర్తి.

ఏం లేదన్నట్టుగా తలూపింది. తల వంచుకుని కుడిచేత్తో కణతను రుద్దుకుంది.

“ఏమైందో చెప్తే కదా తెలిసేది?”

“ఎందుకో ఉదయం నుండి తల నొప్పిగా, భారంగా ఉంది. అదిప్పుడు భరించలేనంతగా బాధిస్తోంది.”

“మరి ఉదయమే చెప్పుండొచ్చు కదా, ఏదైనా ట్యాబ్లెట్‌ తెచ్చిచ్చేవాణ్ణి.”

“తగ్గిపోతుందిలే అనుకున్నాను. అందుకే చెప్పలేదు.”

చుట్టూ చూశాడు. దగ్గర్లో మెడికల్‌ షాపు లాంటిదేదీ కనిపించలేదు. ‘అయినా సముద్ర తీరంలో మెడికల్‌ షాపు ఎందుకుంటుంది?’ అనుకుంటూ భార్య కేసి చూశాడు. నుదురును నొక్కుకుంటూ అక్కడున్న ఒక షాపు నీడన కూర్చుంది యామిని.

“అయితే ఇంటికెళ్లి పోదామా?” అన్నాడతను.

“వద్దు. వస్తున్నప్పుడు చూశాను. ఒకతను ఏవేవో చెట్టువేర్లు, తైలాలు, మూలికలు పెట్టుకుని అమ్ముతున్నాడు. అక్కడ యూకలిప్టస్‌ ఆయిల్‌ బాటిళ్లను చూశాను. తలనొప్పికి ఆ తైలం బాగా పనిచేస్తుంది. వెళ్లి ఒకటి తీసుకు రండి.”

ఆ అంగడి ఎక్కడుందాని చూశాడు.

“దూరంగా.. కుడివైపున ఓ గుడారం పైన పసుపు జెండా ఎగురుతోంది చూశారా, అక్కడ అమ్ముతున్నారు. వెళ్లి తీసుకు రండి. నేనిక్కడే కూర్చుంటాను.” అంది.

అటుకేసి అడుగులు వేశాడు రామమూర్తి. అక్కడికి చేరుకోవటానికి పదినిమిషాలు పైనే పట్టింది. ఓ యూకలిప్టస్‌ ఆయిల్‌ బాటిల్‌ కొని, భార్యను చేరుకోవటానికి వెనక్కు తిరిగాడు.

తీరా దగ్గరకొచ్చి చూస్తే – అక్కడ యామిని లేదు. చుట్టూ చూశాడు. ఏదైనా కొనుక్కోవటానికి వెళ్లిందేమో? అక్కడున్న అంగళ్లకేసి చూశాడు. ఆమె కనిపించలేదు. స్నేహితులెవరైనా కనిపిస్తే వాళ్లతో మాట్లాడుతూ వెళ్లిందా?..

ఆమె కోసం చాలా చోట్ల వెతికాడు. ఊహూ, ఎక్కడా కనిపించలేదు. అతనిలో కంగారు మొదలైంది.

భార్య మొబైల్‌ నెంబరుకు కాల్‌చేశాడు. స్విచ్చాఫ్‌ అని చెబుతోంది. మళ్లీ కాల్‌ చేసినా అదే జవాబు వస్తోంది.

ఇంటికి ఫోన్‌ చేసి తల్లికి విషయం చెబుదామనుకున్నాడు. కానీ ఆమెను కంగారు పెట్టటం ఇష్టంలేక మానేశాడు. మామగారికి ఫోన్‌ చేద్దామనుకున్నాడు. కానీ ఎందుకో మానుకున్నాడు.

అర్ధగంట వరకూ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని వెతుకుతూనే ఉన్నాడు. ఒకవేళ ఒంటరిగా ఉన్న మహిళను ఏ గంజాయి బ్యాచో కిడ్నాప్‌ చేశారేమోనన్న ఊహ రాగానే అతనిలో నిలువెల్లా భయం ఆవహించింది. దడ కూడా మొదలైంది.

పోలీస్‌ కంప్లైంట్‌ ఇద్దామనుకున్నాడు. ఆటో మాట్లాడుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లమన్నాడు.

అతను స్టేషన్‌కు చేరుకోక మునుపే అతని వాట్సప్‌ నెంబర్‌కు ఒక మెసేజ్‌ వచ్చింది. అది యామిని దగ్గర నుండే వచ్చింది. ‘నన్ను క్షమించండి. నేను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్నాను. నన్ను వెతికేందుకు పోలీసు రిపోర్టిచ్చి అభాసుపాలు కాకండి. మా అమ్మానాన్నలకు నేనే తెలియజేస్తాను.’ ఒక్కక్షణం అతని నవనాడులూ స్తంభించి పోయాయి.

అంటే, ఇప్పటిదాకా ఆమె చేసిందంతా నటన అన్నమాట. తనను నమ్మించి చేసిన మోసానికి అతని కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. క్షణమయ్యాక తేరుకుని కన్నీళ్లు తుడుచుకుని ఆటోను స్టేషన్‌కు కాక ఇంటికేసి తిప్పమన్నాడు.

వీధి మొదట్లోనే ఆటో దిగి డ్రైవరకు డబ్బిచ్చి మెల్లగా ఇంటికేసి నడిచాడు. వీధి తలుపు తీసుకుని లోపలికొచ్చి వెంటనే తలుపు మూసి గడియ పెడుతున్న కొడుకును చూస్తూ.. ”కోడలేది రా!” అని అడిగింది కమలమ్మ.

“వస్తుంది. ఏదో అర్జంటు పనిమీద వాళ్లింటికెళ్లింది.” అని బదులిచ్చి తన గదిలోని మంచంమీద వాలిపొయ్యాడు.

రెండో రోజు కూడా కోడలు ఇంటికి రాకపోయేసరికి, “ఒరేయ్‌, యామిని ఇంకా రాలేదేం రా?” అడిగింది కమలమ్మ.

“ఇక ఎప్పటికీ రాదమ్మా!” గుండె దిటవు చేసుకుని చెప్పాడు రామమూర్తి.

“ఏం?” నిర్ఘాంతపోతూ అడిగింది కమలమ్మ.

“తన భవిష్యత్తును తానే నిర్ణయించుకుంది. ప్రేమించినవాడితో వెళ్లిపోయింది.” తల్లి ఒడిలో తల పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు రామమూర్తి. ఆ మాటతో నిశ్చేష్టురాలై తానేం జవాబివ్వాలో తెలియక ఆమెకూ కన్నీళ్లు పొంగుకొచ్చింది.

కొడుకును ఓదార్చే శక్తి లేక కన్నీళ్లనూ, బాధనూ దిగమింగుకుంటూ వాడి తలను నిమురుతూ ఉండిపోయింది.

ఆ తర్వాత ఆ వీధిలోనివాళ్లు అనుమానంగా చూడ్డం మొదలుపెట్టారు. వాళ్లకు వినబడేటట్టుగా హేళనగానూ, అవమానకరంగానూ ఏవేవో మాట్లాడటం మొదలుపెట్టారు. దాంతో రామమూర్తి బయటివాళ్లతో మాట్లాడ్డమే మానేశాడు.

నాలుగు రోజుల తర్వాత..

ఎవరో వీధి తలుపును తడుతున్నట్టుగా అనిపించి వెళ్లి తలుపు తీశాడు రామమూర్తి. బయట యామిని నిలబడుంది. ఆశ్చర్యపోతూ ఆమె ముఖంలోకి చూశాడు. అతను తనను చూడగానే ఆమె కళ్లల్లో నుండి కన్నీళ్లు పొంగుకొచ్చాయి.

“నన్ను క్షమించండి!” అంటూ అతని కాళ్లపై పడబోయింది. అతను రెండడుగులు వెనక్కు వేసి ఆమెను వారించాడు.

“నేను మోసపొయ్యానండీ!” అన్నమాట ఆమె నోటి నుండి రాగానే అతను యామిని కేసి విచిత్రంగా చూశాడు.

“నన్ను మన్నించి మీ భార్యగా స్వీకరించండి.” చేతులు జోడించి అర్థించింది. తల అడ్డంగా ఊపాడు రామమూర్తి.

“నన్ను లోపలికి రానివ్వండి.” చేత్తో ఆమెను వెనక్కు వెళ్లమన్నట్టుగా సైగ చేస్తూ అతనే గుమ్మం దాటుకుని బయటికొచ్చాడు.

“నీకు జరిగిన మోసం గురించి నేనడగను. అసలేం జరిగిందో నాకు తెలుసుకోవాలనీ లేదు. కానీ నీకేం ద్రోహం చేసానని నన్ను మోసం చేశావు?” అతని మాటలు అర్థంకాక అతని ముఖంలోకి అయోమయంగా చూసింది యామిని.

“నీకు పెళ్లికి ముందే అతనిపైన ప్రేముంటే నాతో ఎందుకు పెళ్లికి అంగీకరించావు. మీ తల్లిదండ్రులను ఎలాగో ఒప్పించి అతణ్ణే ఎందుకు పెళ్లి చేసుకోలేకపొయ్యావు. మీ తల్లిదండ్రులకు చెప్పే ధైర్యంలేక నన్ను మోసం చేసేందుకు పూనుకున్నావు. అంతేనా? అంటే, నన్నొక బలి పశువును చేశావన్నమాట.”

“అదేం కాదు..” అంది నోరు తెరిచి.

“నాకు తెలుసు ఇప్పటి యువతరం ‘ప్రేమ వ్యవహారాలు’ ఎలా ఉంటాయో! నూటికి తొంభైతొమ్మిది మంది మధ్య ఉన్నది నిజమైన ప్రేమ కాదు, కేవలఠ ఆకర్షణ, వ్యామోహం! ప్రేమ మాటున దాగి ఉన్నది కామం మాత్రమే. ఎవడో ముక్కూ ముఖం తెలియనివాడు ‘ఐ లవ్‌యు’ అనగానే అదే ‘ఫస్ట్‌ క్రష్‌’ అని మురిసిపోయి లవ్‌ ట్రాప్‌లో పడిపోయేంత బలహీనులా మీరు? మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదా? ప్రేమ అన్న మైకంలో మునిగిపోయి, రెండో రోజే శీలాన్ని దోచుకుని అతను ఉడాయించాక – ఏం చెయ్యాలో, ఎటు వెళ్లాలో తెలియక కొందరమ్మాయిలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లేదూ కూతురు ప్రేమ వ్యవహారం తెలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూతుర్ని క్షమించి, నాలాంటి అమాయకులెవరైనా కనిపిస్తే అతనికిచ్చి పెళ్లి జరిపించేస్తున్నారు.”

“అతను నన్ను మోసం చేస్తాడనుకోలేదు.” అంటూ గుటకలు మింగింది యామిని.

“అతను మోసం చెయ్యొచ్చేమోనని ముందుగానే ఎందుకు ఊహించలేదు? సరే, ఒకవేళ మోసం చెయ్యక పొయుంటే అతనితోనే కదూ శాశ్వతంగా ఉండిపొయ్యే దానివి. మోసం చేశాడని తెలిశాక సరాసరి మీ ఇంటికే వెళ్లలేకపొయ్యావా? వెళ్తే పరువు పోతుందనో లేక మీ తల్లిదండ్రులే నిన్ను చంపేస్తారనో భయపడి వేరే గత్యంతరం లేక ఇక్కడికొచ్చావు! అవునా? అంటే, నా ఇల్లు నీకొక విడిది అనుకున్నావా?” కోపంతో నిలదీశాడు.

“నన్ను క్షమించండి.”

“అసలు నిన్నెందుకు క్షమించాలో చెప్పూ. నీపాటికి నువ్వు నీ ప్రియుడే ముఖ్యమని వెళ్లిపోయావు! తర్వాత మేము పడ్డ అవమానాలు నీకు తెలుసా? నాలో ఏదో లోపముంది కాబట్టే నువ్వు మూడోరోజే వెళ్లిపోయావని ఈ వీధిలోనివాళ్లు ఎంతగా గుసగుసలు పోయారనీ. నాలాంటి అనాకారికి అందమైన అమ్మాయి భార్యగా లభిస్తే ఇలాగే జరుగుతుందని ఎంత హేళనగా మాట్లాడారనీ. ఆ మాటలు విని నేనెంతగా కుమిలిపోయానో నీకు తెలియదు.”

“అతను అలాంటి వాడని నేను ఊహించలేదండీ! అతని ప్రేమ నిజమనుకున్నాను.” అంది దీనంగా.

“ప్రేమ.. నిజం.. హు.. ఒక్క విషయం చెప్తాను విను. నువ్వొకణ్ణి ప్రేమించావు. వాడు నిన్నొకదాన్నే ప్రేమించలేదు. నీలాగే ఇంకో అమ్మాయినీ ప్రేమించి ఉంటాడు. ఆ అమ్మాయి వాణ్ణి ఒక్కణ్ణే ప్రేమించి ఉండదు. ఇంకెవణ్ణో కూడా ప్రేమించి ఉంటుంది. మీ దృష్టిలో ‘ప్రేమ యూనివర్శల్‌’ కదా! అందుకే ప్రేమను అంతగా పంచేస్తారు. ఎవడితో పడితే వాడితో టచ్‌లో ఉంటారు. మీకంటూ ఒక ధర్మం, న్యాయం ఎక్కడుందీ? మీలాంటి నవ నాగరికుల దృష్టిలో అలాంటి ధర్మాలన్నీ పాత చింతకాయ పచ్చడి లాంటివి. ఎందుకూ పనికిరానివీనూ. అంతే కదూ!.. పూర్వం ఒక పురుషుడికి ఒకే స్త్రీ అని ఎందుకు నిర్ణయించారు? అప్పుడే ఈ సమాజం చెక్కుచెదరకుండా ధర్మబద్దంగా ఉంటుందని! లేకపోతే విచ్చలవిడితనం పెరిగిపోయి సమాజమే సర్వనాశనమైపోతుంది. జంతువుల్లో అలాంటి విచ్చలవిడితనం మనం చూడొచ్చు. ఉదాహరణకు ఓ విషయం చెబుతాను. ఒక ఆడకుక్క పిల్లల్ని ఈనుతుంది. ఆ ఆడకుక్క తన పిల్లలికి పాలిచ్చి పెంచుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దవవుతాయి. అందులో మగ కుక్కపిల్లలు కూడా ఉంటాయి. ఆ మగ కుక్కపిల్లలు ఆ తల్లినే సంభోగిస్తాయి. వినటానికి ఎంత అసహ్యంగా ఉంది. కానీ ఇది వాస్తవం. మనుషులు కూడా ఇలాగే ప్రవర్తిస్తే ఇక మనుషులికీ జంతువులికీ తేడా ఏముందీ?”

“క్షమించండి, నన్ను లోపలికి రానివ్వండి.” చేతులు జోడించి బతిమిలాడింది.

అతను తల అడ్డంగా ఊపుతూ.. “నిన్ను నా భార్యగా స్వీకరించే క్షమాగుణం నాకు లేదు. ఇక ఎప్పుడూ ఈ ఇంటి ఛాయలకేసి కూడా రావద్దు.” అని చరచరా ఇంట్లోపలికి నడిచి వీధి తలుపు మూసి గడియ పెట్టాడు.

బహుశా ఆమెకు సంబంధించినంత వరకూ ఆ ఇంటి వీధి తలుపు మరెప్పటికీ తెరుచుకోదేమో?!..

అప్పటి వరకూ వాళ్ల మాటలను విన్న కమలమ్మకు, తన చిరకాల కోరిక అలా శాశ్వతంగా సమాధి అయిపోవటంతో వెర్రిగా ఆ వీధి తలుపునే చూస్తూ ఉండిపోయింది!

Exit mobile version