[ప్రసిద్ధ రచయిత్రి గీతాంజలి గారు రచించిన ‘వీడ్కోలు చెబుతున్నా!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నీకు ఇక వీడ్కోలు చెప్పాలి తప్పదు!
నన్ను నేనే పట్టుకుని,
నీ జ్ఞాపకాల ఇంటి నుంచి బయటకు
గుంజుకు తెచ్చుకోవాలి!
అందుకే చూడు!
ఆకాశం కింద నుంచున్నా
కానీ ఇక చందమామని చూడ్డం మానేశాను!
తలవంచుకొని నువ్వక్కడ లేనట్లే వెళ్ళిపోతాను!
*
ప్రేమ లేని రాత్రుళ్ళని
పాడలేని రాగాలతో నిశబ్దం చేసేస్తాను!
పూలని వాదా చేసిన తోటను కూడా
చెప్పకుండా మౌనంగా దాటేస్తాను
*
నిశబ్దంతోనో, నిర్లక్ష్యం తోనో
నా రాత్రుళ్లను
ఏడిపిస్తావు నువ్వు!
నువ్వెలా ఉన్నావో అక్కడ,
నీ దగ్గర నువ్వు?
నా నువ్వు?
నీ దుఃఖం నా దాకా వస్తుంది.
అంటువ్యాధి కదా దుఃఖమూ, వియోగమూ మరి?
*
ఏమార్చుకో నిన్ను నువ్వు నాలాగా!
రేపనే రోజుకీ రాత్రి ఉందని,
చంద్రుడూ వెన్నెలా ఉంటారని,
అకస్మాత్తుగా చంద్రుడూ, వెన్నెలా,
నువ్వూ నేనైపోతామని!
రహస్యంగానైనా పలకరించుకుంటామని
కుశలం కనుక్కుంటామని
తడిబారిన విషాదపు కళ్ళతో తడుముకుంటామని,
నిశ్శబ్దంలో అరుస్తూ ఒకరి పేర్లు ఒకరం
పెద్దగా పిలుచుకుంటామని!
మరణించే ముందైనా పక్క మీదనుంచి
ఉలిక్కిపడుతూ లేచి, అబ్బురంగా
తొలిచూపులు చూసుకుంటామని!
కమ్ముకున్న చీకటిలో దీపం వెలిగించి
ఒకరినొకరం కనుక్కుంటామని!
ఏమార్చుకో నిన్ను నువ్వు నాలాగా!
*
చంద్రుడిలా దాక్కోడానికి ఎప్పుడూ
ఒక నీలి మేఘాన్ని వెతుక్కుంటావెందుకు?
ముత్యంలా సముద్రపు లోతుల్లోకి జారిపోతావెందుకు?
అయినా అన్ని ఋతువులలో కనిపిస్తూనే ఉంటావెందుకు?
*
నీకేం విరిగిన రాగాన్ని పట్టుకుని
ప్రేమను దాచుకుంటూ వెన్నెల కడిగిన
నగరపు వీధుల్లోనో, వస్తూ పోతూ ప్రయాణాల్లోనో
చాటుగా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటావు.
చంద్రుణ్ణి వేడుకుంటూ చల్లబడుతూ ఉంటావు.
చూడు, నేనిక్కడ నువ్వు నన్ను వదిలేసిన
చోటునే నీ నుంచి అందని ప్రేమలేఖ కోసం
ఎదురు చూస్తూ దగ్ధమవుతుంటాను!
*
తెలుసుకో, ముగియబోయే కథకి కూడా
కలయిక ఉంటుందని,
అది మొదలైందే ప్రేమ అనే అక్షరాలతో అని
నువ్వు మరిచిపోవాలనుకున్నది నిన్నూ నన్ను కాదని
అనుకోని మన కలయిక రహస్యాన్నని!
*
అర్ధరాత్రి నన్ను నిదుర లేపి,
ఎద మీద వాలి నీ దుఃఖం నువ్వు దుఃఖించి
గాఢ సుషుప్తి లోకి
నీ దారిన నువ్వు అదాటున వెళ్ళిపోవడం కాదు!
నువ్వు తెచ్చిన నా మెలకువ సంగతి ఏంటి మరి?
గొంతు విప్పాలి కదా
కనీసం,
ఇక చాలు ఈ నిరీక్షణా రాగాలిక ఆపేద్దామనో,
విడిగా శ్వాసిద్ధామనో,
ఇక నిదురపోదామనో,
మరిచిపోదామనో,
అపరిచితులైపోదామనో,
పోనీ విడిపోదామనో,
చెప్పడానికైనా గొంతు సవరించుకోవాలి కదా!
నువ్వసలు?
చాలు ఇక!
సరే, నేనే చెబుతున్నా వీడ్కోలు కానుక ఇస్తున్నా!
తీసుకొని వెళ్ళిపో!
రాకిక!
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ . ఫోన్: 8897791964
