[శ్రీ గోపాల్ లాహిరి గారు వ్రాసిన Goodbye Eyes అనే కవితని ‘వీడ్కోలు కన్నులు’ పేరిట అనువదించి అందిస్తున్నారు శ్రీ నాగరాజు రామస్వామి.]
నేను మట్టినీ, సుక్షేత్రాన్నీ నమ్ముతాను,
నీవు నీ కళ్ళద్దాలపై పేరిన తడి మేఘాలను తుడిచేస్తుంటావు.
మిణుగురు పురుగుల దండొకటి హటాహుటిగా వచ్చి
నక్షత్రకాంతులను నోట కరచుకుకొని శరవేగంతో వెనుతిరుగుతుంది.
నది నీడలు, గాయపడిన సంధ్యాకాశ లోహఛాయలు
నీ కనులలో తారాడుతుంటవి.
అసమాప్త అల్లికలను విశ్వసిస్తాను;
అంధకారంలో తెగిన దారాలను ఎంచక్కా కత్తిరించేసుకోవచ్చు.
ఇన్నింటి నడుమ నిటారుగా నిలిచి
నీ కంటి కాగడాలతో నన్ను చూస్తుంటావు.
నీడల కౌగిలి మీద నాకు భరోసా వుంది,
అన్ని దారులు ఆఖరు చూపులలో ముగిసిపోతవి.
ఆ కన్నులు
నేలను తాకేందుకు చెక్కిన చుక్కల్లా వున్నవి.
నా చితాభస్మంలో నన్ను నేను రుచిచూస్తాను.
*
ఆంగ్ల మూలం: గోపాల్ లాహిరి
తెలుగు సేత: నాగరాజు రామస్వామి
