[శ్రీ దోసపాటి వేంకట రామచంద్ర రావు గారు రచించిన ‘వీడుతున్నబంధాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
రామనాధం మాష్టారుకి ఏమి తోచడం లేదు. సాయంత్రం బయట తిరిగొచ్చాడు.. పిల్లలందరికి ఈరోజు తీరుబాటే. ఒకొక్కరు ఒక్కో చోట వున్నారు. కొడుకులు కోడళ్ళు, తమ్ముడి కొడుకులు, కూతుర్లు వాళ్ళ పిల్లలు అందరూ కూడా. ఇప్పుడు తాను భార్య మాత్రమే ఇక్కడ ఉంటున్నారు.
ఆదివారం నాడు అందరూ కాన్ఫెరన్సు కాల్ చేసుకొని మాట్లాడుకుంటారు ఒకట్రెండు గంటలపాటు.
రాత్రిపూట తినే ముందే వాళ్ళు ఇలా కలుసుకొన్న తర్వాతే భోజనాలు చేసి పడుకోవడం ఒక అలవాటైంది. అందరూ కలుసుకునేది ఒకచోట పెద్దపండుగగకే. అంతవరకు ఇదే తంతు.
రాత్రి ఏడున్నర కావొస్తోంది. ఇంకా కాల్ రాలేదేమిటా అని టివి ముందు కూర్చున్నాడు. టివిలో వస్తున్న కార్యక్రమం కూడా విసుగు పుడుతోంది. ఏమీ తోచక భార్య కనకానికి ఒక కప్పు కాఫీ తెమ్మని చెప్పాడు.
“ఇప్పుడే కదండి తాగేరు! మళ్ళీనా? నా వల్లకాదు.” అందామె.
“చూడు ఏడున్నరవుతోంది ఇంకా ఫోను రాలేదు. ఈ ఆదివారం నాడే కదా మనం కాస్త మన పిల్లలతో మాట్లాడేది. ఇంతవరకు ఫోను రాలేదు. చికాగుగావుంది కనకం” భార్యతో మొరపెట్టాడు.
“వాళ్ళకైనా ఈరోజే కదండి వెసులుబాటు. వాళ్ళేం పనులు పెట్టుకున్నారో?” భర్తకు సర్ధి చెప్పింది.
“నేనే చేస్తానైతే?”ఫోను చెయ్యడం ఆరంభించాడు ఒకొక్కరికి.
ఎవరి నుండి కూడ జవాబు రావడంలేదు. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళపోయాడు రామనాధం.
***
ఏమిటో రోజు రోజుకి మానవబంధాలన్ని దూరమై పోతున్నాయి. ఒకప్పుడు అందరు ఒకేచోట వుండి కలిమి లేకపోయినా కష్టనష్టాలను భరిస్తూ ఎంతో ఆనందంగా, సంతోషంగా గడిపే వాళ్ళం. పండుగలనాడే
కాదు ప్రతిరోజూ ఒక పండుగలాగే ఉండేది.
రామనాధం ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. తనకి ఉద్యోగం రావడం అటు తండ్రి చనిపోవడం ఒకేసారి జరిగిపోయింది.
రామనాధానికి మరో ముగ్గురు తమ్ముళ్ళున్నారు. వాళ్ళ బాధ్యత, తల్లి బాధ్యత భరించాలి. తండ్రికి కూడా ఒక ఉన్నత పాఠశాలలో గుమాస్తాగానే పనిచేసేవాడు.
తల్లికి వచ్చే కంటుంబ పింఛను ,తన కొచ్చే జీతంతోనే కుటుంబాన్ని నడపడాల్సి వచ్చేది. తమ్ముళ్ళ చదువులైతే అయ్యాయి గాని వాళ్ళింకా ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉన్నారు.
తల్లి పెద్దకొడుకునని పెళ్ళి చేసుకొనమని ఒత్తిడి చేయసాగింది. రామనాధానికి చదువుకొనే సమయం నుండి కొన్ని ఆదర్శాలున్నాయి. ముఖ్యంగా పెళ్ళి చేసుకుంటే కట్నం తీసుకోకూడదని. అదే షరతుపై పెళ్ళికి ఒప్పుకున్నాడు. తల్లి తన బంధువుల ద్వారా ఒక తెలిసిన కుటుంబంలో అమ్మాయినే చూసి పెళ్ళి చేసింది.పేరు కనకమే. కనకం పేరులోనే గాని ధనంలో కాదు. ఒక సామాన్య కుటుంబం కనకం వాళ్ళది. గుణంలో మాత్రం కనకమే.
పెళ్ళైన తరువాత రామనాధం తన పరిస్థితిని కనకానికి మనసు విప్పి చెప్పాడు.అప్పటినుండి భర్తకు అన్ని విషయాల్లోను చేదోడు వాదోడుగా ఉంటూ ఇద్దరూ సంసారసాగారాన్ని సాఫీగా సాగించుకుంటూ వచ్చారు.
తమ్ముళ్ళకు ఉద్యోగాలు రావడం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం చేసాడు. తనకి ఇద్దరు పిల్లలు, తమ్ముళ్ళకు అలాగె ఇద్దరేసి పిల్లలు పుట్టారు. తనకైతే ఇద్దరూ మగపిల్లలే. తమ్ముళ్ళకు ఒక కూతురు, ఒక కొడుకు పుట్టారు. మొత్తం కుటుంబం అంతా ఒకేచోట ఉంటూ ఒక ఆదర్శవంతమైన కుటుంబమని పేరుంది.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కాలంతో పాటు రామనాధం కుటుంబంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ చదువులు అన్ని కూడా అందరూ కలిసికట్టుగా ఉండి కష్టనష్టాలను భరించేవారు.అందులో ఎక్కువభాగం రామనాధానిదే.
తమ్ముళ్ళు చేసేవి రామనాధంలా ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోవడమే. మధ్య మధ్యలో అపార్ధాలు మనస్పర్ధలు చోటు చేసుకున్నా కుటుంబం పిల్లలు చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అయి ఎవరికి వారు వేరేగా వెళ్ళిపోయారు.
తండ్రి కట్టిన ఇల్లే ఉమ్మడి ఆస్తి. అదీ అమ్మేసి ఎవరి వాటా వాళ్ళు పంచుకొని వెళ్ళిపోయారు. రామనాధం మాత్రం అదే చోట ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు.
పెద్ద పండుగ వస్తే మాత్రం అందరూ అక్కడికి వచ్చి ఆ నాలుగురోజుల ఆనందంగా గడుపుతారు. అంతవరకు ఇప్పుడు వాళ్ళని దగ్గర చేసేది ఈ ఫోను సంభాషణమే.
***
రామనాధం ఆలోచనలకు అడ్డువేస్తూ ఫోను మోగింది.
అది రామనాధం పెద్దకొడుకు నుండి వచ్చింది. ఎప్పుడూ ఫోను చేసినా తనే ఫోను చేస్తాడు. ఆ తరువాత అందరిని కాన్ఫెరెన్సు కాల్ చేసి కలుపుతాడు.
“సారీ నాన్నా! మా ఫ్రెండ్ ఒకడికి చిన్న ప్రమాదం జరిగింది. హస్పిటల్‌కి వెళ్ళాను. అందుకే మీ ఫోను చూసినా జవాబివ్వలేదు.” కొడుకు సమాధానం చెప్పాడు.
“అవునా!, ఇప్పుడెలాగుందతనికి? ఆదివారం నాడే కదా ఈ ఫోను ద్వారా కలుసుకొనేది. మీ దగ్గర్నుంచి రాకపోతే నేనే చేసాను. ఒక్కరూ తీయలేదురా? అందుకే కొంచెం చికాకుగా వుంది.” తన పరిస్థితిని చెప్పాడు.
ఇంతలో చిన్న కొడుకు కలిసాడు ఫోనులో. “సారీ నాన్నా! నాకు హాస్పిటల్‌కి వెళ్ళే పనిపడింది. మా కొలీగ్ భార్యకి కడుపులో నొప్పి అంటే హాస్పిటల్లో జాయిన్ చేసారంటే చూడడానికి వెళ్లాము.” చిన్నకొడుకు సంజాయిషీ.
అలాగే అందరూ ఏదో ఒక నెపం చెప్పి మాట్లాడారు. అలా తొమిదిన్నర వరకు మాట్లాడుకున్నారు.
చివరగా పెద్దకొడుకు మాత్రం రామనాధానికి “నాన్నా !మీరిక్కడికి వచ్చి కొన్నాళ్ళు వుండొచ్చు కదా! కాస్త మార్పుగా వుంటుంది. టికెట్సు బుక్ చేస్తాను. ఏమంటారు?”
“ఇప్పడొద్దులేరా! మరో రెండు నెలల్లో నీ పెద్దకూతురు పుట్టినరోజు వస్తుంది కదా! అప్పుడు వస్తాంలే!” రామనాధం కొడుక్కి చెప్పాడు.
“సరే నాన్నా! మీ ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి. మందులు అవి టైముకు వేస్కోండి.ఇక ఉంటాను” అని ఫోను కట్ చేయబోతుంటే
రామనాధం “ఒక్కమాట రా! ఆ పుట్టినరోజుకి అందరిని అక్కడికే రమ్మని చెప్పు. మళ్ళీ పండుగ వరకు అంటే ఇంకా చాలా సమయం వుంది. అందరిని చూడాలని వుందిరా!” కొడుక్కి చెప్పాడు.
“మంచి సజెషన్ నాన్నా! తప్పకుండా అందరూ కలిసేలా చేస్తాను. సరేనా!” ఫోను ఉంచేసాడు.
రామనాధం కొంచెం సంతృప్తి చెంది, రాత్రి భోజనం సిద్ధం చేయమని భార్యకి చెప్పాడు.
