Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేలాది కిలోమీటర్లు ఎగిరి వలస వెళ్ళే పక్షులు

[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]

పిల్లలూ!

ఇంతకు ముందు కొన్ని పక్షులు ఎంత వేగంలో ఎగురుతాయో తెలుసుకున్నాం కదూ! ఇప్పుడు కొన్ని వలస వెళ్ళే పక్షులు ప్రయాణం చేసే దూరమెంతో తెలుసుకుందామా!

అన్నిటికంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసే పక్షి ఒకటుంది. దానిని ‘ఆర్కిటిక్ టెర్న్’ అంటారు. దాని పేరులోనే అదెక్కడుంటుందో తెలుస్తుంది కదూ! ఎక్కడుంటుందనుకున్నారు. ఆర్కిటిక్ మహాసముద్ర తీరప్రాంతంలో వుంటుంది. ఇది ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతంలో వాతావరణం వేడిగా వున్నంతకాలం వుంటుంది. ఆ తరువాత అక్కడ శీతాకాలం వచ్చే నాటికి బయలుదేరి అంటార్కిటికా ప్రాంతానికి చేరుకుంటుంది. అప్పటికి అంటార్కిటికాలో వేసవి కాలం మొదలవుతుంది. కొన్నాళ్ళు అంటార్కిటికా లోనే వేసవికాలం మొదలవుతుంది. కొన్నాళ్ళు అంటార్కిటికా లోనే వుండి శీతాకాలం రాగానే మళ్ళీ ఆర్కిటిక్ ప్రాంతానికి వెళుతుంది. అపుడు ఆర్కిటిక్ ప్రాంతంలో వేసవి కాలం. ఇలా ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికాకు – మళ్ళీ అంటార్కిటికా నుంచి ఆర్కిటిక్ ప్రాంతానికి వెళ్ళడానికి ఇది ప్రయాణం చేసే దూరమెంతో తెలుసా? రానుపోను 30,000 కిలోమీటర్లు. ఒక సంవత్సర కాలంలో 30,000 కి.మీ. ప్రయాణం చేసే ఈ పక్షి పొడవు ఎంతనుకుంటున్నారు? 40 సెంటిమీటర్లే.

‘ఫ్లోవర్’ అనే మరొక పక్షి వుంది. ఇది అలాస్కా నుంచి హవాయి వరకు ఎక్కడా ఆగకుండా ఎగురుతుంది. అలస్కా నుంచి హవాయికి దూరమెంతో తెలుసా? 4000 కిలోమీటర్లకి పైనే. ఎక్కడా ఆగకుండా ఇంతదూరం ప్రయాణం చేస్తుంది కాబట్టి దీనిని ‘ఛాంపియన్ ఆఫ్ ది బర్డ్స్’ అంటారు.

బాతులు రోడ్ల మీద నడుస్తాయి. నీటిలో ఈదుతాయి. వింత, విచిత్ర ధ్వనులతో సందడి చేస్తాయి. కానీ సైబీరియా ప్రాంతంలో నివసించే ‘అడవి బాతులు’ మన బాతుల్లాగా నేలమీద నడిచేవి మాత్రమే కావు. అవి ఆకాశంలో హంసల్లా ఎగురుతాయి. అవి సైబీరియా నుంచి మనదేశంలోని వివిధ సరస్సులకు వలస వస్తాయి. అవి 3200 కి.మీ నుంచి 4800 కి.మీ. వరకు మన దేశానికి ఉత్తర సరిహద్దు అయిన హిమాలయ పర్వతాల పైనుంచి ఎగురుకుంటూ వస్తాయి.

‘వుడ్ కాక్’ అనే పేరుగల పక్షులు హిమాలయ పర్వతాలలో బయలుదేరి దక్షిణ భారతదేశంలోని నీలగిరి పర్వతాల దగ్గరకు వలస వస్తాయి. ఇవి 2400 కిలోమీటర్ల దూరం ఎక్కడా ఆగకుండా ఎగురుతూ వస్తాయి.

ఈ వలస పక్షులను గమనించే మన హెలికాఫ్టర్లకు, విమానాలకు రెక్కలను తయారు చేశారేమోనర్రా!

Exit mobile version