Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వెలితి

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘వెలితి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

కలతల కన్నీటి కాసారం ముందు
ఉదధి ఆకారం చిన్నబోతున్నది!
అవినీతి అభివృద్ధి ముందు
ఉన్నతాకాశం చిన్నబోతున్నది!

అమానుషత్వ పటుత్వం ముందు
అసురత్వ ధృడత్వం చిన్నబోతున్నది!
మహా దాతల ఔన్నత్యం ముందు,
సత్య సంధాతల సామర్థ్యం ముందూ
దైవ పరీక్షల మహత్వం
చిన్నబోతున్నది!

నిరాశల నిబిడాంధకారం ముందు
గాఢ తమస్సు కడిమి
చిన్నబోతున్నది!
స్వల్ప పరోపకారం ముందు
స్వార్థ తపస్సు బలిమి
చిన్నబోతున్నది!

వెలుగుల వేదికపై
వాయిద్యాల మధ్య సాగే పాట
శ్రామిక జన జానపద గీత
మాధుర్యం ముందు
పలుచబారుతున్నది!
ముద్దులొలికే చిన్నారి చిరునవ్వుల
చిక్కని జిగి ముందు
వెండి వెన్నెల వన్నెలు వెలవెలబోతున్నవి!

మనోవేగం ముందు
కాంతి వేగం ప్రాశస్త్యానికి,
కవి హృదయం ముందు
విశ్వ విశాలత్వానికీ
వెలితి వెల్లడౌతున్నది!

ఆచరింపబడిన సదాచారం ముందు
ప్రచారానికే పరిమితమైన
ఉపదేశాలు,
పరాజిత న్యాయం ముందు
పాపాల విజయోత్సవాలూ
నిర్వీర్యమౌతున్నవి!

సంతృప్తి ముందు
సహస్రాకాంక్షల సత్వము,
చెలిమి కలిమి ముందు
కలహ తత్వమూ చిన్నబోతున్నది!

ప్రాణిని దహించే
చింత నిప్పుల వంటి చింత ముందు
నిర్జీవిని కాల్చే
చితి చిన్నబోతున్నది!
ప్రబలుతున్న పేదరికం ముందు
ప్రపంచ ప్రగతి చిన్నబోతున్నది!

Exit mobile version