[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘వెళ్లిపోయిన తర్వాత’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
సెలవంటూ వెళ్లిపోయిన తర్వాత
నన్నూ నా ఉనికినీ ఒక జ్ఞాపకంలా కాదు
కాలం తనలో తాను పలికే ఒక ప్రతిధ్వనిలా వినండి
నేను లేనని అనుకోకండి ఉండటమూ, లేకపోవటమూ
మనిషి పెంచుకున్న ప్రేమ చిహ్నం మాత్రమే
నది సముద్రమైన తర్వాత
దాన్ని ఎక్కడని వెతుకుతారు?
నేను ప్రేమించినవి పూలు కావు
వాటిలో దాగివున్న క్షణభంగురత్వం
పక్షులు కావు
అవి ఎగరటంలో ఉన్న విముక్తి
సంధ్యాకాలాలు కావు
వెలుగూ చీకటీ ఒకరినొకరు ఆలింగనం చేసుకునే
ఆ నిశ్శబ్ద క్షణం
దుఃఖించకండి
మరణం జీవితపు ముగింపు కాదు
అది పేరుకు ముగింపు మాత్రమే
ఆత్మకు చిరునామాలు ఉండవు
ఏదో ఒక రోజు మీరు కూడా
ఈ ప్రపంచాన్ని వెనక్కి చూసుకుంటూ
గుర్తు తెలియని దారిలో నడుస్తారు
అప్పుడు అర్థమవుతుంది
మనం ఎవరమూ ఇక్కడ
శాశ్వతంగా ఉండటానికి రాలేదు
ఒకరినొకరం తాకి కొన్ని వెలుగుల్ని పంచి
కాలం నదిలో అలలుగా కలిసిపోవడానికే వచ్చాం
అందుకే నేను వెళ్లిపోయిన తర్వాత
నా పేరును మెల్లగా మంద్రంగా పలకండి
అది కేవలం నా పేరు కాదు
ఒకప్పుడు మీతో కలిసి
నడిచిన కాలం పేరు
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
