Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వెలుగులాంటి జ్ఞాపకం

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘వెలుగులాంటి జ్ఞాపకం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఇంకా జీవించే ఉన్న మీ లోకానికి
నేను కేవలం దూరమైన ఒక నీడను
అనంతానంత దుఃఖంతో నిండిన హృదయాలకు
వినిపించని ఓ నిశ్శబ్దం నేను
అర్థం లేని తీవ్రమయిన కోపంతో మండే మనసులకు
ఓ అలిసిపోయిన చల్లని జ్ఞాపకం నేను
కానీ ఆనందంగా సంతోషంగా నవ్వే కళ్లకు
శాంతిని అందించే ఒక తడి ఆత్మను నేను
నమ్మకంతో ఎదురు చూసే హృదయాలకు మాత్రం
ఎప్పుడూ దూరంగా వెళ్లిపోలేదు నేను
నేను కేవలం ధ్వనితో మాటలు పలకలేను కానీ
మీ లోపలి నిశ్శబ్దాన్ని వినగలను
నేను మీకు కనబడకపోవచ్చు వినబడక పోవచ్చు
కానీ గాలిలో నడయాడే ఒక స్వరంలా
మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను
ఎప్పుడైనా
ఒక నదీతీరాన నిలబడి
ప్రవాహపు అంతులేని అందాన్ని చూస్తే
అక్కడ నా జ్ఞాపకం అలలా ఉప్పొంగుతుంది
విచ్చుకున్న ఒక పువ్వును చూస్తూ
దాని సాదాసీదా సౌందర్యాన్ని ఆస్వాదించినపుడు
ఆ పరిమళంలో నేను మమేకమై ఉంటాను
అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో
నీ ఆలోచనల్లో, నీ జ్ఞాపకాలల్లో
నీ హృదయంలో ఒక మూలలో నన్ను ఉంచుకో
మనం స్నేహించిన కాలాలు, ప్రేమించిన రోజులు
కన్నీరు పంచుకున్న క్షణాలు
గిల్లి కజ్జాలు పెట్టుకున్న వేళలు
మన నవ్వులతో నిండిన సమయాలు
ఈ జ్ఞాపకాలన్నీ నీ మనసులో వెలుగుతుంటే
నేను ఎక్కడికీ వెళ్లలేదు ఎలా వెళ్ళగలను

ఇంకా నీ జీవితపు నిశ్శబ్దంలో
ఒక వెలుగులాంటి జ్ఞాపకంగా మిగిలిపోయాను
ఎప్పటికీ మిగిలిపోతూనే ఉంటాను

Exit mobile version