Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వెలుగులు

[కార్తీక పున్నమి సందర్భంగా శ్రీమతి మంగు కృష్ణకుమారి గారు రచించిన ‘వెలుగులు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కార్తీక పున్నమి నోములు ఉపవాసంతో
చేసే చలిమిడుల సువాసనలూ

ముఫైమూడు పున్నముల నోములూ
తెల్లటి గుండ్రటి అట్ల దొంతరులూ

పట్టుచీరల గరగరలూ, తలనిండా
పూలూ, ముఖం నిండా వెలుగులూ
పసుపు కుంకం పూలు అక్షింతలూ

‘రండీ రండీ’ ‘కూచొండి కూచొండి’
పిలుపులూ, ‘ముందు వాయనం
తీసుకో వదినా’ ఆప్యాయతలూ

‘ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటి
వాయనం’ చలిమిడి ఒకరూ అట్లు
ఒకరూ.. అందరూ నవ్వుల దొంతరలూ

ఇంటింటా పేరంటం కళకళలూ

‘వెన్నెల కాంతుల వాయనాలు
పుచ్చుకునే పేరంటాళ్లు’

‘పున్నమి వెలుగులాటి బిడ్డ పుట్టాలని’
దీవించే పెద్ద ముత్తయిదువలూ

తెలుగింట నోముల వెలుగులు

Exit mobile version