[బాలబాలికల కోసం ‘వెలుగులు నింపిన థామస్ అల్వా ఎడిసన్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
సాయం సమయమైతే చాలు, లైట్లు వేసి చీకటిని తరిమేస్తాం! అమావాస్య చీకటిని కూడా పట్టపగల్లా మార్చేస్తున్నాం లైట్లతో. నగరాల్లో అయితే పగలు కూడా లైట్లు లేనిదే గడవడం లేదు. మానవ జీవితంలో వెలుగు నింపి మన జీవిత పంథానే మార్చివేసిన థామస్ అల్వా ఎడిసన్ గురించి తెలుసుకుందామా!
థామస్ అల్వా ఎడిసన్ 1847వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన ఓహియోలోని మిలన్‌లో జన్మించాడు. తల్లి పేరు నాన్సీ. ఆమె ఒక స్కూలు టీచరు.
ఎడిసన్ కుటుంబం 1854లో డెట్రాయిట్ లోని మిచిగాన్‌కు వెళ్లిపోయింది. అక్కడ మూడు నెలలు స్కూలుకు వెళ్లాడు ఎడిసన్. స్కూలు టీచర్లు ఇతనిని తెలివితక్కువ వాడనీ, ఇతనికి చదువు రాదనీ అన్నారు. దీనితో ఎడిసన్ తల్లి ఇంట్లో తనే చదువు చెప్పాలని నిర్ణయించుకుంది. తల్లి దగ్గర చదువుకుంటూనే ప్రతిదానినీ పరిశీలిస్తూ విశ్లేషిస్తూ విషయాలు తెలుసుకునేవాడు. ఎడిసన్‌కు చిన్నతనంలోనే చెవిటితనం వచ్చింది. అందరినీ విపరీతంగా ప్రశ్నలతో విసిగించేవాడు. తల్లి ఇచ్చిన ‘స్కూలు ఆఫ్ నాచురల్ ఫిలాసఫీ’ పుస్తకం చదివి అందులోని ప్రయోగాలన్నీ చేసేవాడు. ఎడిసన్ తన పదకొండవ ఏటనే ఇంటి సెల్లార్‌లో లాబోరేటరీ ఏర్పరచుకున్నాడు.
ఎడిసన్ 12 ఏళ్ల వయసులోనే డెట్రాయిట్‌కు పోర్ట్ హారన్‌కు మధ్య తిరిగే రైళ్లలో న్యూస్ బాయ్‌గా ఉద్యోగం సంపాదించాడు. మధ్యలో ఖాళీ దొరికిన సమయంలో లైబ్రరీలో పుస్తకాలను చదివేవాడు. ఉద్యోగం చేస్తూ పరిశోధనలు చేయటానికి వీలుగా రైలు బోగీలోనే ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరోజు అక్కడ మంటలు చెలరేగి రైలు బోగీ కాలిపోయింది. దానితో ఆ అవకాశం కూడా పోయింది.
1861లో అమెరికాలో అంతర్యుద్ధాలు మొదలైనాయి. ఆ వార్తలకోసం జనం బాగా ఎదురు చూసేవాళ్లు. ఈ పరిస్థితిని ఎడిసన్ తనకో అవకాశంగా మలచుకోవాలనుకున్నాడు. డెట్రాయిట్‌లో ఓ పాత హ్యాండ్ ప్రింటింగ్ ప్రెస్ ను కొని రైల్లోనే ప్రెస్ పనులు పూర్తిచేసి ‘గ్రాండ్ ట్రంక్ హెరాల్డ్’ అనే న్యూస్ పేపర్‌ను రూపొందించాడు.
డెట్రాయిట్‌కు 20 మైళ్ల దూరాన ఉన్న మౌంట్ క్లీమెన్స్‌లో రాత్రిపూట టెలిగ్రాఫ్ ఆపరేటర్‌గా పనిచేసే ఉద్యోగం వచ్చింది. రాత్రిపూట ఉద్యోగం, పగలు పరిశోధనలు చేసేవాడు. విద్యుచ్ఛక్తికి సంబంధించిన అన్ని పుస్తకాలనూ చదివేవాడు. మొదటగా ఆటోమేటిక్ టెలిగ్రాఫ్ కోసం ట్రాన్స్‌మీటర్, రిసీవర్లను కనిపెట్టాడు. స్టాక్ ఎక్స్చేంజ్ న్యూస్‌కు సంబంధించిన టెలిగ్రాఫ్ పరికరాన్ని కనుక్కోవడం ఆయనకు అదృష్టాన్నితెచ్చిపెట్టింది. ఆ పరికరాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ ప్రెసిడెంటుకు 3000 డాలర్లుకు అమ్మాలనుకున్నాడు. కానీ అతను నలభైవేల డాలర్లు ఇస్తాననడంతో ఎడిసన్ ఎంతో ఆశ్చర్యానికి గురైనాడు. ఈ డబ్బుతో న్యూజెర్సీలోని నేవార్క్ లో ఒక ఇంజనీరింగ్ లాబోరేటరిని స్థాపించాడు. 1876లో న్యూజెర్సీలోని మెన్లో పార్క్ లో పెద్ద లాబరేటరీని నిర్మించుకున్నాడు.
1877లో ఎడిసన్ ఫోన్ గ్రాఫ్‌ను కనుక్కున్నాడు. 1878లో విద్యుత్ బల్బుపై ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఎక్కువ గంటలు పనిచేయడానికి ప్లాటినమ్ ఫిల్మ్ వాడితే బాగుంటుందనుకొన్నాడు. కానీ అది ఎక్కువ ఓల్టేజీకి పనికిరాలేదు. అందుకని కార్బనైజ్ డ్ కార్బన్ త్రెడ్ ఫిలమెంట్‌ను తయారుచేశాడు. 1879 అక్టోబరు 21వ తేదీన మెన్లోపార్క్ వీధిని విద్యుత్ దీపాలతో వెలిగించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 1882లో న్యూయార్క్ లోని పెరల్ స్ట్రీట్ లో మొట్టమొదటి విద్యుత్ స్టేషన్‌ను నెలకొల్పారు.
కైనెటోస్కోప్, ఎలక్ట్రిక్ స్టోరేజ్ బ్యాటరీ, గ్రామఫోన్, రబ్బరు, సిమెంటు ఇలా 1300 ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులను పొందాడు. టెలిఫోన్‌ను, టైపు మిషన్‌ను మరింత అభివృద్ధి పరిచాడు. డయాబెటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్‌లతో 1931 అక్టోబరు 18వ తేదీన ఎడిసన్ మరణించాడు. అమెరికా అంతా లైట్లను ఆర్పివేసి ఆయన మరణానికి సంతాపాన్ని తెలియజేశారు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
