[డా. ఆచార్య ఫణీంద్ర రచించిన ‘వేమన చరిత్రము’ అనే పద్యకావ్యాన్ని ధారావాహికగా అందిస్తున్నాము. ‘ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య’ రాయలసీమ త్రిమూర్తులపై నిర్వహించిన పద్య కావ్యాల పోటీలో ₹30,000/- నగదు బహుమతి పొందిన చారిత్రక పద్య కావ్యం ఇది.]
ప్రథమాశ్వాసము
~~~~~~~~~~~
అవతారిక
~
ప్రార్థన :
———–
దశావతార స్తుతి :
ఉ.
శ్రీకరమైన సత్యయుగ జీవన ధర్మములెల్ల గూర్చియున్
శ్రీకమలాక్షుడే వెలయజేసిన వేదము నిచ్చె బ్రహ్మకున్!
దాకొన సోమకుండు నది తస్కరణం బొనరించి వారిధిన్ –
“మూకము”నై వధించి, శ్రుతి బ్రోచిన యా కమలాక్షు మ్రొక్కెదన్! – 1
ఉ.
మర్మ మెరింగి యంబునిధి మంథన మూనగ దేవదానవుల్,
కర్మమునందు మంధర నగం బొకవైపున క్రుంగుచుండగా –
ధర్మ సురక్షకుండునగు దైవము శ్రీహరి భారమెల్ల – శ్రీ
“కూర్మము”నై వహించి యొనగూర్చెను కార్యము! వాని మ్రొక్కెదన్! – 2
ఉ.
భూమిని చాపజుట్టి కొనిపోవగ దుష్ట హిరణ్యనేత్రుడే –
భామకు గల్గు కష్టమును బాపగనెంచి “వరాహ” రూపుడై;
భీమ పరాక్ర, మాగ్రహము వెల్లువ గాగ వధించి దైత్యునిన్;
ప్రేమము మీర నా భువిని పెండిలి యాడిన స్వామి! మ్రొక్కెదన్! – 3
ఉ.
ఆతత భక్తితో హరి ననంతముగా భజియింప పుత్రుడే –
“ఆతడు నున్న దెక్కడ?”ని, యంతట వెద్కు హిరణ్యకశ్యపు;
న్నాతని దుష్ట కార్యముల నంతము జేసెను నాడు స్తంభ సం
జాతుడు! శ్రీ “నృసింహు” నిదె సంతతమున్ మనసార మ్రొక్కెదన్! – 4
శా.
ముల్లోకంబుల గుప్పిటన్ నిలిపి సంపూర్ణంబుగా దైత్యులే
వాల్లభ్యంబు వహించు రీతి “బలి”రాట్ పాలింపగా, వానినిన్ –
ముల్లోకంబులు గాదు .. దానమిడగా
మూడడ్గులే కోరియున్,
పల్లంబందున ద్రొక్కె “వామనుడు” విశ్వ వ్యాప్తుడై! – మ్రొక్కెదన్!! – 5
ఉ.
క్షత్రియు లెల్లరు న్నమిత గర్వముతో మును పాలనంబునన్
క్షాత్ర సుధర్మమున్ మరచి, గందరగోళము సేయుచుండ – నా
క్షత్రియ జాతి గర్వ మణగార్చు ప్రతిజ్ఞను బూని, తాను నీ
ధాత్రికి శాంతి గూర్చె గుణధాముడు – “భార్గవ రాము” మ్రొక్కెదన్! – 6
మ.
ధరణీపుత్రిని పెండ్లియాడె శివకోదండమ్మునే త్రుంచియున్ –
ధరణీపుత్రిని తోడుగా గొనుచు పిత్రాజ్ఞన్ వనంబేగె తాన్ –
ధరణీపుత్రిని లంకలో చెర నయో దాచన్ దశగ్రీవునిన్
శరఘాతంబుల గూల్చె! “రామవిభు” సాష్టాంగంబుగా మ్రొక్కెదన్! – 7
చం.
చిటికెన వ్రేలిపై గిరిని చేకొని, యాదవ జాతి గాచియున్;
కుటిలుడు కంసునిన్ దునిమి; ఘోరముగా ద్రుపదాత్మజన్ ఖలుల్
కటకట బెట్ట, మానమును గాచియు; పాండవ రాయబారియై;
స్ఫుటముగ “గీత” బోధనిడి, పోరున ధర్మముు గెల్చునట్లుగా
ఘటనలు సల్పియున్; జగతి గాచిన కృష్ణుని నేను మ్రొక్కెదన్! – 8
కం.
ఎక్కడ నే గుడి కేగిన,
చక్కగ నిపు “డర్చరూప సద్విగ్రహ”మై –
మ్రొక్కిన మ్రొక్కులు దీర్చును!
మ్రొక్కెద “బుద్ధావతార” మూర్తికి భక్తిన్! – 9
ఆ.వె.
కలి యుగమున పాతకములు పరాకాష్ఠ
జేరినంత – పాప చిత్తుల నిక
మద మడంచియు పరిమార్చగ, రాబోవు
“కల్కి రూప”! కర యుగళిని మోడ్తు! – 10
వినాయక స్తుతి :
తే.గీ.
ఓ వినాయక! సంతత ముర్వి జనుల
కెల్ల – నీతి, సందేశము లెరుక జేయు
పద్యము లిడిన “వేమ భూపతి”ని గూర్చి
సుకృతి నల్లు నా కొసగుమా – శుభము! జయము!! – 11
వాణీ మాతా స్తుతి :
కం.
వాసర వాణికి మదిలో
జేసియు సంస్తుతిని భక్తి సీమలు దాటన్,
వ్రాసెద నీ సత్కావ్యము –
వాసి గొనుచు, “వేమన కృతి” వరలగ భావిన్! – 12
కులదైవ స్తుతి :
మ.
ఫలవంతంబయి నా ప్రయత్న మిక, ప్రాప్తంబొంద సత్కీర్తినిన్,
బల మీయంగను కోరుకొందు ధృతితో వ్రాయంగ నీ సత్కథన్,
వెలయంగన్ సువిశిష్ట కావ్యముగ, నే వేవేల ప్రార్థింతు – మా
కులదైవంబుగ వెల్గి ధర్మపురిలో కొల్వైన నర్సింహునిన్! – 13
పూర్వకవి స్తుతి :
సీ.
ఆది సత్కవి “నన్నయార్యు”ని పూజింతు!
“పాల్కుర్కి” సుకవికి ప్రణతులిడుదు!
“తిక్కన”, “ఎర్రన” ధీమంతుల జపింతు!
“శ్రీనాథు”, “పోతన”న్ – ప్రీతి గొల్తు!
“కృష్ణరాయ”ని, “అష్ట కృతికర్తల” స్తుతింతు!
“చేమకూర” కవికి జేజెలందు!
శతకకారులు – “బద్దె” సమ్రాట్టు, “మారవి
వెంకయ్య”, “శేషప్ప”, “వేమ” కవికి –
తే.గీ.
నవ కవులు – “విశ్వనాథ”, “జాషువ”యు, “కృష్ణ
శాస్త్రి”, “పాపయ శాస్త్రి”, “దాశరథి”, స్వీయ
గురువు – “నండూరి ఆచార్య” వరుల కిదియె
శిరసు వంచి నమస్కరించి, కదలెదను! – 14
స్వీయ పరిచయము :
సీ.
గోల్కొండ కవులైన “గోవర్ధనము” వంశ
“నారాయణాచార్య” నాన్న నాన్న!
“సిరిసిల్ల”ను “సి.నా.రె.” గురువునై వెలిగిన
“ఆచి నృసింహార్యు” డమ్మ తండ్రి!
దేశికోత్తముడగు “దేశికాచార్యులే”
నాకు జన్మ నిడిన నాదు తండ్రి!
ఇంటికే లక్ష్మియౌ “ఇందిరాదేవి”యే
కడు ప్రేమమూర్తి నా కన్నతల్లి!
తే.గీ.
స్వస్థలము “జగిత్యాల”లో “బండ లింగ
పురము”! మరి, “నిజామాబాదు” పుట్టి నూరు!
పుట్టితిని వ్యాస పూర్ణిమ పుణ్య తిథిని –
పండిత కుటుంబమున నుగ్గుపాలు గ్రోల! – 15
సీ.
వాసరాధీశ్వరి వాణి చేరువ గాన –
ఆంధ్ర పద్య కవిత్వ మబ్బెనేమొ!
జైలు గోడ లట “దాశరథి” కైతలు పాడె –
ఆ కవిత్వావేశ మందెనేమొ!
చెరుకు పంటలకున్ ప్రసిద్ధ భూమి యగుటన్ –
చెరుకు తీపి కవితన్ చేరెనేమొ!
“ఇందూర”నెడి నామ మింకొక్కటిన్ గల్గె –
ఆ ఇందు కళ లందు నమరె నేమొ!
తే.గీ.
పట్టణము “నిజామాబాదు” పసిడి యొడిని –
ఏను పుట్టి, పెరుగుచు కవీంద్రు నైతి!
“హైదరాబాదు” చేరి నే డలర నేమి?
జన్మభూమికి నే సదా జయమటందు! – 16
ఉ.
పద్యము, గేయమున్, వచన పద్ధతు లన్నిట పట్టు గల్గి, నే
హృద్యమునౌ కవిత్వ రస మెల్లరు మెచ్చగ నారచించుచున్,
గద్యమునందు నన్య కృతికర్తల కావ్య విమర్శనమ్ముతో –
సేద్యము సల్పితిన్ కలము చేతను బూని కవిత్వ సీమలో! – 17
కం.
నా కవనము సంతతమును
శ్రీకరముగ సాగునటుల చేసిరి ప్రియులై –
నా కులసతి సావిత్రియు,
నా కూతురు కీర్తి, నా తనయుడగు రోహిత్! – 18
సీ.
తెలగాణ వీణపై తీగలన్ మీటిన
“దాశరథి”యె వెన్ను తట్టె నన్ను!
జ్ఞానపీఠము నెక్కి ఘన కీర్తి నొందిన
“సీ.నా.రె.” ఆశీస్సు చేసె నాకు!
“జీ.వి.యస్.”, “పోతుకూచి”యు,”వేమరాజు”ను
“తిరుమల” వలన గుర్తింపు గొంటి!
“నండూరి రామకృష్ణమ” ఘనాచార్యులు
దీటుగా మెరుగులు దిద్దె నాకు!
తే.గీ.
“యస్.వి. రామరావ్” దీవెన లందజేయ –
విశ్వవిద్యాలయంబున విచితి సలిపి,
అలరి “డాక్టరేట్” పట్టమ్ము నందుకొంటి!
వృత్తి – “ఇంజినీరింగు”; ప్రవృత్తి – రచన!
కవనమే నాదు జీవన గమ్యమాయె! – 19
కావ్య లక్ష్యము :
కం.
ఇది వేమన చారిత్రము!
ఇది మోహము, పాశములను నిరుసుల నడుమన్
బ్రదు కది నలిగిన పిమ్మట –
తుదకు నరుని గమ్య మేదొ తోపించు కథౌ! – 20
ఉ.
శుభమగు గాక! లోకమున సూక్తులుగా కవి “వేమనార్యు” హృ
త్ప్రభవము లైన యట్టి పలు పద్యములే రహియింప సర్వదా –
విభవము నొంది మానవ వివేకము ధర్మము వైపు నిల్వగా,
నభయము గల్గి భూజనులు నైక్యముగా నభివృద్ధి గాంచుతన్! – 21
(సశేషం)
డా. ఆచార్య ఫణీంద్ర తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం” అనే విషయంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి సాధించారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. తెలుగు సాహిత్యంలో “మాస్కో స్మృతులు” పేరిట ‘తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా’న్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం “Single Sentence Delights” పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.
ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం, ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా – ‘వానమామలై వరదాచార్య’ స్మారక పురస్కారం, ‘దివాకర్ల వేంకటావధాని’ స్మారక పురస్కారం, ‘పైడిపాటి సుబ్బరామశాస్త్రి’ స్మారక పురస్కారం, ‘ఆచార్య తిరుమల’ స్మారక పురస్కారం, ‘బోయినపల్లి వేంకట రామారావు’ స్మారక పురస్కారం, “రంజని – విశ్వనాథ” పురస్కారం, ‘సిలికానాంధ్ర’ గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ ‘ఎక్స్ రే’ పురస్కారాలు, ‘కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్’ నుండి “వైజ్ఞానిక రత్న” పురస్కారం, పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ‘ఉగాది’ సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలో, అట్లాంటాలో జరిగిన “నాటా” తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులో వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి “పద్య కళా ప్రవీణ” బిరుదుని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి “కవి దిగ్గజ” బిరుదుని పొందారు. హైదరాబాదులోని నవ్య సాహితీ సమితి నుండి “ఏకవాక్య కవితా పితామహ” పురస్కారాన్ని పొందారు. ఆయన ప్రస్తుతం “యువభారతి” సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా, “నవ్య సాహితీ సమితి”కి అధ్యక్షులుగానూ, “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” కు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక “సాహితీ కౌముది” కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘పద్య కవిత్వం’లో “కీర్తి పురస్కారం” ప్రదానం చేసారు. 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహాసభల”లో డా. ఆచార్య ఫణీంద్ర “పద్య కవి సమ్మేళన” అధ్యక్షులుగా వ్యవహరించి సత్కరించబడ్డారు.
