[డా. ఆచార్య ఫణీంద్ర రచించిన ‘వేమన చరిత్రము’ అనే పద్యకావ్యాన్ని ధారావాహికగా అందిస్తున్నాము. ‘ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య’ రాయలసీమ త్రిమూర్తులపై నిర్వహించిన పద్య కావ్యాల పోటీలో ₹30,000/- నగదు బహుమతి పొందిన చారిత్రక పద్య కావ్యం ఇది.]
ప్రథమాశ్వాసము
~~~~~~~~~~~
కథా ప్రారంభం
~
ఆ.వె.
అక్షరముల నేర్చి, ఆంధ్ర భాషను తాను
ప్రజ్ఞ గొన్న పిదప, ప్రతి దినమ్ము –
వ్రాత ప్రతుల యందు పరిమళించెడి కావ్య
మధు రసాల గ్రోల మరిగె నతడు! – 22
ఉ.
ఎవ్వ రతండు? బ్రౌను దొర! ఎవ్విధి నాతడు గొప్పవాడునౌ?
అవ్వలి దేశ పాలనకు నాంగ్ల ప్రభుత్వముచే నియుక్తుడై,
జవ్వనమందు వెల్గు నవ శాసనికుండుగ – ఆంధ్ర భాషపై
నివ్విధి ప్రేమ గూడి, బ్రదు కెల్లయు సేవ నొనర్ప బూనెడిన్! – 23
కం.
యౌవన వాంఛల దలపడు!
వైవాహిక సౌఖ్యములను వరియింపడు! తా
నే వేళ నైన – భాషా
సేవయె! లేకున్న .. ప్రజల సేవయె వృత్తిన్! – 24
తే.గీ.
స్థానిక విబుధులను తగ సత్కరించి,
తాళ పత్రాల మూల్గు సత్కావ్యములను,
గత శతాబ్దములందలి శతకములను
వినుచు, సేకరించుచు “బ్రౌను” – వేత్త యయ్యె! – 25
వ.
అట్లు తాళపత్రముల యందు పడియున్న ప్రాచీన తెలుగు కావ్యముల ప్రాభవము నెరింగిన యా బ్రౌను దొర తానెరిగిన అద్యతన సాంకేతిక పరిజ్ఞానముతో వాని నాధునిక గ్రంథముల రూపమున ముద్రించి, భావి తెలుగు ప్రజకై కాపాడ నెంచె. ఆ ప్రయత్నంబున కొంత కాలంబటు సాగుచుండ.. – 26
కం.
ఎందరొ విబుధులు వత్తురు
సుందర కావ్యార్థములను శోభిల జూపన్!
కొందరు ప్రౌఢిమ యందురు!
కొందరు సారళ్యమంద్రు కొన్ని కృతులలో! – 27
ఆ.వె.
సరళ భాషలోన సామాజికాంశాల
బయటపెట్టు నీతి పద్యములను
వినగ నట్లు “బ్రౌను” – విబుధ వరుల నోట,
“వేమన” కవి యొక్క విలువ నెరిగె! – 28
తే.గీ.
“తిప్పభట్ల శివయ శాస్త్రి” ధీమణి – తొలి
సారి వేమన పద్యాల సరణి దెలుప –
మెచ్చి, యతనిని “బ్రౌన్” నియమించె నిడగ –
వేమన కవి పద్యాలను వెలికిదీసి! – 29
కం.
“వేలాల సదాశివ కవి”;
“జూలురి అప్పయ్య శాస్త్రి” సూరిని; దిద్దన్
తాళప్రతి – “కనకాద్రి”ని,
కూలిగ తన స్వీయ ధనము గూర్చుచు పనిచెన్! – 30
ఉ.
ఒక్కొక పద్యమున్ గొనుచు, నుత్తమ నాణ్యపు టాణిముత్యమే
దక్కిన రీతి – గుండెను ముదంబును బొందుచు నుండె “బ్రౌను”! ఇం
పెక్కగ, వ్రాత దోషముల నెల్ల పరిష్కృతి సేయ, తోచెడిన్ –
తక్కిన విశ్వ భాషలను తర్జుమ చేయుట కొప్పు నివ్వటన్! – 31
కం.
మకుట సహితమగు పద్యము
లొక వంద గలిగి “శతకము” నుండని తలపన్,
అకటా! “వేమన శతకము”
ప్రకటంబయె వందలాది పద్యము లహహా! – 32
ఉత్సాహము.
ఉత్సుకుడయె “బ్రౌను” దొరయె! “ఉత్తమ కవి వేమనన్
కుత్సితులగు పండితు లిటు కొందరు గురుతించరో?”; ..
“తత్సమ కవు లెవ్వ?” … రిట్లు తర్కము మొదలై హృదిన్ –
తత్సమయమె “తిప్పభట్ల” ద్రష్ట నడిగె ప్రశ్నలన్! – 33
ఆ.వె.
“దాని కన్న మున్ను, దర్శింప గోరెద
వేమన కవి చరిత మేమి? – యంచు” –
ప్రశ్న గుప్పునట్టి “బ్రౌను” కు విబుధుండు
“తిప్పభట్ల శివయ” తెలిపె నిటుల … – 34
చం.
తిరుమల వేంకటేశ్వరుని దివ్య గృహంబుగ వెల్గు సీమకు
న్నరిగెడు దారికిన్ “గడప” యన్నటు వెల్గెడు ప్రాంతమందునన్
పరగిన – “మూగ చింతల”ను పల్లియ నేలెడు పెద్ద కాపుకున్
కరము ప్రియంబునౌ యనుజుగా ప్రథితుండయె “వేమ”నాఖ్యుడే! – 35
తే.గీ.
“మూగ చింతల” గ్రామమున్ మొత్త మరయ –
పెద్ద పెద్ద భవంతులు పెక్కు గలవు!
కోట వంటి గృహంబులో కొలువు దీరె –
పెద్ద కాపు కోమటిరెడ్డి వేమరెడ్డి! – 36
ఉ.
ఎచ్చట జూచినన్ పొలము లెచ్చుగ గన్పడుచుండు నిండుగా
పచ్చదనంబుతో, ప్రజల భవ్య మనోహర జీవితాలకున్ –
మెచ్చునటున్ ప్రతీకలుగ; మేలిమి బావులు మధ్య మధ్యలో!
ముచ్చట గొల్పు గీముల ప్రమోదముతో జనులుందు రచ్చటన్! – 37
(సశేషం)
డా. ఆచార్య ఫణీంద్ర తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం” అనే విషయంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి సాధించారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. తెలుగు సాహిత్యంలో “మాస్కో స్మృతులు” పేరిట ‘తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా’న్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం “Single Sentence Delights” పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.
ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం, ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా – ‘వానమామలై వరదాచార్య’ స్మారక పురస్కారం, ‘దివాకర్ల వేంకటావధాని’ స్మారక పురస్కారం, ‘పైడిపాటి సుబ్బరామశాస్త్రి’ స్మారక పురస్కారం, ‘ఆచార్య తిరుమల’ స్మారక పురస్కారం, ‘బోయినపల్లి వేంకట రామారావు’ స్మారక పురస్కారం, “రంజని – విశ్వనాథ” పురస్కారం, ‘సిలికానాంధ్ర’ గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ ‘ఎక్స్ రే’ పురస్కారాలు, ‘కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్’ నుండి “వైజ్ఞానిక రత్న” పురస్కారం, పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ‘ఉగాది’ సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలో, అట్లాంటాలో జరిగిన “నాటా” తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులో వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి “పద్య కళా ప్రవీణ” బిరుదుని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి “కవి దిగ్గజ” బిరుదుని పొందారు. హైదరాబాదులోని నవ్య సాహితీ సమితి నుండి “ఏకవాక్య కవితా పితామహ” పురస్కారాన్ని పొందారు. ఆయన ప్రస్తుతం “యువభారతి” సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా, “నవ్య సాహితీ సమితి”కి అధ్యక్షులుగానూ, “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” కు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక “సాహితీ కౌముది” కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘పద్య కవిత్వం’లో “కీర్తి పురస్కారం” ప్రదానం చేసారు. 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహాసభల”లో డా. ఆచార్య ఫణీంద్ర “పద్య కవి సమ్మేళన” అధ్యక్షులుగా వ్యవహరించి సత్కరించబడ్డారు.
