Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేమన చరిత్రము-4

[డా. ఆచార్య ఫణీంద్ర రచించిన ‘వేమన చరిత్రము’ అనే పద్యకావ్యాన్ని ధారావాహికగా అందిస్తున్నాము. ‘ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య’ రాయలసీమ త్రిమూర్తులపై నిర్వహించిన పద్య కావ్యాల పోటీలో ₹30,000/- నగదు బహుమతి పొందిన చారిత్రక పద్య కావ్యం ఇది.]

ప్రథమాశ్వాసము

తే.గీ.
వలపు టుయ్యాలలో నూగి, అలసి, సొలసి,
కులుకులాడి కుచములపై కునుకుదీయ –
స్వర్గ లోక మావాహన జరిగి, వసుధ
వెలిగినట్లుగా తోచెను వేమ దొరకు! – 56

కం.
ఆకస మను మంచముపై
రాకాశశి, తార జేరి రమియింపంగన్ –
చీకటి వేళయు మురిసెను!
వేకువ యది యోర్వ లేక వేగమె వచ్చెన్! – 57

మత్త కోకిల.
ధాత్రిపై రవి కాంతి చేరెను – తామరల్ వికసించెడిన్!
రాత్రి మొత్తము రాగ రంజిత ప్రాప్తి గాంచిన వేమకున్
నేత్ర యుగ్మము విచ్చుకోదయె! “నిండు ప్రొద్దయె” నంచు స
ద్గాత్రి వేడుచు నిద్ర లేపియు, దారి జూపిన దింటికిన్! – 58

తే.గీ.
వచ్చు దారిలో నొక గుడి వద్ద గనె వి
వస్త్రగా నొక్క ముదుసలి పడతి నతడు!
హృది చలించగ – గుడిలోని కేగి, దేవి
విగ్రహము చీర దెచ్చి కప్పె నత డంత! – 59

సీ.
పురజను లది యెంతొ పుణ్యకార్య మటంచు
పొగడుచుండగ, కొంద రెగబడుచును –
దేవాలయమునందు దేవి మూర్తిని తాకి
తప్పు జేసెనటంచు తగవు పడిరి!
పెద్దకాపుకు జెప్పి బుద్ది జెప్పింపగా
తరలి వెడలుచుండ్రి దండు గట్టి!
“చెప్పుకొనుడు.. నాదు తప్పు లే”దని పల్కి –
వారి వెనుకె తాను పరగుచుండె!
ఆ.వె.
వేగ వేగ వార లేగ నింటి కచట
పెద్ద కాపు లేడు .. వెడలె నెటకొ!
రాణి కంత జెప్పి, రక్షింప ధర్మమ్ము
కోర – నచ్చ జెప్పి వారి నంపె! – 60

వ.
అట్లు వారిని బంపిన పిమ్మట, నరసాంబ రాణి మరిదిని నిలదీసె నిట్లు … – 61

కం..
“దేవాలయము పవిత్రత
నీ విధి చెడగొట్టు పనుల నేల జరిపినా
వీవయ? ఇది తెలిసినచో –
శ్రీవారిక నీదుపైన చిందులు ద్రొక్కున్!” – 62

చం.
అన విని వేమనాఖ్యు డపు డాదర మొప్పగ జెప్పె – వృద్ధ నా
రిని కరుణింపగా నటు చరించిన మొత్తము గాథ! దాని కా
తని దయ మెచ్చె గాని, అది తప్పని యామె పవిత్ర ధర్మమున్
వినుమని చెప్పసాగె నటు వేమనకున్ గుడిలోని నీమముల్! – 63

కం.
“నుడుగుచు మంత్రములను తా
నడుగిడి యభిషేక పూజ లందిడ – తాకున్
గుడిలో దేవత నెప్పుడు
మడి గట్టిన యర్చకుండు మాత్రమె భక్తిన్! – 64

ఆ.వె.
తడి.. మడి యని లేక దైవ సన్నిధి కేగి,
గర్భగుడిని మనము కాలు బెట్టి,
తల్లి విగ్రహమును తాక బూనుట తప్పు!
చేయకు డపవిత్ర చేష్ట లెపుడు!” – 65

వ.
అణకువ జూపుచు నదియెల్ల వినిన వేమన, మాతా సమానురాలగు వదినమ్మకు నత్యంత గౌరవమొప్పగా – తన మానసమందలి భావముల గూర్చి జరిగిన యుదంతము నిట్లు వివరించి, ప్రశ్నించె! – 66

చం.
“అది యొక రాతిబొమ్మ! అది ప్రాణము లేనిది! కాని యచ్చటన్
ముదుసలి దట్లు వేదనను మున్గియు నుండగ బ్రోచినాడ నేన్!
కదలిరి జ్ఞాన హీను లిటు కాకమ నీతులు చెప్ప బూనుచున్!
అది విని మూఢ నమ్మకము నంతగ గొప్పగ జేతు వేమమా?” – 67

సీ.
వినినంత నా మాట వేమనతో బల్కె
వదినమ్మ – గోడపై వరలునట్టి
అతని యగ్రజు రూప మచ్చువోసిన యట్టి
చిత్ర పటము దీసి చించివేయ!
వదిన పల్కులు విన్న వాడొక్క మాటున
కుప్పగూలిన యట్లు కుమిలిపోయి,
“అది యేమి వదినమ్మ? అట్లు పల్కితి రేల?”
యనిన వేమన కిట్లు నామె జెప్పె –
తే.గీ.
“భక్తి గౌరవాల ప్రతీక ప్రతిమ యగును!
కావున నెపుడు జన మనోభావములను
గౌరవింపగా వలె! భక్తి సారమిదియె!”
వినియు మారు మాటాడడు వేమ నింక!! – 68

మ.
ప్రకటించెన్ తన మానసంబె, మది నారాధించెడిన్ మాతగా;
నొక సన్మంగళ మూర్తిగా – వదిన తా నుద్బోధ గావింపగాన్ –
“ఇకపై పౌరుల మానసంబులను నొప్పింపంగ తప్పం”చునున్!
భృకుటిన్ చిన్నని దివ్వె వేమన కటున్
వెల్గొందిన ట్లయ్యెడిన్!! – 69

సీ.
చిన్నారి జ్యోతినే చేరి యా పూట తాన్
చేసె ముద్దును; మరి చెప్పె కథలు!
బొమ్మ లన్నియు జూపి పులకింప జేయుచు,
కూతు మోమున గాంచె జ్యోతులెన్నొ!
“చిన నాయనా!” యంచు చిన్నారి జ్యోతి తా
గుర్ర మెక్కగ, తాను గుర్రమయ్యె!
బువ్వ బుక్కలు బెట్టి బొజ్జ నింపెను తాను;
బుల్లి చేతను తాను బుక్క మ్రింగె!
ఆ.వె.
కూతు జ్యోతి పట్ల కొండంత ప్రేమతో
మెలగు వేమన గని, మెచ్చి మదిని –
“అప్పు డప్పు డిటుల ఆడించు నాయనా!”
యనుచు వదిన వేడె నతని తోడ! – 70

ఆ.వె.
నవ్వు పువ్వు విరిసె నా యింట నా రోజు!
దివము గడచిపోయె తృప్తి మీర!
జోల పాట పాడి జోకొట్టె ప్రక్కపై –
అలసియున్న కూతు నాతడింక! – 71

కం.
మాయంబయ్యెను సూర్యుడు!
సాయంత్రమె దాటినంత, జాబిలి వెలుగన్ –
హేయంబుగ మోహం బిక
గాయం బొనరించుచుండె గద వేమనకున్!! – 72

కం.
మెల్లగ నత డింటి తలుపు
గొళ్లెము దీసి, వదిన కనుగొనుటకు ముందే
చల్లగ జారుకొనెను తన
ఉల్లములో వారకాంత ఊరించుటచే! – 73

తోటక వృత్తము.
తనపై గల వేమన దాహమునే;
మొనకెక్కిన యాతని మోహమునే
కనుగొన్నది విశ్వద! కావుననే –
అనువయ్యెను దోచ ననంతముగాన్! – 74

కం.
ఎంతగ ధనమిచ్చిన తన
కంతటితో తృప్తి లేక నా భోగిని తా
నెంతయొ వగలొలుకుచు, తను
వంతయు స్వర్ణాభరణము లమరన్ గోరెన్! – 75

తే.గీ.
వేమ భూపతి యరుదెంచ ప్రేమ మీర
ఎదురుగా నేగి కౌగిలి నిచ్చు కాంత –
ఇప్పు డలుకబూనిన యటు లెటనొ దాగు!
ఇల్లు నిల్లంతయు వెదుక నింతి కనదు! – 76

తే.గీ.
వెదికి వెదికి పట్టుకొనిన వేమన కడ –
“పసిడి గొలుసులు, గాజులు వలయు”నంచు
టక్కులా డిక పెద్ద చిట్టాను విప్పు!
సుఖము దక్కుటే – ఒక పెద్ద సోది యయ్యె! – 77

చం.
“కుదరద”టన్న నింక తన కోరిక తీరదు! అట్లు కానిచో –
“కుదురు” నటన్న నెట్లు సమకూర్చుటొ! పెద్ద సమస్య యయ్యెడిన్!
“కుదురును గాని, వెంటనె చకోరక మట్లు నిరీక్ష కూడ”దం
చదొ, యిదొ, సాకు జెప్పి తన నక్కున జేర్చి రమించె వేమ తాన్! – 78

ఆ.వె.
కొన్ని దినము లట్లు కొనసాగె ప్రణయమ్ము!
పిదప కొంత కొంత విరహమయ్యె!
ఎంత జెప్పిన నిక – యే మాత్ర మొప్పని
రమణి తోడ తుదకు రచ్చ యయ్యె! – 79

వ.
అట్లు నా యింతి కోర్కి తీర్చనిదె తన కోర్కి తీరదని యెరింగిన వాడై, వేమన విరహాబ్ధిలో మునిగి వేదన జెందుచు, తుదకు తప్పక నొక యోచన జేసె! – 80

(సశేషం)

Exit mobile version