[డా. ఆచార్య ఫణీంద్ర రచించిన ‘వేమన చరిత్రము’ అనే పద్యకావ్యాన్ని ధారావాహికగా అందిస్తున్నాము. ‘ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య’ రాయలసీమ త్రిమూర్తులపై నిర్వహించిన పద్య కావ్యాల పోటీలో ₹30,000/- నగదు బహుమతి పొందిన చారిత్రక పద్య కావ్యం ఇది.]
ప్రథమాశ్వాసము
ఉ.
పోరు భరించలేక నిక పుట్టిన యోచన తోడ వేమనే
కోరెను స్వర్ణకారుడు, సఖుండగు నా అభిరాముని న్నెదో
హారము జేసి యిమ్మనుచు; నాతడు రాణికి జేసి యిచ్చెడున్
హారము నింక యొక్కటిని నట్టులె జేసియు, రెంటి నిచ్చెడిన్! – 81
చం.
అవి గొని వేమనాహ్వయుడు నబ్బురమందియు సంతసమ్మునన్
ద్రవిణము, ద్రవ్యమున్ తగు విధంబుగ తా సమకూర్చె గాని, యా
వివరము లేవియున్ వదిన విత్తికి తా నెరిగింపలే దయో!
చివరికి మాటి మాటి కిదె చేయగ నేర్చెను వేమనాఖ్యుడే! – 82
మధ్యాకర.
వెలయాలు గోరిన యంత, వేమన వెంటనే తాను
చెలికాని కటు రెండు నగలు చేయగా జెప్పుచు నుండె!
పలుమార్లు తా జెప్పగానె – పాపము! పరుగు లిడుచును,
చెలు డభిరాముండు చేసి, చేసి విసిగిపోవుచుండె! – 83
కం.
ఒక్కటి తన వదిన కిడుచు;
ఒక్కటి తన వనిత కిడుచు – నొక కొన్నాళ్ళున్ ..
చక్కగ వేమన నడిపెను!
ఎక్కువ కాలంబు సాగ దిదియనె సఖుడే! – 84
వ.
కొన్ని దినంబుల కటులే యాత డన్నంత పనియయ్యె! రాణి నరసాంబ యొకనా డభిరాముని తన కడకు రావించి, యిటు పలువిధంబుల ప్రశ్నింప దొడగె.. – 85
తే.గీ.
“నగలు జేసితి వెన్ని? స్వర్ణ మదియెల్ల
కరిగి పోయె! దానికయి నే నొరగబెట్టు
ధన మదెల్ల తుడిచిపెట్టుకొనె నటందు –
విది గుణమ్మె? నమ్మకమున కిది ఫలమ్మె?” – 86
మ.
నిలదీయ న్నటు రాణి గారు – ముఖమే నిస్తేజ మైపోవగా,
చెలుడు, న్నాతని మోహనాంగి కథలన్ చెప్పంగ నోరాడకే –
తల దించె న్నభిరాము డంత “తనదౌ తప్పేది లే”దంచునున్;
పలికెన్ “వేమన భూపు డెట్లు దెలుపన్ – పాటించి తట్లే” యటన్! – 87
కం.
“నమ్మిన బంటును నే”నని,
“అమ్మగ మిమ్ము జూచుచుందు నమ్మా!” యంచున్ –
“సొమ్మును గొంటిని కూలికి
నెమ్మెయి గొనవలెనొ యంతె! ఇదె నిజ”మనియెన్! – 88
శా.
ఈ రీతిన్ బలుకన్ – “క్షమించితినిలే! ఇంకొక్క మారిట్టులన్ –
వేరెందున్ వృథయైన తీవ్రముగ భావిం తేను శిక్షింప”నం
చా రాణీ కను లెర్ర జేసి యతని న్నంపెన్ స్వగేహంబుకున్!
“ఆరోపంబు తొలంగె, చాలు!” ననుచు న్నాతండు వెన్దిర్గెడిన్! – 89
మ.
అభిరాముం డొక వారమౌ పిదప, ఆ యమ్మెట్లు గద్దించెనో –
ప్రభువున్ జేరిన నిట్టి వార్త యికపై ప్రాప్తంబ దేమౌనొ – ఏ
అభమున్ ముంచుక వచ్చునో – తెలిపి, తన్నా యాటలో పావుగా
గుభులున్ గూలగ జేయకంచు వ్యధతో కోరెన్ సఖున్ – వేమనన్! – 90
ఆ.వె.
విని సఖుని పలుకులు, విసుగుతో వేమన –
“సరియ!” యంచు, నతని సాగ నంపి,
అప్పు డచట నుండ నాసక్తియే చచ్చి,
సఖికి చెప్పి గృహము జనగ నెంచె! – 91
కం.
ప్రక్కన – వెలయా లది చెవి
రిక్కించుచు వినిన దెల్ల! “రిక్తమె ఇకపై
దక్కెడి” దని గ్రహియించుచు –
ఫక్కున నగె వేమన గని పరిహాసముగా! – 92
ఉ.
“నవ్వుచు నుంటి వేల?”యని నారిని తా నడుగంగ – నామెయే
నవ్వె మరింత యెక్కువగ! నవ్వులపై మరి నవ్వులాయె! ఆ
నవ్వును జూడగా – విసుగు నాభి మొదళ్ళను దాటి నెత్తికిన్
రివ్వున జేరి, కోపమున – లేపి కరం, బిడె చెంపదెబ్బనున్! – 93
కం.
రుసరుస లాడుచు వేమన
విసవిస నా స్థలము వీడి వెడలెను; కొమకున్ –
మసిబారిన ముఖమటులై
నిసిరాతిరి యెల్ల కనుల నీరము నిండెన్! – 94
ఆ.వె.
ఏగి గృహము, చూడ – ఏడ్చుచుండె వదిన!
ఏమికంచు నడుగ నామె తెలిపె –
“జ్వరము వచ్చి జ్యోతి వణుకు వారము నుండి..
వైద్యు డరిగి జూచె.. ఫలము లేదు!” – 95
సీ.
అన్నగా రొక మూల ఆసన మందున
కుమిలిపోవుచునుండె కూరుచుండి!
వైద్యు లైదార్గురు పలు చర్చలన్ సల్పి
మార్చి ఇచ్చుచునుండ్రి మందులెన్నొ!
మంత్రశాస్త్ర మెరుంగు మహిమాన్వితులు నేవొ
యత్నంబు లొనరింతు రమిత శ్రద్ధ!
భక్తవరు లెందరో భగవంతునికి పూజ,
స్తుతి జేయుచుండిరి శుభము గోరి!
తే.గీ.
జ్యోతి చెంతకు చేరి.. “ఓ జ్యోతి పాప!
చిన్న నాయన వచ్చె – చూచి పిలువు” మని..
వేదనను దిగ మ్రింగుచు వేమ ననగ –
కదలి యొకపరి, చిన్నారి కనులు తెరిచె! – 96
తే.గీ.
నీరసముతో, జ్వరముతో, కన్నీరు కురిసి,
“చిన్న నాయనా!” యంచనెన్ – చిన్ని స్వరము!
అన్న, వదినయు నానంద మలర గనిరి!
వింతగా జూచుకొని రెల్ల రంత నచట! – 97
తే.గీ.
మూడు రోజులు వేమన వీడ లేదు –
బాలిక పరుండు నట్టి యా ప్రక్క నుండి!
గోరుముద్దలు తినిపించె గోముగాను!
వైద్యు లిడు మందు త్రావించి, పాట పాడె! – 98
మత్తకోకిల.
మెల్ల మెల్లగ జబ్బు తగ్గెను; మేనిలో బల మబ్బెడిన్!
ఉల్లమందు ముదంబు మించిన ఓష ధేదియు లేదిలన్!
తల్లిదండ్రులు, మంత్ర వేత్తలు, దైవ భక్తులు నెల్లరున్
చల్లి రక్షత లెల్ల బాలకు స్వాస్థ్యమే యొనగూడగాన్! – 99
సీ.
ఏడు కొండల వేంకటేశుని కృప నటు
ఏడు రోజులలోన నెల్ల కుదిరె!
చిన్ననాయన యన నున్న ప్రేమ ఫలించి,
చిన్నారి జ్యోతి లేచి తిరుగాడె!
ఆ వారమందు నే యాలోచనలు లేక
వేమన యింటిని వీడ లేదు!
“మార్పు వచ్చినదేమొ మా వేమనకు” నంచు –
వదిన హృదయమందు ముదము నిండె!
ఆ.వె.
అగ్రజుండు వేమనాఖ్యుని కిటు జెప్పె –
“ఉండ నింట నిట్లు జ్యోతి మురియు!
తల్లి – నీ వదినకు ధైర్య మిడును! నాకు
నందును సహకార మడప దడప!” – 100
ఉత్సాహము.
తలను వాల్చి నిల్చి యపుడు తలను నూచె వేమనే!
కలిగె మార్పు కొలది యంచు కరము నెంచి రెల్లరున్!
కలిగెనొ మరి కలుగదొ యది కాలమునకె తెలియులే!
జలజ నేత్రు లీల తోడ జగతి నడచు – సత్యమౌ! – 101
ఆశ్వాసాంత గద్య.
“గోవర్ధన” వంశ సంజాతుండనై, “ఇందిరా, దేశికాచార్య” పుణ్య దంపతుల ద్వితీయ పుత్రుండనై, “భారత ప్రభు త్వాణ్వింధన సంస్థ” విశ్రాంత శాస్త్రవేత్తనై, “సాహితీ విరించి”; “కవి దిగ్గజ” యిత్యాది బిరుదంబుల నొందిన “పద్య కళా ప్రవీణుం” డనగు – “డా. ఆచార్య ఫణీంద్ర” యను నాచే విరచిత “వేమన చరిత్రము” పద్య కావ్య ప్రథమాశ్వాసము పరిసమాప్తము.#
(సశేషం)
డా. ఆచార్య ఫణీంద్ర తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం” అనే విషయంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి సాధించారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. తెలుగు సాహిత్యంలో “మాస్కో స్మృతులు” పేరిట ‘తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా’న్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం “Single Sentence Delights” పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.
ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం, ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా – ‘వానమామలై వరదాచార్య’ స్మారక పురస్కారం, ‘దివాకర్ల వేంకటావధాని’ స్మారక పురస్కారం, ‘పైడిపాటి సుబ్బరామశాస్త్రి’ స్మారక పురస్కారం, ‘ఆచార్య తిరుమల’ స్మారక పురస్కారం, ‘బోయినపల్లి వేంకట రామారావు’ స్మారక పురస్కారం, “రంజని – విశ్వనాథ” పురస్కారం, ‘సిలికానాంధ్ర’ గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ ‘ఎక్స్ రే’ పురస్కారాలు, ‘కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్’ నుండి “వైజ్ఞానిక రత్న” పురస్కారం, పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ‘ఉగాది’ సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలో, అట్లాంటాలో జరిగిన “నాటా” తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులో వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి “పద్య కళా ప్రవీణ” బిరుదుని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి “కవి దిగ్గజ” బిరుదుని పొందారు. హైదరాబాదులోని నవ్య సాహితీ సమితి నుండి “ఏకవాక్య కవితా పితామహ” పురస్కారాన్ని పొందారు. ఆయన ప్రస్తుతం “యువభారతి” సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా, “నవ్య సాహితీ సమితి”కి అధ్యక్షులుగానూ, “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” కు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక “సాహితీ కౌముది” కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘పద్య కవిత్వం’లో “కీర్తి పురస్కారం” ప్రదానం చేసారు. 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహాసభల”లో డా. ఆచార్య ఫణీంద్ర “పద్య కవి సమ్మేళన” అధ్యక్షులుగా వ్యవహరించి సత్కరించబడ్డారు.
