[డా. ఆచార్య ఫణీంద్ర రచించిన ‘వేమన చరిత్రము’ అనే పద్యకావ్యాన్ని ధారావాహికగా అందిస్తున్నాము. ‘ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య’ రాయలసీమ త్రిమూర్తులపై నిర్వహించిన పద్య కావ్యాల పోటీలో ₹30,000/- నగదు బహుమతి పొందిన చారిత్రక పద్య కావ్యం ఇది.]
ద్వితీయాశ్వాసము
కం.
మహిపై జనించు మనుజులు
ఇహలోకపు దుర్వ్యసనపు టిరుసుల బడుచున్
అహరహము తపింతు రయో!
బృహదీశ! వివేక మవని వెలిగింపుమయా! – 1
ఆ.వె.
ఒకటి రెండు దినము లుడిగెనో, మరి లేదొ –
ప్రకటమయ్యె హృదిని ప్రణయ కాంక్ష!
ఎచట జూడ నచట నింతి – వేమన్నకు
కాన నగుచు, రేపె కలవరమ్ము!! – 2
కం.
తడబడ తన మానసమే,
అడుగిడె గృహ సీమ వీడి యాతడు! దారిన్ –
వడి వడి జనియించె మదిని
ముడివడి ముడివిడని యట్టి ముచ్చట లెన్నో! – 3
తే.గీ.
“చెంపదెబ్బ గొట్టి, చెలియ చెంతకేగ –
సరస మాడునె పలుకుచు స్వాగతమ్ము?
వెలది క్రోధమ్ముతో నన్ను వెళ్ళగొట్టు!
సరసమని బోవ నదియెల్ల విరసమగును!!” – 4
వ.
ఇట్లు తలపోసిన చినవేమరెడ్డి – ఇట్టి వేళ నేదైన యుపాయము చెప్పంగ నభిరాముడే సరియగునని తలంచి, ముందుగా – స్నేహితుని నివాసమున కేగి, తగు మార్గమును జూపుమనె. అంత నా యభిరాము డొకింత ఖిన్నుడై, పిదప స్తిమితమొంది సఖుని కిట్లనియె.. ! – 5
కం.
“నా మాట వినుము వేమా!
ఆ మోహము వీడి యింక – అన్న వదినలు
న్నే మార్గము జూపిన, నీ
వా మార్గమునందె చనుమ! అదియే శుభమౌ!” – 6
కం.
“వనితా వ్యామోహముతో
మును భువి నెందరొ నశించ్రి! మూర్ఖత విడుమా!
చనబోకుము చెడు దారిని!”
యని వివరించెను సఖునకు నభిరాముండే! – 7
కం.
“విశ్వద బులిపించు సొబగు;
విశ్వద కౌగిలిని దగులు వెచ్చదనంబుల్;
విశ్వదతో శృంగారము –
విశ్వేశునకైన వశమె వీడగ?” ననుచున్ .. – 8
మ.
“సులభం బంతయునైన వీడ, నిటు నే స్రుక్కంగ నే హేతువో –
తలపున్ జేసియు జెప్పుమయ్య దయతో! దారేదియున్ లేదయా!
వెలదిన్ జేరగ మార్గ మేదొ యొకటిన్
వెల్గించి యాలోచనన్
చెలునిన్ గావగ జూడుమా!” యనెను తా చేజాచి యా వేమనే! – 9
కం.
తన మార్గము తనదేనని,
వినబోడయె నీతు లేవి వివరించిన; కా
వున తన మిత్రుని పై గల
యనురాగముతోడ పలికె నభిరాము డిటున్! – 10
చం.
“అలిగిన యాడువారి యలు కాకస మంటిన నేమి? వారి కా
యలుకను దీర్చగా పసిడి యాభరణాల బహూకరించుచున్,
పలుకులలో పొగడ్త సగపాలుగ జేర్చుచు, ముద్దు సేయుచున్,
వలయు నెడన్ క్షమించుమని ప్రార్థన సేసిన – పొంగి పోవరే?” – 11
మ.
“అటులైనన్ మరి స్వర్ణ భూషణ మొకం డందించుమా మిత్రమా!
ఎటులైనన్ వదినమ్మ కీ విషయము న్నే మాత్రమున్ దెల్పకే –
కటువైన న్నిక నాదు కోరికను సాకారంబునే సేయుమా!
దిటమౌ నొక్క బహూకృతిన్ బదులుగా తెచ్చిత్తు నీ కెప్పుడో!” – 12
వ.
అని వివరించిన వేమనకు – “అది యే మాత్రంబు కుదరదు. ప్రజలను కన్నతల్లి వలె కాపాడు రాణి గారిని నేను వంచించలే” నని పలికె నభిరాముడు. “అంతగా వలయునన్న తద్భూషలకు వలయు బంగారము స్వంతముగా సమకూర్చిన, స్నేహితునిగా భృతి గొనకుండ వాని జేసి యిత్తు” ననియె! – 13
ఉ.
చేయున దేమి లేక యిక – “సిద్ధము జేసెద నేను స్వర్ణమున్ –
పాయక నుండగా బ్రతుకు బాటను నా సఖి నెన్నడైన, నే
నేయది కష్టమైన భరియించెద, నెంతటి కాయ కష్టమున్
సేయుటకైన సిద్ధపడి చేసెద నార్జన!” – పల్కె వేమనే! – 14
ఉ.
“కూలి యొనర్చు నిన్ను గన కూష్మము బ్రద్దలు సేయు గాదె మా
యేలిక!” యంచు నవ్వెను సుహృత్తగు నా యభిరామ నాముడే!
“కాలును నాకు లోన నిటు గందరగోళము రేపి నవ్వినన్ –
చాలిక! నవ్వు టాపు” మని, సాయము జేయగ కోరె వేమనే! – 15
ఉ.
అంతట తోచె వేమనకు నద్భుతమైన వినూత్న యోచనే! –
“ఇంతకు మున్ను రాగి నెటు లిత్తడి జేసితొ, సేయుమా యటున్ –
చెంత గలట్టి లోహ మెదొ చేర్చి రసాయనముల్, పసిండిగాన్!
అంతకు మించి మార్గమెది ఆదుకొనన్ నను?” నంచు పల్కె తాన్ .. -16
కం.
“వెల తక్కువ లోహమునే
విలువగు స్వర్ణముగ మార్చి, వివిధాభరణాల్
వెలయించి, సహాయ పడుము!
కలకాలము మరువ – నీదు ఘనమౌ మేలున్!” -17
వ.
అటు వేడిన వేమనకు బదులుడె నాతని స్నేహితుడగు అభిరాముడు.. 18
చం.
“సరి సరి! స్వర్ణకారు నిక శాస్త్రములో పరిశోధనంబులే
కరపు మటందువే? అదియ కాని పనౌ! – దయ జేసి నీవు నా
యురమున కార్య భార మిటు లుంచకు మిత్రమ! పుత్తడిన్ గొనన్ –
సిరి నెట నుండి తెచ్చెదవొ – చింతన జేయుము నీ మనంబునన్!” -19
చం.
“సిరి నెట నుండి తెచ్చెదము? సిద్ధముగా నెటనుండు? శాస్త్రమం
దరయుచు శోధనన్ సలిపి యద్ది సృజింతము స్వర్ణ సాధనన్!
దొరికినచో పథం, బిపుడు తొల్గు నగత్యము నాకు; నట్టులే –
కరువులు కాటకంబులను కావ జనంబుల విత్త మాడెడిన్! – 20
(సశేషం)
డా. ఆచార్య ఫణీంద్ర తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం” అనే విషయంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి సాధించారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. తెలుగు సాహిత్యంలో “మాస్కో స్మృతులు” పేరిట ‘తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా’న్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం “Single Sentence Delights” పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.
ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం, ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా – ‘వానమామలై వరదాచార్య’ స్మారక పురస్కారం, ‘దివాకర్ల వేంకటావధాని’ స్మారక పురస్కారం, ‘పైడిపాటి సుబ్బరామశాస్త్రి’ స్మారక పురస్కారం, ‘ఆచార్య తిరుమల’ స్మారక పురస్కారం, ‘బోయినపల్లి వేంకట రామారావు’ స్మారక పురస్కారం, “రంజని – విశ్వనాథ” పురస్కారం, ‘సిలికానాంధ్ర’ గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ ‘ఎక్స్ రే’ పురస్కారాలు, ‘కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్’ నుండి “వైజ్ఞానిక రత్న” పురస్కారం, పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ‘ఉగాది’ సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలో, అట్లాంటాలో జరిగిన “నాటా” తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులో వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి “పద్య కళా ప్రవీణ” బిరుదుని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి “కవి దిగ్గజ” బిరుదుని పొందారు. హైదరాబాదులోని నవ్య సాహితీ సమితి నుండి “ఏకవాక్య కవితా పితామహ” పురస్కారాన్ని పొందారు. ఆయన ప్రస్తుతం “యువభారతి” సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా, “నవ్య సాహితీ సమితి”కి అధ్యక్షులుగానూ, “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” కు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక “సాహితీ కౌముది” కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘పద్య కవిత్వం’లో “కీర్తి పురస్కారం” ప్రదానం చేసారు. 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహాసభల”లో డా. ఆచార్య ఫణీంద్ర “పద్య కవి సమ్మేళన” అధ్యక్షులుగా వ్యవహరించి సత్కరించబడ్డారు.
