Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేమన చరిత్రము-7

[డా. ఆచార్య ఫణీంద్ర రచించిన ‘వేమన చరిత్రము’ అనే పద్యకావ్యాన్ని ధారావాహికగా అందిస్తున్నాము. ‘ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య’ రాయలసీమ త్రిమూర్తులపై నిర్వహించిన పద్య కావ్యాల పోటీలో ₹30,000/- నగదు బహుమతి పొందిన చారిత్రక పద్య కావ్యం ఇది.]

ద్వితీయాశ్వాసము

తే.గీ.
స్వీయ లాభమ్ముతో బాటు, బీద సాద
లెల్లరకు భూరి దానమ్ము లిడగ – సతము
సాధ్యమును జేయు సాధింప స్వర్ణ సృష్టి!
దిశను మార్చు; నటులె – దేశ దశను మార్చు! – 21

ఉ.
శ్రోత్రియ స్వర్ణకారునకు శోధన యెంతటి స్వల్ప కార్యమౌ!
మిత్రుడ గాను నే నిపుడు – మీరు వసించెడు “మూగ చింతల”న్
ధాత్రిని నేలు మీ ప్రభువు తమ్మునిగా నిదె యాన తిత్తు! ఈ
మాత్రము సేయవో! విభుని మాట యి”దంచును పల్కె వేమనే! – 22

కం.
“నీవును నేనును గూడియు
నా విధమగు కృషిని సలుప, నందుకు తగ నే
వేవి వలయునో గూర్చుము!
నే విశ్వద నొకపరి గని, నీ కడ నిలుతున్!” – 23

వ.
అని వేమన యభిరామునితో వచించి, విరహానల దహ్యమానమైన తన హృదయమునకు నొకింత నూరట గలుగజేయగా నా విశ్వద కడకేగెను. – 24

ఆ.వె.
తలుపు తీసినంత, తరుణి – ముఖము మాడ్చి,
పరుగు పరుగున విడి పారిపోయి
అలుక పాన్పు నెక్కె నర్రలో వగచుచు!
వెలది వెనుక సాగె పిలుచు చతడు! – 25

మధ్యాక్కర.
“విశ్వదా! విశ్వదా!” యనుచు వెనువెంట వేమరెడ్డి చని,
విశ్వ సౌందర్య మూర్తి యగు వెలదిని వీపుపై తట్టి,
“శాశ్వతంబులె కోప తాప సంగతుల్? సఖియ! నీకు సక
లైశ్వర్యముల నిచ్చు వాడ!” నంచు తా ననునయం బొలుక.. – 26

కం.
కన్నీరై జలపాతము
నున్నని చెక్కిళ్ళ దూకి నురుగుల జిమ్మన్,
“క్రొన్నన కోమలత యచట
మన్నగునో – యనుచు నతడు మరి దరి జేరన్.. – 27

ఆ.వె.
“చెంప వాయగొట్టి, సిగ్గు లేక నికేమి
చేయ వచ్చినావు? చెప్పుమోయి!
సుదతి యన్న పూరుషుని కెప్డు చుల్కనే!”
యంచు నేడ్చు చతని నతివ త్రోసె! – 28

వ.
అంత నా వేమన యా యింతిని మరింత చేరువగా జేకొని యిటు వేడుకొనియె! – 29

చం.
“నను, భవదీయ ప్రేమికుని నమ్మక, నిక్కిన కిన్క బూని త్రో
సిన – అది నాదు దోషమె! హసించెడు నిన్గని కోపినై, పటా
లున చెయి చేసికొంట రస లోపమె! అల్కను మాని, ప్రేయసీ!
నను దయతో క్షమించవె! అనాదరణన్ సహియింపకుంటినే!” – 30

కం.
అలుకను వీడని విశ్వద
పలికెను, వినకుండ నతని పలుకుల నెల్లన్ –
“నిలువెత్తు పసిడి నగలను
కలిగించిన .. దరికి రమ్ము! కానిదె యొప్పన్!” – 31

కం.
కటువుగ నటు తొలి సారిగ
పటపట చెలి పండ్లు గొరికి పలుకుట గని యా
విటుడు వేమనకు గలిగె
నెట లేనటు క్రోధ మైన; నేమన లేడౌ! – 32

మ.
అట తా నొక్క క్షణంబు నైన నిలువ న్నంగీకృతిన్ గల్గదౌ!
దిటమై యుండెడి మానసంబు నటులన్ దీన స్థితిన్ మున్గగాన్ –
తృటిలో వీడెను వేమనాహ్వయుడు ప్రాదేశంబు క్రుద్ధుండునై –
ఎటకున్ బోవలె తోచదాయె; తుదకు న్నేగంజనె న్నింటికిన్! – 33

వ.
ఆ రాత్రి వేళలో వేమన స్వీయ గృహమున కాలిడి నంతట – కన్పడినట్టి దృశ్యమును గాంచి, యాతని హృది కళుక్కుమన్నది. – 34

కం.
మంచము పై జ్యోతియు, నా
పంచన నిలుచుండ్రి వైద్య వరులు; నెదురుగా
మించిన దుఃఖమున వదిన;
యెంచుచు తా నేదొ అన్నయే నుండ గనెన్! – 35

కం.
“మాటాడుదు నెవ్వరితో?
మాటాడగ నాదు పైన మండిపడుదురో?
పాటు నది యేమి వచ్చెనొ?” –
వ్రేటుల యటు ప్రశ్నల నిటు వేమన దలచెన్! – 36

కం.
చిన్నారి నాదు జ్యోతికి
కన్నార్పియు తెరచు లోపు కలుగుచునుండెన్
ఇన్నిన్ని మార్లు జబ్బులు!
ఎన్నటి కీ వెతలు దీరు, నెరుగగ జాలన్! – 37

కం.
అన్నకు వదినకు తోడుగ
నెన్నడు సాయముగ నిలిచి యెరుగ నయో! నే
నున్నను లేనట్లె!” యటన్
ఖిన్నుడగుచు, చేరి, జ్యోతి కేలును నిమిరెన్! – 38

ఆ.వె.
ఒడ లదెల్ల కాలుచున్నను, స్పర్శతో –
కనులు తెరచి చూచి, చినగ నవ్వి,
ఒరగె నిద్రలోకి మరల, పాపము .. పాప!
అయ్యె ఝరులు వేమనయ్య కనులు! – 39

తే.గీ.
“వైద్యు లిచటనే యున్నారు; వారి తోడ
నేను నిచ్చోటనే యుందు నిశ నదెల్ల!” –
యని వదిన, నన్న నొక్కింత నలుపు దీర
విశ్రమించగా వేమన వేడుకొనెను! – 40

(సశేషం)

Exit mobile version