[డా. ఆచార్య ఫణీంద్ర రచించిన ‘వేమన చరిత్రము’ అనే పద్యకావ్యాన్ని ధారావాహికగా అందిస్తున్నాము. ‘ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య’ రాయలసీమ త్రిమూర్తులపై నిర్వహించిన పద్య కావ్యాల పోటీలో ₹30,000/- నగదు బహుమతి పొందిన చారిత్రక పద్య కావ్యం ఇది.]
ద్వితీయాశ్వాసము
తే.గీ.
కొలది కొలది తమస్సది కొండ దిగగ –
మెల్ల మెల్లగా నుదయమ్ము మెరయు నేమో!
ఉపశమము కొంత నొనగూడ నపుడు జ్యోతి
కనుగవ తెరచి యటునిటు కాంచుచుండె! – 41
కం.
బ్రాహ్మీ ముహూర్త మందున
బ్రహ్మాండము తిమిరపు తెర వదలక మునుపే –
బ్రహ్మానందము నొందెను
బ్రహ్మాకృతి యటుల గాంచి – బాబాయిని తాన్! – 42
మత్త కోకిల.
అప్పు డప్పుడె కున్కు దీసిన యట్టి వేమన నూపుచున్,
“ఎప్పు డీ విటు వచ్చినా” వని యెంతొ గారము లొల్కగాన్ –
చప్పునన్ కను విప్పి జూచెను సత్వర మ్మిక నాతడే!
అప్పు డిర్వురు మోదమందిరి యాటపాటల దేలుచున్! – 43
తే.గీ.
మూడు నాల్గు గంటల పాటు మురియు చటుల
ఆట లాడంగ, నడుమలో నంత లేచి
వైద్యులు కలసియాడిరి వారితోడ!
హృదులలో నిండె నానంద మెల్లరకును! – 44
తే.గీ.
తెల్లవారగ పెదకాపు కుల్ల మలరె!
రాణికిన్ కూతు గని, నిల్చె ప్రాణ మింక!
వెడలినారు వైద్యులు తగు విధుల దెలిపి!
విడువకుండ నుండిరి జ్యోతి, వేమన లిక! – 45
వ.
నాల్గు రోజులటు గడచినంత నా జ్యోతి బాల కొంత స్వాస్థ్యము నొంది, తిరుగాడుచుండె. “వెనుకటి గుణమేల పోవు?” ననియన్న యట్లు – వేమన మనస్సు మరల వెలయాలి తలపులతో వెలవెలబోవుచుండె. కాని యా వగలాడి నగలు లేనిదే రావలదన్న మాట ఈటె వలె తన గుండెలో గ్రుచ్చినట్లగుచుండె! అంత నొకనాడు.. – 46
తే.గీ.
స్వర్ణ లోహ సాధనముకై శాస్త్ర మార్గ
శోధనము జేయు కార్యము సుగమ మొందు
యత్నమును గూర్చి అభిరాము డేమి చేసె –
చూడగా బోయి తా నట జూచె నపుడు.. – 47
ఉ.
లోహ మదేదియో కొలిమి లోపల నుంచి దహించుచుండె – స్వ
స్నేహితుడైన కారణము చేత నిబద్ధతతో నొనర్చు – రా
త్రాహములున్ ప్రయోగ మభిరాముడు కాంచన సాధనార్థమై!
మోహితుడైన వేమనయె ముందర సుందర స్వప్నమున్ గనున్! – 48
చం.
తన దరి జేరి కూర్చొని, పదార్థము లందిడుచుండె వేమనే!
విను – ఘన విద్యయౌ – “పరుసవేది”ని గూర్చి సుతర్క మాడెడిన్!
మును నెవరున్ తలంచని యపూర్వ మహోన్నత కార్య మద్ది! ఆ
పని విజయంబు నొంద, భువివాసుల కోరిక లెల్ల తీరెడిన్! – 49
కం.
కరిగిన లోహమున గలిపె
మరిగించి రసాయనమ్ము; మలినమ్మెల్లన్
తొరగన్ వడగట్టి, యపుడు
స్థిరముగ నా ద్రవము నెండజేసియు జూచెన్! – 50
ఆ.వె.
స్వర్ణ వర్ణ మలరు – సాగిపోవు నిటులె;
గట్టి బడిన యెడల – కాంతి తగ్గు!
భార, సాంద్రతలను పరిపుష్ట మొనరించు
శ్రేష్ఠ యత్నములను జేసి రెన్నొ! – 51
కం.
నడి రాతిరియై – నాటికి
పొడిగింపక స్వస్తి జెప్పి, పొరలిరి నిదురన్!
కడ కా రాతిరి వేమన
పడుకొనె చెలు నింట – చిన్ని పానుపు పైనే! – 52
కం.
పడుకొని పడుకొనని యటుల
పడుకొను వేమనకు నిద్ర పట్టదు సరిగాన్!
ఎడనెడ మేల్కొని యాతడు
విడమరచి తలంచు “స్పర్శవేధి” విషయముల్! – 53
తే.గీ.
పలవరించును – వగలాడి వలపు గూర్చి,
వెలది యాశించెడి నగల విలువ గూర్చి,
పలు విధంబుల యత్నించు పసిడి గూర్చి –
తేల దెటు కెంత నిదురలో!.. తెల్లవారె!! – 54
కం.
వెడలు నిక గృహము నేగగ –
వెడలగ దోచును మనమున విశ్వద కడకున్ –
వెడలిన యవమానపరచు!
తడబడు నడుగులు పడె నిక తన గృహమునకే! – 55
ఇంద్రవ్రజము.
స్వీయంబునౌ గేహము జేరి కాంచన్ –
న్యాయంపు పత్రంబుల నన్న జూచున్!
శ్రేయంబుకై రాణియె సేయు పూజల్!
హాయిన్ పరుండెన్ చిటియమ్మ లోనన్! – 56
సీ.
చిన్నారి జ్యోతికి చెంత జేరి యతడు
అల్లారుముద్దుగా నలర జేసి,
ముద్దుముచ్చట్లతో మురిపించి, తనతోడ –
ప్రొద్దు కృత్యాలను పూర్తి జేసి,
వడివడిగా వెళ్ళి వదినమ్మ కడకేగి,
చేత ప్రసాదాల స్వీకరించి,
అన్నయ్య, వదినతో నాహారమును గ్రోలి,
ఫలరసాలను ద్రావి పరవశించి,
తే.గీ.
అగ్రజుండు కార్యమ్ముపై నరుగ వెలికి –
వదిన గృహములో పనులెల్ల పాటి గొనగ –
తాను చిట్టితల్లికి తోడుగాను నిలిచి
ఆట పాటలందున తేలియాడ సాగె! – 57
వ.
కొంత సమయము పిదప వేమన చెంత కరిగి వదిన యిట్లు వివరించె. – 58
మ.
వరలక్ష్మీ వ్రత పర్వ మింక త్వరలో వచ్చున్ గదా నాయనా!
సిరికిన్ ముందర బెట్టి నాదు నగలన్, చేయన్ వలెన్ పూజలన్!
మరి యా భూషల స్వర్ణకారునికి పంపన్ జూచుచుంటిన్ సుమా!
త్వరగా చేకొనిపోవుమా మెరుగులన్ పట్టింపగా వానికిన్! – 59
ఆ.వె.
మేని పై ధరించు మేటి నగల నెల్ల
తీసి యుంచినాను – తీసుకొనుడు!
సత్వరమ్మె పనిని సంపూర్తి గావించి
పట్టుకొ నిక తెమ్ము భద్రముగను! – 60
(సశేషం)
డా. ఆచార్య ఫణీంద్ర తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం” అనే విషయంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి సాధించారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. తెలుగు సాహిత్యంలో “మాస్కో స్మృతులు” పేరిట ‘తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా’న్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం “Single Sentence Delights” పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.
ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం, ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా – ‘వానమామలై వరదాచార్య’ స్మారక పురస్కారం, ‘దివాకర్ల వేంకటావధాని’ స్మారక పురస్కారం, ‘పైడిపాటి సుబ్బరామశాస్త్రి’ స్మారక పురస్కారం, ‘ఆచార్య తిరుమల’ స్మారక పురస్కారం, ‘బోయినపల్లి వేంకట రామారావు’ స్మారక పురస్కారం, “రంజని – విశ్వనాథ” పురస్కారం, ‘సిలికానాంధ్ర’ గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ ‘ఎక్స్ రే’ పురస్కారాలు, ‘కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్’ నుండి “వైజ్ఞానిక రత్న” పురస్కారం, పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ‘ఉగాది’ సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలో, అట్లాంటాలో జరిగిన “నాటా” తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులో వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి “పద్య కళా ప్రవీణ” బిరుదుని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి “కవి దిగ్గజ” బిరుదుని పొందారు. హైదరాబాదులోని నవ్య సాహితీ సమితి నుండి “ఏకవాక్య కవితా పితామహ” పురస్కారాన్ని పొందారు. ఆయన ప్రస్తుతం “యువభారతి” సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా, “నవ్య సాహితీ సమితి”కి అధ్యక్షులుగానూ, “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” కు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక “సాహితీ కౌముది” కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘పద్య కవిత్వం’లో “కీర్తి పురస్కారం” ప్రదానం చేసారు. 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహాసభల”లో డా. ఆచార్య ఫణీంద్ర “పద్య కవి సమ్మేళన” అధ్యక్షులుగా వ్యవహరించి సత్కరించబడ్డారు.
