Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేమన చరిత్రము-9

[డా. ఆచార్య ఫణీంద్ర రచించిన ‘వేమన చరిత్రము’ అనే పద్యకావ్యాన్ని ధారావాహికగా అందిస్తున్నాము. ‘ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య’ రాయలసీమ త్రిమూర్తులపై నిర్వహించిన పద్య కావ్యాల పోటీలో ₹30,000/- నగదు బహుమతి పొందిన చారిత్రక పద్య కావ్యం ఇది.]

ద్వితీయాశ్వాసము

ఆ.వె.
వదిన పనులు జెప్ప – వారింప డాతడు!
“సరియ” యంచు పలికి సాగిపోవు!
అటులనే – తల నూపి, ఆ నగ లన్నిటిన్
వెంట తీసుకొనుచు వెలికి వెడలె! – 61

తే.గీ.
అడుగు లిడ నభిరాముని కడకు నేగ –
అడుగు పడుచుండె విశ్వద గడప కడకు!
అదుపు జేయబూనెను – మన మదుపు దప్పె!
చేత బంగారు నగలుండ – చేష్ట మారె! – 62

ఆ.వె.
“ఎంత వారలైన కాంత దాసులె!” యంచు
వంతపాట పాడి స్వాగతించె –
విశ్వద గృహమునకు వెడలు దారి యపుడు!
పాద యుగళి లొంగి, వడిగ నడచె! – 63

ఉ.
చేరిన వాడునై, చెలికి చెంతన నిల్చియు చూపి భూషలన్ –
“దూరితి వేల నన్ను! కను దోయిని విప్పుచు కాంచు మిప్పుడున్!
బారెడు స్వర్ణ భూషలివి! పట్టుక వచ్చితి నీకు చూపగాన్!
కోరిన కోర్కి దీర్చవొకొ? కోల్పడు మీ ఘన భాగ్య మీ” వనెన్! – 64

తే.గీ.
అలుక బూనిన యట్లు తా నభినయింప,
వగల నొలకబోయుచు వారవనిత యాపి,
“అంత కోప మ్మదేలనో?” యనుచు వాని
మోముపై జేర్చి తన మోము, ముచ్చటించె! – 65

తోటక వృత్తము.
“చిరు కోపము నాకును చేరదొకో?
తరుణీమణి యల్కయె తగ్గెనుగా!
పురుషాగ్రణి! నన్నిక బ్రోవుమయా!
మరి యంతగ కిన్కను మానుమయా!” – 66

తే.గీ.
ముదిత మోముపై పెదవులు కదలుచుండ,
కనుల గాంచిన వేమన కామ మెచ్చి,
మూతితో వాని బిగబట్టి ముడిని వేయ –
మౌన మావరించుచు నూరె మధువు లెన్నొ! – 67

ఆ.వె.
ఇన్ని నాళ్ళ సుఖమునెల్ల పిండుకొనుచు
హృదయ కలశమందు ముదము నింపి –
రేయి పవలు నెల్ల శృంగార హరిణంపు
వేట నాడె రసిక వేమ రేడు! – 68

చం.
తనువుకు హత్తుచున్ తనువు, తాపము పెంచుచునుండె తన్వి! ఆ
స్తనముల విందు వేమనను స్వర్గ సుఖంబుల యందు నిల్పె! కా
మన లవి యెల్ల దీరి, తన మానస మొందగ తృప్తి, పిమ్మటన్ –
చిన చినగా యదార్థ భువి జేరె నతండొక రెండు నాళ్ళలో! – 69

కం.
వదినమ్మ యిడిన పని యెది?
పదిలముగా జూడదగిన పసిడి నగ లెటన్?
పదపదమని వచ్చె నెటకు?
మృదు భోగము వేమన కిడె స్మృతి విస్మృతినిన్! – 70

చం.
వెడలగ సిద్ధమై యతడు – “వెంటనె నగలను తెచ్చి యిచ్చుచో
వెడలియు స్వర్ణకారు కడ వెల్గులు జిమ్మ మెరుంగు బెట్టగా
నడిగెద” నంచు బల్కె! “మరి యట్టి నగల్ మరి కొన్ని నీకునై
కడగుము సేయగా ననెద కామిని!” యంచు వచించె నాతడే! – 71

కం.
“ఫక్కున నవ్వెదరు – వినిన,
అక్కట! ఇచ్చిన నగ లిటు లడుగుట మగుడిన్ –
ఎక్కడనైనను విందుమె?” –
ముక్కున వ్రేలిడుచు పలికె పొలతి యతనితో! – 72

కం.
“అవి రాణి గారి నగ”లని;
“అవి నే జూపించి నీకు నట్టి నగలనే
అవసరముగ జేయిం”తని
వివరించిన గాని వినదు విశ్వద! అకటా! – 73

తే.గీ.
విస్తుబోవుచు వేమన వినుచునుండ,
నిష్ఠురంబుగా విశ్వద నిక్కి జెప్పె –
“క్రొత్త నగలను చేయించి యిత్తువేని,
పాత నగ లివి నీ కందజేతు” ననుచు! – 74

కం.
“అందుకు సమయము బట్టదె?
ఎందుకు వేధింతు విటుల ఈ నిర్భాగ్యున్?
సుందరి! నను కరుణించవె!
అందరి ముందు నగుబాటు నయ్యెద! వినుమా!” – 75

దోదక వృత్తము.
“‘ఏవయ! నా నగ లెచ్చట?’ యంచున్
నా వదిన మ్మిక నన్నడుగంగన్ –
ఏ విధి జెప్పుదు నే వివరంబుల్?
ఏ విధి జూపుదు నేనిక మోమున్?” – 76

కం.
పరితాపము, చిరుకోపము –
కరుగని యా కఠిన హృదయ కడ చెల్లవయో!
మరి మరి వివరించి వెతను,
పరి పరి బ్రతిమాలి తుదకు పాదము లంటెన్! – 77

ఆ.వె.
పదములంటి యతడు బ్రతిమాలుచుండగా –
కొంత కరిగి, మరల కొండ వోలె
కరడుగట్టె – రేగి కనక భూషల ప్రీతి!
సహజ గుణ మదెట్లు సమసిపోవు? – 78

తే.గీ.
పుణ్యవతి బులాకి మరియు పుస్తె లెప్పు
డెవరి కీయగా తీసి తా నిడదు గాన –
పట్టు సాధించుకొన నెంచి పడతి – దొంగ
తెలివినే జూపి యోచించి, తీర్పు జెప్పె – 79

చం.
“సరియ! సువర్ణ భూషలను సర్వము వెన్కకు నిచ్చి వేయుదున్!
మరి .. యొక కార్యమున్ సలుపుమా! మహరాణి ధరించునట్టి ము
క్కెర గొని తెచ్చి యిమ్ము! అదొకే యొకటి న్నిడ నాకు చాలు” నం
చిరుకున బెట్టుచు, “న్నదియె చేకొని వీనిని నిత్తు” నంచనెన్! – 80

కం.
అది జరిగెడి పని కాదని,
ఇది న్యాయము గాదటంచు నెంతయొ వేడెన్
సుదతిని వేమన; యైనన్ –
గది లోనికి వెడలి యామె గడియను వేసెన్! – 81

(సశేషం)

Exit mobile version