Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వెన్నెల స్నానం!

[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘వెన్నెల స్నానం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మాఘమాసం
నిండు పున్నమి రేయి
మంచు గాలులు నా తనువును స్పృశిస్తోన్న వేళ..
అపురూపమైన నీ సోయగాలు ఒలికే
ప్రతి క్షణాన్ని దోచుకోవాలని..
నా హృదయం లోగిలిలో దాచుకోవాలని..
నా అంతరంగం ప్రతిక్షణమూ తపనపడుతోంది!
మన ఇద్దరి అంతర్లోకాలు ఒక్కటైపోయాక
మనోవీధులతో ఏడడుగులు కలిసి నడిచాక
ఒకరు లేకుండా మరొకరం మనుగడ సాగించగలమా!
అందుకే.. ప్రియసఖీ..
నీ హృదయంలో హృదయమై
నీ తనువులో తనువునై
నీ జీవితంలో జీవితమై
నీతోనే జీవిస్తా కడ శ్వాస వరకూ!
నా భౌతిక జీవితం నుండి నువ్వు కనుమరుగై
హృదయం రక్షసికమై..
మనోవేదనతో అలమటిస్తోన్న వేళ కూడా..
నా మది లోయలన్నీ
నీ తలపులతోనే నిండి వున్నాయి!
పగలూ రోజూ నాకు నీదే ధ్యాస!!
నువ్వు నన్ను విడిచి ఊరి పొలిమేరలు దాటి
ఏ సుదూర తీరాల వెళ్ళిపోయావో గాని..
నా ప్రతి శ్వాస నీతోనే వుంది ప్రేయసీ!
నిజ ప్రేమికుల దేహాలు ఎక్కడుంటేనేమిటీ!?
ఆత్మలు మాత్రం..
అంతర్నేత్రానికి అన్నివేళలా..
అన్ని వైపులా.. కనిపిస్తూనే వుంటాయి!
అలానే నువ్వూ..
ప్రతి పగలు.. ప్రతి రాత్రి నాలోనే వున్నావు!
రేయింబవళ్ళూ ఒకే ధ్యాస.. ఒకే యోచన!
ఎప్పటికీ నా కళ్ళల్లోనే నిన్ను దాచుకోవాలని
ఏ సెగలూ నీ దరి చేరకుండా
ఏ నిప్పు రవ్వ నీ మీద పడకుండా
ఏ విస్ఫోటనానికో నువ్వు ఎర కాకుండా,
నేను దగ్ధమైపోయినా పరవాలేదు గాని..
నిన్ను మాత్రం కాపాడుకోవాలని
నా హృదయం నిజాయితీగా కోరుకుంటోంది!
అంతేగాదు ప్రేయసీ..
ప్రతిక్షణం నిన్ను నీడలా వెన్నంటి వుండి
నీ బాధలన్నీ నేనే మోసి
నిన్ను నా ఆత్మలో అలంకరించుకోవాలని
నా మనసు మౌనంగా పలవరిస్తోంది!
దశాబ్దాలుగా..
నా ఎదలోయలలో నిక్షిప్తమై
నన్ను నిరంతరమూ వేధిస్తోన్న
ఓ చిలిపి కోరికను వెల్లడించనా!?
చలి చెలితో సయ్యాట లాడుతూ,
మంచు వర్షాన్ని సైతం లెక్కచేయక
ప్రేమ జంటలకు ఆహ్లాదాన్ని పంచుతోన్న
ఈ మాఘమాసం పూర్ణచంద్రుడి సాక్షిగా
సాగర తీరంలో విహరిస్తూ మనమిద్దరమూ..
ప్రేమ పరిష్వంగంలో ఓలలాగుతూ
‘వెన్నెల స్నానం’ చేయాలి!
ఊహాజనితమైన..
నా ‘ఆశ’కు ఊపిరి పోస్తావు కదూ!?

Exit mobile version