[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల గారు రచించిన ‘వెన్నెల తోరం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
రక్షా బంధనానికి
దారం పోగు ముఖ్యం.
అనుబంధాలకు ఆధారం ఈ సూత్రం.
సోదర ప్రేమల సాకారం,
సంస్కృతి పరంపరలసారం,
కుటుంబ సఖ్యతల తీరం.
కరుణ సాంద్రతల హృదయ తోయం!
సహజన్ములం అందరం
అన్న దమ్ముల ఆదర్శ భావానికి,
సోదరిని రక్షించాలన్నది పురుషుని సంకల్పం.
ఆపదలకు అండగ నిలవాలన్నది సోదరి ధ్యేయం,
మనసు విశాలానికి మానవతా సందేశం..
రాకా శశి గగనంలో
దివ్య సంబరం!
దూది మబ్బుల వరండాలో,
చంద్రుని మండువా లోగిలి నడుమ ,
రాట్నం వడుకుతున్న
నూలు పోగుల వెన్నెల తోరం,
అంచనాలను దాటినట్టు
పేనుకున్న గట్టి మెలికతో
నేలకు జారిన సమయం!
అక్క చెల్లెళ్ళు అందుకున్నారు
జాబిలి పోచల దీక్షా బంధం .
నిశాచరత్వం తొలగిన వేళకు
చెల్లి బయలుదేరింది..
అన్న మణికట్టున తళ తళల రాఖీ కట్టడానికి,
ఒకరికి ఒకరు తోడు నిలిచే,
ఆత్మ సంపదల అపురూప పర్వానికి.
డా. రాజేశ్వరి దివాకర్ల విశ్రాంత తెలుగు ఆచార్యులు. ప్రవృత్తి రీత్యా కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు. కళాప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని గారు, చంద్రావతి గార్ల కుమార్తె. భూమి తడిపిన ఆకాశం, నీరు స్తంభించిన వేళ, నక్షత్రదాహం, కాగితం సంచీ అనే కవితాసంపుటులు, పగడాల దీవి అనే కథాసంపుటి ప్రచురించారు. సోమనాథ కళాపీఠం వారి సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి మాతృవందనం పురస్కారం పొందారు. అనేక కవితలకు బహుమతులు పొందారు.
