Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వెన్నెలకు విన్నపం

[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘వెన్నెలకు విన్నపం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

అమావాస్య చీకటిని
తరిమికొడుతూ
నెలవంక మెరిసింది
ఒకొక్క వెలుగు రేఖను
విచ్చుకుంటూ
దిన దిన ప్రవర్ధమానమై
పక్షం రోజులకు
పూర్ణ చంద్ర సుధాకరుడిగా
రూపు దిద్దుకుంది
మల్లెలు జాజులు
రేరాణి పుష్పాలు
పరిమళాలు వెదజల్లుతూ
మురిపించి మైమరపించే
రాత్రిలో ధన్యమై సోలిపోతున్నాయి

కొలనులో కమల భామినులు
వెన్నెలలో అందాలను
ఆరబోసుకుని
ఎరుపెక్కిన వదనాలతో
సిగ్గుపడుతున్నాయి
నదివొడ్డున విహరించే
ప్రేమికులు వెన్నెలను దోసిలితో పట్టి
మేనిపై అలుముకుని
పరవశించి పోతున్నారు

‘అమృతం కురిపించిన రాత్రి’ అంటూ
కవులు కవితలు అల్లారు
వెండివెన్నెలలో జలకాలు ఆడిన
తారలు ఉనికినే కోలుపోయాయి

నీవుంటే నిదురరాదు
నిన్నువదలి క్షణమైనా నిలువలేము
కనులు మూస్తే కరిగిపోతావేమో అని
రేయంతా నీతోనే గడిపాను

నీవు లేని బ్రతుకు శూన్యం
నీవు లేని జగము చీకటి
నీవు వచ్చిన రాత్రి ఆనందం
రాని రోజున చెప్పలేని దిగులు
అసలెందుకు వస్తావో
మళ్ళీ ఎందుకు మాయమైపోతావో
శాశ్వతంగా ఉండిపోవేమి
మా నిరీక్షణకు వీడుకోలు చెప్పవేమి!

Exit mobile version