Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వెన్నుని వెదకు వ్రేతలు..

[శ్రీమతి మరింగంటి సత్యభామ గారి ‘వెన్నుని వెదకు వ్రేతలు..’ అనే భక్తి కవితను అందిస్తున్నాము.]

కలువల, ఋతువులు, సుమబాణములతొ
మనసు మథించే సుందర భువనము,
చకోర, పికముల కిలకిల రవములు
చక్రవాకముల భ్రమింప జేయుచు
రాకా చంద్రుని చంద్రోదయము
శరత్ పూర్ణిమ,చల్లని పవనము
తొలకరి చినుకుల వలె నలరింప
పరమ పురుషుడు యోగీశ్వరుడు!
పురుషోత్తముడు! పరబ్రహ్మమను,
ఎరుకలేక, వెన్నుని తలచి తలచి,
నిశి సమయమున కానల తిరిగిరి!

మురళీ రవముల, మధుర గీతికల
నాలకించిరి రయము వచ్చే వ్రేతల
వెన్నుడు చూచి సుగుణ విన్నాణీ!
మృదు మధురముగా మాటలాడుచూ,
రేపల్లె వాడలో ఇంతులార! గోపాంగనలార!
క్రూర మృగముల జాడ కనుగొంటిరా!
ఈ నిశాసమయమున ఏతెంచుఏల?
త్వరతోడ వెళ్ళుమా! మీ గేహములకు!
మీ బంధువర్గము తల్లడిల్లగ మీరు
*ఘోషమును వదిలి తరలి వచ్చెదరేల?
ఇంత తెగువేల? ఈ వేగ.. గమనమేల?
మీ నాథు వీడి రాకడ, మంచి నడతేన?
మీ పరివారము నుండి రాతగున మీరు?
మానినులార ఇలువీడీ వచ్చుట తప్పు కాద!
మీ ప్రాణనాథులు కోపించరా మిమ్ము!
మీ అత్త,మామలెరుగ జీవితము పోవు!
రాచభటులు కనిన తగవుపెట్టుదురు!
తల్లితండ్రులు కేమో తలవంపు లగును!
*ఏరాలు చూచినచో.. ఎత్తి పొడుచు!
బంధు బలగ మేమొ వెలి వేయగా,
హితులు స్నేహితులేమొ నవ్వి పోవుదురు!
పేద బడుగైన, రోగైన, కొరగాని వాడైన,..
పతి విడిచి వచ్చుట మరియాద కాదు!
యమునా నదీ సలిలము వెల్లి విరియు.
లతా లతిక, పల్లవముల పుష్ప సుగంధ
పరిమళ మలరించు సౌరు సొంపు మీర
కనిన భ్రమ చెందినద మీ మానసమ్ము!
పాడియావుల లేగల నొదలి బాలురను
లాలించి, క్షీర మొసగి నాథుని సేవతో
సేద తీర్చగ పొండు.. సనాతన ధర్మ
పాలనతో పతిని సేవించు మో
సుదతులార! నా ధ్యాన దర్శనమున,
నా నామామృత గానము తలపు వలన
ధన్యు లగుదురు మీరు మరలి పొండు!

నవనీతచోరు నెడబాటు తాళలేక కాటుక
కన్నీరు కనులలో జాలువారే కంది పోయిన
మోముల సంభ్రమము తోడ చిన్నబోయిన
ముఖార విందములతో నిను నమ్మినాము!
నీ పద కమలముల.. పూజించగా మేము
మోక్ష పథమును కోరి… నీచెంత చేరితిమి!
కరుణించవయ్య.. నందనందనుడా!
కరమెత్తి మొక్కెదము! మోహనాకారా!

***

ఘోషము=గొల్లపల్లె

ఏరాలు= తోటి కోడలు

Exit mobile version