[జీ.వీ.యస్. ఆచార్యులు గారు రచించిన ‘వేసంగి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
భగభగ మనిపించే వేసవి వెళ్ళిపోయింది
పోతూ పోతూ పల్లెటూరి పెద్దమ్మ గారింట
పిల్లలు చేసిన వేసంగి శలవుల సందడిని
తనతో తీసుకెళ్లిపోయింది
బోసిపోయిన మోముతో
దిగులు పడ్డ మనసుతో
మరల వచ్చే వేసంగి కోసం
మౌనంగా ఎదురుచూస్తూ
ఇంటిచుట్టూ తిరుగుతూ పెద్దమ్మ..
పూతై పింధై కాయై
చివరకు మధుర రస ధారలందించే పండై
వేసవంతా కళకళలాడుతూ
కనువిందు చేస్తూ
వర్షాగమనంతో
కనుమరుగైన వేసవిలో
అవి ఏవీ కానరాక
మరల వేసవి కోసం
నిశ్శబ్దంగా నిరీక్షించే (మామిడి) రసాలమ్మ లాగా..
