Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేసవి నీలో ఉంది!

[శ్రీమతి గీతాంజలి రచించిన ‘వేసవి నీలో ఉంది!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]


వేసవిని రాత్రిలో చూడు..
వెన్నెల్లో చూడు.. మల్లెల్లో చూడు
వేసవిని.. నీ ఏకాంతపు వేదనలో చూడు
నీకు మాత్రమే వినిపించే మార్మిక సంగీతంలో..
ఒక అపరిచిత ప్రేమలో చూడు..
వేసవిని స్మృతుల్లో చూడు..
మృతుల్లో చూడు..
వేసవిని నీ శ్వాసలో చూడు..
వేసవిని ఆమెతో వియోగంలో చూడు..
నువ్వు విరహంలో మరణించడంలో చూడు..
ప్రేమికుల మధ్య నిశ్శబ్దంలో చూడు..
పాడలేని పాటలో చూడు..
వేసవిని.. నువ్వు రాయలేని కవిత్వంలో చూడు..
వేసవి హృదయవిదారకంగా కూడా ఉండడం చూడు.
ఎండిపోయిన పొలంలా.. నీటి చుక్క లేని ఊరి చెరువులా
పగల బారిన రైతుల పాదాల్లా..
పుట్టింటికి కట్నం కోసం తరమబడ్డ కూతురి దుఃఖంలా
దూర దేశాలకి వలసలు పోయిన రైతుల
ఎడబాటు వేదనలా..
దాహం తీరక ఎడారైన
మనుషుల పెదవుల్లా ఉంటుంది వేసవి.
~
వేసవి రంజాన్ నెలవంకలో..
చార్మినార్ అత్తరు బుడ్డీలో ఉంది.
వేసవి నీ కిటికీ కోయిలై వసంత గీతాన్ని పాడడం చూడు.
వేసవి నువ్వు దాచుకున్న ప్రేమలేఖలో చూడు.
వేసవిని ఆమె విశాలమైన కళ్ళల్లో చూడు.
ఆమె వెళ్ళిపోయాక వేసవి
నిన్ను మరింత కాల్చడాన్ని చూడు.
వేసవి నీలో మల్లెల తోటలా పరమలించడాన్ని చూడు!
ఎక్కడో వెతకకు..
వేసవి ఎక్కడో లేదోయి.. నీలోనే ఉంది
వేసవి.. నీకు అందని ప్రేయసిలో ఉంది..!

Exit mobile version