Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వేటూరి మధుర గీతాలు-1

[శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటిని విశ్లేషణని అందిస్తున్నారు డా. మాధురి ఇంగువ గారు.]

ముందుమాట:

తెలుగు, సంస్కృత, ఆంగ్ల వాఙ్మయాల జలధులను మథించి, భావాల అమృతాన్ని సినీ గీతాలుగా అందించిన అక్షర బ్రహ్మ, బ్రహ్మశ్రీ డాక్టరు వేటూరి సుందరరామమూర్తి గారు. ఆయన కలం నుండి జాలువారిన ప్రతి పాట ఒక అద్భుత కావ్యం, ప్రబంధ సమానం, వికసిత పారిజాతం. వేటూరి వారు తెలుగు చిత్రాల కోసం వ్రాసిన శాస్త్రీయ సంగీత, శాస్త్రీయ నృత్య ఆధారిత గీతాలలో ఎంపిక చేసిన 19 అద్భుత గీతాల ప్రతిపదార్థ తాత్పర్యాలను మనం ‘వేటూరి గీతామృతం-భాగం 1’ లో చదువుకున్నాము. ఆ పుస్తకానికి ఆస్కార్ పురస్కార విజేత శ్రీ చంద్రబోసు గారు, అలాగే ప్రఖ్యాత గీత రచయిత శ్రీ భువనచంద్ర మాష్టారు గారు ముందుమాట, ప్రశoశలు వ్రాయడం నా భాగ్యం. పుస్తకం విడుదల అయిన పిదప పలువురు సినీ ప్రముఖుల, సాహితీ సంస్థల వ్యవస్థాపకుల ప్రశంసలు అందుకుంది. అలాగే కళారత్న శ్రీ బిక్కి కృష్ణ గారి ఆధ్యర్యంలో ఆ గ్రంథానికి ‘గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారం’ వరించటం నా భాగ్యంగా, వేటూరి వారి దీవెనగా భావిస్తున్నాను. ఈ రెండవ భాగంలో వేటూరి వారి మధుర గీతాల విశ్లేషణ చేయ సంకల్పించాను.

అయితే, ఆ అనంతమైన గీతకుసుమరాశి నుండి కేవలం వంద పాటలను మాత్రమే ఈ పుస్తకం కోసం ఎంచుకోవలసి వచ్చింది. నింగి చాలని సితారకల రాశిలా ఉన్న వేటూరి వారి మధురగీతాలలో ఈ సంపుటిలో చోటు దక్కని మిగతా మధురగీతాలకు అలక రాక మానదు. కానీ, అంతటి మధుఝరిని ఒకేసారి గుమ్మరిస్తే పాఠకులు ఉక్కిరిబిక్కిరి అవుతారని, ఆ కవితాకాశం నుండి కొన్ని మేలిమి గీతాలను ఏర్చి కూర్చి చక్కని విశ్లేషణలను ఇక్కడ పొందుపరిచాను. మరిన్ని మధురగీతాల విశ్లేషణ కోసం మరో భాగం వ్రాసే ప్రయత్నం చేస్తాను.

ఎటు చూసినా పరవశం కలిగించే ఆ సాహితీ సువర్ణ కేదారం నుండి, నా దోసిలిలో పట్టిన ఈ కొన్ని గీతాలను ‘వేటూరి మధురగీతాలు’ గా మీ ముందుకు తీసుకువచ్చే ఈ ప్రయత్నం, వేటూరి గారి కవితా వైభవాన్ని మీకు మరింత చేరువ చేస్తాయని ఆశిస్తున్నాను.

ఈ వ్యాసపరంపరలో  దర్శకుల వారీగా వేటూరి వారి మధురగీతాలన్నీ ఒకదాని తరువాత ఒకటిగా అందిచదలచాను. ఈ క్రతువు పూర్తి అయ్యాక మరిన్ని మధురగీతాల విశ్లేషణతో మరో సంపుటి, ఆపైన వేటూరి వారి ఫాస్ట్ బీట్ సాంగ్స్‌లో ఉండే చిలిపి సంస్కృత – తెలుగు సమాసాలు, ఆంగ్ల పద ప్రయోగాలు, వాటితో పాటు తెలుగులో ఆయన సృష్టించిన ‘టంగ్ ట్విస్టర్స్’ ఉంటాయి, ప్రయివేట్ గీతాల గురించి కూడా మరో సంపుటి వెలువరించే యోచనలో ఉన్నాను. నా ఈ ప్రయత్నాలన్నిoటినీ ఆశీర్వదిస్తారని, భావితరాల తెలుగువారికి వేటూరి పద సంపదనూ భావసంపదనూ అందించే నా ప్రయాసను అర్థం చేసుకుంటారని నమ్ముతూ, రసజ్ఞులైన తెలుగు శ్రోతలకు అభివాదాం చేస్తూ ఇక విశ్లేషణలోకి అడుగు పెడతాను.

డా. మాధురి ఇంగువ

కెనడా.

~

కవి కులాలంకార డా. వేటూరి సుందర రామమూర్తి గారి గురించి పరిచయం చేయడం అంటే మల్లె పందిరికి పరిమళాన్ని అద్దడమే. జగమెరిగిన వేటూరికి పరిచయాలేల? 1972 నుండి నుండి 2010 వరకు విభిన్నమైన దర్శకుల, సంగీత దర్శకుల, నటీనటుల కలయికలో ఆయన రాసిన మధుర గీతాలు అజరామరం. ఆయన సృష్టించిన సుగంధభరితమైన స్వర్ణ సాహిత్యం బంగారానికి తావి అబ్బింది రీతిన సాగింది. అప్పట్లో ఉద్దండులైన దర్శక శ్రేష్ఠులు కే. విశ్వనాథ్, జంధ్యాల, వంశీ, సింగీతం శ్రీనివాసరావు, భారతీ రాజా, క్రాంతి కుమార్, రాఘవేంద్ర రావు, వి.మధుసూదన్ రావు, దాసరి, వంటి ఎందరికో కొంగుబంగారం అయిన అతి పెద్ద రచయిత వేటూరి సుందర రామమూర్తి గారు.

శంకరాభరణం పాట రాసిన చేత్తోనే వేటగాడు, అన్వేషణ, ముద్దమందారం వంటి వైవిధ్యభరితమైన చిత్రాలలో గీతాలు వ్రాసి తన కలానికి నాలుగువైపులా పదునే అని ఆయన నిరూపించుకున్నారు. శాలువాలు కప్పి సన్మానించే పండితుల దగ్గర నుండి చప్పట్లనే పురస్కారాలుగా ఇవ్వగలిగే పామరుల దాకా అందరినీ ఆయన సాహితీ చమత్కారాలతో అలరించి పాయసాన్నం అందించారు.

వేటూరి సుందరరామమూర్తి గారు అంటేనే సర్వతోముఖ ప్రజ్ఞతో ఎటువంటి పాటకైనా న్యాయం చేయగల ఏకైక సవ్యసాచి అని, సందర్భ శుద్ధి కలిగిన గీతాలే కాదు సందర్భo శూన్యo అయినప్పుడు కూడా సాహితీ పుష్టి కలిగిన గీతాలెన్నో ఆయన అందించగలరాని శ్రోతలకు తెలుసు. ఆయన వ్రాసిన వేలకొలదీ పాటలను స్మరించుకొని విశ్లేషించుకోవడం కష్టతరమైన పని కనుక ఈ ‘వేటూరి మధుర గీతాలు -మొదటి సంపుటి’ లో జంధ్యాల, వంశీ, క్రాంతి కుమార్, సింగీతం శ్రీనివాస రావు, కే విశ్వనాథ్ , భారతీరాజా, దాసరి, వి. మధుసూదన రావు గారు వంటి వారి కలయికలో వచ్చిన మధురగీతాలను విశ్లేషించదలచాను. ముందుగా జంధ్యాల వేటూరి మధురగీతాల స్మరణతో శుభారంభం చేద్దాం.

~

ముద్ద మందారం:

1. కడగంటి కొలుకుల్లో

1982లో ప్రదీప్, పూర్ణిమ జంటగా నటించిన తొలి చిత్రం ‘ముద్ద మందారం’, ఎంతో లో-బడ్జెట్లో వచ్చినా మాటల్లో పాటల్లో హై క్వాలిటి నిక్షిప్తం చేసుకున్న మందార పూలు జంధ్యాల చిత్రాలయి.

ముందుగా ‘ముద్ద మందారం’ చిత్రంలోని ఈ సూపర్ హిట్ గీతాన్ని విశ్లేషిద్దాం.

పల్లవి:
అతడు:
కడగంటి కొలకుల్లో తెలుగింటి వెలుగుల్లో తెరతీసిన తేనెదీపం
తేనె కన్నా తీపి రూపం తేనె కన్నా తీపి రూపం

ఆమె:
నీ నిండు హృదయాన ఒదిగేటి సమయాన
ప్రణయాల ఓంకార నాదం వినిపించె కళ్యాణ గీతం వినిపించె కళ్యాణ గీతం

చరణం 1:
అతడు:
హరిత వర్ణ చైత్ర పత్ర గీతికలా
గ్రీష్మ తప్త ఉదయ రాగ కుంకుమలా
గగన నీల శ్రవణ మేఘ మాలికలా
శరత్కాల సితానంద చంద్రికలా
కదలిరా
కప్పుర తీవల వీణలు వెన్నెల పుప్పొడి వానలు
అందాలభరిణ అనురాగకిరణ
అందాలభరిణ అనురాగకిరణ
కనుపాపలే మూగజాణలు

ఆమె:
ఈ చంచల నయన, దృగంచలరేఖా చందన శీతల శీకరములు వశీకరములు
నీ మేఘసందేశమే నీ మోహనావేశమే
నీ దాహ సంకీర్తనే నీ దాహ సంకేతమే

అతడు:
//కడగంటి కొలకుల్లో//

చరణం 2:
అతడు:
హిమస్నపిత హేమ పుష్పలావికలా
శిశిర శీర్ణ జీర్ణ పత్ర భూమికలా
సంధ్యరాగ పశ్చిమాంతరంగిణిలా
సప్తవర్ణ ‘స్వరస’ స్వర్ణ సుందరిలా
ఇంద్ర ధనుస్సుందరిలా తరలిరా

ఆమె:
నాపాలి వేదాద్రి శిఖరం నా ఇల్లు నీదివ్య చరణం
చుంబించు అధరం సుధ కన్న మధురం
చుంబించు అధరం సుధ కన్న మధురం
నీ మాట మంత్రాక్షరం

అతడు:
తమాల పల్లవజాల మాలికా
వికసిత విభాత భాస్వంతము నాస్వాంతము
నీ స్నేహసంగీతమే నీ స్నిగ్ధ సౌందర్యమే
నీ సాంధ్య సంసారమే నీ సాంధ్య సంసారమే
//కడగంటి కొలకుల్లో//

విశ్లేషణ:

వేటూరి సుందరరామమూర్తి గారి కలం నుండి జాలువారిన ఈ ప్రణయ గీతం పల్లవిలో అత్యంత మనోహరమైన తెలుగుపదబంధాలతో ఆకట్టుకుంటూనే చరణాలల్లోకి వెళ్ళేసరికి సంస్కృత భూయిష్ట సమాసాలు అబ్బురపరుస్తాయి .

“కడగంటి కొలకుల్లో” = కనుచూపుల చివరల్లో,

“తెలుగింటి వెలుగుల్లో” = లక్ష్మీ కళతో తెలుగు ముంగిళ్ళల్లో వెలిగే దీపంలా

“తెరతీసిన తేనెదీపం_తేనె కన్నా తీపి రూపం” కలిగిన సౌందర్యం అని అతడు పరవశించిపోతాడు.

దానికి ప్రతిగా నాయిక

“నీ నిండు హృదయాన ఒదిగేటి సమయాన ప్రణయాల ఓంకార నాదం” వినిపిస్తోందని, అదే ఒక కళ్యాణ గీతంగా మారుతోందని చెప్తుంది.

ఇక్కడ ‘తేనెదీపం’ అంటూ తేనెకూ దీపానికి భేదం లేదని చెప్తూ రూపకాలంకారం వాడారు వేటూరి గారు.

అలాగే ‘తేనె కన్నా తీపి రూపం’ అనడంలో ఉపమాలంకారం వ్యక్తమవుతాయి.

‘కడగంటి కొలకుల్లో తెలుగింటి వెలుగుల్లో’ అన్నప్పుడు ‘ల’కార పునరావృత్తి వల్ల వృత్త్యానుప్రాసాలంకారం అలరారుతూ శ్రవణ సుభగత్వాన్ని ఇస్తోంది.

మొదటి చరణంలో నాయకుడు ప్రకృతిలోని రుతువులను ప్రేయసికి ఆపాదిస్తూ, ఆమెను

“హరిత వర్ణ చైత్ర పత్ర గీతికలా” = వసంత కాలంలోని పచ్చని ఆకుపై రాసిన పాటలా,

“గ్రీష్మ తప్త ఉదయ రాగ కుంకుమలా” = ఎండకాలపు వేడిమిలో ఉదయించే సూర్యుడి ఎర్రటి కుంకుమలా రావాలంటాడు.

“గగన నీల శ్రవణ మేఘ మాలికలా” = శ్రావణ మాసపు నీలి మేఘాల మాలలా,

“శరత్కాల సితానంద చంద్రికలా” = శరదృతువులోని తెల్లని వెన్నెల వెలుగులా తరలి రమ్మంటున్నాడు.

“కప్పుర తీవల వీణలు వెన్నెల పుప్పొడి వానలు” కురుస్తున్న వేళ, “అందాలభరిణ, అనురాగకిరణ” అయిన నీ “కనుపాపలే మూగజాణలు”గా మారిపోతున్నాయని వర్ణిస్తాడు.

సిగ్గుతో కళ్లు దించుకునే నాయిక స్థితిని ‘కనుపాపలే మూగజాణలు’ అంటూ స్వభావోక్త్యలంకారం పండించటం ఎంతో కమనీయమూ!

నాయిక, “చంచల నయన దృగంచలరేఖ” = సిగ్గుతో బిత్తర చూపులు చూసే కంటి చివర ఉండే రేఖలు ప్రసరించే చూపుల్లో

“నీ మేఘసందేశం, నీ మోహనావేశం, నీ దాహ సంకీర్తనo, దాహ సంకేతాలన్నీ చందనం లాంటి చల్లని నీటి బిందువులై నన్ను వశీకరించుకుంటున్నాయి” అని వివశురాలై బదులిస్తుంది.

రెండవ చరణంలో నాయకుడి వర్ణన మరింత పతాక స్థాయికి చేరుకుంటుంది. ఆమెను ప్రకృతిలోని ప్రతి ఋతువులు పోల్చి చూసుకుంటాడు.

“హిమస్నపిత హేమ పుష్పలావికలా” = మంచుతో తడిసిన బంగారు పువ్వులను కోసే కోమలిలా, ఒకసారి

“శిశిర శీర్ణ జీర్ణ పత్ర భూమికలా” = శిశిర ఋతువులో రాలిన ఆకులతో నిండిన నేలలా ఒకసారి.

“సంధ్యరాగ పశ్చిమాంతరంగిణిలా” = పడమటి దిక్కున ప్రవహించే సంధ్య వర్ణపు నదిలా ఒకసారి

“సప్తవర్ణ ‘స్వరస’ స్వర్ణ సుందరిలా = ఏడు రంగుల ఇంద్ర ధనస్సులో ఏడు స్వరాలను కలిపి సువర్ణసుందరిలా తరలిరమ్మని పిలుస్తాడు.

ఇక్కడ స్వరస అనే పదం వాడడం వేటూరి మార్కు చమత్కారం. సప్త వర్ణాల హరివిల్లులో స్వరస = “స్వర+రస”, ఏడు స్వరాల యొక్క రసాన్ని కలగలిపి, స్వర్ణ సుందరిలా దిగి రమ్మంటాడు.

ఆమెను ప్రకృతిలా ఆరాధించే ప్రియుడి ప్రేమకు పరవశించిన ప్రేయసి ముగ్ధురాలైన

“నువ్వే నా పాలి వేదాద్రి శిఖరం, నా ఇల్లు మీ దివ్య చరణం” అని ప్రియుడిని సాక్షాత్తు వేద మూర్తిగా ఆది నారాయణుడిగా ఆరాధిస్తూ, స్వామి వారి పాదాలే ఆమెకు లక్ష్మి వలే శాశ్వత స్థానం అంటోంది.

అతడు చుంబించే అధరం అమృతం కన్నా తీయన అని, అతడి ప్రతి మాట తనకు మంత్రాక్షరమని త్రికరణ శుద్ధిగా చెప్తుంది.

చివరగా నాయకుడు

“తమాల పల్లవజాల మాలికా” = చీకటి వంటి నల్లని కాటుక చెట్టు యొక్క చిగురాకుల మాల వంటి

నాస్వాంతము =హృదయము

వికసిత విభాత భాస్వంతము = ఉదయ సూర్యుడిలా వికసించిందని,

దీనికి కారణం మీ స్నేహసంగీతమే, మీ స్నిగ్ధ సౌందర్యమే, మీ సాంధ్య సంసారమే అంటూ ముగిస్తారు.

ఇక్కడ ‘సాంధ్య సంసారం’ అంటే అస్తమించే దాకా జీవిత చరమాంకం దాకా సాగే తోడు.

“తమాల పల్లవ జాల మాలికా, వికసిత విభాత భాస్వంతము నాస్వాంతము, నీ సాంధ్య సంసారమే” అనేది ఈ గీతంలోనే కాదు, మొత్తం తెలుగు చలనచిత్ర సాహిత్యంలోనే అత్యంత ఉత్కృష్టమైన, క్లాసిక్ సంస్కృత సమాస పంక్తులలో ఒకటి అని నా భావన. వేటూరి గారు కేవలం మూడు ముక్కల్లో ఒక మనిషి అంతరంగ పరిణామాన్ని, జీవిత భాగస్వామి వల్ల కలిగే కాంతిని, భవిష్యత్తుపై ఉండే నమ్మకాన్ని అద్భుతంగా పండించారు

దీని అర్థం “నా హృదయం ఇన్నాళ్ళు చిక్కని చీకటిలో ఉంది, నీ స్నేహ సంగీతం అంది, నీ స్నిగ్ధ సౌందర్యం సోకి , ఉదయభానుడి కిరణం తాకి వికంచిన పద్మoలా మారింది. నా హృదయానికి వికాసాన్ని ఇచ్చింది నీ సాoధ్య సంసారమే” అంటాడు. ఆమె ఉదయ సూర్యుడిలా వస్తే సాoధ్య సంసారం అనడంలోనే ఉంది వేటూరి గారి చమత్కృతి.

అది జీవిత చరమాంకానికి సూచకం. ఆమె ఉదయించే సూర్యుడిలా వచ్చి అతడి మనసుని పద్మంలా వికసింప చేసింది. ఆపైన వారు ఇరువురు అస్తమించే వరకు ఎంతో ప్రశాంతంగా అన్యోన్యంగా సాగిపోతారు అనడానికి సూచికగా సాంధ్య సంసారం అనే పదబంధం వాడారు వేటూరి.

ముగింపు:

ఈ అద్భుతమైన భావ ప్రవాహాన్ని విశ్లేషిస్తే, ఈ పాటలో నాయకుడు ప్రేయసిలో ప్రకృతిని చూస్తుంటే నాయిక నాయకుడిలో దైవత్వాన్ని చూస్తోంది. ఆత్మానుగతమైన ఆలౌకిక ప్రేమ మాధుర్యమే తప్ప శారీరకమైన వ్యామోహం క్షణికమైన మొహం లేని స్వచ్ఛమైన ప్రేమను పండించిన అచ్చ తెలుగు పాట ఇది, తెలుగు సాహిత్యానికి పచ్చని పంట ఇది.

ఇది కేవలం ఒక ఉత్కృష్ట భాషా సౌందర్యం గుబాళించే పాట కాదు అన్యోన్యమైన దాంపత్యాన్ని కావలసిన అనురాగం ఆరాధనల గురించి తెలియజేసే జీవనవేదం. నేటి కాలంలో దంపతులందరూ పెళ్ళవగానే పాడుకోవాల్సిన పాట, ఇచ్చి పుచ్చుకోవాల్సిన మాట ఈ గీతం.

(‘కడగంటి కొలకుల్లో’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=wcgIR4CzGEU)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version